తెలంగాణ గ్రూప్-1: అభ్యర్థుల ఆందోళనల నడుమ మొదలైన మెయిన్స్ పరీక్షలు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతించింది.
అక్టోబరు 21 (సోమవారం) నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్న దశలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
గ్రూప్-1 పరీక్షల విషయంలో వివాదానికి కారణమైన జీవో నం.29ను రద్దు చేయాలని, అప్పటివరకు మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని రాంబాబు అనే అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై అక్టోబరు 21న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
‘‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ రోజు (అక్టోబరు 21) నుంచి మొదలవుతుండటంతో ఈ దశలో జోక్యం చేసుకోలేం. స్టే ఇవ్వడం సాధ్యం కాదు. జీవో నం. 29 వివాదాన్ని వీలైనంత త్వరగా, అంటే మెయిన్స్ పరీక్షల ఫలితాలు వచ్చేలోగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశిస్తున్నాం. ఉద్యోగ నియామకాలు అనేవి తీర్పుకు లోబడి ఉంటాయని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. ఒకవేళ పిటిషనర్ల (కేసు వేసిన అభ్యర్థులు)కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇస్తే, దానికి తగ్గట్టుగా వెసులుబాటు కల్పించాలి’’ అని సుప్రీం కోర్టు చెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పోటీ పరీక్షల నిపుణురాలు ఎం. బాలలతతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఇది ప్రభుత్వానికి ఊరట అని అనుకోవడానికి లేదు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్న దశలో కోర్టులు జోక్యం చేసుకోవడం చాలా అరుదుగానే భావించాలి. జీవో నం.29 వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇక దీనిపై హైకోర్టు తీర్పు చెబుతుంది. ఆ తీర్పు పైనే పరీక్ష భవితవ్యం ఆధారపడి ఉంటుంది’’ అని బాలలత అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం నేపథ్యంలో అసలు జీవో నం. 29 వివాదం ఏమిటి? గతంలో ఉన్న జీవో నం. 55 ఏం చెబుతోంది? అభ్యర్థుల అభ్యంతరాలు ఏమిటి? ఒకసారి చూద్దాం.

తెలంగాణ ఏర్పడ్డాక తొలి గ్రూప్-1 నోటిఫికేషన్
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలివి.
చివరిసారిగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పరీక్షలు జరిగాయి.
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. 503 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. 2022 అక్టోబర్, 2023 ఆగస్టులో రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి.
ఒకసారి ప్రశ్నపత్రం లీకేజీ, మరోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోని కారణంగా ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసింది టీజీపీఎస్సీ.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఫిబ్రవరి 19న మరోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. మరో 60 పోస్టులు పెంచి, 563 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జారీ చేసిన జీవో నం.55ను సవరించి 2024 ఫిబ్రవరి 8వ తేదీన జీవో నం.29ను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
2024 జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాయి. నోటిఫికేషన్ ప్రకారం, 1:50 నిష్పత్తిలో పోస్టులు, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC
అసలు ఏమిటీ జీవో నం.29?
పోటీ పరీక్షలకు సంబంధించి 2022లో జీవో నం.55ను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
దాని ప్రకారం ప్రతి మల్టీ జోన్‌లోని పోస్టుల సంఖ్యకు తగ్గట్టుగా 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో రిజర్వుడు, మహిళలు, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, స్పోర్ట్స్ కేటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలోను, ఇటు రిజర్వుడ్ కేటగిరీలోనూ ఎంపిక అయ్యేందుకు వీలుండేదని అభ్యర్థులు చెబుతున్నారు.
‘‘జీవో నం.29 ప్రకారం, రిజర్వుడు కేటగిరీతో సంబంధం లేకుండా మల్టీ జోన్‌లోని పోస్టుల సంఖ్యకు తగ్గట్టుగా 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఒకవేళ ఏదైనా రిజర్వుడు పోస్టులలో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే, అదే కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులను తీసుకుంటారు. అలా అభ్యర్థుల నిష్పత్తి 1:50 ఉండేలా చూసుకుంటారు’’ అని టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
అయితే, జీవో నం.29పై బీబీసీకి మరింత స్పష్టత ఇచ్చారు పోటీ పరీక్షల నిపుణురాలు ఎం. బాలలత.
‘‘భారత్‌లో రిజర్వేషన్ వ్యవస్థ ఉంది. ఉదాహరణకు వంద పోస్టులు ఉంటే 50 ఓపెన్ కేటగిరీలో, 50 రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయని అనుకుందాం. టీజీపీఎస్సీ ప్రిలిమ్స్‌లో జీవో నం.29 అమలు చేసింది ప్రభుత్వం. ఓపెన్‌లో రిజర్వుడు కేటగిరీలో అర్హత సాధించిన అభ్యర్థులను కూడా ఎస్సీ కేటగిరీ కింద లెక్కగట్టారు. దీపేంద్ర యాదవ్ జడ్జిమెంట్ పేరా నం.31 ప్రకారం ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ వర్తిస్తుంది. వాళ్లను రిజర్వుడు కేటగిరీలో లెక్కించకూడదు. దానివల్ల సీట్లు తగ్గిపోతాయి’’ అని చెప్పారు బాలలత.

అభ్యర్థుల అభ్యంతరాలు ఏమిటి?
జీవో నం. 29 కారణంగా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు గ్రూప్-1 అభ్యర్థులు.
‘‘జీవో నం.55 వల్ల రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ జీవో నం.29 వల్ల రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఇప్పటికిప్పుడు పరీక్షలు జరపాల్సిన అవసరమేంటి? పరీక్షలు రాశాక కోర్టు కొట్టివేస్తే, ఏం చేస్తారు? మళ్లీ పరీక్ష రాయమంటారా? ఇప్పటికే ప్రిలిమ్స్ మూడుసార్లు రాశాం. మెయిన్ పరీక్షలు కూడా మళ్లీ రాయాలా?’’ అని బీబీసీతో అన్నారు ఒక గ్రూప్-1 అభ్యర్ధి.
‘‘హైకోర్టులో 22 కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో సగం కేసులపైన ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కేసులన్నీ పరిష్కారం అయ్యాకే మెయిన్స్ పరీక్షలు పెట్టాలి. ప్రిలిమ్స్ అంటే ఒక రోజు రాసే పరీక్ష. కానీ మెయిన్ పరీక్షలు ఏడు రోజులపాటు రాయాలి. మానసికంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి కాకుండా బయట రచయితలు రాసిన పుస్తకాలు, వికీపీడియాపై ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరుగా హాల్ టికెట్లు ఇస్తున్నారు’’ అని బీబీసీతో అన్నారు మరో అభ్యర్థి.
ఫిబ్రవరిలో జీవో నం.29 వస్తే పరీక్షలపై ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారని గ్రూప్-1 అభ్యర్థులను బీబీసీ ప్రశ్నించింది.
‘‘ఇప్పటికే కోర్టులో కేసులు వేశాం. కోర్టులలో మాకు న్యాయం జరుగుతుందని భావించాం. అందుకే ఎదురుచూశాం’’ అని చెప్పారు.

ఆందోళనలు, రాజకీయ పార్టీల మద్దతు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని లేదా రీషెడ్యూల్ చేయాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అశోక్ నగర్‌లో ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు.
గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు.
‘‘ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి. జీవో నం.29 రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలి. 563 పోస్టులకు గంపగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయం. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే, ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారు. గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
ఈ ఆందోళనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
‘‘ప్రభుత్వం ఇచ్చిన జీవో నం.29 రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. న్యాయపరమైన సమస్యలన్నీ పరిష్కారమైన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK
ప్రభుత్వం ఏం చెబుతోంది?
అభ్యర్థుల అభ్యంతరాలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
‘‘గ్రూప్-1 విషయంలో అపోహలను నిరుద్యోగులు నమ్మొద్దు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేశాం. జీవో నం.55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. మధ్యలో నిబంధనలు మారిస్తే కోర్టులు పరీక్షల్ని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే అందరికీ న్యాయం జరగాలనే జీవో నం.29ను ప్రభుత్వం తీసుకొచ్చింది. గ్రూప్-1 అభ్యర్థులంతా మెయిన్ పరీక్షకు హాజరవండి. లేకపోతే ఒక బంగారు అవకాశం కోల్పోతారు’’ అని అక్టోబరు 19న జరిగిన పోలీసు డ్యూటీ మీట్‌లో అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఫొటో సోర్స్, UGC
46 కేంద్రాల్లో పరీక్షలు మొదలు
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో యథావిధిగా మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాయి. అక్టోబరు 27 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. దీనికి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ).
మొత్తం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 46 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది.
31,383 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో, ఆ మేరకు వారందరూ మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటనలో చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














