రక్తపరీక్షతో క్యాన్సర్ నిర్ధరణ.. వ్యాధి నియంత్రణ దిశగా గొప్ప ముందడుగు

ఫొటో సోర్స్, iStock
- రచయిత, జేమ్స్ గాల్లగర్,
- హోదా, ఆరోగ్యం-సైన్స్ ప్రతినిధి, బీబీసీ
క్యాన్సర్ నియంత్రణ దిశగా గొప్ప ముందడుగు పడింది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు సార్వత్రిక రక్తపరీక్ష విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధించారు.
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం ఎనిమిది రకాల క్యాన్సర్లను గుర్తించే ఒక విధానాన్ని పరీక్షించి చూసింది.
క్యాన్సర్ కణితులకు చెందిన పరివర్తిత జన్యువులు, ప్రొటీన్ల జాడలు రక్తంలోకి విడుదలవుతాయి. వాటిని పసిగట్టడమే ఈ రక్తపరీక్షలో కీలకాంశం.
క్యాన్సర్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు తద్వారా వ్యాధిగ్రస్థుల ప్రాణాలు కాపాడేందుకు వీలుగా ఒక వార్షిక పరీక్ష విధానాన్ని రూపొందించాలన్నది ఈ బృందం లక్ష్యం.
బృందం సాధించిన ఫలితాలు చాలా ఉత్తేజభరితంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'మరణాలను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది'
ఈ పరీక్షను 'క్యాన్సర్ సీక్' పరీక్షగా పిలుస్తారు. ఇందులో- క్యాన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా 16 జన్యువులకు సంబంధించి ఏర్పడే జన్యు పరివర్తితాలను, రక్తంలో తరచూ విడుదలయ్యే ఎనిమిది ప్రొటీన్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తారు.
1,005 మంది క్యాన్సర్ రోగులపై తమ విధానాన్ని నిపుణుల బృందం పరీక్షించి చూసింది.
ఈ బాధితులు అండాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమ గ్రంథి, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకినవారు. పరీక్ష జరిపిన సమయానికి ఇతర కణజాలాలకు క్యాన్సర్ వ్యాపించలేదు.
నిపుణుల బృందం పరీక్షలో 70 శాతం క్యాన్సర్లు నిర్ధరణ అయ్యాయి.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ క్రిస్టియన్ టొమసెట్టి బీబీసీతో మాట్లాడుతూ- ''క్యాన్సర్‌ను ముందే గుర్తించగలగడం కష్టతరమైనది. బృందం సాధించిన ఫలితాలు చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. క్యాన్సర్ మరణాలను అడ్డుకోవడంలో ఈ పరీక్ష గొప్ప ప్రభావాన్ని చూపగలదు'' అని చెప్పారు.
క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అందించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
అండాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమ గ్రంథి, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్లు- ఈ ఎనిమిది క్యాన్సర్లలో ఐదింటిని ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ విధానాలు లేవు.
క్లోమ గ్రంథికి వచ్చే క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం. వ్యాధి లక్షణాలు కొన్నే ఉంటాయి. ఇది బాగా ఆలస్యంగా బయటపడుతుంది.
ఈ క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణ అయిన ప్రతీ ఐదుగురిలో నలుగురు వ్యాధి నిర్ధరణ అయ్యాక ఏడాదిలోపే చనిపోతున్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
కొనసాగుతున్న ప్రయోగాలు
శస్త్రచికిత్స చేసి తొలగించగలిగే దశలోనే కణితులను గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్ క్రిస్టియన్ టొమసెట్టి తెలిపారు.
నిపుణుల బృందం 'క్యాన్సర్ సీక్' విధానాన్ని ప్రస్తుతం క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణకాని వ్యక్తులపై పరీక్షించి చూస్తోంది.
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మామోగ్రామ్, కొలరెక్టల్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొలనోస్కోపీ ఉన్నాయి. ఇలాంటి కొన్ని విధానాలకు తోడుగా ఈ రక్తపరీక్షను ఉపయోగించవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు.
క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఏడాదికి ఒకసారి నిర్వహించే రక్తపరీక్ష విధానాన్ని రూపొందించగలమని డాక్టర్ క్రిస్టియన్ టొమసెట్టి ఆశాభావం వ్యక్తంచేశారు.
'క్యాన్సర్ సీక్' పరీక్ష వివరాలు 'సైన్స్' పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ విధానంలో క్యాన్సర్ కణితులకు చెందిన పరివర్తిత జన్యువులు, ప్రొటీన్ల జాడలు రెండింటినీ పసిగట్టేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల ఈ విధానం సరికొత్తది.
రక్తపరీక్షతో క్యాన్సర్‌ను నిర్ధరించడమనే విధానం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోందని లండన్‌లోని క్యాన్సర్ పరిశోధన సంస్థలో 'పరిణామక్రమం, క్యాన్సర్ కేంద్రం'లో బృంద సారథిగా ఉన్న డాక్టర్ గెర్ట్ అటార్డ్ బీబీసీతో చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, అందువల్ల రక్తపరీక్షతో క్యాన్సర్‌ను నిర్ధరించే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
'క్యాన్సర్ సీక్' విధానంతో వ్యాధి నిర్ధరణకు ఒక్కో వ్యక్తికి రూ.32 వేల (ఐదు వందల డాలర్లు) లోపు అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- రొమ్ము క్యాన్సర్: ఈ అసాధారణ లక్షణాలు తెలుసుకోండి
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- క్యాన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- అమెరికా: 'ఫేక్ న్యూస్ అవార్డుల’ విజేతలు ఎవరంటే...
- Quiz: ట్రంప్‌కు పెట్టిన పరీక్ష ఇదే.. మరి మీరు రాస్తే?
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- అనుమానం అక్కర్లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- కోడళ్ల సంఘం: ఏమిటీ కోడళ్ల ప్రత్యేకత?
- సుప్రీంకోర్టు: ఇంతకూ ‘రోస్టర్’ ఏంటి? దాని ప్రాధాన్యం ఏంటి?
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








