అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక స్థితి మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాదవుతున్న సందర్భంగా న్యూయార్క్ జర్నలిస్టు మైకేల్ వోల్ఫ్ రాసిన 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్' పుస్తకం ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.

ట్రంప్‌కు ఓపిక లేదని, దేనిపైనా దృష్టి నిలపలేరని, గందరగోళంగా వ్యవహరిస్తుంటారని, చెప్పిందే పదేపదే చెబుతుంటారని రచయిత ఆరోపించారు.

వోల్ఫ్ ఆరోపణలను ట్రంప్ నిర్ద్వంద్వంగా ఖండించారు. ''నాది స్థిమితమైన ఆలోచనా తీరు. నేనెంతో తెలివైనవాడిని. మానసిక స్థిరత్వం, చురుకుదనం నాకున్న అతి గొప్ప సామర్థ్యాలు'' అని 'ట్విటర్'లో ఆయన చెప్పారు.

అధ్యక్షుడి వ్యవహారశైలి, మాటతీరులో మార్పులను ప్రస్తావిస్తూ, అల్జీమర్స్ మొదలుకొని, 'నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(‌ఎన్‌పీడీ)' వరకు వివిధ మానసిక సమస్యలను కొందరు ఆయనకు ఆపాదిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డొనాల్డ్ ట్రంప్

'ఫైర్ అండ్ ఫ్యూరీ' రాసే క్రమంలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని పలువురిని తాను సంప్రదించానని వోల్ఫ్ చెప్పారు.

అధ్యక్షుడి మానసిక శక్తిసామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆయన చుట్టూ ఉన్నవారే గుర్తించడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

ట్రంప్ ఒకే విషయాన్ని గతంలో 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు చెప్పేవారని, ఇప్పుడు పది నిమిషాల్లోనే మూడుసార్లు చెబుతున్నారని వోల్ఫ్ పేర్కొన్నారు.

ఎవరైనా చెప్పిందే చెబుతున్నారంటే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మందగించడం, ఇతర అంశాలు అందుకు కారణం కావొచ్చు. డిమెన్షా సమస్యకు ఇదో సంకేతం కూడా కావొచ్చు.

60 ఏళ్లు నిండిన వ్యక్తుల్లో ఐదు నుంచి ఎనిమిది శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి.

ట్రంప్‌ వయసు 71 సంవత్సరాలు.

పుస్తక రచయిత మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుస్తక రచయిత మైకేల్ వోల్ఫ్

అదో అబద్ధాల పుట్ట: ట్రంప్

వోల్ఫ్ పుస్తకాన్ని 'అబద్ధాల పుట్ట' అని, మోసపూరితమైనదని ట్రంప్ కొట్టిపారేశారు.

పుస్తక రచన విషయమై వైట్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు వోల్ఫ్‌కు అసలు అనుమతే ఇవ్వలేదని తెలిపారు.

ఈ పుస్తకాన్ని రచయిత ఏ ఆధారాలతో రాశారని విమర్శకులు అడిగారు.

పుస్తకంలో ప్రస్తావిస్తున్న ఘటనలను వోల్ఫ్ స్వయంగా చూశారా అని ప్రశ్నించారు. ఇందులోని కొన్ని విషయాలు ఊహాగానాలని వ్యాఖ్యానించారు.

ట్రంప్ నిరుడు జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మానసిక స్థితిపై కొన్ని నెలల్లోనే పలు పుస్తకాలు వెలువడ్డాయి.

బాండీ ఎక్స్ లీ రాసిన 'ద డేంజరస్ కేస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్', అలెన్ ఫ్రాన్సెస్ రచన 'ట్వైలెట్ ఆఫ్ అమెరికన్ శానిటీ', కుర్ట్ ఆండర్సన్ రచన 'ఫాంటసీల్యాండ్' ఈ జాబితాలో ఉన్నాయి.

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ మానసిక స్థితి బహిర్గతం కానుందని, ఆ సూచనలు కనిపిస్తున్నాయని యాలే విశ్వవిద్యాలయంలో మానసిక వ్యాధుల విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న బాండీ ఎక్స్ లీ గత నెల్లో అమెరికన్ సెనేటర్ల బృందంతో చెప్పారు.

ఈ బృందంలో ఎక్కువ మంది ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్లే ఉన్నారు.

అధ్యక్షుడి మానసిక స్థితిపై పుస్తకాలు రాసినవారిలో ఎవ్వరూ కూడా ఆయనకు ఎలాంటి చికిత్సా అందించినవారు కాదు. ఆయన మానసిక స్థితి గురించి నేరుగా సమాచారం తెలుసుకోగలిగిన వారు కూడా కాదు. ఆయనకు మానసిక సమస్యలు ఉన్నాయనే ఆధారాలేవీ లేవు.

ఒకవేళ ట్రంప్‌కు ఎవరైనా ఏదైనా చికిత్స అందిస్తుంటే, వారు వివరాలను బహిర్గతపరచడం నైతిక ప్రమాణాలకు విరుద్ధం. అలా చేయడం చాలా సందర్భాల్లో చట్టవిరుద్ధం కూడా అవుతుంది.

మానసిక స్థితి సరిగా లేకపోతే ఏమవుతుంది?

ట్రంప్ మానసిక స్థితి సరిగా లేకపోతే ఆయన అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి రావొచ్చు.

25వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అధికారాలను ఉపయోగించలేని, విధులను నిర్వహించలేని స్థితిలో అధ్యక్షుడు ఉంటే ఉపాధ్యక్షుడు బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధ్యక్షుడి కేబినెట్, ఉపాధ్యక్షుడు ఉభయులూ కలిసి విధులను నిర్వహిస్తారు.

ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా కనిపించడం లేదు. ఇంతవరకు ఏ అధ్యక్షుడూ 25వ రాజ్యాంగ సవరణ కారణంగా పదవీచ్యుతుడు కాలేదు.

రొనాల్డ్ రీగన్

ఫొటో సోర్స్, Keystone/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, రొనాల్డ్ రీగన్

గతంలో ఏ అధ్యక్షుడికైనా ఈ సమస్యలు ఉండేవా?

గతంలో అబ్రహం లింకన్, రొనాల్డ్ రీగన్ సహా కొందరు అధ్యక్షులకు మానసిక అనారోగ్యం ఉంది. అబ్రహం లింకన్‌ తీవ్రస్థాయి కుంగుబాటు(క్లినికల్ డిప్రెషన్)తో బాధపడ్డారు.

1981 నుంచి 1989 వరకు అధ్యక్షుడిగా చేసిన రొనాల్డ్ రీగన్ అయోమయానికి గురయ్యేవారు. కొన్నిసార్లు తాను ఎక్కడ ఉన్నదీ గుర్తించలేకపోయేవారు. పదవీకాలం పూర్తయిన తర్వాత ఐదేళ్లకు ఆయనకు అల్జీమర్స్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

ఎన్‌పీడీ అంటే?

ట్రంప్‌కు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఎన్‌పీడీ) సమస్య ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'సైకాలజీ టుడే' పత్రిక ప్రకారం ఎన్‌పీడీ ముఖ్య లక్షణాలు ఏంటంటే- ఇతరుల సమస్యలను, ఉద్వేగాలను అర్థం చేసుకోలేకపోవడం, ఇతరులు తమను ప్రశంసించాలని తాపత్రయపడటం, తాము గొప్పవాళ్లమని, తమను ఇతరులు ప్రత్యేకంగా పరిగణించాలని భావించడం, ఓటమిని, విమర్శను తట్టుకోలేకపోవడం.

ఎన్‌పీడీ నిర్ధరణ విధానాన్ని రాసిన అలెన్ ఫ్రాన్సెస్ స్పందిస్తూ- ట్రంప్‌లో వ్యాకులత కనిపించదని, అది ఉండుంటే ఆయనకు ఈ సమస్య ఉందని చెప్పేవాడినని వ్యాఖ్యానించారు.

ట్రంప్ వల్ల అవతలివాళ్లకు తీవ్రమైన బాధ కలుగుతుందిగాని ఆయనకు మాత్రం ఇలాంటి బాధేమీ లేదన్నారు.

ట్రంప్ గత వీడియోలను, ఇటీవలి వీడియోలను కొన్నింటిని పోల్చి చూసిన నాడీశాస్త్ర నిపుణులు- ఆయన మాట తీరు పూర్తిగా మారిపోయిందని గుర్తించారు.

గతంలో ఆయన పెద్ద పెద్ద వాక్యాలుగా, సంక్లిష్టంగా మాట్లాడేవారని, సుదీర్ఘమైన విశేషణాలు వాడేవారని, ఇటీవలి కాలంలో ఆయన చిన్న పదాలు, తక్కువ పదాలు వాడుతున్నారని, కొన్ని మాటలు వదిలేస్తున్నారని, గందరగోళ పడుతున్నారని వారు తేల్చారు.

'ద బెస్ట్' లాంటి ఉన్నతస్థాయి విశేషణాలను ట్రంప్ వాడుతున్నారని గుర్తించారు.

రెండు చేతులతో గ్లాసును నోటి వద్దకు తీసుకొన్న ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్

అల్జీమర్స్ లాంటి సమస్య వల్ల అధ్యక్షుడు ఇలా వ్యవహరిస్తుండొచ్చని లేదా వయసు పెరగడం వల్ల తలెత్తిన సమస్య అయ్యుండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ఆలోచనా శక్తి తగ్గిపోయిందని, ఈ విషయాన్ని ఆయన దాచిపెడుతున్నారని వాదించేవారు కొన్ని ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భాల్లో ఆయన తన కదలికలపై పూర్తిస్థాయి నియంత్రణతో వ్యవహరించలేకపోతున్నారని వారు పేర్కొంటున్నారు.

డిసెంబరులో ట్రంప్ ఒక కార్యక్రమంలో తన ప్రసంగం మధ్యలో నీళ్ల గ్లాసును రెండు చేతులతో నోటి వద్దకు తడబాటుగా తీసుకోవడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.

అగౌరవకరం.. హాస్యాస్పదం: వైట్‌హౌస్

ట్రంప్ మానసిక ఆరోగ్యంపై చర్చ జరగడం అగౌరవకరమని, హాస్యాస్పదం కూడా అని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి సారా హకబీ సాండర్స్ వ్యాఖ్యానించారు.

''ట్రంప్ మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఆయన అధ్యక్ష పదవిని చేపట్టగలిగేవారు కాదు. రిపబ్లికన్ పార్టీలో సమర్థులైన ఎంతో మంది నాయకులను ఓడించి, అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని సాధించగలిగేవారు కాదు'' అని ఆమె చెప్పారు.

వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి సారా హకబీ సాండర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి సారా హకబీ సాండర్స్

అది వాస్తవ విరుద్ధమైన ఆలోచనా దృక్పథం

ట్రంప్ మానసిక స్థితిని ప్రశ్నించడాన్ని 'హార్వర్డ్ లా స్కూల్' మాజీ ప్రొఫెసర్ అలన్ డెర్షోవిట్జ్ తప్పుబట్టారు.

''ఎవరైనా నాయకుడి రాజకీయాలు మనకు నచ్చకపోతే ఆయన్ను విమర్శిస్తాం, ఆయనకు వ్యతిరేకంగా పోరాడతాం. అంతేగాని 'మానసిక సమస్యలు' అనే అంశాన్ని లేవనెత్తం. 25వ రాజ్యాంగ సవరణతో ట్రంప్ అధ్యక్ష పదవిని కోల్పోతారని నమ్మేవారిది వాస్తవ విరుద్ధమైన ఆలోచనా దృక్పథం. ఇలా ఆలోచించడం ఒక తీవ్రమైన మానసిక సమస్య'' అని వ్యాఖ్యానించారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వచ్చే వారం ట్రంప్ శారీరక వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)