సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా

సిరియా సరిహద్దుల్లో టర్కీ భారీగా బలగాలను మోహరిస్తోంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సిరియా సరిహద్దుల్లో టర్కీ భారీగా యుద్ధ సన్నాహాలు చేస్తోంది

ఉత్తర సిరియా నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించడం ప్రారంభించింది. దీంతో సిరియా సరిహద్దు వెంబడి కుర్దు యోధులతో పోరాటానికి టర్కీకి మార్గమేర్పడింది.

సిరియా యుద్ధంలో ఐఎస్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరులో ఇంతవరకు అమెరికా బలగాలకు కుర్దు యోధులు కీలక సంకీర్ణంగా వ్యవహరించారు. కానీ, కుర్దు యోధులను టర్కీ తీవ్రవాదులుగా పరిగణిస్తుంది.

ఇప్పుడు అమెరికా బలగాలు వెనక్కు మళ్లుతుండడంతో కుర్దిష్ సేనలు కంగారు పడుతున్నాయి. ప్రధాన కుర్ద్ గ్రూప్ దీనిపై స్పందిస్తూ 'అమెరికా వెన్నుపోటు పొడిచింది' అని పేర్కొంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ''ముగింపు లేని యుద్ధాల నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయం'' అన్నారు.

ఈ బలగాల ఉపసంహరణ అమెరికా విదేశాంగ విధానంలో కీలక మలుపు మాత్రమే కాదు, ఆ దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల సీనియర్ అధికారుల సూచనలకు భిన్నమని కూడా చెబుతున్నారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్దొగాన్ మాట్లాడుతూ.. ''సరిహద్దుల్లోని కుర్దు యోధులతో పోరాడడమే మా లక్ష్యం. ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా మార్చి టర్కీలో ఉంటున్న సిరియా శరణార్థులకు అక్కడ ఆశ్రయం కల్పిస్తాం'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వైట్‌హౌస్ ఏం చెప్పింది

''ఉత్తర సిరియాలో దాడులకు చాలాకాలంగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం టర్కీ త్వరలో అటు దూసుకురానుంది. ఈ ఆపరేషన్‌కు అమెరికా బలగాలు మద్దతివ్వడం కానీ, అందులో పాల్గొనడం కానీ చేయవు. సిరియాలో ఐఎస్‌ను అంతమొందించడంతో అమెరికా బలగాలు అక్కడ నుంచి వచ్చేస్తాయి'' అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కుర్దు సేనల అదుపులో ఉన్న ఐఎస్ ఫైటర్ల బాధ్యత టర్కీ చూసుకుంటుందని కూడా వైట్ హౌస్ తెలిపింది.

కుర్దుల అధీనంలోని శిబిరాల్లో సుమారు 12 వేల మంది ఉన్నారు. వారంతా ఐఎస్ సభ్యులుగా అనుమానిస్తూ కుర్దులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారిలో 4 వేల మంది విదేశీయులు.

కుర్దులేమంటున్నారు

కుర్దుల నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్) అధికార ప్రతినిధి కినో గాబ్రియల్ ఈ అంశంపై స్పందిస్తూ అమెరికా చర్యను తప్పుపట్టారు. ఈ ప్రాంతంలో టర్కీ ఎలాంటి ఆపరేషన్ చేపట్టకుండా చూస్తామని అమెరికా తమకు హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు.

''అమెరికా ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ఎస్డీఎఫ్‌కు ఇది వెన్నుపోటే'' అని కినో గాబ్రియల్ అన్నారు.

సిరియా సరిహద్దుల్లో తాము ప్రతిపాదిస్తున్న సేఫ్ జోన్ మ్యాప్‌ను ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రదర్శిస్తున్న ఎర్దోగాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సిరియా సరిహద్దుల్లో తాము ప్రతిపాదిస్తున్న సేఫ్ జోన్ మ్యాప్‌ను ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రదర్శిస్తున్న ఎర్దోగాన్

టర్కీ ప్రణాళికలేమిటి?

ఈశాన్య సిరియాలో 'రక్షిత ప్రాంతం' (సేఫ్ జోన్) ఏర్పాటు చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆదివారం ఎర్దోగాన్ కార్యాలయం వెల్లడించింది.

సిరియా శరణార్థులకు సురక్షిత ఆశ్రయాలు నెలకొల్పేలా సరిహద్దు వెంబడి 32 కిలోమీటర్ల మేర 'టెర్రరిస్టుల'తో పోరాడాల్సి ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.

ఎస్‌డీఎఫ్ కూటమిలో కీలక పాత్ర పోషించే కుర్దిష్ వైపీజీ మిలీషియాను నిషేధిత కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) అనుబంధ యూనిట్‌గా టర్కీ పరిగణిస్తుంది. పీకేకే టర్కీలో కుర్దు ప్రాంత స్వయంప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాలు పోరాడింది.

సిరియా యుద్ధం వల్ల 2011 నుంచి వలస వచ్చిన 36 లక్షల మందికి టర్కీ ఆశ్రయమిచ్చింది. వారిలో 20 లక్షల మందిని ఇప్పుడు నెలకొల్పబోయే రక్షిత ప్రాంతానికి తరలించాలని టర్కీ యోచిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)