కాలిఫోర్నియాలో పిల్లలను గొలుసులతో కట్టేసిన దంపతులు

ఫొటో సోర్స్, Getty Images
తమ 13 మంది పిల్లలను ఇంట్లోనే బంధించిన దంపతులను కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల్లో కొందరిని ఆ దంపతులు గొలుసులతో కట్టేసి ఉంచారని పోలీసులు తెలిపారు.
డేవిడ్ అలెన్ టర్పిన్ (57), లూయిస్ అనా టర్పిన్(49) లను పిల్లల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసారు.
రెండు నుంచి 29 ఏళ్ల వయసు కలిగిన పిల్లలతో కలిసి టర్పిన్ దంపతులు లాస్ ఏంజెల్స్‌కు 59 మైళ్ల దూరంలో పెరీస్‌లో నివసిస్తున్నారు.
తల్లిందండ్రుల చెర నుంచి తప్పించుకున్న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న ఆ బాలిక కేవలం పదేళ్ల బాలికలా ఉందని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, David-Louise Turpin/Facebook
పోలీసులకు ఇంట్లో ఏం కనిపించింది?
బాలిక ఫిర్యాదుతో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు పిల్లలను గొలుసులు, తాళాలతో కట్టేసి ఉండడం కనిపించింది. ఇల్లంతా చీకటిమయంగా, ఓ రకమైన వాసనతో ఉంది.
పిల్లలను ఎందుకు కట్టేశారన్న పోలీసుల ప్రశ్నలకు ఆ దంపతులు సరైన సమాధానం చెప్పలేకపోయారు.
ఇంట్లో బంధించిన వారి పిల్లల్లో ఏడుగురి వయసు 18-29 మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నివ్వెరపోయారు.
పిల్లలు పోషకాహారం లేక చిక్కిపోయి, చాలా మురికిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, David-Louise Turpin/Facebook
ఈ రహస్యాన్ని ఎలా దాచి ఉంచారు?
ఈ సబర్బన్ పట్టణంలో టర్పిన్ దంపతులు ఈ రహస్యాన్ని ఎలా దాచి ఉంచారన్నది అంతు చిక్కడం లేదు.
పోలీసుల రికార్డు ప్రకారం టర్పిన్ దంపతులు గతంలో చాలా కాలం టెక్సాస్‌లో నివసించారు. 2010లో కాలిఫోర్నియాకు మారారు.
డేవిడ్ టర్పిన్ రెండుసార్లు దివాలా తీసినట్లు రికార్డులు చెబుతున్నాయి. రెండోసారి దివాలా తీసినపుడు ఆయన ఓ ఎరోనాటిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో ఇంజనీర్‌గా పని చేసేవారు.
అయితే ఇంత మంది పిల్లలను చూస్తే, ఆయన ఆదాయం ఇంటి ఖర్చులకు ఎంత మాత్రమూ సరిపోయేది కాదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
డేవిడ్ టర్పిన్ తల్లిదండ్రులు తమ మనవలు, మనవరాళ్లకు ఇంట్లోనే చదువు చెప్పేవాళ్లని తెలిపారు. కుమారుడి కుటుంబాన్ని చూసి నాలుగైదేళ్లు అవుతోందని వివరించారు.
ఈ దంపతుల ఫేస్‌బుక్ పేజీలో కుటుంబసభ్యులంతా సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఫొటోలు ఉన్నాయి. వాటిపై కుటుంబ సభ్యులు, స్నేహితుల కామెంట్లు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇరుగు పొరుగు ఏమంటున్నారు?
''కేవలం వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మాత్రమే చూసేవాళ్లం. అంతే తప్ప వాళ్ల గురించి ఏ వివరాలూ తెలీదు'' అని వాళ్ల పొరుగువాళ్లు చెబుతున్నారు.
వాళ్ల పొరుగున ఉండే కింబర్లీ మిలిగాన్, వాళ్ల పిల్లలు ఎన్నడూ ఆడుకునేందుకు బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదని తెలిపారు.
పిల్లల వెంట ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండేవాళ్లని, ఒకసారి పిల్లలను పలకరిస్తే గాభరా పడ్డారని అన్నారు.
ఇంతకూ టర్పిన్ దంపతులు తమ పిల్లలను ఎందుకు బంధించారో తెలియడం లేదు.
ప్రస్తుతం పిల్లలందరినీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








