రోహింగ్యా సంక్షోభం: ఆంగ్ సాన్ సూచీ జీనోసైడ్ ఆరోపణలను ఎదుర్కొంటారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జస్టిన్ రోలట్
- హోదా, బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్
మయన్మార్‌లో రోహింగ్యాలపై క్రూర హింసకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ జీడ్ రాద్ అల్ హుస్సేన్ పట్టుదలగా ఉన్నారు.
మయన్మార్ ప్రభుత్వ అధినేత ఆంగ్ సాన్ సూచీ, సాయుధ బలగాల అధిపతి జనరల్ ఆంగ్ మిన్ హ్లెయింగ్‌లు భవిష్యత్తులో ఎప్పుడైనా జీనోసైడ్ (జాతి నిర్మూలన) ఆరోపణలను ఎదుర్కొంటూ బోనులో నిల్చునే అవకాశాన్ని ఆయన కొట్టివేయలేదు.
ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులను పరిశీలించే ఐక్యరాజ్యసమితి సంస్థకు ఆయన అధిపతి కాబట్టి ఆయన అభిప్రాయాలకు విలువ ఉంటుంది.
మయన్మార్‌లో (బర్మా అని కూడా పిలుస్తారు) రోహింగ్యాలపై విస్తృత స్థాయిలో వ్యవస్థీకృతంగా జరిగిన వివక్షాపూరిత దాడులను జాతి నిర్మూలన అనటాన్ని కొట్టివేయలేమని జీడ్ ఈ నెల ఆరంభంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలితో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘సైనిక చర్యల తీవ్రతను బట్టి చూస్తే.. ఈ నిర్ణయాలను ఉన్నత స్థాయిలో తీసుకుని ఉండొచ్చని స్పష్టమవుతోంది’’ అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు. బీబీసీ పనోరమా కోసం మేం ఆయనను జెనీవాలోని ఐరాస ప్రధాన కార్యాలయంలో కలిసినపుడు ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
జాతి నిర్మూలన అనే పదమే చాలా భయం పుట్టిస్తుంది. ఈ ఆరోపణల కింద గతంలో చాలా కొద్ది మంది మాత్రమే దోషులుగా నిర్ధారితులయ్యారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హోలోకాస్ట్ (జర్మనీలో యూదుల ఊచకోత) అనంతరం జాతి నిర్మూలన (జీనోసైడ్) నేరానికి నిర్వచనమిచ్చారు. ఒక నిర్దిష్ట మానవ బృందాన్ని నాశనం చేసే ఉద్దేశంతో పాల్పడే చర్యగా జీనోసైడ్‌ను నిర్వచిస్తూ నాడు కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఒక తీర్మానంపై సంతకాలు చేశాయి.
మయన్మార్‌లో జాతి నిర్మూలన చర్యలకు పాల్పడ్డారని నిరూపించటం జీడ్ పని కాదు. అది న్యాయస్థానం మాత్రమే చేయగలదు. అయితే.. ఉత్తర రాఖైన్‌లో ముస్లిం జాతి ప్రజలపై ‘‘దిగ్భాంతికరమైన కిరాతక దాడులు’‘ జరిగాయని ఆయన అభివర్ణించారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై అంతర్జాతీయ నేర దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చారు.
కానీ ఈ పని చాలా కష్టమవుతుందని ఆయనకు తెలుసు. ‘‘కారణాలు విస్పష్టమైనవే. ఎవరైనా జాతి నిర్మూలనకు పాల్పడాలని ప్రణాళిక రచిస్తున్నపుడు దానిని కాగితాలలో రాయరు. సూచనలూ చేయరు’’ అని జీడ్ అంటారు.
‘‘సాక్ష్యాలు చూపే భారం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం చూస్తున్న దాని ఆధారంగా భవిష్యత్తులో ఒక న్యాయస్థానం దీనిని జాతినిర్మూలనగా గుర్తించినా ఆశ్యర్యం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు చివర్లో సైన్యం సారథ్యంలో మొదలైన దాడుల పరంపర నుంచి డిసెంబర్ మొదటి నాటికి 6,50,000 మంది రోహింగ్యాలు - మొత్తం జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది - మయన్మార్ వదిలి పారిపోయారు.
వందలాది గ్రామాలను దగ్ధం చేశారు. వేలాది మందిని చంపేసినట్లు వార్తలు వచ్చాయి.
ఊచకోతలు, హత్యలు, సామూహిక అత్యాచారాలు వంటి భయానక దాడులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. ఈ సంక్షోభం మొదలైనపుడు నేను శరణార్థి శిబిరాలను సందర్శించినపుడు స్వయంగా ఈ దారుణాల గురించి విన్నాను.

నిజానికి ఆగస్టులో రోహింగ్యాలపై హింస పేట్రేగటానికి ఆరు నెలల ముందుగానే.. వారిని రక్షించటానికి చర్యలు చేపట్టాలంటూ ఐరాస మానవ హక్కుల విభాగాధిపతి జీడ్ మయన్మార్ ప్రభుత్వాధినేత సూచీకి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవటం ఆయనను కలతపెడుతోంది.
2016 అక్టోబర్‌లో మొదలైన హింసాత్మక ఘటనల సందర్భంగా జరిగిన దారుణ అకృత్యాలపై తమ కార్యాలయం 2017 ఫిబ్రవరిలో ఒక నివేదికను ప్రచురించినపుడు తాను సూచీతో టెలిఫోన్‌లొ మాట్లాడినట్లు జీడ్ చెప్పారు.
‘‘ఈ సైనిక చర్యలను నిలిపివేయాలని నేను ఆమెకు విజ్ఞప్తి చేశాను. దీనిని ఆపటానికి ఆమె చేయగలిగిందంతా చేయాలని భావోద్వేగపరంగా కూడా కోరాను. కానీ విచారమేమిటంటే అదేదీ జరిగినట్లు కనిపించలేదు’’ అని ఆయన నాతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యం మీద సూచీకి ఉన్న అధికారం పరిమితం. అయితే సైనిక చర్యలను ఆపటానికి ఆమె మరింత కృషి చేసి ఉండాల్సిందని జీడ్ భావిస్తున్నారు.
‘‘రోహింగ్యా‘‘ అనే పదాన్ని ఉపయోగించటంలోనూ సూచీ విఫలమయ్యారంటూ జీడ్ విమర్శించారు. ‘‘వారి నుంచి వారి పేరును కూడా తొలగించటమంటే.. ఏదైనా సాధ్యమేనని నమ్మేంత స్థాయికి అమానవీయంగా మారటమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఐరాస ఉన్నతాధికారి ఇంతటి శక్తిమంతమైన భాషను ఉపయోగించటం అరుదు.
2016 నాటి హింస తర్వాత అంతర్జాతీయ సమాజం తమపై ఎలాంటి చర్యా తీసుకోకపోవటంతో మయన్మార్ సైన్యానికి మరింత ధైర్యం లభించినట్లయిందని ఆయన భావిస్తున్నారు. ‘‘ఇక తాము ఎలాంటి భయం లేకుండా తాము అనుకున్నది కొనసాగించవచ్చునని అప్పుడు వారు ఒక తీర్మానానికి వచ్చారని నేను అనుకుంటున్నా’’ అని జీడ్ చెప్పారు.
‘‘ఇదంతా నిజంగా బాగా ఆలోచించి రచించిన ప్రణాళిక అనే విషయం మాకు అర్థమవటం మొదలైంది’’ అని జీడ్ నాతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఆగస్టులో భద్రతా బలగాల సిబ్బంది 12 మందిని చంపిన ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా సైనిక చర్య జరిగిందని మయన్మార్ ప్రభుత్వం చెప్పింది.
కానీ.. రోహింగ్యాలపై నిరంతర దాడికి సన్నాహాలు దానికన్నా ముందుగానే మొదలయ్యాయని బీబీసీ పనోరమా సేకరించిన ఆధారాలు చూపుతున్నాయి.
మయన్మార్ సైన్యం అప్పటికే స్థానిక బౌద్ధులకు శిక్షణనిస్తూ, ఆయుధాలను సమకూర్చుతోందని మేం చూపాం. గత ఏడాది హింస చెలరేగిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఒక ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే.. ‘‘సొంత రాష్ట్రాన్ని రక్షించాలనుకునే ప్రతి రాఖైన్ జాతీయుడికీ స్థానిక సాయుధ పోలీసులో భాగం కావటానికి అవకాశం ఉంటుంది’’.
‘‘పౌర జనాభాపై దాడుల నేరాలను సమర్థవంతంగా విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయమిది’’ అని ఫోర్టిఫై రైట్స్ అనే మానవ హక్కుల సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ స్మిత్ అభివర్ణించారు. ఈ ఏడాది చెలరేగిన హింస దారితీసిన పరిణామాలను ఈ సంస్థ పరిశోధిస్తోంది.
మయన్మార్‌లోని విశాల శిబిరాల్లో గల శరణార్థుల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఆ వాలంటీర్లు తమ పొరుగునున్న రోహింగ్యాలపై దాడులు చేస్తూ, వారి ఇళ్లను దగ్ధం చేస్తూ ప్రత్యక్షంగా పాల్గొనటాన్ని ఈ శరణార్థులు చూశారు.
‘‘వాళ్లు అచ్చం సైన్యం లానే ఉన్నారు. అవే తరహా ఆయుధాలు వారి వద్ద ఉన్నాయి’’ అని మొహమ్మద్ రఫీక్ చెప్పారు. ఆయన అంతకుముందు మయన్మార్‌లో వ్యాపారం చేసుకునే వారు. ‘‘వాళ్లందరూ స్థానిక కుర్రాళ్లే. వాళ్లు మాకు తెలుసు. మా ఇళ్లను సైన్యం దగ్ధం చేస్తున్నపుడు, మమ్మల్ని హింసిస్తున్నపుడు వాళ్లూ అక్కడున్నారు’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదిలావుంటే రోహింగ్యాలపై ఇతర మార్గాల్లోనూ ఒత్తిడి తీవ్రమైంది.
వేసవి నాటికి ఉత్తర రఖైన్‌లో ఆహార కొరత విస్తరించింది. కారణం ప్రభుత్వం నట్లు బిగించింది. ఆగస్టు మధ్య నుంచి ఉత్తర రఖైన్‌కు ఆహారం, ఇతర సాయం ఏదీ అందకుండా అధికారులు దిగ్భందించారని బీబీసీ పనోరమాకు తెలిసింది.
ఇక సైన్యం అదనపు బలగాలను కూడా రప్పించింది. ఉగ్రవాద దాడి జరగటానికి రెండు వారాల ముందు ఆగస్టు 10వ తేదీన ఒక బెటాలియన్‌ను వాయు మార్గంలో దించినట్లు వార్తలు వచ్చాయి.
మయన్మార్‌లో ఐరాస మానవ హక్కుల ప్రతినిధి దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మయన్మార్ అధికారులు సంయమనం పాటించాలని కోరుతూ బహిరంగ హెచ్చరిక కూడా ఆమె జారీ చేశారు.
కానీ.. 30 పోలీస్ పోస్టులు, ఒక సైనిక స్థావరం మీద రోహింగ్యా మిలిటెంట్లు దాడులు ప్రారంభించనపుడు.. సైన్యం భారీస్థాయిలో, వ్యూహాత్మకంగా, దారుణంగా ప్రతిస్పందించింది.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై తమ స్పందన ఏమిటని ఆంగ్ సాన్ సూచీని, మయన్మార్ సైనిక బలగాల అధిపతిని బీబీసీ అడిగింది. కానీ వారిద్దరిలో ఎవరూ జవాబు ఇవ్వలేదు.
ఆ దాడులు జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత కూడా.. ఆ హింస పర్యవసానాలు ఇంకా ముగిసిపోలేదని జీడ్ ఆందోళన చెందుతూనే ఉన్నారు. ‘‘ఇది మరింత దుష్పరిణామాలకు ప్రారంభ దశ కావచ్చు’’నన్నది ఆయన భయం.
బంగ్లాదేశ్‌లోని భారీ శరణార్థి శిబిరాల్లో జిహాదీ బృందాలు ఏర్పడవచ్చునని, అవి మయన్మార్‌లో దాడులు ప్రారంభించవచ్చునని, బౌద్ధ ఆలయాలను కూడా లక్ష్యం చేసుకోవచ్చునని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఇది ‘‘బౌద్ధులు - ముస్లింలకు మధ్య మతపరమైన ఘర్షణ’’గా మారవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆలోచనే భీతావహమని ఆయన పేర్కొన్నారు. కానీ దీనిని మయన్మార్ తగినంత సీరియస్‌గా పట్టించుకోవటం లేదన్నారు.
‘‘అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న తీవ్ర ఆందోళనల విషయంలో నిర్లక్ష్యపూరితంగా స్పందిస్తున్న తీరు నిజంగా ప్రమాదఘంటికలు మోగిస్తోంది’’ అని ఆయన చెప్పారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








