ఏపీ: విటులకు కటకటాలు తప్పవిక!

బాధితురాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనుషుల అక్ర‌మ రవాణాలో విటుల(ఎండ్‌ క్లైంట్స్)ను నేరస్థులుగా పరిగణించి, శిక్షించేందుకు వీలుగా చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ విషయమై అధ్య‌య‌నం చేసి, ప్ర‌స్తుతమున్న చ‌ట్టాల్లో చేయాల్సిన మార్పుల‌ను సిఫార్సు చేసేందుకు సలహా బృందం(అడ్వైజరీ గ్రూప్)ను నియమిస్తూ ఈ నెల 3న జీవో ఎంస్ నంబరు 1ని జారీ చేసింది. ఈ బృందం రెండు నెలల్లో మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి యువతులను అక్రమంగా తరలించడం-వ్యభిచార కూపంలోకి దించడం తీవ్రస్థాయిలో ఉంది. విటుల‌ను శిక్షించే నిబంధ‌న వ‌స్తే ప‌రిస్థితి మారుతుంద‌నే భావన ఉంది.

ఈ అంశంపై సలహా బృందంలో సభ్యురాలైన సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సంస్థ 'ప్రజ్వల' సహవ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌తో, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.

చట్టంలో ప్రతిపాదిత మార్పులు వస్తే, విటులను శిక్షించేలా చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుందని సునీత చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరి దేశంలో ఎవరూ ప్రయత్నించలేదన్నారు. ఈ చట్టం తెస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గం చూపిన‌ట్టు అవుతుందని, ఏపీ ప్రతిపాదిత చట్టంతో మార్పు కనిపిస్తే దేశమంతటా ఇలాంటి చట్టం తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నానని సునీత పేర్కొన్నారు.

'డిమాండ్' తగ్గాలి

అమ్మాయిల అక్రమ తరలింపు డిమాండ్-సరఫరా సూత్రంపై ఆధారపడి ఉందని సునీత వ్యాఖ్యానించారు. విటులను శిక్షిస్తే వారిలో భయం పెరిగి, అమ్మాయిల అక్రమ రవాణాకు డిమాండ్ తగ్గుతుందని, అదే జరిగితే అమ్మాయిల తరలింపు ఎంతో కొంత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రతిపాదిత మార్పులతో సత్వర ఫలితాలు ఉంటాయని ఆమె తెలిపారు. చాలా కాలంపాటు ప్రభావం ఉండాలంటే చట్టమే మార్గమన్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం విటులను శిక్షించే అవకాశం లేదా అని అడగ్గా- 'ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్' ప్ర‌కారం వారినీ అరెస్టు చేయవచ్చని, అయితే అలాంటి అరెస్టులు చాలా తక్కువని, ఒకవేళ అరెస్టయినా నేరం నిరూపితమై శిక్ష పడే అవకాశాలు స్వల్పమని సునీత చెప్పారు.

వ్యభిచారం కేసుల్లో మహిళలే ఎక్కువగా పట్టుబడుతున్నారు. విటులు తప్పించుకొంటున్నారు.

మహిళల అక్రమ తరలింపును, వారిని వ్యభిచారంలోకి దించడాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు పెద్దగా ఏమీ చేయడం లేదని సునీత విచారం వ్యక్తంచేశారు.

సునీతా కృష్ణన్

ఫొటో సోర్స్, Sunitha Krishnan

ఫొటో క్యాప్షన్, సునీతా కృష్ణన్

ఈ మూడింటిపై శ్రద్ధ పెట్టాలి

అక్రమ తరలింపును నివారించడం, వ్యభిచార కూపాల నుంచి కాపాడిన మహిళలకు తగిన రక్షణ-పునరావాసం కల్పించడం, బాధ్యుల ప్రాసిక్యూషన్ మెరుగుపడాల్సి ఉందని, ఈ మూడు అంశాలపై శ్రద్ధ పెడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సునీత వివరించారు.

అక్రమ తరలింపునకు బాధ్యులైనవారిపై నేర నిరూపణ పేలవంగా ఉందని, ఇది చాలా మెరుగుపడాల్సి ఉందని ఆమె చెప్పారు.

అక్రమ తరలింపు బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ వారే ఎక్కువనే వార్తలపై ప్రశ్నించగా- ఏపీ నుంచి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని, అలాగ‌ని వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఈ సమస్య లేదని కాదని సునీత స్పందించారు. ఇదో అంతర్జాతీయ సమస్యని వ్యాఖ్యానించారు. జనాభాను బట్టి ఈ నంబర్లు పెరుగుతున్నాయన్నారు.

''ఆంధ్రప్రదేశ్ కృషిని మెచ్చుకోవాలి. వేరే రాష్ట్రాలు దీని గురించి ఏమీ చేయలేదు కాబట్టి, నంబర్లు కనిపించవు. ఏపీ ప‌నిచేస్తోంది కాబ‌ట్టి నంబర్లు కనిపిస్తున్నాయి. అందుకే సంఖ్య గురించి మాట్లాడేటప్పుడు బ్యాలెన్సుడుగా ఆలోచించి మాట్లాడాలి'' అని ఆమె సూచించారు.

నివేదిక అందాక నిర్ణయం

మనుషుల అక్రమ తరలింపును అరిక‌ట్టే క్ర‌మంలో ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని మ‌హిళా శిశు సంక్షేమశాఖ‌ క‌మిష‌న‌ర్ అరుణ్ కుమార్ చెప్పారు.

అక్రమ తరలింపును నిరోధించేందుకు దేశవ్యాప్తంగా, ప్ర‌పంచవ్యాప్తంగా అమలు చేస్తున్న విధానాలను ప‌రిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు ఏ నమూనా స‌రిపోతుందో ఈ సలహా బృందం నివేదిక రూపంలో తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.

నివేదిక అందాక ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)