సుప్రీంకోర్టు: ఇంతకూ ‘రోస్టర్’ ఏంటి? న్యాయమూర్తుల వివాదంలో దాని పాత్ర ఏంటి?

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP/Getty Images)

ఇటీవలి పరిణామాలతో సుప్రీంకోర్టుకు సంబంధించి 'రోస్టర్' కీలకాంశంగా నిలిచింది.

దేశంలో ముందెన్నడూ లేని విధంగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు- జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ నెల 12న మీడియా సమావేశం నిర్వహించి, ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కేసులను కేటాయిస్తున్న తీరుపై అభ్యంతరాలను, ఆందోళనలను వ్యక్తంచేశారు.

ధర్మాసనాలకు కేసుల కేటాయింపునకు సంబంధించిన 'రోస్టర్'పై సీజేఐకు తాము రాసిన లేఖను కూడా వారు అప్పుడు విడుదల చేశారు.

జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ కురియన్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, జనవరి 12న మీడియా సమావేశంలో జస్టిస్ కురియన్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్

రోస్టర్‌ను ఎవరు రూపొందిస్తారు?

ఏదైనా ధర్మాసనానికి విచారణ నిమిత్తం కేటాయించిన కేసుల జాబితాను 'రోస్టర్' అంటారు. ఏ కేసును ఎప్పుడు విచారణకు చేపట్టాలో సీజేఐ నిర్ణయిస్తారు.

ఈ ప్రత్యేకాధికారం దృష్ట్యా సీజేఐను 'మాస్టర్ ఆఫ్ ద రోస్టర్' అంటారు. కేసు విచారణకు ధర్మసనాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆయనకు ఉంటుంది.

సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అండ్ ఆఫీస్ ప్రొసీజర్, 2017 ప్రకారం కేసుల రోస్టర్‌ను సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ రూపొందిస్తారు.

సీజేఐ మాత్రమే 'మాస్టర్ ఆఫ్ ద రోస్టర్' అని, సీజేఐ ఈ అధికారాన్ని బదలాయిస్తే తప్ప మరే ఇతర న్యాయమూర్తి కూడా ఈ అధికారాన్ని ప్రయోగించడానికి వీల్లేదని 2017 నవంబరులో సీజేఐ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్ దీపక్ మిశ్రా

ఫొటో సోర్స్, NALSA.GOV.IN

ఫొటో క్యాప్షన్, జస్టిస్ దీపక్ మిశ్రా

రోస్టర్‌ ప్రాధాన్యం ఏమిటి?

ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో సీజేఐ అధికారం గురించి, సీజేఐ ఈ అధికారాన్ని వినియోగిస్తున్న తీరు గురించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ నెల 12న బహిరంగంగా మాట్లాడిన తర్వాత 'రోస్టర్' ప్రాధాన్యంపై చర్చ మొదలైంది.

రోస్టర్ తయారీకి, కేసుల కేటాయింపునకు సీజేఐకు అన్ని హక్కులూ ఉన్నాయని, అయితే ఆయన ''సమానుల్లో ప్రథముడు మాత్రమే, అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు'' అని ఆ నలుగురు జడ్జిలు వ్యాఖ్యానించారు.

రోస్టర్ తయారీ విధానం, కేసుల కేటాయింపు తీరుపై వారు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

దేశానికి, సుప్రీంకోర్టుకు సంబంధించి తీవ్రమైన పరిణామాలుండే కేసులను సహేతుక ప్రాతిపదిక ఏదీ లేకుండా తమకు నచ్చిన ధర్మాసనాలకు సీజేఐ కేటాయించిన సందర్భాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీబీ సావంత్ 'రోస్టర్'కు సంబంధించి తన ఆందోళనలు వ్యక్తంచేశారు.

''కేసుల కేటాయింపులో సీజేఐకు తిరుగులేని అధికారం ఉంది. కేసుల ఫలితాన్ని నిర్ణయంచడంలో ఈ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అధికారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేయాలనుకుంటే, చేయగలరు. ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే రోస్టర్‌ను నిర్ణయించేందుకు లిఖితపూర్వక నిబంధనలేవీ లేవు. ఇది సీజేఐ విశేషాధికారం'' అని ఆయన తెలిపారు.

రోస్టర్‌పై చర్చ నేపథ్యంలో జస్టిస్ పీబీ సావంత్, సీజేఐ దీపక్ మిశ్రాకు ఒక లేఖ రాశారు.

''ప్రతీ కేసు సాధారణ కేసు కాదు. సామాజిక-రాజకీయ అంశాలతో ముడిపడిన కేసులు, సున్నితమైన కేసులు చాలా ఉంటాయి. ఈ కేసులను సీజేఐ సహా ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాలి'' అని జస్టిస్ పీబీ సావంత్ తన లేఖలో సూచించారు.

అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా సుప్రీంకోర్టు

ఇతర దేశాల్లో ఉన్న విధానాలేమిటి?

భారత సుప్రీంకోర్టులో 25 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది జడ్జిలతో కూడిన ధర్మాసనాలు కేసులను విచారిస్తుంటాయి.

అమెరికా సుప్రీంకోర్టులో తొమ్మిది మంది జడ్జిలు ఉన్నారు. వీరంతా ధర్మాసనంగా ఏర్పడి, కేసును విచారిస్తారు.

యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) సుప్రీంకోర్టులో 12 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ధర్మాసనంలో ఐదుగురు లేదా ఆరుగురు న్యాయమూర్తులు ఉంటారు.

అమెరికా, యూకేల్లో న్యాయమూర్తులకు కేసుల విషయంలో 'ఛాయిస్' తక్కువ. అయితే భారత్‌లో సహచర న్యాయమూర్తులకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికి ఎక్కువ విచక్షణాధికారం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)