మర్చంట్ నేవీలో చేరడం ఎలా? ఏ కోర్సులు చదవాలి, జీతం ఎంత ఉంటుంది?

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సముద్రం అంటే కేవలం మత్స్య సంపదకు, రవాణాకు ఉపయోగపడేది మాత్రమే కాదు, అది ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక. అత్యధిక వ్యాపార లావాదేవీలు, సరకు రవాణా సముద్ర మార్గంలోనే జరుగుతున్నాయి.

భారత దేశంలోనే 12 ప్రధాన ఓడరేవులు, 200 వరకూ చిన్న ఓడరేవులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువుల రవాణా జరుగుతోంది.

ఈ రంగానికి సంబంధించి యువతను అమితంగా ఆకర్షిస్తున్న ఉద్యోగం - మర్చంట్ నేవీ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం మర్చంట్ మెరైనర్లలో ఏడు శాతం మంది, అంటే ప్రతి వంద మందిలో ఏడుగురు భారతీయులే ఉండటం విశేషం.

షిప్పింగ్ రంగం రాబోయే కాలంలో మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

భారత ప్రభుత్వం 2047 నాటికి మారిటైమ్ రంగంలో కోటిన్నర కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మర్చంట్ నేవీ విషయానికి వస్తే, భారీ జీతాలు, ప్రపంచంలోని అనేక దేశాలను చుట్టివచ్చే అవకాశం, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు... ఇవన్నీ ఈ కెరీర్‌ను ఆకర్షణీయంగా మారుస్తాయి. అయితే, ఇందులో సవాళ్లు కూడా తక్కువేమీ కావు.

'కెరీర్ కనెక్ట్' ఈ ఎపిసోడ్‌లో.. అసలు మర్చంట్ నేవీ అంటే ఏమిటి, ఈ ఉద్యోగంలోకి ప్రవేశించే మార్గాలు ఏంటి? ఇది ఎవరికి సరైన ఎంపిక? ఇందులో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అనే విషయాలను వివరంగా పరిశీలిద్దాం.

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, Getty Images

మర్చంట్ నేవీ అంటే ఏమిటి?

ఇండియన్ నేవీలో చేరాలా? లేక మర్చంట్ నేవీలో చేరాలా? అనే సందిగ్ధత చాలామంది యువతలో కనిపిస్తుంటుంది.

ఈ రెండు దారులు సముద్రం వైపుకే వెళ్తాయి, కానీ ఈ రెండింటి లక్ష్యాలు మాత్రం ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి.

అందుకే మొదట వీటి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకుందాం.

అకాడమీ ఆఫ్ మారిటైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఏఎంఈటీ) ప్లేస్‌మెంట్ డైరెక్టర్ కెప్టెన్ చంద్రశేఖర్ ఇలా చెబుతున్నారు.

''మర్చంట్ నేవీ అనేది సముద్ర మార్గం ద్వారా సరకులను రవాణా చేసే వాణిజ్య నౌకలకు సంబంధించిన షిప్పింగ్ సర్వీస్. ఇది ఒక కాస్ట్ సెంటర్, అంటే ఇది లాభనష్టాలతో కూడుకున్న వ్యాపారం. అదే సమయంలో నేవీ అనేది ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉంటుంది. ఇది మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లాగే భారత సైన్యంలో ఒక విభాగం'' అని చెప్పారు.

'మర్చంట్ నేవీ డీకోడెడ్' అనే ఎడ్యుటెక్ సంస్థను నడుపుతున్న ప్రణీత్ మెహతా స్వయంగా ఒక షిప్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.

''నేవీలోకి వెళ్లే దారి వేరు. దాని కోసం ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మూడేళ్ల కఠినమైన శిక్షణ పొందాలి. మర్చంట్ నేవీ అనేది ప్రైవేట్ రంగం. నేవీ అనేది పూర్తిగా ప్రభుత్వపరమైనది, దేశ సేవ కోసం ఉద్దేశించినది. జీతాల విషయంలోనూ ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది'' అని ఆయన అన్నారు.

మర్చంట్ నేవీ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పర్యవేక్షిస్తుంది. ఇందులో వేర్వేరు విభాగాలు ఉంటాయి.

మరి వీటిలోకి ప్రవేశం ఎలా?

మర్చంట్ నేవీ విభాగాలు, అర్హతలు...

1. నేవిగేషన్ విభాగం లేదా డెక్ విభాగం: ఈ విభాగంలో చేరడానికి డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ లేదా బీఎస్సీ నాటికల్ సైన్స్ పూర్తి చేయాలి.

బాధ్యతలు: ఓడను సురక్షితమైన మార్గంలో నడపడం, సముద్ర పరిస్థితులను అంచనా వేయడం వీరి ప్రధాన పని.

పదవులు: డెక్ క్యాడెట్‌తో మొదలై.. థర్డ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, చివరకు కెప్టెన్ స్థాయికి చేరుకుంటారు.

2. ఇంజన్ విభాగం (మెరైన్ ఇంజనీరింగ్): దీని కోసం బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా అవసరం. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ చదవాలంటే IMU-CET రాయాలి. అలాగే, సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఒక ఏడాది గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ (జీఎంఈ) అనే ప్రత్యేక కోర్సు కూడా ఉంటుంది.

బాధ్యతలు: ఓడ ఇంజన్, యంత్రాలు, సాంకేతిక పరికరాల నిర్వహణ ఈ విభాగం చూసుకుంటుంది.

పదవులు: జూనియర్ ఇంజనీర్‌గా ప్రయాణం మొదలై.. ఫోర్త్, థర్డ్, సెకండ్ ఇంజనీర్, చివరకు చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకుంటారు.

3. ఎలక్ట్రో-టెక్నికల్ ఆఫీసర్ (ఈటీవో): ఓడలోని సెన్సార్లు, అలారం వ్యవస్థలను, ఎలక్ట్రికల్ పరికరాలను పర్యవేక్షించే లైసెన్స్ కలిగిన అధికారి.

అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇంస్ట్రుమెంటేషన్‌లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు డీజీ షిప్పింగ్ గుర్తింపు పొందిన ఈటీవో కోర్సు పూర్తి చేయాలి.

4. జీపీ రేటింగ్ (సపోర్ట్ క్రూ): ఇది ఆఫీసర్ స్థాయి కాకపోయినా, ఓడతో పాటు సిబ్బంది సంరక్షణలో వీరు కీలకపాత్ర పోషిస్తారు.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతి లేదా 12వ తరగతి తర్వాత ఆరు నెలల జీపీ రేటింగ్ కోర్సు ద్వారా ఈ ఉద్యోగాన్ని పొందవచ్చు.

వయస్సు: పదిహేడున్నర నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

మర్చంట్ నేవీ ఎవరికి సరైన ఎంపిక?

ప్రతీక్ తివారీ ప్రస్తుతం ఒక కంపెనీలో సీనియర్ చార్టరింగ్ (షిప్పింగ్) మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2006లో ఆయన 12వ తరగతి పూర్తి చేసినప్పుడు, మిగిలిన విద్యార్థుల్లాగే ఆయనకు కూడా భవిష్యత్తులో ఏ దారి ఎంచుకోవాలో తెలియదు. ఆయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.

''మా ఇంట్లో వాళ్లు నేను ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్లాలని కోరుకున్నారు. కానీ నాకు ఏదైనా భిన్నంగా చేయాలని ఉండేది. ఆ సమయంలో మర్చంట్ నేవీ గురించి పెద్దగా సమాచారం లేదు, సరైన గైడెన్స్ కూడా లేదు. నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపించినా, మెరైన్ ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. నాలుగు ఏళ్ల కోర్సు తర్వాత మెరైన్ ఇంజనీర్‌గా నా ప్రయాణం మొదలైంది'' అని చెప్పారు.

అయితే, ఈ ప్రయాణం అంత సులభం కాదని ప్రతీక్ చెబుతున్నారు.

ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. మర్చంట్ నేవీ ఎవరికి సరిపోతుందంటే...

  • ఇంజనీరింగ్, యంత్రాలు, నేవిగేషన్ వంటి సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉన్నవారికి.
  • సుదీర్ఘ కాలం పాటు ఇంటికి దూరంగా ఉండగలిగే వారికి.
  • అత్యంత క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో, బాధ్యతాయుతంగా పనిచేయగలిగే వారికి.
  • శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేవారికి.
  • ప్రపంచాన్ని చుట్టి రావాలని, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ కావాలని కోరుకునే వారికి.

మర్చంట్ నేవీ అనేక సవాళ్లను కూడా తెస్తుందని ప్రణీత్ మెహతా అంటున్నారు.

ఉదాహరణకు, ఏకధాటిగా ఆరు నెలల పాటు సముద్రం మీదనే గడపాల్సి ఉంటుంది. అంతకాలం కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఎదురవుతాయి. ఇది శారీరకంగా, మానసిక సిద్ధంగా ఉండి, కఠినమైన క్రమశిక్షణతో పని చేయాల్సిన వృత్తి.

''ప్రస్తుతం బయట ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. చాలామంది విపరీతమైన పోటీ ఉన్న రంగాలనే ఎంచుకుంటున్నారు. కానీ ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్ పెరుగుతున్న తీరును బట్టి చూస్తే, రాబోయే 10 ఏళ్లలో మర్చంట్ నేవీ రంగంలో భారీ వృద్ధి ఉండబోతోంది. అందుకే మర్చంట్ నేవీని ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే, ఇక్కడ పోటీ తక్కువ, జీతాలు ఎక్కువ. దీనితో పాటు ఆఫీసర్ యూనిఫాం ధరించే గర్వించదగ్గ అవకాశం కూడా లభిస్తుంది'' అని ప్రణీత్ మెహతా వివరించారు.

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, @IMU_HQ

మర్చంట్ నేవీలో చేరడానికి కోర్సులు..

1. డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (డీఎన్ఎస్): ఇది డెక్ విభాగంలో చేరడానికి ఉద్దేశించిన ఒక సంవత్సరం కోర్సు. దీనిని ఇంటర్మీడియట్ (12వ తరగతి) తర్వాత చేయవచ్చు.

2. బీఎస్సీ నాటికల్ సైన్స్: డెక్ విభాగంలో ఆఫీసర్ కావాలనుకునేవారి కోసం ఇది మూడేళ్ల డిగ్రీ కోర్సు.

3. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్: ఇంజన్ విభాగంలో చేరడానికి ఇది నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు.

4. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ (జీఎంఈ): ఒకవేళ మీరు ఇప్పటికే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉంటే, ఈ 8 నుంచి 12 నెలల కోర్సు చేయడం ద్వారా ఇంజన్ విభాగంలో ఆఫీసర్‌గా చేరవచ్చు.

5. ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ (ఈటీవో): ఒకవేళ మీరు ఇంటర్ తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ విభాగాల్లో బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉంటే, ఈ నాలుగు నెలల కోర్సు చేసి ఇంజన్ విభాగంలో ఎలక్ట్రికల్ ఆఫీసర్‌గా చేరవచ్చు.

6.జీపీ రేటింగ్: ఇది ఆరు నెలల కాలపరిమితి గల కోర్సు. దీనిని పూర్తి చేసిన వారు డెక్, ఇంజన్ విభాగాల్లో సపోర్ట్ క్రూగా చేరవచ్చు.

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, @IMU_HQ

మర్చంట్ నేవీలో ఎవరు చేరవచ్చు?

1. ఇంటర్మీడియట్ (12వ తరగతి): మీకు ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో 60 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉంటే మర్చంట్ నేవీలో చేరడం సులభం అవుతుంది. అలాగే, కంటి చూపు (విజన్) కచ్చితంగా 6/6 ఉండాలి.

2. కామర్స్ లేదా ఆర్ట్స్ విద్యార్థుల కోసం: ఒకవేళ మీరు ఇంటర్మీడియట్‌లో కామర్స్ లేదా ఆర్ట్స్ చదివి ఉంటే, మర్చంట్ నేవీ కోసం మళ్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో 11, 12 తరగతులు చదవాల్సి ఉంటుంది. దీని కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షలు రాయడం ఒక మంచి ప్రత్యామ్నాయం.

3. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ): భారతదేశంలో మర్చంట్ నేవీ చదువుల కోసం ప్రధాన సంస్థ ఐఎంయూ. ఈ యూనివర్శిటీ ప్రతి ఏటా మే నెలలో IMU-CET అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.

ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులు బీఎస్సీ నాటికల్ సైన్స్ (3 ఏళ్లు) లేదా బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ (4 ఏళ్లు) కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీల వివరాల కోసం ఐఎంయూ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

4. జీపీ రేటింగ్: మీకు ఇంటర్‌లో ఎంపీసీ సబ్జెక్టులు లేకపోయినా, జీపీ రేటింగ్ కోర్సు ద్వారా మర్చంట్ నేవీలో చేరవచ్చు. అయితే, ఈ కోర్స్ చేసినవారు నేరుగా ఆఫీసర్ స్థాయికి చేరుకోలేరు (తర్వాత అనుభవం, పరీక్షల ద్వారా ఆ స్థాయికి చేరుకోవచ్చు).

వయోపరిమితి: ఈ కోర్సులన్నింటికీ కనీస వయస్సు 17 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 25 ఏళ్లు ఉండాలి.

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, @IMU_HQ

మర్చంట్ నేవీలో కెరీర్, జీతం ఎలా ఉంటాయంటే....

నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇంజనీరింగ్ (జేఈఈ) లేదా మెడికల్ (నీట్) పరీక్షలకు లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కానీ ఐఎంయూ సీఈటీకి(IMU-CET) కేవలం 30 వేల నుంచి 40 వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. దీనివల్ల మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఎక్కువ.

జీతాల వివరాలు చూస్తే, మర్చంట్ నేవీలో జీతం మీరు పనిచేసే షిప్ రకం (ఉదాహరణకు: ఆయిల్ ట్యాంకర్ లేదా కంటైనర్), మీ అనుభవంపై ఆధారపడి ఉంటుంది.

హోదా, నెలవారీ జీతం (సుమారుగా)..

క్యాడెట్ (ట్రైనీ) రూ.30,000

ఆఫీసర్ (4 ఏళ్ల కోర్స్ తర్వాత) రూ.45,000 – రూ.90,000

కెప్టెన్ / చీఫ్ ఇంజనీర్ రూ.8,00,000 – రూ.15,00,000

గమనిక: చమురు ట్యాంకర్లు, గ్యాస్ క్యారియర్లు (ఎల్‌ఎన్‌జీ) వంటి ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లే ఓడలలో పని చేసే వారికి సాధారణ ఓడల కంటే ఎక్కువ జీతం లభిస్తుంది.

పదోన్నతులు, సీవోసీ పరీక్షలు: మర్చంట్ నేవీలో కేవలం అనుభవం ఉంటే సరిపోదు. మీరు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి (ఉదాహరణకు థర్డ్ ఆఫీసర్ నుంచి సెకండ్ ఆఫీసర్‌కి) వెళ్లాలంటే డీజీ షిప్పింగ్ నిర్వహించే సీవోసీ (సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ) పరీక్షలు పాస్ కావాలి. ఈ పరీక్షలు మీ నైపుణ్యాన్ని, బాధ్యతను పెంచుతాయి. సీవోసీ అనేది మీరు ఆ పదవికి అర్హులని చెప్పే ఒక అధికారిక సర్టిఫికెట్.

మర్చంట్ నేవీ, ఉపాధి, ఉద్యోగం, విద్య

ఫొటో సోర్స్, IMU

ఎలాంటి కాలేజీని ఎంచుకోవాలి?

మర్చంట్ నేవీలో చేరడానికి మీరు ఎంచుకునే కళాశాల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, మర్చంట్ నేవీ కోర్సులు కేవలం డీజీ షిప్పింగ్ గుర్తింపు పొందిన సంస్థల్లో చదివితేనే సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి. ఈ కోర్సులు కూడా ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఉండవు. ఇవి కేవలం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) పరిధిలోకి వచ్చే సంస్థలు లేదా డీజీ షిప్పింగ్ గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం భారతదేశంలో సుమారు 200 మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ): ఇది ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. చెన్నై, ముంబయి, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చి ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి.

కోర్సులు: ఇక్కడ బీటెక్ (మెరైన్ ఇంజనీరింగ్), బీఎస్సీ (నాటికల్ సైన్స్), జీఎంఈ డిప్లొమా, ఈటీవో కోర్సు, మేనేజ్మెంట్ కోర్సులు చేయవచ్చు.

ఇతర ప్రముఖ విద్యాసంస్థలు:

అకాడమీ ఆఫ్ మారిటైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ( AMET) , చెన్నై

తులానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్ (TMI) , పుణె

జీపీ రేటింగ్, ప్రీ-సీ ట్రైనింగ్ కోసం ఉత్తమ సంస్థలు:

మీరు సపోర్ట్ క్రూ లేదా రేటింగ్ కోర్సుల వైపు వెళ్లాలనుకుంటే ఇవి మంచి ఆప్షన్.

ఆంగ్లో ఈస్టర్న్ మారిటైమ్ అకాడమీ (కొచ్చి)

సౌత్ ఇండియా మారిటైమ్ అకాడమీ (చెన్నై)

లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ (చెన్నై)

ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్ (నోయిడా)

సైంటిఫిక్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (కోల్‌కతా)

ఫీజుల వివరాలు:

మర్చంట్ నేవీ కోర్సుల ఫీజులు మీరు ఎంచుకునే సంస్థను బట్టి మారుతుంటాయి.

ఐఎంయూ క్యాంపస్‌లు: బీటెక్ లేదా బీఎస్సీ కోర్సుల కోసం ఏడాదికి సుమారు రూ.2.25 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది.

ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు: గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలలో ఈ ఫీజు ఇంకా ఎక్కువే ఉండవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)