సిరియా జైల్లో విప్లవ వధూవరుల విషాద ప్రేమ గాథ
ఇదొక విషాదాంత ప్రణయం.
పౌరహక్కుల న్యాయవాది నోరా సఫాదీ భర్త సిరియాలో పేరుగాంచిన కార్యకర్త.
ఆయన పేరు బాసెల్ ఖర్తాబిల్ సఫాదీ. ఈ జంట సిరియా విప్లవ వధూవరులుగా ప్రపంచానికి సుపరిచితం. వారి ప్రేమ కథ ఇది.
తూర్పు ఘూటాలో జరిగిన ఓ ప్రదర్శన సందర్భంగా వీరు తొలిసారి కలుసుకున్నారు. కొన్నాళ్ళకే ఒకరినొకరు ఇష్టపడ్డారు.
వీరి పెళ్లికి రెండు వారాల ముందే బాసెల్ ఖర్తాబిల్ సఫాదీ అరెస్టయ్యారు.
తర్వాత ఏం జరిగిందో నోరా మాటల్లోనే..

ఫొటో సోర్స్, Noura safadi/facebook
ఏదో ఒక రోజు తనని కోల్పోవాల్సి వస్తుందని, లేదా నేను చనిపోతానని నాకు ముందే తెలుసు.
అందుకే మేం వీలైనంత తొందరగా నిశ్చితార్థం జరుపుకున్నాం.
ఎనిమిది నెలల తర్వాత నాకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. మొదట మాట్లాడటానికి సంకోచించాను. తర్వాత మాట్లాడాను.
అటువైపు బాసెల్ ... నేనే. నేనిప్పుడు అద్రా జైలులో ఉన్నాను. నువ్వు ఇక్కడికొచ్చి నన్ను కలవచ్చు. అని ఆయన అన్నారు.
తనని కలుసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను న్యాయవాదిని కావడం వల్లనే తనను కలుసుకోగలిగాను. నేను తనని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాను, ప్రేమగా ముద్దు పెట్టాను.

ఫొటో సోర్స్, Noura safadi/facebook
నాకింకా గుర్తుంది ఒక పోలీసు వచ్చి నన్ను తనకి కాస్త దూరంగా ఉండమన్నాడు. నావల్ల కాదని చెప్పేశాను. అదే అత్యంత అద్భుతమైన సమయమని నాకనిపించింది.
అలా మేం అద్రా జైలులోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. అది శీతాకాలం. పెళ్లికి నేను మా ఇద్దరికీ ఇష్టమైన నీలిరంగు గౌను వేసుకున్నాను. మూడేళ్లుగా వారంలో మూడుసార్లు నేను తనని కలుస్తునే ఉన్నాను.
తనను చూడటానికి వెళ్లిన ప్రతిసారీ తనకోసం ఎన్నో కవితలు రాస్తాను. ఆ కవితలను నా సంచిలో, జేబుల్లో భద్రంగా దాచి ఎవరికీ కనిపించకుండా తీసుకెళ్లేదానిని . మరి ముఖ్యంగా స్నిక్కర్స్.
ఆ చాక్లెట్ అంటే బాసెల్‌కి చాలా ఇష్టం.

ఫొటో సోర్స్, Noura safadi/facebook
తర్వాత బాసెల్ త్వరలోనే విడుదల కాబోతున్నాడన్న సమాచారం తెలిసింది.
కానీ బాసెల్ ఎందుకో నమ్మలేదు. తనను వాళ్లు చంపేయ్యబోతున్నారని చెప్పాడు.
చివరిసారిగా నేను తనని నా పుట్టిన రోజైన 2015 సెప్టెంబర్ 30 న చూశాను.
ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులతో సత్సంబందాలున్న ఒక న్యాయవాది మా ఇంటికొచ్చారు.
నాకొక టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని పదే పదే చెప్పారు. తర్వాత నేను కాస్త నెమ్మదిగా అయిపోయాను. అప్పుడు చెప్పారాయన - బాసెల్‌ను చంపేశారని.
నేను కుప్పకూలిపోయాను. నమ్మలేకపోయాను.

ఫొటో సోర్స్, Noura safadi/facebook
ఇప్పటికీ నాకు బాసెల్‌తో ఏదో తెలియని అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికీ తను నన్ను ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ ఉంటాడు.
నేను వేసే ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉంటాడు.
నాకు బ్రిటన్‌లో ఓ స్కాలర్‌షిప్ లభించింది.
కానీ నేను సిరియాకు దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నాను.
ఇవి కూడా చదవండి
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- ‘భాగస్వామిని ఆకట్టుకునే శృంగార కళను మర్చిపోతున్న భారతీయులు’
- ‘బాయ్స్ హాస్టల్స్లో లేని రూల్స్ మాకెందుకు?’
- మిర్యాలగూడలో 'పరువు' హత్య: ‘మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం’
- ఎవరు అబద్ధాల కోరు?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









