తెలంగాణ పంట రుణమాఫీ: 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఏం చేయాలి, ప్రభుత్వ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

దుక్కి దున్నుతున్న రైతులు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపు కోసం ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది.

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 09 వరకు తీసుకున్నపంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.

ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలు చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌చానల్‌
పంట రుణాలు

ఫొటో సోర్స్, Getty Images

పంట రుణమాఫీ పథకం 2024 పరిధి, వర్తింపు

  • తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
  • ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.
  • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా "బ్యాంకులు" అని పిలుస్తారు) వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • 2018 డిసెంబర్ 12 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి ఈ పథకం వర్తిస్తుంది.
  • రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు, తదితరులు ఉంటారు.
పంట రుణ మాఫీ

ఫొటో సోర్స్, Getty Images

పథకం అమలుకు ఏర్పాట్లు

వ్యవసాయశాఖ కమిషనర్, సంచాలకులు (డిఒఎ) పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించారు.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) ఈ పథకానికి ఐటి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.

వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్‌ను నిర్వహిస్తారు.

ఈ ఐటి పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం పేర్కొన్న మరికొన్ని విషయాలు..

  • ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బిఎస్ఐ) నియమించాలి.
  • ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
  • బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ పంటరుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి.
  • ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) నుండి రిఫరెన్స్- 1వ మెమో, జత చేసిన ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్ లో లేవు. కాబట్టి, పిఎసిఎస్ కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్- 2వ మెమో, జత చేసినట్టి ప్రొఫార్మా-2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.
  • ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి.
  • ఈ ప్రక్రియ ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం.
  • అవసరమైతే వ్యవసాయశాఖ సంచాలకులు, ఎన్‌ఐసీ డేటా వాలిడేషన్ తనిఖీలు చేయాలి.
  • ఈ పథకం కింద లబ్ధిదారుల రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో , పిడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి.
  • ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి బకాయి ఉన్న సంచిత (క్యుములేటివ్) రుణమాఫీ రూ.2.00 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
  • అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డిబిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణఖాతాలకు జమ చేస్తారు. పిఏసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎసిఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.
  • ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 తేదీ నాటికి ఉన్న రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమచేయాలి.
  • ప్రతి రైతుకుటుంబానికి 09-12-2023 నాటికి కలిగిఉన్న మొత్తం రుణం కానీ లేక రూ.2.00 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
  • ఏ కుటుంబానికి అయితే రూ.2.00 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు 2.00 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత, అర్హతగల రూ. 2.00 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
  • రూ. 2.00 లక్షల కంటే ఎక్కువ రుణం వున్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
రైతు

ఫొటో సోర్స్, UGC

మినహాయింపులు

  • ఈ రుణమాఫీ ఎస్‌హెచ్‌జీలు,జెఎల్‌జిలు, ఆర్ఎంజిలు, ఎల్ఇసిఎస్‌లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.
  • ఈ రుణమాఫీ పునర్ వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు.
  • కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు.
  • కానీ పిఏసిఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది.

బ్యాంకుల బాధ్యత :

  • ప్రతి బ్యాంకు బాధ్యతగా ప్రభుత్వానికి డేటాను సమర్పించాలి.
  • ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణఖాతా వివరాలు సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరియైన విధంగా ఇవ్వాలి.
  • పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్‌ఓ డిజిటల్ సంతకం చేయాలి.
  • నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి.

రైతుల బాధ్యతలు :

ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులుకారని కనుగొన్నట్లయితే, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది.

ఆడిట్:

లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యధార్ధతను నిర్థరించేందుకు సహకారశాఖ సంచాలకులు సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రిఆడిట్ ను చేపట్టి, అమలు అధికారికి (వ్యవసాయశాఖ సంచాలకులు) వారు కనుగొన్న విషయాలను సమర్పించాలి.

ఈ పథకం కింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంకు అకౌంట్ ను ఆర్బిఐ/ నాబార్డ్ నిర్దుష్ట

కార్యవిధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ ఆడిట్ ను చట్టబద్ధ (స్టాట్యుటరి) ఆడిటర్లు, ప్రత్యేక ఆడిటర్ల ద్వారా చేయించవచ్చు.

పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం

పథకం గురించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి.

రైతులు తమ ఇబ్బందులను ఐటి పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలుపవచ్చు.

ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి, దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో క్యాప్షన్, Telangana Runamafi: రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారు ఏం చేయాలి, మాఫీ ఎవరికి?