ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్‌ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు.. సరిదిద్దే పనిలో టెక్ సంస్థలు

ఫొటో సోర్స్, Getty Images
హ్యాకర్లు కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని దొంగలించడానికి సహకరించే బగ్స్‌ను సరిదిద్దడానికి టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్‌ఎమ్‌లు తయారు చేసే చిప్స్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించే డివైజెస్‌కు అవి చాలా హాని కలుగజేస్తాయని గూగుల్ పరిశోధకులు తెలిపారు.
ఈ లోపాల గురించి చాలా నెలల ముందుగానే తెలుసు. అయితే ప్రజలకు వాటి గురించి తెలిసే ముందే సరిచేయవచ్చని టెక్ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
ఆ లోపాల వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని యూకేకు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 80 శాతం డెస్క్‌టాప్ కంప్యూటర్లకు, 90 శాతం లాప్ టాప్‌లకు చిప్‌లు అందించే ఇంటెల్ సంస్థ రాబోయే రోజుల్లో వినియోగదారులకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లాంటి కొన్ని పరిష్కారాలను అందిస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

బీబీసీ టెక్నాలజీ ప్రతినిధి క్రిస్ ఫాక్స్ సమీక్ష
పరిశోధకులు ఏదైనా సెక్యూరిటీ సమస్యను కనుగొన్నపుడు, వారు సంబంధిత కంపెనీతో సంప్రదించి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు దానిని బయటకు వెల్లడించకూడదని ఇద్దరూ అంగీకరిస్తారు. దాని వల్ల హ్యాకర్లు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు.
అయితే ఈసారి మాత్రం దానికి పరిష్కారం కనుగొనేలోపే ఎవరి వల్లనో ఈ సమాచారం లీక్ అయినట్లు కనిపిస్తోంది.
తాము వచ్చేవారం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని ఇంటెల్ తెలిపింది. కొంతమంది భద్రతా నిపుణులు ఈ చిప్‌లు తయారు చేసే సంస్థతో గోప్యతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్వీట్ చేశారు.
దీంతో సమస్యకు పరిష్కారం కనుగొనేలోపే విషయం వెల్లడి కావడంతో ఇంటెల్ ఇబ్బందికర పరిస్థితిలో ఇరుక్కుపోయింది.

కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌లాంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో మైక్రోచిప్ అనేది ఒక కీలక భాగం.
ఈ సమస్య నిజానికి ఇంటెల్ చిప్స్‌లోని లోపాలకు సంబంధించిందే అయినా ఆ సంస్థ మాత్రం దానిని తోసిపుచ్చుతోంది.
''అనేక రకాల ప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన కంప్యూటింగ్ పరికరాలు ఇలా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది'' అని ఇంటెల్ తెలిపింది.
ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఇంటెల్ - తమ చిప్స్‌లోని లోపాలతో హ్యాకర్లు పాస్ వర్డ్‌లు, ఎన్‌క్రిప్షన్ కీస్ లాంటి కీలకమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపినట్లు వెల్లడించింది.
ఇప్పటికే అనేక స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులు సహా వినియోగదారులతో ప్యాచెస్‌ను పంచుకోవడం జరిగిందని ఏఆర్‌ఎమ్ తెలిపింది.
ఏఎమ్‌డీ మాత్రం ప్రస్తుతం తమ ఉత్పత్తుల్లో జీరో రిస్క్ ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, AFP/Getty
సెక్యూరిటీ అప్‌డేట్స్
ఇంటెల్ చిప్స్‌ను ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థ, తాము గురువారం సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే ఏదైనా డాటా దుర్వినియోగం అయిందా అన్న విషయంపై మాత్రం తమకు సమాచారం లేదని తెలిపింది.
ఆపిల్ తన లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్‌లను అప్‌డేట్స్ చేసే పనిలో ఉంది.
ఈ సమస్యపై వినియోగదారులు ఏం చేయాలో సూచిస్తూ గూగుల్ ఒక సవివరమైన బ్లాగ్‌ను ప్రచురించింది. బగ్స్‌తో లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఎలాంటి ప్రమాదమూ లేదని, జీమెయిల్ కూడా సురక్షితమని పేర్కొంది.
అయితే పాత క్రోమ్‌బుక్స్‌ను ఉపయోగిస్తున్న యూజర్స్ కొరకు గూగుల్ సెక్యూరిటీ ప్యాచెస్ విడుదల చేయనుంది.
మా ఇతర కథనాలు
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- గూగుల్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- సెక్యూరిటీ గురు, యాంటీ వైరస్ సంస్థ మేకఫీ వ్యవస్థాపకుడి ఖాతా హ్యాక్!
- 'యాహూ యూజర్ల ఖాతాలన్నీ లీకయ్యాయ్'
- ట్రంప్ యుద్ధ ప్రణాళిక కిమ్ చేతికి చిక్కినట్టేనా?
- హెచ్-1బీ: అమెరికా వీసాల వివాదానికి కారణాలేంటి? భారతీయులకు ఎంత నష్టం?
- బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- BBC SPECIAL: ‘భారత్ ఒత్తిడితోనే మాపై చర్యలు’
- ‘హలో కిమ్.. నా న్యూక్లియర్ బటన్ నీకన్నా పెద్దది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








