ఐఎస్ సభ్యులైన అమ్మానాన్న యుద్ధభూమిలో మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా?

ఉత్తర సిరియాలో శిబిరంలోని చిన్నారులు

ఫొటో సోర్స్, Jewan Abdi/BBC

ముగ్గురు పిల్లలున్న ఒక జంట ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌లో చేరింది. తర్వాత వారిద్దరూ చనిపోయారు. వారి పిల్లలు ఇప్పుడు సిరియాలో చిక్కుకుపోయారు.

అమీరా, హెబా, హమ్జా అనే ఈ చిన్నారులు బ్రిటన్‌కు చెందినవారని భావిస్తున్నారు.

సిరియాలో ఐఎస్ ఫైటర్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఒక శిబిరంపై బీబీసీ ఇటీవల అందించిన కథనంలో ఈ పిల్లలు ఉన్నారు. వీరిని ఐక్యరాజ్యసమితి రఖా నగరానికి తరలించినట్లు తెలుస్తోంది.

వారిని స్వదేశానికి చేర్చడం ఎలా? ఇందులో ఉన్న అడ్డంకులు ఏమిటి?

ఉత్తర సిరియాలో శిబిరంలోని చిన్నారి

పరాయి దేశంలో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు అక్కడి తమ దేశ కాన్సులర్ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి, అవసరమైన సేవలు పొందవచ్చు.

ఉత్తర సిరియాలో ఐఎస్ సభ్యుల కుటుంబాలున్న శిబిరాలు ప్రస్తుతం కుర్దుల నాయకత్వంలోని బలగాల నియంత్రణలో ఉన్నాయి. వీటిలో ఉన్న మీ పౌరులను వెనక్కు తీసుకెళ్లండని ఐరోపా దేశాలకు ఈ బలగాల నాయకులు పదే పదే చెప్పారు.

శిబిరాల్లోని వ్యక్తులను స్వదేశాలకు తరలించడంలో తన వంతు తోడ్పాటు అందించేందుకు 'ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌ క్రాస్(ఐసీఆర్‌సీ)' ప్రయత్నించింది. వారి జాతీయతను గుర్తించి సంబంధిత రాయబార కార్యాలయాలను లేదా కాన్సులర్ అధికారులను నేరుగా సంప్రదించింది. అటు వైపు నుంచి తగిన స్పందన లేకపోవడంతో నిరుత్సాహానికి గురైంది.

సిరియాలో చాలా దేశాలు వాటి రాయబార కార్యాలయాలను మూసేయడం సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి.

ఈ విషయంలో ఇక్కడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని, శిబిరాల్లోని వ్యక్తులను తరలించే ప్రక్రియ చేపట్టేందుకు ఎవరికీ ఆసక్తి లేదని ఐసీఆర్‌సీ అధ్యక్షుడు పీటర్ మారర్ ఇంతకుముందు విచారం వ్యక్తంచేశారు.

సిరియా

ఫొటో సోర్స్, Getty Images

'తరలింపులో పిల్లలకు ప్రాధాన్యమివ్వాలి'

సిరియాలో యుద్ధం జరుగుతోందని, అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకొచ్చేందుకు తమ అధికారులను పంపడం చాలా ప్రమాదకరమని కొన్ని దేశాలు చెబుతున్నాయి.

ఐఎస్ సభ్యుల కుటుంబాలున్న అతిపెద్ద శిబిరాన్ని గత నెల్లో బ్రిటన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం సందర్శించింది.

బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకురావడం భారమైన పనేనని, కానీ ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందని, ఈ విషయంలో పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలని బృందంలో సభ్యుడైన కన్జర్వేటివ్ ఎంపీ క్రిస్టిన్ బ్లంట్ వ్యాఖ్యానించారు.

పిల్లలను కాపాడేందుకు సిరియాకు వ్యక్తులను పంపించడం ముప్పుతో కూడుకున్నదని, తాము ఆ పని చేయలేమని ఆస్ట్రేలియా ఇటీవల చెప్పింది.

సిరియా చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, అక్కడున్న ఆస్ట్రేలియన్ పిల్లలను కాపాడేందుకు ఇతర ఆస్ట్రేలియన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేయలేమని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి లిండా రెనాల్డ్స్ స్పష్టం చేశారు.

చిన్నారితో మహిళ

ఫొటో సోర్స్, AFP

రప్పించే ప్రక్రియ

చిక్కుకుపోయిన పిల్లలను దౌత్య అధికారులు కలుసుకున్నాక లేదా వారితో సమాచార సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత, చట్టప్రకారం వారు ఎవరి సంతానమో నిర్ధరించాలి. జాతీయతను ధ్రువీకరించాలి. ఇది అన్నిసార్లూ సాఫీగా జరగకపోవచ్చు.

తల్లిదండ్రుల గుర్తింపు పత్రాలు లేకపోయినా, వారు రెండు వేర్వేరు దేశాలవారైనా, బాలిక లేదా బాలుడు చట్టపరంగా సంరక్షకుడు ఎవరూ లేని అనాథ అయినా, తల్లిదండ్రులను నిర్ధరించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేసే సదుపాయం లేకపోయినా పిల్లలను స్వదేశానికి తరలించడంలో అడ్డంకులు ఏర్పడతాయి.

పిల్లల జాతీయతను నిర్ధరించడం అత్యంత కష్టమైన పనని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది.

జాతీయతను నిర్ధరించేందుకు అన్ని ఆధారాలను పరిశీలిస్తామని బ్రిటన్ హోం ఆఫీస్ బీబీసీతో చెప్పింది. తమను కాన్సులర్ సాయం కోరిన ప్రతి కేసులోనూ పరిశీలన జరుపుతామని తెలిపింది.

లండన్లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ రాడికలైజేషన్' జులైలో విడుదల చేసిన ఒక నివేదికలో- కేవలం నలుగురే చిన్నారులు బ్రిటన్‌కు తిరిగి వచ్చారని పేర్కొంది. వాస్తవ సంఖ్యలను తమ లెక్క ప్రతిబింబించకపోవచ్చని కూడా చెప్పింది.

యుద్ధభూమిలో చిక్కుకుపోయిన అమాయక చిన్నారుల పట్ల తనకు సానుభూతి ఉందని ఫిబ్రవరిలో నాటి బ్రిటన్ హోం సెక్రటరీ సాజిద్ జావిద్ పార్లమెంట్లో చెప్పారు. అదే సమయంలో- వీరిని రక్షించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలనుకుంటే, ఇందులో ఉన్న రిస్కుల గురించి ఆలోచించాలన్నారు. వారిని తీసుకొస్తే మున్ముందు బ్రిటన్లో భావి చిన్నారులకు ఎదురయ్యే రిస్కు గురించి ఆలోచించాలని, వారిని కూడా తల్లిదండ్రులు యుద్ధక్షేత్రాలకు తీసుకెళ్లే ఆస్కారం ఉందని వ్యాఖ్యానించారు.

షమీమా బేగం

ఫొటో సోర్స్, JAMIE WISEMAN/DAILY MAI

ఫొటో క్యాప్షన్, తన మూడో కుమారుడు జెరాతో షమీమా బేగం. ఈ శిశువు పుట్టిన మూడు వారాల్లోపే చనిపోయాడు.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌లో చేరి, 2015లో సిరియా వెళ్లిన లండన్ యువతి షమీమా బేగం బ్రిటన్ పౌరసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆమె తిరిగి బ్రిటన్ రాకుండా అడ్డుకొనేందుకు ఈ చర్య తీసుకొంది. ఈ ఏడాది ఆమెకు జన్మించిన మూడో కుమారుడు జెరాకు మాత్రం బ్రిటన్ పౌరసత్వం ఉంటుందని లోగడ సంకేతప్రాయంగా చెప్పింది.

జెరా పుట్టిన మూడు వారాల్లోపే సిరియా శరణార్థి శిబిరంలో న్యుమోనియాతో చనిపోయాడు. ఈ శిశువును తీసుకొచ్చేందుకు షమీమా బేగంను నిర్బంధించిన శిబిరానికి తమ అధికారులను పంపి ఉంటే, అది చాలా ప్రమాదకరమైన చర్య అయ్యుండేదని ఈ ఘటన తర్వాత బ్రిటన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

శిబిరాలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలను, చిన్నారులను తరలించిన 17 దేశాలు

సిరియాలో ఐఎస్ సభ్యుల కుటుంబాలున్న అతిపెద్ద శిబిరంలోంచి జనవరి నుంచి ఇప్పటివరకు 17 దేశాలు మహిళలను, చిన్నారులను స్వదేశాలకు తరలించాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది.

రష్యా 145 నుంచి 200 మందిని విమానాల్లో తరలించింది. పలు మధ్య ఆసియా దేశాలు కూడా చిన్నారులను స్వదేశాలకు తీసుకొచ్చాయి.

కజక్‌స్థాన్ మేలో సిరియా శిబిరాల నుంచి 230 మందికి పైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిలో అత్యధికులు చిన్నారులే.

అనాథలైన ఇద్దరు పిల్లలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూరోపియన్ దేశం ఆస్ట్రియా ఇటీవల అంగీకరించింది. డీఎన్‌ఏ పరీక్షల నిర్వహణ, పిల్లలను తీసుకొచ్చాక వారి సంరక్షణ బాధ్యతలు ఎవరు చూస్తారనేదానిపై కోర్టు నిర్ణయం తర్వాత ఆస్ట్రియా ఈ మేరకు స్పందించింది.

ఐరోపా దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే కూడా తమ పిల్లలు కొందరిని వెనక్కు తీసుకొచ్చాయి.

గ్రే లైన్, అడ్డగీత, అడ్డ గీత, ప్రజంటేషనల్ గ్రే లైన్
రియాలిటీ చెక్ బ్రాండింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)