ఆర్‌సీఈపీలో చేరకూడదని ప్రధాని మోదీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఆసియాన్ దేశాలతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందంపై సంతకం చేయకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది.

ఆర్‌సీఈపీ సభ్యత్వం విషయంలో తమకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని, పూర్తి స్పష్టత లేకపోవడంతో దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఆత్మ ప్రబోధానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అయితే, కాంగ్రెస్ మాత్రం దీన్ని తమ విజయంగా చెప్పుకుంటోంది.

సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సీఈపీ సదస్సుకు మోదీ హాజరయ్యారు. దీంతో భారత్ ఈ ఒప్పందంలో భాగమవుతున్నట్లు ప్రచారం జరిగింది.

భారత్‌లోని రైతు, వ్యాపార సంఘాలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేశాయి.

మోదీ

ఫొటో సోర్స్, PIB

కానీ, ఆర్‌సీఈపీ సదస్సు ముగిసిన తర్వాత.. ప్రతికూల పరిస్థితుల కారణంగా, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ ప్రకటించారు.

కొన్ని అపరిష్కృత సమస్యలు, ఆందోళనలు ఉండటంతో ఆర్‌సీఈపీలో భారత్ భాగస్వామి కాలేదని ఆమె వివరించారు.

సదస్సులో ప్రధాని మోదీ ప్రకటనను కూడా విజయ్ చదివి వినిపించారు. ఆత్మ ప్రబోధానుసారం, 'గాంధీ తాయత్తు' సూత్రం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ఇందులో చెప్పారు.

''భారతీయులపై, ముఖ్యంగా బలహీన వర్గాలు, వారి జీవనోపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ చెప్పారు. 'అత్యంత పేద, బలహీన వ్యక్తికి మీ చర్యతో లాభం జరుగుతుందా, లేదా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని గాంధీ చెప్పిన తాయత్తు సూత్రాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు'' అని విజయ్ వివరించారు.

''ఆర్‌సీఈపీ చర్చల్లో భారత్ తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్టిగా సంప్రదింపులు జరిపింది. ఒప్పందంలో భాగం కాకపోవడమే మంచి నిర్ణయమన్న అభిప్రాయానికి వచ్చింది. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజలకు సంబంధించిన బంధాల బలోపేతాన్ని మాత్రం కొనసాగిస్తుంది'' అని అన్నారు.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందం ఏంటి?

2011-12లోనే ఆర్‌సీఈపీ గురించి అవగాహన కుదిరింది.

ఆసియాన్ సభ్యదేశాలు (బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వాములు (భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్)ల మధ్య ఒప్పందం ఇది.

ఒకవేళ అమల్లోకి వస్తే ఆయా దేశాలు కస్టమ్స్ సుంకాలు లేకుండా ఒకరితో ఒకరు వాణిజ్యం చేసుకోవచ్చు.

ప్రపంచ జీడీపీలో 34 శాతం ఈ 16 ఆర్‌సీఈపీ దేశాల నియంత్రణలోనే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ దేశాల వాటా 40 శాతం.

ఆర్‌సీఈపీ ఒప్పందం గురించి భారత్‌లోని రైతు, వ్యాపార సంఘాలు చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. దీనిపై భారత్ సంతకం చేస్తే, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులు, చిన్న తరహా వ్యాపారులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారని అభ్యంతరం చెప్పాయి.

ఆర్‌సీఈపీలో భాగం కాకూడదని తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైందని, ప్రజల అభిప్రాయాన్ని ప్రధాని మోదీ గౌరవించారని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ అన్నారు.

''ఈ నిర్ణయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తప్పకుండా మెచ్చుకోవాలి. ఆర్‌సీఈపీలో చేరితే రైతులు, చిన్న వ్యాపారులు సంక్షోభంలో చిక్కుకునేవారు. అయినా, ప్రభుత్వం ముందుకువెళ్లింది. సంతకం చేస్తారనే అనుకున్నాం. కానీ, ప్రధాని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, ఒప్పందంపై సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇది దేశ ప్రయోజనాలను కాపాడే నిర్ణయం'' అని అభిప్రాయపడ్డారు.

ఆర్‌సీఈపీ

ఎందుకు వ్యతిరేకత?

దేశంలోని రైతు సంఘాలన్నీ ముక్త కంఠంతో ఆర్‌సీఈపీని వ్యతిరేకించాయని యోగేంద్ర యాదవ్ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘాలు కూడా వాటిలో ఉన్నాయని చెప్పారు.

''ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటుందని భావించే అమూల్ డెయిరీ కూడా ఆర్‌సీఈపీని వ్యతిరేకించింది. బీజేపీ మంత్రులు కూడా లోలోపల విమర్శలు చేశారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అభ్యంతరం చెప్పాయి. కాంగ్రెస్ కూడా కొన్ని రోజుల క్రితమే తమ పాత విధానాన్ని మార్చుకుని ఆర్‌సీఈపీని వ్యతిరేకించింది. ఇవన్నీ మోదీపై ప్రభావం చూపించి ఉంటాయి'' అని యోగేంద్ర అన్నారు.

ఒకవేళ భారత్ ఒప్పందం చేసుకుని ఉంటే, న్యూజీలాండ్ పాల పొడి దిగుమతుల వల్ల భారత పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడేదని అభిప్రాయపడ్డారు.

కొబ్బరి, నల్ల మిరియాలు, రబ్బర్, గోధుమలు, నూనె గింజల ధరలు విపరీతంగా పడిపోయే ప్రమాదం ఉండేదని, చిన్న వ్యాపారాలు ఘోరంగా దెబ్బతినేవని అన్నారు.

''భారత ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. నోట్ల రద్దు నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సమయంలో మరో సమస్యకు ప్రభుత్వం కారణమైతే, ప్రజల్లో ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ఇవన్నీ ఆలోచించి, మోదీ మనసు మార్చుకుని ఉంటారు'' అని యోగేంద్ర చెప్పారు.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా బృందం ఆర్‌సీఈపీలో చేరాలని ఇదివరకు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఆర్‌సీఈపీలో చేరకపోతే భారీ ప్రాంతీయ మార్కెట్‌కు భారత్ దూరమవుతుందని అభిప్రాయపడింది.

అయితే, గతంలో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అనుభవాలు బాగా లేవని, ఆర్‌సీఈపీలో భాగమయ్యే దేశాలు భారత్‌ ఎగుమతులను తీసుకోవడం కన్నా ఇక్కడికి దిగుమతులే ఎక్కువగా చేస్తాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఆర్‌సీఈపీని చైనా గట్టిగా సమర్థిస్తోంది. ఇప్పటికే చైనా, భారత్ వాణిజ్య లోటు గరిష్ఠ స్థాయిలో ఉంది. ఆర్‌సీఈపీలో భాగమైతే ఇది మరింత పెరిగేది.

ఆర్‌సీఈపీ గురించి చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయని, ఆ ఒప్పందం వల్ల తక్కువ ప్రయోజనాలు లేదా నష్టాలు ఉండే అవకాశాలున్నాయని భావించి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని సీఆర్ఐఎస్ఐఎల్‌కు చెందిన ఆర్థికవేత్త సునీల్ సిన్హా అన్నారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

‘‘చైనా ఇప్పటికే ఆర్థికంగా సుసంపన్నమైన దేశం. తూర్పు ఆసియా దేశాలతో చైనాకు భారత్ కన్నా మెరుగైన సంబంధాలున్నాయి. ఇలాంటి వాణిజ్య చర్చలు జరిగినప్పుడు చైనా కొంచెం మెరుగైన స్థితిలో ఉంటుంది. తూర్పు ఆసియా దేశాలతో భారత్‌కు అంతటి వాణిజ్య సంబంధాలు లేవు. ఈ ప్రాంతీయ సహకారంలో భాగం కావాలని భారత్ ప్రయత్నిస్తోంది. చైనా ఎప్పుడో వాటిని చేరుకుంది'' అని సునీల్ అభిప్రాయపడ్డారు.

ఆర్థిక కోణమే కాకుండా ఆర్‌సీఈపీ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా పొడచూపింది.

ఆర్‌సీఈపీలో చేరకూడదని ప్రధాని గొప్ప దార్శనిక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ చెబుతుంటే, ఇది తమ విజయమేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది.

మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాల తరహాలో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గకుండా ఉన్నందుకు ప్రధానికి అభినందనలని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఎదురైన ప్రతిఘటన కారణంగా ఆర్‌సీఈపీపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)