రాయలసీమకు ఆ పేరు ఎప్పుడు, ఎలా వచ్చింది?

కర్నూలులో కొండా రెడ్డి బురుజు

ఫొటో సోర్స్, C.Chandra Kanth Rao

ఫొటో క్యాప్షన్, కర్నూలులో కొండా రెడ్డి బురుజు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'రాయలసీమ'.. తెలుగు నేలపై ఈ పేరుకు ప్రత్యేకత ఉంది. సరిగ్గా 93 ఏళ్ల కిందట 1928 నవంబర్ 18న ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. ఈ నామకరణం ఎలా జరిగింది? కృష్ణదేవరాయల నాటి కాలం నుంచీ ఈ పేరు వాడుకలో ఉందా?

తొమ్మిది దశాబ్దాల క్రితం వరకూ ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు లేదు. అంతకుముందు.. ప్రస్తుత అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు.

విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయం

ఫొటో సోర్స్, Srinivas

ఫొటో క్యాప్షన్, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయం

సీడెడ్ జిల్లాలు

ఇంగ్లీషులో ఒక ప్రాంతాన్ని, ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడాన్ని సీడెడ్ (ceded) అంటారు. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక 1792 వరకూ ఈ ప్రాంతం రకరకాల రాజులు, వంశాలు, సామంతుల పాలనలో ఉండేది.

1792లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం నిజాం రాజుకు వచ్చింది. అక్కడి నుంచి 1800 వరకూ రాయలసీమ నిజాం రాజుల పాలనలో ఉండేది.

ఆ తరువాత మరాఠాలు, టిప్పు సుల్తాన్ నుంచి దాడులు ఎదుర్కొన్న అప్పటి రెండో నిజాం రాజు, బ్రిటిష్ సైన్యం సహాయం కోరాడు. ఇదే సైన్య సహకార పద్ధతి. బ్రిటీష్‌వారి సాయానికి ప్రతిగా ప్రస్తుత రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి (ఈస్ట్ ఇండియా కంపెనీకి) దత్తత ఇచ్చారు.

దీన్ని బ్రిటిష్ వారు అప్పటి మద్రాసు రాష్ట్రంలో కలిపి సీడెడ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది 1800వ సంవత్సరంలో జరిగింది. సీడెడ్‌ జిల్లాలను తెలుగులో 'దత్త మండలాలు'గా వ్యవహరించేవారు.

టిపు సుల్తాన్

ఫొటో సోర్స్, Thinkstock

రాయలసీమ నామకరణం

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీడెడ్ జిల్లాల సమావేశాలు 1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి.

సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందన్న ఉద్దేశంతో దీన్ని మార్చాలన్న ప్రతిపాదనలు ఆ సమావేశాల్లో వచ్చాయి.

అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణ రావు సీడెడ్ బదులు రాయలసీమ అన్న పేరు వాడాలని ప్రతిపాదన చేశారు. బళ్లారి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలను రాయలసీమగా పిలవాలని ఆ సభల్లో తీర్మానించారు.

రాయలసీమ

ఫొటో సోర్స్, ఆదిత్యమాదవ్3

"వాస్తవానికి రాయలసీమకు ఈ పేరు పెట్టింది స్వతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు అనుకునే వారు. కానీ 1928, నవంబరు 17, 18 తేదీల్లో ఆంధ్ర మహాసభల్లో భాగంగా దత్తమండలం సమావేశాలు కూడా జరిగాయి. కడప కోటిరెడ్డి దానికి అధ్యక్షులు. చిలుకూరు నారాయణ రావు కూడా అందులో ఉన్నారు. ఈ ప్రాంతానికి దత్త మండలం కాకుండా ఇంకేదైనా పేరు పెట్టాలన్న చర్చ వచ్చినప్పుడు యథాలాపంగా రాయలసీమ అనే పేరు ప్రతిపాదించారు నారాయణ రావు. పప్పూరి రామాచార్యాలు ఆ తీర్మానాన్ని ఆమోదింపచేశారు. 1946 జనవరి 3వ తేదీన రాయలసీమ భాషా సంపద పేరుతో తాను చేసిన రేడియో ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించిన నారాయణ రావు, రాయలసీమకు ఆ పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. టేకుమల్ల కామేశ్వర రావు రాసిన వాజ్ఞ్మయ మిత్రుడు అనే గ్రంథంలో రాయలసీమ పేరుపెట్టడం గురించిన చరిత్ర సవివరంగా ఉంది" అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్ర, పురావస్తు శాస్త్ర ఆచార్యులు నాగోలు కృష్ణారెడ్డి బీబీసీతో అన్నారు.

హంపిలోని రాతి రథం

ఫొటో సోర్స్, Getty Images

1617 శతాబ్దాల్లోనే వాడుకలో ‘రాయలసీమ’

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 16 -17 శాతాబ్దాల్లో రాయలసీమ అనే పదం మొదట వినిపించింది.

"మట్లి సంస్థానం కాలంలో రాసిన అభిషిక్త రాఘవం అనే గ్రంథంలో రాయలసీమ అనే పదం ఉంది. తెలుగు సాహిత్యంలో రాయలసీమ పదం కనిపించింది అదే మొదలు. మట్లి సంస్థానం రాజధాని ప్రస్తుత కడప జిల్లా సిద్ధవటం దగ్గర్లో ఉండేది" అని కృష్ణా రెడ్డి వివరించారు.

లేపాక్షి

ఫొటో సోర్స్, Facebook/Namaste Rayalaseema

కవితలో సీమ పౌరుషం

రాయలసీమను దత్త మండలంగా పిలవడంపై తన అభ్యంతరాన్ని చెబుతూ, రాయలసీమ గొప్పదనాన్ని చెబుతూ 128 పంక్తుల్లో 'దత్త' పేరుతో దీర్ఘ కవిత రాసారు చిలుకూరి నారాయణ రావు. మంజరి ద్విపద చందస్సులో ఈ కవిత రాసిన చిలుకూరి నారాయణ రావు తెలుగు సాహిత్యం, చరిత్రపై కృషి చేశారు.

దత్తన మందును నన్ను దత్తమెట్లగుదు

రిత్తన మాటలు చేత చిత్తము కలదె

ఇచ్చినదెవరో పుచ్చినదెవరురా పుచ్చుకున్నట్టి ఆ పురుషులు ఎవరో

తురక బిడ్డండిచ్చె దొరబిడ్డ పట్టె

అత్తసొమ్మునుగొని అల్లుండుదానమమర చేసినట్టు

(సారాంశం: ఇవ్వడానికి నిజాం ఎవడు, తీసుకోవడానికి తెల్ల దొర ఎవడు? అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, ఈ ప్రాంతాన్ని ఎలా దానమిస్తారంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు కవి)

గండికోట, వారసత్వ కట్టడాలు, ఏపీటీడీసీ

ఫొటో సోర్స్, Gandikota/Facebook

ఫొటో క్యాప్షన్, గండికోట పరిసరాల్లో కనువిందు చేసే దృశ్యాలు

సీమ సరిహద్దులేవి?

1953 వరకూ మద్రాసు రాష్ట్రంలో, 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది.

కానీ 1953కి ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా కుదించుకుపోయింది.

1953 వరకూ రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నాటకలో కలిశాయి. 1970లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.

ఆ క్రమంలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు తాలూకాలను తెచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారు. ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో కోస్తా-సీమ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది.

సీమ పెద్దలు, ప్రజలు అసహ్యించుకున్న 'సీడెడ్' పదాన్నీ, ఫ్యాక్షనిజాన్నీ తెలుగు సినిమా ఇంకా వదల్లేదు!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)