ఎంవీ రమణారెడ్డి మృతి: విప్లవం నుంచి వైసీపీ దాకా ప్రయాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, UGC
వైద్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, విప్లవ కమ్యూనిస్టు రచయితగా, రాజకీయ నాయకుడిగా మారిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్. ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) 2021 సెప్టెంబరు 29న కన్నుమూశారు.
అక్కడికి మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డిని కర్నూల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన దేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకు వెళ్లనున్నారు.
విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగం పైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు.
తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టుంది. వ్యాకరణంపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణారెడ్డి మరణించేనాటికి వైసీపీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, UGC
సమాజానికి ప్రయోజనం ఉండాలి...
‘‘మనిషి కాకిగా బతకడం కంటే.. మనిషి ఓ మనిషిగా బతకాలి. అంటే అతని వల్ల సమాజానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. నేను రచయితను.. కానీ నేను సమాజానికి చేయగలిగిన ప్రయోజనం ఏమిటంటే, నా రచనల ద్వారా సమాజానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం’’అని బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో రమణారెడ్డి వివరించారు.
భిన్న రంగాల్లో నైపుణ్యం సాధించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘నా జీవితం చాలా మలుపులు తిరిగింది. అవేమీ నేను ముందుగా అనుకొని చేసింది కాదు. డాక్టర్‌ను కావాలని మాత్రమే నేను అనుకున్నాను. వైద్యం నుంచి ట్రేడ్ యూనియన్‌కు మొదటవచ్చాను. నిజానికి నాకు ట్రేడ్ యూనియన్ గురించి తెలియనే తెలియదు.’’
‘‘నేను పేదల డాక్టర్‌గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా దగ్గరకు కొంతమంది వర్కర్లు వచ్చేవారు. ఆ వర్కర్లు తమ చిన్న పిల్లలను తీసుకొని వచ్చేవారు. కానీ మందులు కొనడానికి వారి దగ్గర స్థోమత ఉండేదికాదు. దీనికి పరిష్కారంగా నేను ట్రేడ్ యూనియన్‌లోకి అడుగుపెట్టాను.’’
‘‘నేను మొదట ప్రొద్దుటూరులో మాత్రమే సేవలు అందించేవాణ్ని. అయితే, నాకు సాయం చేయాలని రాయలసీమలోని భిన్న ప్రాంతాలకు చెందినవారు వచ్చేవారు. చాలామంది వర్కర్లు వచ్చేవారు. అలా చాలా ప్రాంతాల్లో యూనియన్లు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఆ పని చాలా ఎక్కువ కావడంతో, నా మెడికల్ ప్రాక్టీస్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత రాయలసీమలోని పెద్దల అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక యువ సమాఖ్యను స్థాపించాల్సి వచ్చింది’’అని ఆయన వివరించారు.

ఫ్యాక్షన్‌లోకి అలా
రమణారెడ్డిపై ఫ్యాక్షనిస్టు అనే ముద్ర కూడా ఉంది. ఆ ముద్ర ఎలా పడిందో బీబీసీకి ఆయన వివరించారు.
‘‘నాకు చాలా సన్నిహితుడు, యూనియన్ వర్క్‌లో సాయం అందించే రామ్‌సుందర్ రెడ్డి తరచూ క్లబ్బులకు వెళ్లేవాడు. అక్కడ మాజీ ఎమ్మెల్యే చంద్ర ఓబుల్ రెడ్డి కొడుకుతో ఆయనకు వాగ్వాదం జరిగింది. ఆ గొడవను సద్దిచెప్పేందుకు మేం చాలా ప్రయత్నించాం.
అయితే, అనుకోకుండా ఓబుల్ రెడ్డి ఇంటి ముందు ఓ హత్య జరిగింది. ఓ ట్రేడ్ యూనియన్ కార్మికుణ్ని హత్య చేశారు. ఆయన కొడుకు స్నేహితుల్లో ఎవరో ఈ హత్య చేశారని మేం అనుకున్నాం. కానీ వేరే వ్యక్తి ఆ హత్య చేశారని తర్వాత తెలిసింది.
ఆ హత్యతో ఓబుల్ రెడ్డికి సంబంధంలేదని తెలిసేసరికే కథ చాలా దూరం వెళ్లిపోయింది. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షనిస్టుగా మారాల్సి వచ్చింది. అలాచేయకపోతే నన్ను నమ్ముకున్నవారికి మనుగడ ఉండేది కాదు’’అని ఆయన వివరించారు.
అనుకున్నట్లు జరగనే లేదు..
జీవితంలో తను అనుకున్నట్లు ఏనాడూ జరగలేదని రమణారెడ్డి తెలిపారు. అయితే సాహిత్యం విషయంలో తన జీవితం కొంత సంతృప్తికరంగానే సాగిందని వివరించారు.
‘‘2001లో నేను తొలి పుస్తకాన్ని ప్రచురించాను. నేను జైలులో ఉన్నప్పుడే పాపియాన్ అనే నవలను సగం అనువదించాను. జైలు నుంచి విడుదలైన తర్వాత, స్నేహితుల ప్రోత్సాహంతో అది ప్రచురించాం. దానికి మంచి ఆదరణ దక్కడంతో మిగతా భాగాన్ని కూడా నేను పూర్తి చేయాల్సి వచ్చింది’’అని ఆయన వివరించారు.
ఆయన సొంతంగా ప్రభంజనం అనే పత్రికను కూడా స్థాపించారు. ‘‘రాజకీయం మారాలంటే సాయుధ పోరాటం తప్ప, వేరే మార్గంలేదని ట్రేడ్ యూనియన్ల నుంచి నేర్చుకున్నాను. అదే స్ఫూర్తితో ఈ పత్రిక పెట్టాను’’అంటూ విప్లవ కమ్యూనిస్టు ప్రస్థానం గురించి ఆయన వివరించారు.
ఆ విప్లవ భావాలు నేటికీ ఉన్నాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''లేదు లేదు... ఇంత పెద్ద దేశానికి సాయుధ పోరాటంతో విముక్తి కల్పించడం అసాధ్యమైన పని. ఈ విషయం చాలా కాలం కిందటే నేను గుర్తించాను. అప్పుడే దీన్ని వదిలిపెట్టి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాను''అని ఆయన అన్నారు.

అప్పట్లో టీడీపీ ఒక వైట్ పేపర్..
''అప్పట్లో టీడీపీనాకు ఒక వైట్ పేపర్‌గా అనిపించేది. దానికొక సిద్ధాంతం లేదు. ఏ సిద్ధాంతమైనా దానిలో రాసుకోవచ్చు. అందుకే దానిలో చేరాను.
పార్టీలో నా నిర్ణయాన్ని వారు కాదు అనలేదు. అయితే, నాకు పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. నాతోపాటే నా క్యాడర్ మొత్తం పార్టీ మారింది.
నా రాజకీయ జీవితంపై ఫ్యాక్షనిస్టు అనే ముద్ర ప్రభావం చాలా తక్కువే. ఎందుకంటే నాకు తెలిసినవారు, నా పార్టీ శ్రేణల్లోనివారు ఎప్పుడూ నన్ను ఫ్యాక్షనిస్టుగా చూసేవారు కాదు.
విమోచన సమితి అలా...
రాయలసీమ నీటి పారుదల అవసరాల కోసం ఆయన రాయలసీమ విమోచన సమితిని స్థాపించారు. అయితే ఆ తర్వాత కాలంలో అది మరుగునపడింది.
''నాకు వచ్చిన పాపులారిటీని చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోయింది. వారు కౌంటర్ యూనియన్ ఒకటి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ యూనియన్‌లోని నాయకులతోనూ కలిసి నేను పనిచేశాను.
ఈ మధ్యలోనే ఓ కేసులో నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు గ్యాప్ వచ్చింది. అదే సమయంలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలా ఆ విమోచన సమితి కూడా మరుగునపడింది''అని ఆయన చెప్పారు.
నేటి రాయలసీమ ప్రత్యేక ఉద్యమాలపై రమణారెడ్డి స్పందించారు. ''నేటి ఉద్యమాలు చెల్లుతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, ఏదో రాజకీయమైన ప్రయోజనాలు ఆశించి ఆ ఉద్యమాలను తెరపైకి తీసుకొస్తున్నారు. వాటిని ప్రజలు నమ్మడం లేదు''అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లు
- ఏపీ అసెంబ్లీలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలకు నోరెత్తే అవకాశం లేనట్లేనా?
- పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- భారతదేశపు రాజులు నిజంగానే ‘ఆడంగి లక్షణాలు’ ఉన్న, మగతనం లేని అసమర్ధులా?
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








