‘మూసీ’ అని పిల్లలకు పేరు పెట్టే స్థాయిలో ఈ నది మారిపోతుందా? ఇప్పటివరకు ఏం జరిగింది?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కృష్ణా, గోదావరి, గంగ, యమున నదుల పేర్ల మీద ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా తన బిడ్డకు మూసీ అని పేరు పెట్టుకున్నాడా? మూసీలో మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. మూసీని అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు కచ్చితంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు మూసీ అనే పేరు పెట్టుకుంటారు.’’
2024 అక్టోబరు 6న శిల్పకళావేదికలో ‘కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలివి.
ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి (మూసీ నది ప్రక్షాళన) ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది.
నిర్వాసితుల వ్యతిరేకత.. ప్రతిపక్షాల అభ్యంతరాలు.. ప్రాజెక్టు వ్యయ అంచనాల్లో గందరగోళం.. గత అనుభవాలు.. ఇలా అనేక అంశాల మధ్య మూసీనది ప్రక్షాళన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది.
ఈ ప్రాజెక్టును దశల వారీగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో నిర్వాసితుల తరలింపును ప్రభుత్వం చేపట్టింది.
కొన్ని ప్రాంతాల్లో మాత్రం తమ ఇళ్లను వదిలి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించినప్పుడు నిర్వాసితులు బీబీసీకి చెప్పారు.
ఇంతకీ అసలు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు ఏమిటి? దీనిపై అభ్యంతరాలు ఏమిటి? గతంలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు ఏమయ్యాయి?

మూసీ నది పుట్టుక.. అతిపెద్ద ఉపద్రవం
మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి (ఈ నదిని అక్కడ మూసా లేదా ముచ్చుకుందా అంటారు).. సుమారు 267 కిలోమీటర్లు ప్రయాణం సాగించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ వద్ద ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణం మొదలుపెడుతుంది.
నగర శివారులోని గండి పేట ప్రాంతం దాటాక పారిశ్రామిక, ఇతర వ్యర్థ జలాలు కలుస్తుండటంతో మూసీ నది మురికికూపంగా మారింది.
మూసీ నది చరిత్రలో 1908లో అత్యంత భారీ వరదలు వచ్చాయి. ఆ ఏడాది సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూసీ నదిలో వరదలు వచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి.
అప్పటి నిజాం ప్రభుత్వ లెక్కల ప్రకారం, వరదల కారణంగా దాదాపు 15 వేల మంది చనిపోయారు. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా.
ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టుపైకి ఎక్కి సుమారు 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారని ఇప్పటికీ చెప్పుకొంటారు. దీనికి గుర్తుగా 2002లో చింత చెట్టుకు ‘ప్రాణధాత్రి’గా పేరు పెట్టారు.
ఈ వరదల తర్వాత అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ విజ్ఞప్తి మేరకు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. మూసీ నదికి సమగ్ర నీటి ప్రణాళికను సిద్ధం చేశారు.
అందులో భాగంగా భవిష్యత్తులో వరదలు వస్తే నియంత్రించేందుకు వీలుగా గండిపేట (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించింది అప్పటి నిజాం ప్రభుత్వం.
ఈ జంట జలాశయాలు ఒకప్పుడే కాదు, ఇప్పటికీ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటికి ఆధారంగా మారాయి.
ఆ తర్వాత 1930, 1954, 1970, 2000 సంవత్సరాల్లో మూసీ నదికి వరదలు వచ్చినా, జలాశయాల నిర్మాణంతో వరద నీటి నియంత్రణ సాధ్యపడిందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.

నిజాం హయాంలోనే మూసీ పరివాహక అభివృద్ధి
మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి అనేది చివరి నిజాం సమయంలోనే జరిగిందని బీబీసీతో చెప్పారు పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు.
అప్పట్లో నగరంలో 14 చోట్ల పార్కులు నిర్మించారని ఆయన వివరించారు.
‘‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో సర్ మీర్జా అలీ అనే ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌ను పిలిపించి మూసీ పరివాహకంలో పార్కులు నిర్మించారు. సాయంత్రం వేళ పిల్లలతో కలిసి పెద్దవాళ్లు వెళ్లి అక్కడ సేదతీరేవారు.
నన్ను మా అమ్మ అలా తీసుకుని వెళ్లేది. అప్పట్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా మూసీ అభివృద్ధి జరిగింది’’ అని సుబ్బారావు తెలిపారు.
‘‘ప్రజల ప్రత్యక్ష సంబంధాలు, ప్రజా భాగస్వామ్యం, నది ప్రవాహ సహజత్వాన్ని కాపాడటం, ఖర్చు.. ఈ నాలుగు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుత పాలకులు కూడా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. రిక్రియేషన్ కార్యకలాపాలు కాదు, నది పరిరక్షణకు ప్రాధాన్యంఇవ్వాలి’’ అన్నారు బీవీ సుబ్బారావు.
‘సేవ్ మూసీ.. సేవ్ హైదరాబాద్’ నినాదంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రస్తుత పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

నందనవనం ప్రాజెక్టుతో మొదలు..
మూసీ నది కాల క్రమంలో మురికి కూపంగా మారడంతో ప్రక్షాళన దిశగా గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
అయితే, ప్రభుత్వ పరంగా మొదటి అడుగు పడింది 1997లో అని చెప్పవచ్చు.
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ‘నందనవనం’ పేరుతో ప్రాజెక్టును తీసుకువచ్చింది. నదీ గర్భాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
బాపూఘాట్ నుంచి నాగోలు వరకు అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది.
కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెర్సస్ ఏపీ ప్రభుత్వం కేసులో 1997లో నాటి హైదరాబాద్ కలెక్టర్ ఏపీ హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నందనవనం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన 1095 కుటుంబాలకు కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం పేరుతో కాలనీ నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం.
మొత్తం రూ.8కోట్లు వెచ్చించి 1858 ప్లాట్లు అభివృద్ధి చేయగా.. 1095 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లుగా ప్రభుత్వం అప్పట్లో హైకోర్టుకు నివేదించింది.
ఆ తర్వాత రెండేళ్లలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా అప్పట్లో చాదర్ ఘాట్ ప్రాంతంలో నదీ గర్భంలో పది మీటర్ల కాంక్రీట్ ఛానెల్ (కాలువ) నిర్మించారు.
నదిని కుదించడంపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు 2001లో నిలిచిపోయింది.
ఆ తర్వాత మళ్లీ 2005లో ‘సేవ్ మూసీ’ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ.908 కోట్లతో మూసీని సుందరీకరించాలనేది ప్రణాళిక.
కానీ అది కూడా ముందుకు కదల్లేదు.
‘‘ప్రాజెక్టు వ్యయం, పునరావాసం, ప్రక్షాళన, సుందరీకరణ వేర్వేరుగా చేయాల్సి ఉండటం వంటి రకరకాల కారణాలతో సేవ్ మూసీ ప్రాజెక్టును పెద్దగాపట్టించుకోలేదు’’ అని అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే..
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత మూసీ అభివృద్ధికి ప్రత్యేక విభాగాన్ని తీసుకువచ్చింది అప్పటి బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం.
2017 మార్చి 25న జీవో నెం.90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
బాపూ ఘాట్ నుంచి మూసీ నది పై భాగాన సుమారు 57.5 కిలోమీటర్లు, ఆ తర్వాత ఉన్న కింద భాగాన మరో 57.5 కిలోమీటర్లు.. అంటే మొత్తం 115కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తుంది ఈ సంస్థ. మూసీ నది కాలుష్యాన్ని తగ్గించి పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించి పరిసరాలనుమెరుగుపరచాలన్నది ఈ సంస్థ ఏర్పాటు ఉద్దేశం.
నది తీరం వెంట పార్కులు, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సమాంతర రహదారులు, ఇతర వినోద (రిక్రియేషన్) కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది.
మూసీ నది సుందరీకరణ, అభివృద్ధికి రూ.16,635 కోట్లతో గత ప్రభుత్వం అంచనాలు రూపొందించింది.
కొత్తపేట నుంచి నాగోలు, హైకోర్టు, ఛాదర్ ఘాట్ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది.
సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం ప్రకారం మూసీ నదిని దాటే ప్రయాణికుల ప్రయాణాలు 2031 నాటికి 36 లక్షల నుంచి 60లక్షల ట్రిప్పులకు పెరుగుతాయనిఅంచనా. దీనికి తగ్గట్టుగా మూసీ నది ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపేలా రూ.545 కోట్లతో 14 చోట్ల వంతెనలకు ప్రణాళిక రూపొందించింది.
ఇవి కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు), ఎక్స్‌ప్రెస్ వేలు.. ఇలా వివిధ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో అందులో కొన్ని ప్రతిపాదనలు నిలిచిపోయాయి.

మురుగునీటిని శుద్ధి చేస్తేనే…
మురుగునీరు చేరకుండా నదిని శుభ్రం చేయడం మూసీ ప్రక్షాళనలో కీలకమైన ప్రక్రియ.
ప్రస్తుతం హైదరాబాద్ సీవరేజీ బోర్డు పరిధిలో ప్రతిరోజూ 1950 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా.
ఇందులో 772.3 ఎంఎల్‌డీల మురుగునీరు 25 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) ద్వారా శుద్ధి అవుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3866 కోట్లతో 31 ఎస్టీపీల సాయంతో 1259.5 ఎంఎల్‌డీ నీరు శుద్ధి చేయాలని ప్రణాళిక తయారుచేసి నిర్మాణ పనులు చేపట్టారు.
వీటిల్లో మూసీకి ఉత్తరాన పరివాహక ప్రాంతాల్లో 402.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎనిమిది ఎస్టీపీలు, మూసీకి దక్షిణ ప్రాంతాల్లో 480.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఆరు ఎస్టీపీలు, హుస్సేన్ సాగర్-కూకట్‌పల్లి మధ్య 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 17 ఎస్టీపీలు నిర్మాణంలో ఉన్నాయి.
వీటిల్లో ఆరు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు.
జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికలో భాగంగా మూసీ నదిలో కాలుష్యం చేరకుండా ఉండేందుకు రూ.335.6 కోట్లతో నాలుగు ఎస్టీపీలను నిర్మించినట్లు2021లో అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. అంతకుముందు మూడేళ్లలో మాత్రం ఎలాంటి నిధులూ ఇవ్వలేదని తెలిపింది.
ఈ నాలుగు ఎస్టీపీల నిర్మాణం 2001లో ప్రారంభం కాగా, వివిధ దశల్లో అవి అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పరివాహక ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో 39 ఎస్టీపీలకు రూ.3849 కోట్లను కేటాయిస్తూఆగస్టులో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.
మూడు ప్యాకేజీల్లో (ప్యాకేజీ-1లో 16, ప్యాకేజీ-2లో 22, ప్యాకేజీ-3లో భారీ ఎస్టీపీ ఒకటి) నిర్మించాలనేది ప్రణాళిక.
మొత్తంగా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 972 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్.
‘‘మూసీలోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేసి పంపించాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని ఎస్టీపీలు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి అదనంగా మరికొన్ని ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆయన చెప్పారు.

మూసీ ప్రక్షాళన ఖర్చు ఎంత?
మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతోంది?
ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి నుంచి వస్తోంది. ఈ విషయంలోనే అధికార, విపక్షాల మధ్య వివాదం నడుస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ సహా వివిధ వేదికలపై మూసీ ప్రాజెక్టు ఖర్చును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
‘‘2,400 కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామీ గంగే ప్రాజెక్ట్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ 55 కిలోమీటర్ల పొడవున్న మూసీకి మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లంట. ఇంత బడ్జెట్ ఎందుకంటే రేవంత్ దగ్గర సమాధానం లేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మూసీ ప్రక్షాళనను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16,635 కోట్లతో చేపట్టనున్నట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.58వేల కోట్లతో పనులు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
2024-25 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ ఏడాది జులై 20న గోపన్ పల్లిలో ఫై ఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా మూసీ ప్రక్షాళన ఖర్చుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం’’ అని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఆయన ప్రసంగంలో కేవలం మూసీ నది అభివృద్ధికే రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పలేదు. హైదరాబాద్ నగరం, మూసీ నది.. రెండింటికి కలిపిఅన్నట్లుగా చెప్పారు.
ఇదే విషయంపై అక్టోబరు ఏడో తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికలపై అధ్యయనం జరగాల్సి ఉంది. దీనికి ఖర్చు ఎంత అనేది ఇప్పటివరకు ప్రభుత్వం అనుకోలేదు. ఒకవేళఎవరైనా ఖర్చు గురించి చెబుతున్నా.. అది నిజం కాదు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక వచ్చాక ఖర్చు ఎంతనేది తెలుస్తుంది’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఆక్రమణల లెక్కలపై అస్పష్టత
మూసీ నదిలో ఎన్నివేల ఆక్రమణలు గుర్తించారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
దీనికి ప్రకారం మూసీ నదికి కూడా 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ అనేది ఎక్కడి నుంచి లెక్కిస్తారన్న విషయంపై ప్రభుత్వం నుంచిస్పష్టత లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
2015లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంచనా ప్రకారం ఆరు వేల మంది మూసీ నది గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని తెలిపింది.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు నెలల కిందట డ్రోన్ సాయంతో మూసీ నదిలో కట్టడాలపై సర్వే చేశారు.
‘‘మొత్తం 55 కిలోమీటర్లు మూసీ వెంట సర్వే చేసి, దాదాపు 10,600 కట్టడాలు, ఇళ్లు మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్‌లో ఉన్నాయని తేల్చారు’’ అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ చెప్పారు.
ఇప్పటికే నదీ గర్భంలో గుర్తించిన నిర్మాణాలకు గుర్తులు వేశారు అధికారులు.
మూసీ నదిలో ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వద్ద.. అసలు నది అభివృద్ధికి సంబంధించి బ్లూ ప్రింట్ ఉందా.. అని ప్రశ్నించారు పర్యావరణవేత్త కె.పురుషోత్తమరెడ్డి.
‘‘కేవలం ఆక్రమణలు తొలగించడం ఒక్కటే నదికి పూర్వవైభవం తీసుకువస్తాయని చెప్పడానికి లేదు. ఆక్రమణలు తొలగించాల్సిందే. కానీ, నదిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా.. అనేది చెప్పాలి.
ప్రభుత్వం నది సుందరీకరణ గురించి మాట్లాడుతోంది. కానీ మేం నది సుందరీకరణ కాదు, నదిని కాపాడాలని అడుగుతున్నాం. వికారాబాద్‌లో మూసీ మొదలైన ప్రదేశం నుంచి నల్లగొండ జిల్లాలో కృష్ణా నదిలో కలిసే చోటు వరకు పరిరక్షించాలి’’ అని చెప్పారు.
నదిలో ఆక్రమణల తొలగింపుపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు బీవీ సుబ్బారావు.
‘‘అసలు ఎంత శాతం ఆక్రమణలు ఉన్నాయనేది ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెప్పలేదు. నది ఆక్రమణలనేవి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు,అన్నిచోట్లా ఉన్నాయి. మూసీ నది ఆక్రమణల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉండాలి’’ అని ఆయన చెప్పారు.

మూసీ నిర్వాసితులు ఏమంటున్నారు?
మూసీ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారి కోసం 16వేల ఇళ్లను కేటాయిస్తూ సెప్టెంబరు 26న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఇళ్లకు తరలి వెళ్లేందుకు కొందరు సుముఖత చూపగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
బీబీసీ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించినప్పడు ఈ విషయం తెలిసింది.
ఇప్పటికే చాదర్ ఘాట్ ప్రాంతంలోని మూసా నగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లోని కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలివెళ్లడంతో అక్కడ కూల్చివేతలుచేపట్టారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు.
కిషన్ బాగ్, కొత్తపేటలోని న్యూ మారుతీనగర్, సత్యానగర్, వినాయక్ నగర్ ప్రాంతంలోని కొందరు తాము వెళ్లేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు.
ఈ విషయంపై వినాయక్ నగర్‌కు చెందిన యాదిరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘మా కుటుంబం 1969 నుంచి ఇక్కడే ఉంటోంది. నేను డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నా. మా కాలనీలోకి ఎప్పుడూ మూసీ నది రాలేదు. అలాంటిదిమూసీ నదిలో మా ఇల్లు ఉందని చెబుతున్నారు.
పైసా పైసా కూడబెట్టి వంద గజాల స్థలం కొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా ఇల్లు మాకు కాకుండా చేసి డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పడంఎంతవరకు సమంజసం?
మేం ఇక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధంగా లేం. కాదు.. వెళ్లాలంటే మాత్రం మా స్థలానికి రెండు, మూడింతలు పరిహారం కట్టి ఇవ్వాలి’’ అని చెప్పారు యాదిరెడ్డి.
జీవో నెం.59 కింద ప్రభుత్వం తమ ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించిందని చెప్పారు మరో నిర్వాసితుడు శ్రీనివాసరావు.
తమ కుటుంబం 20 ఏళ్ల నుంచి సత్యానగర్‌లో ఉంటోందని వివరించారు.
‘‘కొన్నేళ్ల కిందట రూ.పది లక్షలు పెట్టి నోటరీ మీద ఇంటిని కొనుక్కొన్నాం. తర్వాత జీవో నెం.59 కింద మా ఇంటి స్థలం క్రమబద్దీకరణ జరిగింది.
ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వచ్చి రూ.30 లక్షలు ఖర్చు పెట్టి సొంతిల్లు కట్టుకున్నాం. అలాంటిది ఇప్పుడు వచ్చి ఇంటిని కూలగొడతామని చెబుతున్నారు. మా గతి ఏం కావాలి?’’ అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
‘‘మేం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ అని బెదిరిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్లడానికి మాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అని చెప్పారు కొత్తపేట సత్యానగర్‌కు చెందిన నందగిరి సీతమ్మ.
కిషన్ బాగ్ ప్రాంతంలో బీబీసీ పర్యటించినప్పుడు.. కెమెరా ముందు మాట్లాడేందుకు అక్కడి నిర్వాసితులు ముందుకు రాలేదు.
కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే స్థానిక నాయకులు తమను బెదిరిస్తున్నారని వాపోయారు.
అయితే, నిర్వాసితులు ఎవరినీ బలవంతంగా తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వారికి అవగాహన కల్పించి, అన్ని రకాల సదుపాయాలు, ఉపాధి కల్పించిన తర్వాతే తరలింపు చేపడతామని దానకిషోర్ వెల్లడించారు.

ఇతర ప్రాంతాల్లో నదులలో ఏం జరిగింది?
లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది.
దాదాపు 200 ఏళ్ల కిందట పారిశ్రామిక విప్లవం సమయంలో థేమ్స్ నదిలోకి పరిశ్రమల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు నేరుగా వెళ్లడం మొదలైంది.రానురాను 1957 సమయంలో థేమ్స్ నదిని ‘బయోలాజికల్లీ డెడ్’ గా లండన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది.
ఆ తర్వాత అక్కడి అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని థేమ్స్ నదిని ప్రక్షాళన చేస్తూ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది.
ఈ ఏడాది జనవరిలో లండన్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థేమ్స్ నదిని పరిశీలించారు.
థేమ్స్ నది పాలకమండలితో సమావేశమై చర్చించారు.

ఫొటో సోర్స్, PA Media
మూసీ నది అభివృద్ధిపై ప్రభుత్వం ఏం చెబుతోంది?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2026 జూన్ కల్లా మూసీ నదిలో మంచినీరు ప్రహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిశోర్ చెప్పారు.
‘‘మొదటి విడతగా రూ.10వేల కోట్లతో పనులు మొదలు కాబోతున్నాయి. గోదావరి నుంచి నీటిని తీసుకువచ్చి గండిపేట, హిమాయత్ సాగర్‌లో ఐదు టీఎంసీలు నింపనున్నాం.
ఆ నీరు సూర్యాపేట వరకు పారేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక. అక్కడక్కడ చెక్ డ్యామ్‌లు కట్టి నీటిని నిల్వ చేయనున్నాం.
రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్ కట్టబోతున్నాం. హాకర్స్ జోన్స్ పెడుతున్నాం’’ అని వివరించారు.
నెల రోజుల్లో ప్రాజెక్టుకు టెండర్లు పిలవబోతున్నామని, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు దానకిశోర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















