తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ రద్దు: రెవెన్యూ సంస్కరణల చరిత్ర ఏమిటి? ఎప్పుడు ఎలా మారుతూ వచ్చాయి?

తెలంగాణ రెవెన్యూ చట్టం
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) వ్యవస్థ రద్దు అయ్యింది. దీనికి సంబంధించి 2020 సెప్టెంబరులోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పటికీ.. ఎట్టకేలకు ఈ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీరి క్రమబద్ధీకరణపై ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు నేతృత్వంలో నలుగురు మంత్రుల ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నియమించారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను పంచాయతీరాజ్, నీటిపారుదల, మున్సిపల్, మిషన్ భగీరథ, వ్యవసాయ, విద్యాశాఖల్లో ప్రభుత్వ సర్దుబాటు చేయనుంది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీరిలో చదువుకోనివారు, ఏడో తరగతి, పదో తరగతి, డిగ్రీ.. ఇలా వివిధ స్థాయిల వరకు చదువుకున్న వారున్నారు. వారి విద్యార్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేస్తారు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేయనుంది.

61ఏళ్లు దాటిన వీఆర్ఏలు 3700 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారిని సర్దుబాటు చేయడం ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధ్యం కాదు కనుక కారుణ్య నియామకం కింద వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అలాగే రాష్ట్ర ఆవిర్భావం.. అంటే 2014 జూన్ రెండో తేదీ తర్వాత 61 ఏళ్లు ఉండి చనిపోయిన వీఆర్ఏలు ఉంటే వారి కుటుంబీకులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసలు ఇంతకీ వీఆర్ఏల వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది..? రెవెన్యూ చట్టాలకు ప్రభుత్వం ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తోంది..అనేది ఒకసారి చూద్దాం..

రెవెన్యూ అంటే ఆదాయం అనే అర్థం ఉంది ఇంగ్లిష్‌లో. ఒకప్పుడు భూమి ద్వారా వచ్చే పన్ను ఆదాయమే ప్రభుత్వాలకు ప్రధాన వనరు. అందుకే ఆ భూమి వ్యవహారాలు చూసే శాఖను రెవెన్యూ శాఖగా పిలుస్తున్నారు.

కాలంతో పాటూ అన్నీ మారినా, ఆ శాఖకు పాత పేరు ఎలా మారలేదో, అలానే ఆ శాఖలో చాలా పాత విషయాలు మారలేదు. కేవలం తెలంగాణయే కాదు. మొత్తం భారతదేశమంతటా భూమి నిర్వహణ, భూమి హక్కులు, భూమి పత్రాలు, భూమి రికార్డులు, భూ పరిపాలన అనేది చాలా గందరగోళమైన సబ్జెక్టు అనే భావన ఉంది.

ఈ పరిస్థితిని మార్చడానికి చాలా మంది పాలకులు చాలా ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ కంటే ముందు భూమి రికార్డులు తీరు మార్చే ప్రయత్నం చేసింది ఎన్‌టీఆరేనా? ఆయన కంటే ముందెవరు?

కేసీఆర్

ఫొటో సోర్స్, @TelanganaCMO

రాజుల కాలం నుంచీ ఇదే గొడవ...

వందల ఏళ్ల కిందట భూమి మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ప్రజల్లో ఎక్కవ మంది భూమి మీదే ఆధారపడే వారు. దీంతో.. రాచరిక వ్యవస్థ నడిచే రోజుల్లో చాలా మంది రాజులు తమకు ఆదాయం తెచ్చేపెట్టే భూములను కొలవడం, పంట పండే విధానం, నీటి వసతి, భూమి తత్వం ఆధారంగా వర్గీకరించడం వంటివి చేశారు. వాటి ఆధారంగా పన్ను నిర్ణయించేవారు.

ఏ భూమికి ఎంత పన్ను నిర్ణయించాలి? ఏ భూమి ఎవరి పేరిట ఉండాలి? పన్ను ఎవరు వసూలు చేయాలి? భూమి వివాదాలు ఎవరు పరిష్కరించాలి? అనే అంశాలపై రాజుల కాలంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. పదిహేనో శతాబ్దం మధ్య కాలంలో దిల్లీ కేంద్రంగా కొంత కలం పరిపాలించిన షేర్ షా సూరికి ఎక్కువ పేరు వచ్చింది.

షేర్ షా సూరి కన్నా ముందు ఈ వ్యవస్థ లేదని కాదు. కానీ ''చరిత్ర పుస్తకాలు ఆయనకు ఎక్కువ క్రెడిట్ ఇచ్చేశాయి తప్ప, ఆయనకన్నా ముందూ తరువాతా, ఆయన కంటే పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు చేసిన వారు ఉన్నారు'' అని చెబుతారు ఏనుగు రవీందర్ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటి కలెక్టర్ హోదాలో పనిచేస్తోన్న రవీందర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు అనే పుస్తకం రాశారు.

పూర్వ కాలం నాటి రెవెన్యూ వ్యవహారాలు చెబితే చాలా ఉంటాయి. కానీ వాటిలో నిన్నమొన్నటి వరకూ కొనసాగిన వ్యవస్థల్లో కరణం ఒకటి.

కాకతీయుల కోట గడప

ఫొటో సోర్స్, Wikimedia Commons/Shishirdasika

''12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు (రుద్రమ దేవి తండ్రి) భూమి ఆదాయంపై దృష్టి పెట్టారు. ఇది సక్రమంగా నిర్వహించడం కోసం ఆయన 6,000 మంది బ్రాహ్మణులను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి గ్రామాలకు పంపి వారిని పన్ను, భూ హద్దులు నిర్ణయించే అధికారులుగా నియమించారు. వారే ప్రస్తుతం మనం చూస్తోన్న కరణాలు. కరణాలకు సంబంధించి సశాస్త్రీయంగా ఆధారాలతో దొరికిన విషయం ఇది'' అని రవీందర్ రెడ్డి వివరించారు.

రాజులు, రాజ్యాలు మారినా, పన్నులు పెరిగినా, తగ్గినా, పన్నులు వసూలు చేసేవారు మారినా, కరణాల వ్యవస్థ మాత్రం 30 ఏళ్ల కిందటి వరకూ మారలేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భూమి కొలతల విషయంలో కరణాలపై ఆధారపడడం కొనసాగుతోంది.

12 శతాబ్దం నుంచి నేరుగా 17వ శతాబ్దానికి వస్తే, అప్పటికి తెలంగాణ ప్రాంతం నిజాంల పాలనలో, బ్రిటిష్ వారి పరోక్ష పెత్తనంలో, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలో ఉండేది. ఆంధ్రలో భూమి వ్యవహారం పూర్తిగా బ్రిటిష్ వారు తమ పద్ధతుల్లో ప్రారంభించారు. కానీ తెలంగాణలో మాత్రం స్పష్టమైన వ్యవస్థ రాలేదు.

ఈ క్రమంలో బ్రిటిష్ వారు భూ పాలనా సంస్కరణలు తేవాలంటూ నిజాం రాజులపై ఒత్తిడి తెచ్చారు. అలా ఒత్తిడి తేవడానికి ఒక కారణం ఉంది. నిజాం రాజులు బ్రిటిష్ వారికి కప్పం కట్టాలి. ఆ బాకాయిల వల్ల వారికి కొంత అవగాహన, పెత్తనం వచ్చాయి. దీంతో భూ పాలనా సంస్కరణలు తేవాలనీ, భూమి సర్వే చేపట్టాలని ఒత్తిడి తెచ్చారు.

అదే సమయంలో నిజాం ప్రధాని మొదటి సాలార్జంగ్‌కి బ్రిటిష్ వారితో సన్నిహిత సంబంధాలున్నాయి. సాలార్జంగ్ - 1 అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్. ఆయన నిజాం దగ్గర చేరడంలో కూడా బ్రిటిష్ వారి పాత్ర ఉందంటారు.

అప్పటి నిజాం పాలనలో పాతకాలపు పద్ధతులు వీడి, ఆధునిక తరహా ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశ పెట్టిన ఘనత ఈ సాలార్జంగ్ కి దక్కుతుంది. 1853 నుంచి 1883 వరకూ ఈయన నిజాంల దగ్గర ఉన్నాడు. అంతకు ముందు మొఘలులు దగ్గర, బీజాపూర్ సుల్తానుల దగ్గర పనిచేశాడు.

హైదరాబాద్ రాజ్యంలో పోస్టల్, టెలిగ్రాఫ్, ఆధునిక విద్యా సౌకర్యాలు, రైల్వే, రెవెన్యూ సంస్కరణలు, నాణేల ముద్రణ, ఆధునిక కోర్టులతో కూడిన న్యాయ వ్యవస్థ, రాజ్యాన్ని జిల్లాలు, తాలూకాలుగా విభజించడం వంటివన్నీ ఈయనే ప్రారంభించారు.

సాలార్జంగ్ వన్

ఫొటో సోర్స్, salarjung museum

ఫొటో క్యాప్షన్, మొదటి సాలార్జంగ్

ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ మూడేళ్ల వయసప్పుడే సింహాసనం ఎక్కతే, ఆయన్ను సింహాసనంపై ఉంచి పాలన మొత్తం ఈ సాలార్జంగే సాగించారు. తన కుమార్తెను ఆరో నిజాంకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన ముగ్గురు నిజాంల దగ్గర మంత్రిగా ఉన్నారు. నిజాంల తరపున నేరుగా బ్రిటిష్ వారితో లండన్ వెళ్లి చర్చలు జరిపేవారు. ఆక్సఫర్డ్ నుంచి గౌరవ డిగ్రీ అందుకున్నారు.

మొన్నటి వరకూ తెలంగాణలో ఉన్న జిల్లాలు కూడా ఆయన ఏర్పాటు చేసినవే. పన్నుల వసూలు కోసం తెలంగాణను జిల్లాల వారీగా విభజించి దాన్ని జిల్లా బందీగా పిలిచేవారు.

అంతకుముందు పన్ను వసూలు చేసే వారికి ఆ పన్నులో వాటా ఉండేది. అంటే రైతుల దగ్గర పన్ను వసూలు చేసి, అందులో కొంత వాటా తాము ఉంచుకుని, మిగతాది నిజాం ప్రభువుకు పంపేవారు. దాన్ని రద్దు చేసి, వారి స్థానంలో జీతాలు ఇచ్చే ఉద్యోగులను ఏర్పాటు చేసారు సాలార్జంగ్. అప్పట్లో ఇలా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరుకు నెలకు వంద రూపాయల వరకూ జీతం ఉండేది.

జిల్లా పెద్ద యూనిట్ కావడంతో వాటిని తాలూకాలుగా విభజించి వాటికి తహశీల్దార్లను వేశారు. వీరికి పాలనలో సహకరించడం కోసం గ్రామానికి ముగ్గురు ప్రతినిధులను నియమించారు.

వారు: 1. పోలీస్ పటేల్, 2. మాలి పటేల్ (ఆంధ్రలో మునసబు తరహా), 3. పట్వారీ (ఆంధ్రలో కరణం తరహా)

ఇందులో పోలీస్ పటేల్ శాంతి భద్రతల వ్యవహారం చూస్తారు. మాలి పటేల్ పన్ను వసూలు, ఇతర పాలన చూస్తారు. పట్వారీ రికార్డులను నిర్వహిస్తారు. పన్ను నిర్ణయిస్తారు.

ఎడ్లు, నాగలితో చేను దున్నుతున్న రైతు

సాలార్జంగ్ హయాంలోనే తెలంగాణలో మొదటిసారి సమగ్ర భూసర్వే జరిగింది. అప్పుడే పంట పండే భూములు, పంట పండని భూములను వేరుగా వర్గీకరించారు.

''ఈ సర్వే కోసం హైదరాబాద్‌లో సంపన్న కుటుంబాల పిల్లలను ఎంపిక చేసి, వారిని రిక్వెస్ట్ చేసి, ముంబై పంపించి సర్వే చేయడంలో శిక్షణ ఇప్పించారు సాలార్జంగ్. ఆ తరువాత వారు ఇక్కడకు వచ్చి మిగతా వారికి సర్వేలో శిక్షణ ఇచ్చారు. ఈ సర్వే సుమారు 20 ఏళ్ల పాటు సాగింది. వాటి ఆధారంగా బట్టతో మ్యాపులు (క్లోత్ మ్యాప్) తయారు చేశారు'' అని వివరించారు రవీందర్ రెడ్డి.

1880ల నాటికి ఇదంతా ఒక కొలిక్కి వచ్చింది. 1948 సెప్టెంబరులో నిజాం రాజ్యం (ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని భాగాలు) అధికారికంగా భారతదేశంలో కలిసింది. అప్పటి నుంచి నాలుగేళ్లు - అంటే 1952 ఎన్నికల వరకూ హైదరాబాద్ రాష్ట్రంలో (తెలంగాణ) భారత మిలటరీ పాలన సాగింది.

అప్పుడు హైదరాబాద్ పాలనాధికారిగా ఉన్న భారత ఆర్మీ ఆఫీసర్ జనరల్ వెల్లోడీ కాలంలో జాగీర్దారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. 1977లో జలగం వెంగళరావు ప్రభుత్వంలో పోలీస్ పటేల్ వ్యవస్థను రద్దు చేశారు.

అంతకు మించి గ్రామ పాలన, రెవెన్యూ వ్యవస్థలో పెద్ద మార్పులు రాలేదు. అది అలానే 1985 వరకూ కొనసాగింది. పైగా ఈ పదవులు వతన్ దార్ (అనువంశికం)గా వచ్చేవి.

కాలక్రమంలో తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, ఛీఫ్ కమిషనర్ ల్యాండ్ ఎడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) వంటి అనేక కార్యాలయాలు, అధికారులు ఏర్పడ్డారు. రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ భూమి వ్యవహారాలు చూసేవారు, ఆయన కింద జిల్లా కలెక్టర్లు ఉంటారు. ఒకప్పుడు ఈ జిల్లా కలెక్టరుకు సీసీఎల్‌ఏకు మధ్య రీజినల్ కమిషనర్ వ్యవస్థ ఉండేది. ఇది ప్రస్తుతం కర్ణాటకలో ఉంది.

ఎన్‌టీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL

1985లో ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాలి పటేల్, పట్వారీలను (మునసబు, కరణాలను) రద్దు చేశారు.

నిజానికి ఆంధ్రలో మునసబుల కంటే తెలంగాణలో పటేల్‌లు కాస్త ఎక్కువ పలుకుబడితో ఉండేవారు. వారు గ్రామాల్లో అనధికారిక పెత్తందార్లుగా ఉండేవారు. వారు బలంగా ఉన్న చోట నాయకులుగా ఉన్నారు. కొన్ని చోట్ల లేరు.

కానీ కరణం వ్యవస్థ అలా కాదు. కరణాలతో గ్రామంలోని అందరికీ నిత్యం పని ఉంటుంది. వారి దగ్గర సమగ్రమైన భూమి వివరాలు, చరిత్ర ఉన్నాయి. దీంతో కరణాలను రద్దు చేయడం పెద్ద సంచలనం అయింది. దానికి తోడు కరణాలను రద్దు చేశారు తప్ప, వారికి ప్రత్యామ్నాయంగా ఎవర్నీ నియమించలేదు.

దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో రెవెన్యూ రికార్డు పనులు ఆగిపోయాయి. పరిస్థితి గందరగోళంగా మారింది. అప్పటి జిల్లా కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సూపర్ న్యూమరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎన్‌టీఆర్. వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించారు.

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, TDP

ఇక తాలూకాలను ఇంకా చిన్నగా విభజించి మండలాలు అనే పేరు పెట్టి, వాటికి మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్‌ఓ)లను పెట్టారు.

దీంతో అప్పటి వరకూ అనువంశిక పటేల్ పట్వారీలుగా ఉన్నవారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. వారిలో అర్హత ఉన్నవారికి ఆ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కొందరికి ఆ ఉద్యోగాలు వచ్చాయి. పదో తరగతి కూడా చదవని కొందరు వీఏ (విలేజ్ అసిస్టెంట్) పేరుతో వచ్చారు. పది కంటే ఎక్కువ చదివిన వారు వీఏఓ (విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)గా వచ్చారు. అప్పటి నుంచీ గ్రామా రెవెన్యూ వ్యవస్థ వీరి చేతుల్లోకి వచ్చింది.

ఆ తర్వాత చంద్రబాబు హయాంలో క్షేత్ర స్థాయిలో పంచాయితీ వ్యవస్థనూ, రెవెన్యూ వ్యవస్థనూ కలిపేశారు. అంటే విఏవోలను పంచాయితీ కార్యదర్శులుగా నియమించారు. వీరే పంచాయితీ విధులు, రెవెన్యూ విధులు నిర్వహించాల్సి వచ్చేది. వీరిని ఎమ్మార్‌ఓల నుంచి ఎంపీడీఓ (మండల పరిషత్ డవలప్‌మెంట్ ఆఫీసర్) కింద పెట్టారు.

వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

అంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూనూ, గ్రామ పంచాయితీని విభజించి వీఆర్ఓలను నియమించారు. దీంతో గ్రామంలో మూడు పోస్టులు వచ్చాయి.

1. వీఆర్ఓ - విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ - భూమి, పన్నులు వ్యవహారాలు చూస్తారు

2. పంచాయితీ కార్యదర్శి - పంచాయితీ పాలన, గ్రామంలో సౌకర్యాలు చూస్తారు

3. వీఆర్ఏ - విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ - గ్రామ నౌకరు లేదా మస్కూరి, వీరు గ్రామ పాలనలో సహకారిగా ఉంటారు.

ఇప్పుడు కేసీఆర్ వీరిలో వీఆర్‌ఏలను రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)