బోస్నియా నరహంతకుడు: మాజీ సైనిక జనరల్ రాకో మలాడిచ్‌కు జీవితఖైదు

ఫొటో సోర్స్, Reuters
సామూహిక మారణకాండతో పాటు దారుణమైన యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోస్నియా సైనిక జనరల్ రాకో మలాడిచ్‌ను హేగ్‌లోని ఐక్యరాజ్య సమితి యుద్ధ నేరాల ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. ఆయనకు జీవిత ఖైదు విధించింది.
బోస్నియాక్, క్రోట్‌లలో భయోత్పాతాన్ని సృష్టించి సెర్బ్ భూభాగం నుంచి వారిని తరిమేశారని, మారణకాండకు పాల్పడారన్నది మలాడిచ్‌పై ప్రధానమైన ఆరోపణ.
1990లలో బోస్నియా సెర్బ్ దళాలకు మిలటరీ కమాండర్‌గా ఉన్న మలాడిచ్ బోస్నియా క్రోట్‌లు, బోస్నియాక్(బోస్నియా ముస్లింలు)లపై దారుణాలకు పాల్పడ్డారు.
'బోస్నియా నరహంతకుడు'గా పేరొందిన మలాడిచ్ పాల్పడిన అత్యంత దారుణమైన నేరాలలో - 1995లో స్రెబ్రెనికాలో 7 వేలకు పైగా బోస్నియాక్ పురుషులు, బాలుర ఊచకోత, 10 వేల మందికి పైగా మరణించిన సరజేవో ముట్టడి ప్రధానమైనవి.
రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో జరిగిన హత్యాకాండల్లో స్రెబ్రెనికా అత్యంత దారుణమైనది.
1995లో యుద్ధం ముగియడంతో మలాడిచ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు, భద్రతా బలగాలలోని కొన్ని వర్గాల సహకారంతో సెర్బియాలో గుర్తు తెలియని ప్రాంతంలో నివసించేవారు.
75 ఏళ్ల మలాడిచ్ 16 ఏళ్ల పాటు చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరిగారు. 2011లో తన బంధువుల ఇంట్లో ఉండగా ఆయనను అరెస్ట్ చేశారు. 2012 నుంచి ఆయన నేరాలపై విచారణ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Reuters
మారణకాండ నేపథ్యం
జులై, 1995 ప్రారంభంలో బోస్నియా సెర్బ్ దళాలు స్రెబ్రెనికా పట్టణం సమీపంలోని ఒక ఫ్రాంతాన్ని స్వాధీనపరచుకున్నాయి. ఐక్యరాజ్య సమితి 'సేఫ్ జోన్'గా ప్రకటించిన ఆ ప్రాంతాన్ని 600 మంది ఐరాస డచ్ సైనికులు కాపలా కాసేవారు.
సెర్బులు దక్షిణం వైపు నుంచి దాడి చేయడంతో వేలాది మంది బోస్నియాక్ పౌరులు, తిరుగుబాటుదారులు స్రెబ్రెనికా ఉత్తరం వైపుకు పారిపోయారు. జులై 10 నాటికి సుమారు 4 వేల మంది అక్కడ గుమికూడారు.
సెర్బులు పురోగమించేకొద్దీ శరణార్థులు పెద్ద ఎత్తున డచ్‌ల ఆధీనంలో ఉన్న పోటోకరికి చేరుకున్నారు.
జులై 12న సుమారు 15 వేల మంది బోస్నియాక్ తిరుగుబాటుదారులు తాము తలదాచుకున్న ప్రాంతం నుంచి దగ్గర్లో ఉన్న పర్వతాలలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. మలాడిచ్ సైన్యం వారిపై బాంబుల వర్షం కురిపించింది. కొంతమందిని లొంగిపోయాక కూడా కాల్చి చంపారు.
ఆ తర్వాత సుమారు 23,000 మంది మహిళలు, చిన్నపిల్లలను బస్సుల ద్వారా బోస్నియాక్ భూభాగానికి తరలించారు.
12 నుంచి 77 ఏళ్లలోపు మగవాళ్లందరినీ విచారణ పేరిట వేరు చేశారు. వందలాది మంది పురుషులను ట్రక్కుల్లో, గోదాముల్లో బంధించారు.
13 జులై, 1995న క్రావికా గ్రామ సమీపంలోని గోదాముల్లో నిరాయుధులైన బోస్నియాక్‌లను విచక్షణారహితంగా మెషీన్ గన్‌లతో కాల్చి చంపి మారణకాండ సృష్టించారు. చనిపోయిన వారిని బుల్ డోజర్లతో సామూహికంగా ఖననం చేశారు.

ఫొటో సోర్స్, AFP
ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో స్రెబ్రెనికా చుట్టపక్కల ప్రాంతాల్లో సుమారు 8,000 మంది బోస్నియాక్ పురుషులు, మగపిల్లలను హత్య చేశారు.
1992-95 మధ్యకాలంలో బోస్నియా సెర్బ్ బలగాలు రాజధాని సరజేవోను ముట్టడించాయి. ఈ ముట్టడిలో సరజేవోలోని సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరం చుట్టుపక్కల ఉన్న పర్వతాల పైనుంచి సెర్బ్ బలగాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 10 వేల మందికి పైగా పౌరులు మరణించారు.
1995లో దేశంలో యుద్ధం ముగియడంతో మలాడిచ్ అజ్ఙాతంలోకి వెళ్లారు.

ఫొటో సోర్స్, AFP
మలాడిచ్‌పై చేసిన ఆరోపణల్లో ప్రధానమైనవి:
- మలాడిచ్ ఆదేశాల ప్రకారం సెర్బ్ బలగాలు బోస్నియాక్ మహిళలు, బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు.
- కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా బోస్నియాక్ ఖైదీలతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. వారిని చిత్రహింసలు పెట్టారు.
- బోస్నియాక్‌ల ఇళ్లను, మసీదులను ధ్వంసం చేసారు.

ఫొటో సోర్స్, AFP
బోస్నియా యుద్ధం నేపథ్యం
యుగొస్లేవియా ముక్కలు కావడంతో 1992లో బోస్నియాలో బోస్నియన్ ముస్లింలు (బోస్నియాక్‌లు), క్రోట్‌లు స్వాతంత్ర్యం కోసం రెఫరెండం నిర్వహించగా, సెర్బులు దానిని బహిష్కరించారు.
దాంతో దేశంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. బోస్నియాక్‌లు, క్రోట్‌లు ఒకవైపు, బోస్నియా సెర్బులు మరోవైపు వర్గాలుగా విడిపోయారు.
బోస్నియా సెర్బ్ నేత రాడోవాన్ కరాడ్జిక్ నేతృత్వంలో జనరల్ మలాడిచ్ జాతి నిర్మూలన చేపట్టారు. ఈ ఘర్షణల్లో వేలాది మంది మృతి చెందగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.

ఫొటో సోర్స్, Reuters
- అజ్ఞాతంలో ఉన్న మలాడిచ్‌ను బంధించినపుడు, తనను బంధించిన వారితో ఆయన ''నేను తల్చుకుంటే మీ అందర్నీ చంపేయగలను. కానీ మీరు మీకు అప్పగించిన పనిని చేస్తున్నారంతే'' అన్నారు.
- మలాడిచ్ పాల్పడుతున్న దారుణాల గురించి తెలుసుకున్న ఆయన కూతురు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడమే ఆయన కసాయిగా మారడానికి కారణమనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.
- జడ్జిలు మలాడిచ్‌కు విధించిన శిక్షను చదువుతుండగా ఆయన కేకలు వేయడంతో, కోర్టు నుంచి బయటకు తరలించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








