‘వేల మంది రోహింజ్యాలను చంపేశారు’

మయన్మార్‌లో నెల రోజుల వ్యవధిలోనే 6,700కు పైగా రోహింజ్యాలు హత్యకు గురయ్యారని స్వచ్ఛంద సంస్థ మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్(యంఎస్‌ఎఫ్) వెల్లడించింది.
ఆగస్టులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న అనంతరం ఈ మారణకాండ జరిగిందని ఆ సంస్థ తెలిపింది.
నాలుగు వందల మంది రోహింజ్యాలు మరణించారని మయన్మార్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కానీ, ప్రాణ భయంతో బంగ్లాదేశ్‌లోకి వెళ్లిన శరణార్థులను సర్వే చేస్తే మృతుల సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉందని తేలింది.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 6,47,000 మందికి పైగా రోహింజ్యాలు బంగ్లాదేశ్‌లోకి వెళ్లారని యంఎస్‌ఎఫ్ వెల్లడించింది.
యంఎస్‌ఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం "ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు మయన్మార్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 6,700 మంది రోహింజ్యాలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 730 మంది వరకు ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు."
గతంలో కేవలం 400 మంది మాత్రమే మరణించారని, అందులోనూ ఎక్కువ మంది ముస్లిం తీవ్రవాదులేనని మయన్మార్ ఆర్మీ తెలిపింది.
యంఎస్‌ఎఫ్ చెబుతున్న వివరాల ప్రకారం:
- 69 శాతం మంది తుపాకి కాల్పుల్లో మరణించారు.
- 9 శాతం మంది వారి ఇళ్లు నిప్పంటించడం వల్ల సజీవదహనమయ్యారు.
- 5 శాతం మందిని కొట్టి చంపారు.
'రోహింజ్యా ఆర్సా' గ్రూపు మిలిటెంట్లు దాదాపు 30కి పైగా పోలీసు పోస్టులపై దాడికి పాల్పడటంతో ఆగస్టు 25 తర్వాత మయన్మార్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రధానంగా రఖైన్ రాష్ట్రంలో ఎక్కువ విధ్వంసం జరిగింది. అనేక మంది రోహింజ్యాలను ఆర్మీ హతమార్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
మయన్మార్ ఆర్మీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










