పాఠశాలలు, ఆటస్థలాల్లో ముస్లిం పిల్లలకు వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింలకు వ్యతిరేకంగా అపోహలు పెరిగిపోతున్నాయని, దీని కారణంగా భారత్‌లో ఖరీదైన పాఠశాలల్లో ముస్లిం బాలలకు అవహేళనలు, వేధింపులు అధికమవుతున్నాయని తాజాగా విడుదలైన ఒక పుస్తకం పేర్కొంది. పాఠశాలల్లో ముస్లిం పిల్లలను వారి మతం కారణంగా వేధించే ఘటనలు భారత్, అమెరికా సహా చాలా దేశాల్లో జరుగుతున్నాయి.
'మదరింగ్ ఎ ముస్లిం' అనే ఈ పుస్తకాన్ని నజియా ఎరుమ్ రాశారు. పుస్తకం రాసే క్రమంలో అధ్యయనంలో భాగంగా 12 నగరాల్లోని 125 కుటుంబాలతో ఆమె సంభాషించారు. దిల్లీలో 25 అగ్రశ్రేణి పాఠశాలల్లో చదువుతున్న వంద మంది బాలలతో మాట్లాడారు.
''ఉన్నతశ్రేణి పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు ఉండవనుకున్నాను. నా పరిశోధనలో వెల్లడైన అంశాలు దిగ్భ్రాంతి కలిగించాయి. మమ్మల్ని 'ఉగ్రవాదులు', 'పాకిస్తానీలు' అని అంటున్నారని ఐదారేళ్ల పిల్లలు చెబితే మనకు ఎలా అనిపిస్తుంది? దీనిపై పాఠశాల యాజమాన్యానికి ఏమని ఫిర్యాదు చేయాలి'' అని నజియా 'బీబీసీ'తో వ్యాఖ్యానించారు.
పిల్లలు ఇలాంటి మాటలు చాలా వరకు సరదాకో, ఆట పట్టించడానికో అంటుంటారని, చూస్తే ఇది ఏ మాత్రం బాధ కలిగించని విధంగా అనిపిస్తుందని, కానీ నిజానికి ఇది వేధించడం, గేలిచేయడమేనని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Nazia Erum
ఇతర పిల్లలు తమను తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు, చేసే కామెంట్లను రచయిత్రితో మాట్లాడిన ముస్లిం పిల్లలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అవేంటంటే..
- ''నువ్వు ముస్లింవా? ముస్లింలంటే నాకు ద్వేషం.''
- ''మీ అమ్మానాన్న ఇంట్లో బాంబులు తయారుచేస్తారా?''
- ''మీ నాన్న తాలిబనా?''
- ''వాడు పాకిస్తానీ.''
- ''వాడు ఉగ్రవాది.''
- ''ఈ అమ్మాయిని ఏమీ అనొద్దు.. అంటే నీపై బాంబు వేస్తుంది''
ఇటీవల విడుదలైన ఈ పుస్తకం, పాఠశాలల్లో పిల్లల పట్ల మతపరమైన ద్వేషం, అపోహలపై చర్చకు తెర తీసింది. గత వారాంతంలో #MotheringAMuslim అనే హ్యాష్ ట్యాగ్ 'ట్విటర్'లో బాగా ట్రెండ్ అయ్యింది. తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను ఎంతో మంది సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
భారత జనాభా 130 కోట్లు. ఇందులో దాదాపు 80 శాతం మంది హిందువులు, 14.2 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

ఫొటో సోర్స్, Nazia Erum
ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు 1990ల నుంచే ఉన్నాయని, అయితే ఇటీవల సంవత్సరాల్లో వీటి తీవ్రత పెరిగిందని నజియా చెప్పారు.
తనకు మొదటి సంతానం కలిగిన తర్వాత 2014లో ఈ తీవ్రతను స్పష్టంగా గుర్తించానని ఆమె తెలిపారు. ''నా కుమార్తె మైరాను చేతుల్లోకి తీసుకున్నాను. మొదటిసారిగా నాకు భయం కలిగింది'' అన్నారు. తన బిడ్డకు పేరు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాల్సి వచ్చిందని, పేరును బట్టి ముస్లిం అని తెలిసిపోతే ఎలా అనే ఆందోళన కూడా కలిగిందని నజియా వెల్లడించారు.
2014 నుంచి తన విషయంలో ముస్లిం అనే గుర్తింపే ప్రాథమిక గుర్తింపుగా ఉందని, ఇతర్రతా అంశాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయని ఆమె విచారం వ్యక్తంచేశారు.
పెద్దవారి మధ్య ఏర్పడ్డ విభజన రేఖలు తీవ్రతరమయ్యాయి. అవి క్రమంగా పిల్లలకు పాకుతున్నాయి.
ఆటస్థలాలు, పాఠశాలలు, తరగతి గదులు, స్కూలు బస్సులు - ఇలా అన్ని చోట్లా ముస్లిం చిన్నారులను వేరుగా చూడటం పెరిగిపోయిందని, వారిని పాకిస్తానీ అని, ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) అని, బాగ్దాదీ అని, ఉగ్రవాది అని పిలుస్తున్నారని నజియా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింలపై వ్యాప్తి చేసిన అపోహలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పే కొన్ని ఉదాహరణలను ఆమె పుస్తకంలో పేర్కొన్నారు. అవి:
- ''ముస్లింలు వస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు'' అని ఒక ఐదేళ్ల బాలిక భయాందోళనకు గురవుతోంది. విస్మయం కలిగించేదేంటంటే- ఆ పాప కూడా ముస్లిమే. తానో ముస్లింను అనే అవగాహన కూడా ఆ పాపకు లేదు.
- యూరప్‌లో ఒక ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పదేళ్ల ఒక విద్యార్థిని అతడి క్లాస్‌మేట్ ''ఏం చేశావ్'' అని అడిగాడు. ఈ ప్రశ్న ఆ బాలుడికి చాలా కోపం తెప్పించింది. అవమానకరంగా కూడా అనిపించింది.
- 17 ఏళ్ల బాలుడిని మరో బాలుడు 'ఉగ్రవాది' అన్నాడు. బాధితుడి తల్లి అతడి తల్లికి ఫోన్ చేసి, దీనిపై ప్రశ్నించారు. ''మరి మీ అబ్బాయి మా అబ్బాయిని 'దుబ్బోడా' అన్నాడు'' అని ఆమె సమాధానమిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచార తీరు వల్ల అక్కడి పాఠశాలల్లో వర్ణ, జాతిపరమైన ఉద్రిక్తతలు పెరిగాయని, నల్లజాతి పిల్లల్లో భయం ఆందోళనకర స్థాయికి పెరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ మార్పును 'ట్రంప్ ఎఫెక్ట్' అని వ్యవహరిస్తున్నారు. భారత పాఠశాల్లలో ముస్లిం బాలలకు వేధింపులు పెరగడాన్ని 'మోదీ ఎఫెక్ట్'గా పేర్కొనవచ్చా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇస్లామిక్ పార్టీల నాయకులు సహా రాజకీయ నాయకులందరూ విద్వేష స్వరంతో మాట్లాడుతున్నారని నజియా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
తమ పాఠశాలల ప్రాంగణాల్లో పిల్లలకు మతపర వేధింపులు ఉన్నాయనే విషయాన్ని పాఠశాలలు అంగీకరించడం లేదని నజియా తెలిపారు. ఇలాంటి ఘటనల గురించి చాలా వరకు ఫిర్యాదులు యాజమాన్యాల దృష్టికి రాకపోవడం, వీటిని ఎక్కడో చోట అరుదుగా జరిగే ఘటనలుగా భావించడం కూడా పాఠశాలలు అంగీకరించకపోవడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషించారు.
పాఠశాలల్లో ముస్లిం పిల్లలకు ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రుల్లో చాలా మంది తమ పిల్లలకు 'అదనపు జాగ్రత్తలు' చెబుతున్నారని ఆమె తెలిపారు. ఎప్పుడూ అత్యుత్తమంగానే నడుచుకోవాలని చెబుతున్నారని పేర్కొన్నారు.
ఎవ్వరితోనూ వాదించొద్దు, బాంబులు, తుపాకులతో కూడిన కంప్యూటర్ గేమ్‌లు ఆడొద్దు, విమానాశ్రయాల్లో జోకులు వేయొద్దు, బయటకు వెళ్లినప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించవద్దు- ఇలా ముస్లింలు వారి పిల్లలకు అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆమె వివరించారు. ఈ పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
పిల్లలపై మతపరమైన వేధింపులను అడ్డుకొనేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు చేయగలిగినదంతా చేయాలని నజియా సూచించారు. సమస్య ఉందన్న వాస్తవాన్ని గుర్తించి, దానిపై చర్చించాలని పేర్కొన్నారు. కేవలం ప్రత్యారోపణలతో సమస్య పరిష్కారం కాదన్నారు.
ఈ సమస్యను సత్వరం పరిష్కరించుకోకపోతే, విద్వేషం టీవీ స్టూడియోల్లో చర్చలకు, పత్రికల్లో శీర్షికలకే పరిమితం కాదని, అన్నింటికీ వ్యాపిస్తుందని, అప్పుడు మతపర వేధింపులు ఎదుర్కొనేవారే కాదు, వేధించేవారూ బాధపడాల్సి ఉంటుందని నజియా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’
- సుప్రీంకోర్టు ‘సంక్షోభం’: న్యాయమూర్తుల లేఖలో ఏముందంటే..
- ఇరాన్లో ఎందుకీ నిరసనలు?
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








