SSC Exams: ఈ పరీక్షల ద్వారా ఏయే కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, జీతం ఎంత ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మంచి జీతం, స్థిరత్వం, అన్ని సౌకర్యాలు ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరైనా కోరుకుంటారు కదా? నేను ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా'' అని చెబుతున్నప్పుడు మాళవిక కళ్లలో ఆశ, మెరుపు కనిపించాయి. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత రెండేళ్లుగా ఆమె 'ఎస్‌ఎస్‌సీ' పరీక్షకు సిద్ధమవుతున్నారు.
ఇలా ఆమె ఒక్కరే కాదు, ఏటా లక్షలాది మంది అదే లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు.
10వ తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు, ఉత్తీర్ణులైనవారు తమ అర్హతను బట్టి ఎస్ఎస్‌సీ నిర్వహించే వివిధ ఉద్యోగ పరీక్షలకు హాజరవుతున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంక్షిప్త రూపమే ఎస్ఎస్‌సీ. ఇది దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖలలో ఉద్యోగాలు పొందుతారు. అసలు ఎస్ఎస్‌సీ ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తుంది, ఏయే ఉద్యోగాలు వస్తాయో తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా విద్యార్థులు పట్టభద్రులై జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారనేదీ మీకు తెలుసా? వారి సంఖ్యతో పోలిస్తే, అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ.

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (2025) ప్రకారం, 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువత గ్రామీణ ప్రాంతాల్లో 13.7 శాతం, నగరాలలో 18 శాతం ఉన్నారు.
అటువంటి చాలామంది యువతకు, ఎస్ఎస్‌సీ ద్వారా వస్తున్న వేలాది ఖాళీలు మంచి ఉద్యోగం పొందడానికి చాలా ఉపయోగంగా ఉంటాయి.
2025లో, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలలో 14,582 పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశారు.
2024లో 17 వేలకు పైగా ఉద్యోగాలు, 2023లో ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. మూడేళ్ల క్రితం 2022లో 37 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు.
ఇవి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి ప్రకటించిన ఖాళీలు మాత్రమే. ఇది కాకుండా ఎస్ఎస్‌సీ అనేక ఇతర ఉద్యోగ పరీక్షలను నిర్వహిస్తుంది.

ఏటా ఉద్యోగ ప్రకటనలు
జీత్ రాణా ఎస్ఎస్‌సీ సీజీఎల్, ఎంటీఎస్ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. ఇప్పుడు ఆయన ఆ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు.
ఉద్యోగార్థులకు ఎస్ఎస్‌సీ మంచి ఆప్షన్ కాగలదో చెప్పడానికి జీత్ రాణా మూడు కీలక అంశాలను వివరించారు:
- మీరు 10వ తరగతి ఉత్తీర్ణులైనా, గ్రాడ్యుయేట్ అయినా, వివిధ స్థాయి ఉద్యోగాలలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది, మీరు వేర్వేరు అర్హత ప్రమాణాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రిపరేషన్‌లో నాలుగు ప్రధాన రంగాలు ఇంగ్గిష్, రీజనింగ్, జీకే/జీఎస్, గణితంపై దృష్టి సారించాలి.
- మీరు ఎస్ఎస్‌సీ కోసం సిద్ధమవడం ఇప్పుడే మొదలుపెట్టి ఉంటే, ఈ నియామక ప్రక్రియ కూడా ఎక్కువ కాలం పట్టదు. ఉదాహరణకు, జీడీ కానిస్టేబుల్ కోసం రాత పరీక్ష ఉంటుంది, తర్వాత శారీరక పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటాయి. ఇవన్నీ పూర్తి అయితే ఉద్యోగంలో చేరడమే. గ్రాడ్యుయేట్-స్థాయి పరీక్షలో రెండు దశలు ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ తదుపరి ప్రక్రియ ఒక సంవత్సరంలోపే పూర్తవుతుంది.
ప్రభుత్వ పరీక్షలకు హాజరవ్వాలనుకునేవారికి శిక్షణ అందించే ఎగ్జామ్‌పూర్ వెబ్‌సైట్‌లో టీచర్ వివేక్ మాట్లాడుతూ, 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు విద్యార్హతలను బట్టి, గ్రూప్-డి నుంచి గ్రూప్-బి వరకూ అనేక అవకాశాలను అందిస్తుండటంతో ఉద్యోగార్థులకు ఎస్ఎస్‌సీ ఖాళీలపై ఆసక్తి ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే ఉద్యోగాలు ఉంటాయి, జీతం ఎంత?
ప్రతి సంవత్సరం 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు లక్షలాది మంది అభ్యర్థులు ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్నారు.
క్లర్క్‌లు, అసిస్టెంట్‌లు, ఇన్‌స్పెక్టర్లు, ఇంజనీర్లు, కానిస్టేబుళ్లు సహా గ్రూప్-బి, గ్రూప్-సి స్థాయి ఉద్యోగాలను ఎస్ఎస్‌సీ అందిస్తోంది.
ఈ నియామకాల కోసం వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో సాధారణంగా జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లిష్, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాన్ని బట్టి పరీక్షల స్థాయి కూడా మారుతూ ఉంటుంది. అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఎస్ఎస్‌సీ నిర్వహించే ప్రధాన పరీక్షలు...
ఎస్ఎస్‌సీ సీజీఎల్ (కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్) : గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులకు గ్రాడ్యుయేట్ స్థాయి అభ్యర్థులను నియమించడానికి దీన్ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మెరిట్‌ను బట్టి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, ఇన్‌స్పెక్టర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. జీతాలు దాదాపు రూ.25,000 నుంచి రూ.1,50,000 వరకూ ఉంటాయి.
ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్‌ఎల్ (కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్): వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో క్లరికల్, డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ఇంటర్మీడియెట్ (12వ తరగతి) ఉత్తీర్ణులకు ఈ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో మెరిట్‌ను బట్టి సాధారణంగా లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పోస్టుల స్థాయిని బట్టి జీతం రూ.20,000 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.
ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ (నాన్-టెక్నికల్ ): ఈ పరీక్ష 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ప్యూన్, వాచ్‌మెన్, గార్డెనర్ వంటి గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్వహిస్తుంది. ఉద్యోగ స్థానం, స్థాయిని బట్టి రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య జీతం ఉంటుంది.
ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్: బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్ వంటి కేంద్ర పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)లో కానిస్టేబుల్ పోస్టులలో నియామకం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది. జీతం రూ.20,000 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.
వీటితో పాటు జేఈ, సీపీవో, స్టెనోగ్రాఫర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల నియామక పరీక్షలు కూడా ఎస్ఎస్‌సీ ద్వారానే జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఎస్ఎస్‌సీ-సీజీఎల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్‌ఎల్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎస్ఎస్‌సీ-ఎంటీఎస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎస్ఎస్‌సీ-జేఈ (జూనియర్ ఇంజనీర్): ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ (పోస్టును బట్టి ఏది వర్తిస్తుందో అది).
ఎస్ఎస్‌సీ సీపీవో: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి సాధారణంగా 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది కూడా ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.
అయితే, నిర్ణీత వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. 1962 జనవరి 1కి ముందు నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, అలాగే పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన భారత సంతతికి చెందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తును ssc.gov.in వెబ్‌సైట్‌లో దాఖలు చేస్తున్నవారు, పోస్టును బట్టి అవసరమైన సమాచారాన్ని సమర్పించాలి. మీ ఫోటోగ్రాఫ్, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆపై రుసుము చెల్లించాలి. జనరల్ కేటగిరీకి రుసుము రూ.100 మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా సిద్ధం కావాలి?
వివిధ స్థాయులలో నిర్వహించే ఈ పరీక్షలకు ఎప్పటి నుంచి సిద్ధం కావాలి అనే సందేహం రావడం సహజం.
ఈ విషయమై జీత్ రాణా మాట్లాడుతూ, అభ్యర్థి కుటుంబ నేపథ్యం కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు.
"ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, 10వ తరగతి తర్వాత నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. లేకపోతే, 12వ తరగతి తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. డిగ్రీ చదువుతూనే పరీక్షకు సిద్ధం కావచ్చు. ఒకవేళ ఎవరైనా హ్యుమానిటీస్ చదివినట్లయితే, జీఎస్ పేపర్‌కు ప్రిపరేషన్ కూడా సులభం అవుతుంది" అని జీత్ రాణా అన్నారు.
సాధారణంగా, ఎస్ఎస్‌సీ పరీక్షకు ఆరు నెలల ప్రిపరేషన్ సరిపోతుందని, అయితే ఇది విద్యార్థి చదివే, సిద్ధమయ్యే పద్ధతులపై ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరైనా తన మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించకపోతే, వారు తాము ఎక్కడ పొరపాట్లు చేశారో పరిశీలించి, వాటిని సరిదిద్దుకోవాలి.
మాదిరి పరీక్ష (మాక్ టెస్ట్)లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
పరీక్షకు ముందు మాదిరి పరీక్షలు రాయడం వల్ల మీ ప్రిపరేషన్ ఎలా ఉందో, ఇంకా ఏమి చేయాలో అంచనా వేయడానికి సహాయపడుతుంది.
ఒకవేళ ఎస్ఎస్‌సీ పరీక్షల్లో మీరు విఫలమైతే, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే, వాటి సిలబస్ కూడా ఎస్ఎస్‌సీ సిలబస్ మాదిరిగానే ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














