ఐసిస్ మాజీ సారథి బగ్దాదీ సోదరిని నిర్బంధించిన టర్కీ సైన్యం.. ఐఎస్ గుట్టుమట్లు వెల్లడయ్యేనా?

ఫొటో సోర్స్, Reuters
అమెరికా సైన్యం ఆపరేషన్లో చనిపోయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మాజీ నాయకుడు అబూ బకర్ అల్-బగ్దాదీ అక్క రష్మియా అవద్‌ను ఉత్తర సిరియాలో 'అరెస్టు చేసినట్లు' టర్కీ అధికారులు చెప్పారు.
రష్మియా వయసు 65 ఏళ్లు. సోమవారం అలెప్పో రాష్ట్రంలోని అజాజ్ పట్టణంలో జరిపిన దాడిలో ఆమెను అదుపులోకి తీసుకొన్నట్లు వారు తెలిపారు. ఈ రాష్ట్రం ప్రస్తుతం టర్కీ బలగాల నియంత్రణలో ఉంది.
రష్మియా అరెస్టుతో ఇస్లామిక్ స్టేట్ గురించి విలువైన నిఘా సమాచారం వెల్లడయ్యే అవకాశముందని టర్కీ అధికారులను ఉటంకిస్తూ వివిధ మీడియా సంస్థలు వెల్లడించాయి.
టర్కీ ఉగ్రవాద నిరోధక చర్యల విజయానికి రష్మియా అరెస్టు ఇంకో ఉదాహరణ అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్దోగాన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు.
అక్టోబరులో వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో అమెరికా ప్రత్యేక బలగాలు చేపట్టిన ఆపరేషన్లో బగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నారు.
బగ్దాదీ మరణం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విజయంగా ట్రంప్ మద్దతుదారులు చెప్పగా, సిరియా, ఇతర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికీ ముప్పుగానే ఉందని విమర్శకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
రష్మియా గురించి సమాచారం అంతగా అందుబాటులో లేదు. ఆమె పూర్వాపరాలను బీబీసీ సొంతంగా నిర్ధరించుకోలేకపోయింది.
బగ్దాదీకి ఐదుగురు సోదరులు, పలువురు సోదరీమణులు ఉన్నారని, వీరంతా ఇంకా బతికే ఉన్నారా అనేది స్పష్టంగా తెలియదని 'ద న్యూయార్క్ టైమ్స్' పత్రిక తెలిపింది.
భర్త, కోడలు, ఐదుగురు పిల్లలతో కలిసి ఒక ట్రెయిలర్లో రష్మియా నివసిస్తున్నారని, అక్కడే ఆమెను అదుపులోకి తీసుకొన్నట్లు టర్కీ అధికారి ఒకరు ఏపీ వార్తాసంస్థతో చెప్పారు. ఒక తీవ్రవాద గ్రూపుతో సంబంధాలున్నాయనే అనుమానంపై ఆమెను విచారిస్తున్నట్లు తెలిపారు. ఆమెను నిఘా సమాచార నిధిగా అభివర్ణించారు.
బగ్దాదీతో రష్మియా ఎంత కాలం ఉన్నారు, ఆమె నుంచి ఎంత విలువైన సమాచారం లభిస్తుందనే స్పష్టత కొరవడిందని నిపుణులు చెబుతున్నారు.
దాడుల కుట్రల గురించి రష్మియాకు తెలిసి ఉంటుందని తాను అనుకోవడం లేదని, అయితే స్మగ్లింగ్ మార్గాల గురించి ఆమెకు అవగాహన ఉండొచ్చని అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మైక్ ప్రెగెంట్ బీబీసీతో చెప్పారు. బగ్దాదీ నమ్మకం ఉంచే నెట్‌వర్కులు, వ్యక్తుల గురించి రష్మియాకు అవగాహన ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రష్మియాకు, ఆమె కుటుంబానికి ప్రయాణాల విషయంలో సహకరించిన ఇరాక్‌లోని నెట్‌వర్కుల గురించి ఆమెకు తెలిసి ఉండొచ్చని వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
బగ్దాదీ ఎలా చనిపోయారు?
ఇడ్లిబ్ రాష్ట్రంలో, టర్కీ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో బరిషా అనే గ్రామం బయట బగ్దాదీ స్థావరాన్ని అమెరికా గుర్తించింది. అందులో ఉన్నది ఆయనేనని నిర్ధరించుకుని అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది.
బగ్దాదీ స్థావరంపై అమెరికా సైన్యం ఆపరేషన్లో ఆయన మృతిచెందారని అక్టోబరు 27న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రకటించారు. బగ్దాదీ ఒక సొరంగంలోకి పారిపోయి, సూసైడ్ వెస్ట్‌ను పేల్చుకున్నారని చెప్పారు.
దాడి వీడియో దృశ్యాలను అమెరికా సైన్యం తర్వాత విడుదల చేసింది. బగ్దాదీ స్థావరమున్న ప్రదేశంలోని సాయుధులపై అమెరికా ప్రత్యేక బలగాల కమాండోలు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిపారు. ఆ సమయంలో వారు బగ్దాదీ దాక్కొన్న స్థావరం ప్రహరీ వైపు పరుగెత్తారు.
కమాండోలు కిందకు దిగిన తర్వాత ప్రహరీని పేల్చివేశారని, లొంగిపోవాలని బగ్దాదీకి పిలుపునిచ్చారని సైన్యం తెలిపింది. కానీ ఆయన ఓ సొరంగంలోకి పారిపోయి, సూసైడ్ వెస్ట్‌ను పేల్చుకొన్నారని, దీంతో బగ్దాదీతోపాటు ఆయన వెంట తీసుకెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారని చెప్పింది.
డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి చనిపోయింది బగ్దాదీయేనని ధ్రువీకరించుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
దాడి తర్వాత ప్రహరీని వైమానిక దాడితో ధ్వంసం చేశారు.
బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించిన ఐసిస్, తమ నాయకుడిగా అబూ ఇబ్రహీం అల్-హషేమీ అల్-ఖురాషీని నియమితమించినట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- వాయు కాలుష్యంతో ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'భూ వివాదంతో తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
- తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి: బీబీసీ గ్రౌండ్‌రిపోర్ట్
- బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించిన ఐసిస్, కొత్త చీఫ్ అబు ఇబ్రహీం అల్-హషేమీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








