నాటి తియానాన్మెన్ స్క్వేర్ ఘటనలో మృతుల సంఖ్య 10 వేలు, వెల్లడైన రహస్య పత్రాలు

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ 1989లో తియానాన్మెన్ స్క్వేర్‌లో నిరసన చేపట్టిన ప్రజలపై సైన్యం జరిపిన దాడిలో కనీసం 10,000 మంది చనిపోయారని బ్రిటన్ తాజాగా విడుదల చేసిన పత్రాలు చెప్తున్నాయి.
చైనాలో బ్రిటన్ రాయబారి అలాన్ డొనాల్డ్ రహస్యంగా పంపించిన దౌత్య సమాచారంలో ఈ సంఖ్యను పేర్కొన్నారు.
చైనా స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఒకరికి స్నేహితుడైన వ్యక్తి నుంచి ఈ సమాచారం లభించినట్లు ఆ రాయబారి తెలిపారు.
ఇంతకుముందు.. తియానాన్మెన్ స్క్వేర్ నిరసనల్లో మృతుల సంఖ్య కొన్ని వందల నుంచి 1,000 మంది పైగా ఉండొచ్చని అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1989 జూన్ చివర్లో చైనా అధికారికంగా ప్రకటన చేస్తూ.. 1989 జూన్ 4న ‘‘విప్లవ ప్రతీఘాత అల్లర్ల’’ను అణచివేసే క్రమంలో 200 మంది పౌరులు, పలువురు భద్రతా సిబ్బంది చనిపోయారని పేర్కొంది.
అప్పుడు చైనాలో బ్రిటన్ రాయబారిగా ఉన్న డొనాల్డ్ జూన్ 5వ తేదీన బ్రిటన్‌కు టెలిగ్రామ్ ఇచ్చారు. మృతుల సంఖ్య 10,000 మంది అని అందులో పేర్కొన్నారు.
‘‘ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్ సభ్యుడైన ఒక వ్యక్తికి సన్నిహిత మిత్రుడు తెలిపిన సమాచారాన్ని పంపిస్తున్నా’’ అని ఆయన ఆ టెలిగ్రామ్‌లో వివరించారు.
స్టేట్ కైన్సిల్ అంటే చైనా ప్రధానమంత్రి సారథ్యంలోని ప్రభుత్వ మంత్రివర్గం.

ఫొటో సోర్స్, AFP
ఈ సమాచార పత్రాలను బ్రిటన్ నేషనల్ ఆర్కైవ్స్‌లో ఉంచారు. వీటిని అక్టోబర్‌లో బహిర్గతం చేశారు.
తనకు సమాచారం అందించిన వ్యక్తి గతంలో విశ్వసనీయ సమాచారం ఇచ్చారని, ‘‘ఊహాగానాలు, వదంతులకు.. వాస్తవాన్ని వేరు చేసే జాగ్రత్త గల’’ వ్యక్తి అని డొనాల్డ్ పేర్కొన్నారు.
‘‘కూడలిని విడిచిపెట్టి వెళ్లడానికి తమకు ఒక గంట సమయం ఇచ్చారని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. కానీ ఐదు నిమిషాల తర్వాత సైనిక సిబ్బంది దాడి చేశారు’’ అని ఆ రాయబారి తను పంపిన సమాచారంలో రాశారు.
‘‘విద్యార్థులు ఒకరి చేతులు ఒకరు (మానవ హారంలా) పట్టుకున్నారు. వారి మీదుగా సైనిక వాహనాలు నడిపించి వారిని నలిపేశారు. మృతుల శరీరాలను బుల్‌డోజర్‌తో తొలగించారు. మిగిలిపోయిన భాగాలను తగులబెట్టి, నీటితో కడిగి డ్రెయిన్లలోకి పంపించారు. గాయపడిన నలుగురు విద్యార్థినులు తమను చంపొద్దని ప్రాధేయపడ్డారు. కానీ వారిని బాయినెట్లతో పొడిచి చంపారు’’ అని అందులో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అంతర్యుద్ధం తప్పదని స్టేట్ కౌన్సిల్ సభ్యులు కొందరు భావించార’’ని కూడా డొనాల్డ్ పేర్కొన్నారు.
తియానాన్మెన్ స్క్వేర్‌లో ఈ రాజకీయ ఆందోళన ఏడు వారాల పాటు కొనసాగిన తర్వాత సైన్యాన్ని రంగంలోకి దింపారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్రలో ఇదే అత్యంత భారీ స్థాయి నిరసన.
ఆ మారణకాండ చైనాలో చాలా సున్నితమైన అంశంగా మిగిలిపోయింది.
నాటి ఆందోళనకారుల సంస్మరణలను చైనా నిషేధించింది. ఆ ఘటనపై ఆన్‌లైన్‌లో చర్చను కూడా నిశితంగా నియంత్రిస్తుంది. విమర్శలను సెన్సార్ చేస్తుంది. అయితే.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో, ప్రత్యేకించి హాంగ్ కాంగ్, తైవాన్‌లలో కార్యకర్తలు ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








