జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురుదెబ్బ... వజైనల్ మెష్ కేసులో ఓటమి

జూలీ డేవిస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మహిళలను గినియా పిగ్‌లుగా పరిగణించారని ఈ కేసులో ప్రధమ కక్షిదారు జూలీ డేవిస్ తప్పుపట్టారు

జాన్సన్ అండ్ జాన్సన్ తన ఉత్పత్తుల వివాదాల పరంపరలో మరో కేసులో ఓడిపోయింది. వజైనల్ మెష్ (యోని సంబంధ జాలీ) ఇంప్లాంట్స్ మీద దీర్ఘ కాలంగా నడుస్తున్న కేసులో 1,350 మందికి పైగా ఆస్ట్రేలియా మహిళలు గెలిచారు.

జాన్సన్ అండ్ జాన్సన్ ఉప సంస్థ ఎథికాన్, ఈ వజైనల్ ఇంప్లాంట్స్ విషయంలో గల 'రిస్కుల' గురించి పేషెంట్లను, సర్జన్లను హెచ్చరించటంలో విఫలమైందని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు నిర్ధరించింది.

సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కటి అవయవాలు వదులైనపుడు చికిత్స చేయటం కోసం ఈ వజైనల్ మెష్ ఇంప్లాంట్స్‌ను ఉపయోగిస్తారు. జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఈ ఉత్పత్తుల మీద అనేక కేసులు నమోదయ్యాయి.

ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు తాజాగా తీర్పు చెప్పిన కేసులో.. కొంతమంది పేషెంట్లు సర్జరీ ద్వారా ఈ వజైనల్ మెష్ ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత తాము నిరంతరం నొప్పితో బాధపడేవారిమని, రతి సమయంలో రక్తస్రావంతో పాటు తీవ్రంగా అసౌకర్యంగా ఉండేదని చెప్పారు.

ఈ ఉత్పత్తుల గురించి సదరు సంస్థ అందించిన సమాచారం చాలావరకూ అబద్ధమని.. కొన్నిసార్లు తప్పుడు వివరాలు కూడా చెప్పిందని న్యాయమూర్తి అన్నా కాట్జ్‌మాన్ తేల్చారు. ''దీనివల్ల ప్రమాదాల గురించి తెలుసు. అవి చిన్నవేమీ కాదు. ఎథికాన్ స్వయంగా అంగీకరించిన విధంగా.. వాటి పర్యవసానంగా తీవ్ర హాని జరగొచ్చు'' అని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.

బాధితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని కోర్టు వచ్చే ఏడాది నిర్ణయిస్తుంది.

line
line

ఎథికాన్ తనను సమర్థించుకుంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ''ఈ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి, పంపిణీల్లో సంస్థ నైతికబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు ఎథికాన్ నమ్ముతోంది'' అని తెలిపింది. కోర్టు తీర్పు మీద అప్పీలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పింది.

కోర్టు తీర్పును ఈ కేసులో మొదటి కక్షిదారు అయిన జూలీ డేవిస్ స్వాగతించారు.

''వాళ్లు మహిళలను ప్రయోగాలకు ఉపయోగించుకునే గినియా పిగ్స్‌లా పరిగణించారు. దాని గురించి అబద్ధాలు చెప్పారు. సాయం చేయటానికి ఏం చేయలేదు'' అని ఆమె సిడ్నీలో కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

వజైనల్ మెష్ వల్ల బాధపడుతున్న మహిళలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గత ఏడాది జాతీయ క్షమాపణ జారీ చేసింది. ఆ మహిళల దశాబ్దాల పాటు తీవ్ర బాధా వేదనలు అనుభవిస్తున్నారన్న విషయాన్ని గుర్తించింది.

జాన్సన్ అండ్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

భారీ సంఖ్యలో కేసులు

ఇతర ఉత్పత్తుల విషయంలోనూ వందల కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించాలనే డిమాండ్లతో అనేక కేసులు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి తాజా తీర్పు మరో దుర్వార్త.

అమెరికాలోని 41 రాష్ట్రాలతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో.. తన ఉత్పత్తి అయిన పెల్విక్ మెష్ మీద కేసులను పరిష్కరించటానికి 11.7 కోట్ల డాలర్లు (దాదాపు 850 కోట్ల రూపాయలు) చెల్లించటానికి ఈ కంపెనీ అక్టోబర్ నెలలో అంగీకరించింది.

ఇదే ఉత్పత్తి విషయంలో అటు కెనడా, యూరప్‌లలోనూ కేసులను ఎదుర్కొంటోంది జాన్సన్ అండ్ జాన్సన్.

మరోవైపు, ఈ సంస్థ టాల్క్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వచ్చిందంటూ వేలాది మంది వేసిన కేసులు కొనసాగుతున్నాయి.

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఒక మానసిక ఔషధాన్ని ఉపయోగిస్తే రొమ్ములు పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ ముందుగా హెచ్చరించలేదంటూ ఒక వ్యక్తి వేసిన కేసులో.. అతడికి 800 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 57,500 కోట్లు) చెల్లించాలని ఒక కోర్టు ఆదేశించింది.

ఈ కేసులు ఉన్నాకూడా.. ఈ మల్టీనేషనల్ కంపెనీ తాజా త్రైమాసికంలో 2,700 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) అమ్మకాలు నమోదు చేసింది. ఇది 2018లో ఇదే త్రైమాసిక విక్రయాలకన్నా 1.9 శాతం అధికం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)