కేటీఆర్: ‘పార్టీ పదవే కాదు, త్వరలోనే ముఖ్యమంత్రి పదవి కూడా’

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTR

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

టీఆర్ఎస్ గెలిచాక ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్‌ను సీఎం చేస్తారా అని ప్రశ్నించినప్పుడు లేదంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం తరువాత ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

'స్పష్టమైన సంకేతం'

కేటీఆర్‌కు పార్టీలో కీలక పదవి అప్పగించడం భవిష్యత్తులో ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికేనని సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ అన్నారు.

'పార్టీలో నెంబర్ 2గా వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టడం ద్వారా కేసీఆర్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు అనుకోవచ్చు. జాతీయ రాజకీయాలకు వెళ్లే ఉద్దేశంతోనే కేసీఆర్ త్వరలోనే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి సీటులో కూర్చొబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు' అని ఆయన బీబీసీకి చెప్పారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/ktr

క్రమంగా అధికారాల బదిలీ

కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా క్రియాశీలంగా మారుతూ వచ్చారు. కేసీఆర్ కూడా తన కుమారుడికి ఒకేసారి పదవులు ఇవ్వడం కాకుండా ఒక్కో బాద్యతా పెంచుతూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఐటి శాఖతో మొదలుపెట్టి దాదాపు 13 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు కేటీఆర్. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు పార్టీ వర్గాలకు తాను అందుబాటులో ఉంటూ వచ్చారు. పార్టీలో రెండో స్థానం ఇవ్వడం ద్వారా తన తరువాత అన్ని నిర్ణయాధికారాలూ కేటీఆర్ వే అని ప్రకటించేశారు కేసీఆర్.

కేటీఆర్ ఉద్యమ కాలంలో రాజకీయ ప్రవేశం చేశారు. అప్పుడు నంబర్ టూ స్థానంలో హరీశ్ రావు ఉన్నారు. ఉద్యమ కాలంలో తనను తాను మలచుకుంటూ, నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుకున్నారు కేటీఆర్.

నోట్: ఏడాది కిందట కేటీఆర్ దిల్లీలోని బీబీసీ తెలుగు కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆయనతో చేసిన ఫేస్‌బుక్ లైవ్ ( ఫైల్ వీడియో)

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)