మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది

మోదీ ప్రభుత్వం గణాంకాలు

ఫొటో సోర్స్, Bjp

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది మే నెలలో మోదీ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్ రాజీనామా చేశారు. భారత్ తన జీడీపీ వృద్ధి రేటును ఎక్కువ చేసి చెబుతోందని రాజీనామాకు ఒక నెల తర్వాత ఆయన అన్నారు.

2011-12 నుంచి 2016-17 మధ్య భారత్ జీడీపీ వాస్తవిక వృద్ధి రేటు 4.5 శాతం ఉందని, కానీ దానిని అధికారికంగా 7 శాతంగా చెప్పారని ఆయన తెలిపారు. అరవింద్ సుబ్రమణ్యన్ ప్రకటనను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రభుత్వం గణాంకాలను తారుమారు చేస్తోందని చెప్పింది.

అంతకు ముందు ఇదే ఏడాది జనవరి 28న పీసీ మోహనన్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (ఎన్ఎస్‌సీ) కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్ఎస్‌సీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది భారత కీలక గణాంకాల నాణ్యతను పరిశీలిస్తుంది.

ఉపాధికి సంబంధించిన గణాంకాల ప్రచురణలో ఆలస్యాన్ని వ్యతిరేకిస్తూ పీసీ మోహనన్ రాజీనామా చేశారు. మోహనన్‌తోపాటు మరో సభ్యురాలు జె.లక్ష్మి కూడా రాజీనామా చేశారు. మోహనన్ రాజీనామా చేసిన మూడు రోజుల తర్వాత బిజినెస్ స్టాండర్డ్ వార్తాపత్రికలో ఉపాధి గణాంకాలు లీక్ అయ్యాయి. వాటితో నిరుద్యోగం రేటు పెరిగి 6.1 శాతం అయ్యిందని తెలిసింది. ఇది గత 45 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది.

మోదీ ప్రభుత్వం గణాంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవన్నీ మోదీ మొదటి పదవీకాలంలోనే జరిగాయి. నిరుద్యోగంపై ఈ గణాంకాలు ఎన్నికలకు ముందు విడుదలయ్యుంటే, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవే. కానీ, మోదీ ప్రభుత్వం నిరుద్యోగం గణాంకాలను తోసిపుచ్చింది. డేటా సేకరణ ప్రక్రియలో ఎన్నో తప్పిదాలు ఉన్నాయని, ఇది వాస్తవ చిత్రం కాదని చెప్పింది.

ముద్ర పథకం ద్వారా వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, జనం ఆ నిధులతో ఉపాధి పొందుతున్నారని, కానీ డేటా సేకరణలో దానిని నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వం తన వాదన వినిపించింది.

బీజేపీ ప్రభుత్వం 2015 జనవరిలో జీడీపీ గణన ఆధారిత సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చింది. దానితోపాటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేని ఆధారంగా జీడీపీని లెక్కించేదో, మోదీ సర్కారు దానిని కూడా మార్చేసింది.

జీడీపీ గణన ప్రక్రియను మార్చడం వల్ల దాని గణాంకాలు పెరిగాయని, అది వాస్తవిక చిత్రం కాదని అరవింద్ సుబ్రమణ్యన్ చెప్పారు. బ్యాంక్ క్రెడిట్ గ్రోత్, ఎగుమతుల రేటు నెగటివ్‌గా ఉందని, నిరుద్యోగం పెరిగిందని ప్రజలు తక్కువ ఖర్చు పెడుతుంటే జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఎలా ఉంటుందని అన్నారు.

దీని వల్ల రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన గణాంకాలపై నిపుణులు ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. జారీ చేయకుండా ఆపుతున్న గణాంకాలు ప్రభుత్వానికి నచ్చడం లేదని నిపుణులు చెబుతున్నారు.

మోదీ ప్రభుత్వం గణాంకాలు

ఫొటో సోర్స్, Getty Images

గత వారంలో గణాంకాలకు సంబంధించిన మరో విషయం కూడా బయటపడింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ 2017-18 వినియోగదారుల ఖర్చు సర్వే డేటా జారీ చేయకూడదని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డేటా నాణ్యతలో లోపం వల్ల దీనిని జారీ చేయట్లేదని ప్రభుత్వం చెప్పింది.

ఈ డేటా జారీ చేయకపోవడం వల్ల, గత పదేళ్ల పేదరికం డేటా తెలీకుండా పోతుంది. ఇంతకు ముందు ఈ సర్వే 2011-12లో జరిగింది. ఈ డేటా వల్ల దేశంలో పేదరికం, అసమానతలను ప్రభుత్వం అంచనా వేస్తుంది.

ఈ డేటా కూడా ఈ ఏడాది జూన్‌లోనే విడుదల కావాలి. కానీ చేయలేదు. కానీ, బిజినెస్ స్టాండర్డ్ పత్రిక మరోసారి ఆ డేటా లీక్ అయ్యిందని చెప్పింది. ప్రజల ఖర్చు చేసే సామర్థ్యం గత 40 ఏళ్లలో తగ్గిందని చెప్పింది. అయితే ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది. ఎన్ఎస్ఓ సర్వే ఆధార సంవత్సరాన్ని మార్చాలని ఆలోచిస్తున్నామని, ఆ సర్వే ఇక 2021-22లో జరుగుతుందని తెలిపింది.

అయితే, మోదీ ప్రభుత్వం తమ సంస్థల గణాంకాలనే ఎందుకు నమ్మకం లేదు?

దీనికి సమాధానంగా... "ఈ రిపోర్టు జూన్‌లోనే రావాల్సి ఉంది. నవంబర్ సగం అయిపోయింది. ఇప్పటివరకూ ఆ రిపోర్టు రాలేదు. ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వం దానిని ఎందుకు విడుదల చేయలేదనే సందేహం వచ్చింది. ప్రభుత్వానికి గణాంకాలు నచ్చలేదని బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన లీక్ రిపోర్టుల్లో స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం రిపోర్ట్ జారీ చేయకపోవడానికి కారణం నాణ్యతా లోపం అని చెబుతోంది. కానీ అది అర్థం చేసుకోవడం కష్టం" అని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ చైర్మన్ పీసీ మోహనన్ అన్నారు.

మోదీ ప్రభుత్వం గణాంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్ఎస్ఓ 1950 నుంచి ఈ సర్వే చేస్తోంది. ఇది కొత్త సర్వే ఏం కాదు. ఎన్ఎస్ఓ సర్వే చేయడం మొదలుపెట్టినప్పుడు కూడా ప్రభుత్వానికి క్వాలిటీ గురించి తెలుసు. ఇందులో క్వాలిటీ లోపం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం ఓపెన్‌గా ఎందుకు చెప్పలేకపోతోంది. ఈ సర్వే డేటా చాలా ముఖ్యమైనది. 2011-12 తర్వాత మొదటిసారి ఈ సర్వే రిపోర్ట్ రాబోతోంది. దానివల్ల దేశంలో జనాభా ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలుస్తుంది.

మొత్తం వివాదంపై బిజినెస్ స్టాండర్డ్‌తో మాట్లాడిన మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ ప్రణబ్ సేన్... "2017-18 అసాధారణ ఏడాది అయినప్పటికీ ప్రభుత్వం డేటా జారీ చేయాల్సుంటుంది. నేను చీఫ్ స్టాటిస్టీషియన్‌గా ఉన్న సమయంలో 2009-10లో సర్వే జరిగింది. అప్పుడు 40 ఏళ్ల తర్వాత భయంకరమైన కరవు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉంది. అయినా, మేం డేటాను ఆపలేదు. మేం 2011-12ను కొత్త ఆధార సంవత్సరంగా చేశాం. కానీ 2009-10 రిపోర్టు ఆపలేదు. మేం డేటాను అణిచివేయలేదు" అన్నారు.

నాణ్యత లేదనే వాదనపై మాట్లాడిన పీసీ మోహనన్... "మీరు క్వాలిటీ ఆధారంగా సర్వే డేటాను అడ్డుకుంటున్నారు. కానీ అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లభించదు. కనీసం ఆర్థిక వ్యవస్థ, ప్రజలకు కూడా ప్రయోజనాలు అందవు. అంతర్జాతీయ వేదికపై మన విశ్వసనీయత తగ్గిపోతోంది. దేశంలో కూడా సంస్థల పట్ల అవిశ్వాసం ఏర్పడుతోంది. ప్రభుత్వానికి ఏ గణాంకాలు సౌకర్యంగా ఉంటాయో వాటినే విడుదల చేస్తుందని, లేదంటే చేయదని ఇప్పుడు స్పష్టమైన సందేశం వెళ్తోంది. ప్రభుత్వం ఈ గణాంకాలను బట్టి ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది. కన్సూమర్ ఇండెక్స్ ప్రైస్ లాంటివి వీటి ఆధారంగానే నిర్ణయిస్తారు" అన్నారు.

మోదీ ప్రభుత్వం గణాంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరవింద్ సుబ్రమణ్యన్

గత నెల కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ కూడా ఉపాధిపై నేషనల్ శాంపిల్ సర్వే డేటాను తోసిపుచ్చారు. ఎన్ఎస్ఎస్ఓ డేటా సేకరణ ప్రక్రియ సరిగా లేదని అన్నారు. "ఎన్ఎస్ఎస్ఓ ప్రక్రియ 70 ఏళ్ల క్రితం నాటిది, దానికి ఇప్పటి పూర్తి చిత్రం ఆందించే సామర్థ్యం లేదు" అన్నారు.

"మీరు కొత్త ఆధార సంవత్సరం కావాలంటే తీసుకోండి. ఎవరు అడ్డుకున్నారు? కానీ పాత డేటాను జారీ చేయడంలో సమస్యేముంది? సర్వే అయిపోయినప్పుడు, ఆ డేటాను ఎందుకు అడ్డుకోవాలి? దీంతో ఒక విషయం స్పష్టమవుతోంది. వారికి తమకు నచ్చిన డేటా కావాలి. నచ్చని డేటాను జారీ చేయనివ్వరు. ఉపాధి డేటాతో అదే జరిగింది. వాళ్లు దాన్ని కూడా విడుదల చేయనివ్వలేదు" అని పట్నా ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఆర్థశాస్త్ర ప్రొఫెసర్ డీఎం దివాకర్ అన్నారు.

"ప్రజాస్వామ్య భారత చరిత్రలో సంస్థలు విడుదల చేసిన డేటాను తోసిపుచ్చుతున్న మొదటి ప్రభుత్వం ఇదే అవుతుంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన రిపోర్టులో ఒక భారతీయుడి ప్రతి నెల ఖర్చు సగటు సామర్థ్యంలో 3.7 శాతం పతనం వచ్చిందని చెప్పారు. అటు గ్రామీణ భారతంలో ఈ పతనం 8.8 శాతం ఉంది" అని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఈ గణాంకాల ఆధారంగా చర్చ జరుగుతుందని, విపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను అంశంగా చేసుకుని ప్రశ్నలు సంధిస్తాయని పీసీ మోహనన్ చెప్పారు. కానీ డేటా జారీ చేయకపోవడం అనేది ఈ చర్చల నుంచి అసలు చిత్రాన్ని మాయం చేయడమే అన్నారు.

పీసీ మోహనన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పీసీ మోహనన్

"ఎవరైనా ఏదైనా వాదించినపుడు, దానిని సరిచూసుకోడానికి మన దగ్గర ఎలాంటి మార్గం ఉండదు. దేశంలో పేదరికం గ్రాఫ్ ఏంటి అనేదాని గురించి మన దగ్గర ఎలాంటి వివరాలూ ఉండవు. సర్వే చేసిన తర్వాత ఒక ప్రభుత్వం డేటా రిలీజ్ చేయకపోవడం అనేది మొదటిసారి ఇప్పుడే జరిగింది. ఎన్ఎస్ఓ ప్రతిష్ట విదేశాల్లో కూడా ఉంది. ఇక్కడ పనిచేసేవారు చాలా నిపుణులు. ప్రభుత్వ ఈ వైఖరి వల్ల ఇక్కడి స్టాఫ్‌లో నిరుత్సాహం ఏర్పడుతుంది. నిజాయతీగా చేసిన పని ఎందుకూ పనికిరాకుండా పోయిందని వారు అనుకుంటారు.

భారత గణాంక నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది. కానీ ఈ ప్రభుత్వం గత మూడు నాలుగేళ్ల నుంచి డేటాను అంగీకరించడం లేదు. దీర్ఘకాలంలో ఇది సరికాదు, మన డేటాపై విశ్వసనీయత తగ్గుతుంది. దాని ప్రభావం అన్నివైపులా ఉంటుంది. ప్రభుత్వం నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు తక్షణం ఏదో ఒకటి చేయాలి" అని పీసీ మోహనన్ చెప్పారు.

ఇదే ఏడాది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 'ద హిందూ' పత్రికకు ఒక వ్యాసం రాశారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గణాంకాల ప్రచురణపై కన్నేసి ఉంచారని అన్నారు. ఈ విషయాన్ని ఒక ఆర్థికవేత్తగా చెబుతున్నానని ఆయన తెలిపారు. దేశ సంస్థలను బలహీనపరుస్తున్నారని, దానివల్ల ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుందని చెప్పిన ఆయన... ప్రభుత్వం మీడియాలో కలర్‌ఫుల్ హెడ్‌లైన్స్‌తో ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయలేదని అన్నారు.

మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలతో పీసీ మోహనన్ ఏకీభవించారు. "సర్వే చేయాలనే నిర్ణయం ఒకటి రెండేళ్లు ముందే తీసుకుంటారు. కానీ సర్వే మొదలైనప్పుడు ఆయన నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. మధ్యలో జీఎస్టీ కూడా అమలు చేశారు. ఈ రెండింటి ప్రభావం ప్రజలపై పడిందనేది తెలిసిందే. సర్వే ఫలితాలు కూడా దానివల్ల ప్రభావితం అయ్యుంటాయి" అన్నారు.

"ప్రభుత్వానికి నా పనితో ఎలాంటి సంబంధం లేనపుడు, దానిని ఉపయోగించడానికి వెనకాడుతున్నప్పుడు.. నాకు రాజీనామా చేయడం తప్ప వేరే అవకాశం లేదు. ప్రభుత్వానికి చెప్పడమే కాదు, ప్రజలకు కూడా చెప్పడం అనేదే గణాంకాల లక్ష్యం. డేటా కేవలం ప్రభుత్వాల కోసమే కాదు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ దాన్ని అడ్డుకోలేదు" అని మోహనన్ అన్నారు.

ప్రభుత్వం ఈ సర్వేను జారీ చేయకపోతే, గత పదేళ్లలో భారత పేదరికం గ్రాఫ్ ఏంటి, అనేది ఎప్పటికీ తెలీకుండా పోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)