ఏపీ అసెంబ్లీలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలకు నోరెత్తే అవకాశం లేనట్లేనా, ప్రివిలేజ్ కమిటీ చేసిన సిఫార్సుతో ఏమవుతుంది?

ఫొటో సోర్స్, AP GOVERNMENT
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందగా ప్రివిలేజ్ కమిటీ సమావేశాల తర్వాత ఇద్దరు సభ్యుల పై చర్యలకు ప్రతిపాదించింది.
ప్రస్తుతం మనుగడలో ఉన్న 15వ శాసనసభ కాలపరిమితి గడువు ముగిసేవరకూ టీడీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇద్దరికీ సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని నిర్ణయించింది.
దానికి అనుగుణంగా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడంతో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు రాబోయే రెండున్నరేళ్ల పాటు మైక్ దక్కదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది ఏమేరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వివాదం ఏంటి?
గత వర్షాకాల సమావేశాల్లో వివిధ చర్చల సందర్భంగా టీడీపీ నేతలు చేసిన ఉపన్యాసాలు ఈ వివాదానికి మూలం. అప్పట్లో మద్యం షాపుల విషయంలో మాట్లాడిన టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలు సరికాదన్నది అధికార పార్టీ వాదన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు లెక్కలతో సభను పక్కదారి పట్టించారన్నది వైసీపీ అభియోగం. దానిపై ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న జి శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
పాలకొల్లు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు వృధ్యాప్య పెన్షన్ల విషయంలో చేసిన ప్రస్తావనపై ప్రభుత్వపక్షం నుంచి వ్యతిరేకత వచ్చింది. 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వృధ్దాప్య పెన్షన్లు ఇస్తామని వైసీపీ చెప్పినట్టు రామానాయుడు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. దానిపై సభలో నేరుగా జోక్యం చేసుకున్న సభా నాయకుడు వైఎస్ జగన్ సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించారు. దానిని స్పీకర్ అంగీకరించడంతో సభ ఆమోదం దక్కింది. సభను పక్కదారి పట్టిస్తూ నిమ్మల రామానయుడు ప్రకటన చేశారని, చర్యలు తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయంతో విషయం ప్రివిలేజ్ కమిటీకి చేరంది.

పలు సమావేశాలు, వివరణలు, చివరకు చర్యలు
వైసీపీకి చెందిన కాకాని గోవర్థన్ రెడ్డి సారథ్యంలో సభా హక్కుల కమిటీ ఉంది. కమిటీలో మరో ఆరుగురు సభ్యులుండగా కేవలం అనగాని సత్యప్రసాద్ మినహా మిగిలిన సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారే. సభలో వారి బలాబలాలను అనుసరించి కమిటీలో అవకాశం వస్తుంది కాబట్టి టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే కమిటీలో ఉన్నారు.
గత డిసెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ప్రివిలేజ్ కమిటీ ముందు వచ్చిన విషయంలపై పలు దఫాలు చర్చించారు. వాటిలో అచ్చెన్నాయుడుపై రెండు ఫిర్యాదులు, నిమ్మల రామానాయుడు మీద సభలో చేసిన తీర్మానం మేరకు కమిటీ ముందుకు వచ్చాయి. వారిద్దరితో పాటుగా రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మీద కూడా సభా హక్కులకు భిన్నంగా వ్యవహరించారనే ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా కమిటీ పరిశీలించింది.
వాటికి గానూ తొలుత అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ఫిర్యాదులో చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించారు. స్పీకర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ కమిటీ ముందు హాజరయ్యి స్వయంగా అచ్చెన్నాయుడు వివరణ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నారు.
మద్యం షాపుల విషయంలో అచ్చెన్నాయుడు, వృధ్యాప్య పెన్షన్ల విషయంలో రామానాయుడు సభను పక్కదారి పట్టించడం, సరైన వివరణ ఇవ్వకుండా, తమ ప్రకటనలను సమర్థించుకున్నారని భావించిన ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ప్రతిపాదించింది. వారి వివరణ కోసం పలు మార్లు నోటీసులు ఇచ్చినా తగిన స్పందన రావడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఈనెల 21వ తేదీన జరగిన సమావేశంలో టీడీపీ నేతల తీరు సరిగా లేదని, వారికి మైక్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు ప్రతిపాదించారు. దానిని మల్లాది విష్ణు బలపరచడంతో తీర్మానం ఆమోదించి స్పీకర్‌కి నివేదించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని కమిటీలో టీడీపీ తరుపున సభ్యుడిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ నిరసించారు. ఇలాంటి చర్యలు సరికాదని తెలిపారు. అయినప్పటికీ కమిటీ తీర్మానం ప్రకారం చర్యలకు ఉపక్రమించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

ఫొటో సోర్స్, facebook/DrNimmala
వచ్చే సమావేశాల్లోనే నిర్ణయం
అచ్చెన్నాయుడు, రామానాయుడు సభను పక్కదారి పట్టించారని నిర్ధారణ అయ్యింది. కమిటీలో సభ్యులందరి నిర్ణయం మేరకు వారిపై చరర్యల కోసం అసెంబ్లీకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మేమిచ్చి నివేదికను స్పీకర్‌కు అందిస్తాం. సభలో సభ్యులందరికీ తెలియజేసిన తర్వాత చర్యలు తీసుకుంటాం అని కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి ప్రకటించారు
దాంతో ఇక అచ్చెన్నాయుడు, రామానాయుడుకి మైక్ కట్ చేయడం ఖరారయ్యింది. అయితే ప్రివిలైజ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ సభ మనుగడలో ఉన్నంత కాలం పాటు మైక్ ఇవ్వకుండా నిలిపివేస్తారా లేదా అందులో ఏమయినా మినహాయింపు దక్కుతుందా అనేది ఏపీ అసెంబ్లీ స్పీకర్ చర్యల ఆధారంగా ఉంటుంది.
త్వరలోనే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఈ వ్యవహారం అధికార, విపక్షాల మధ్య వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.

వివాదాస్పదంగా మారుతున్న ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్ నెం 256 ప్రకారం ప్రివిలేజ్ కమిటీ ఏర్పడుతుంది. సభలో మంత్రి హోదాలో ఉన్న వారు కాకుండా మిగిలిన వారు ఈ కమిటీలో ఉండేందుకు అర్హులు. కమిటీ సభ్యుడిగా నియమితులయిన తర్వాత మంత్రి పదవి చేపట్టినా ప్రివిలేజ్ కమిటీ సభ్యత్వం కోల్పోతారు. మొత్తం 15మందికి తగ్గకుండా ఈ కమిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
రూల్ 257 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులుగా ఉన్న వారి నియమాలు, ప్రవర్తనా నియమావళి విషయంలో ఈ కమిటీ పరిశీలించే అవకాశం ఉంటుంది. సభ్యులకు సంబంధించి సభ లోపలా, వెలుపలా కూడా హక్కులకు భంగం కలిగితే ఈ కమిటీ చర్యలకు ప్రతిపాదించడానికి అవకాశం ఉంటుంది. సభలో ప్రస్తావించిన అంశాలను ప్రతీ ప్రశ్న కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. చర్చల సందర్భంగా జరిగే సంభాషణల్లో కూడా తగవని భావిస్తే చర్యలకు ప్రతిపాదించే అవకాశం ప్రివిలైజ్ కమిటీకి ఉంటుంది.
ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. గత అసెంబ్లీలో ఆనాటి విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజాని ఏడాది పాటు సభ నుంచి బహిష్కరించడం న్యాయ వివాదంగానూ మారింది. ఆమె సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. అయితే సభా నియమావళి విషయంలో తాము జోక్యం చేసుకోబోమని , కానీ ఆమె క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
ఇప్పుడు కూడా టీడీపీ సభ్యులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను కమిటీ పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ సహా పలువురి ప్రకటనలపై టీడీపీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ప్రివిలేజ్ కమిటీ నిబంధనల ప్రకారం ఆయా ఫిర్యాదులను స్పీకర్ ఆమోదించి కమిటీకి సిఫార్సు చేసినా లేక సభలో ప్రివిలేజ్ మోషన్ ఆమోదం పొందిన సమయంలో మాత్రమే కమిటీ చర్చించే అవకాశం ఉంటుంది.
టీడీపీతో పాటుగా వైసీపీకి చెందిన అనేక మంది ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులు కూడా తమ వరకూ రావని ప్రస్తుత కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరు చిన్నగా వేసినా అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని, కానీ ఆయా ఫిర్యాదులు స్పీకర్ ఆమోదించి తమకు ప్రతిపాదించాల్సి ఉంటుందని అన్నారు.
అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఆర్కే రోజా విషయంలో ఏడాది బహిష్కరణ అమలు చేయగా, ప్రస్తుతం వైసీపీ హయంలో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలపై దాదాపు రెండున్నరేళ్ల పాటు మైక్ కట్ చేసేందుకు ప్రతిపాదనలు రావడం కమిటీల తీరు మీద పలు విమర్శలకు ఆస్కారమిస్తోంది.

ఫొటో సోర్స్, facebook/DrNimmala
బాల్, బ్యాట్ ఇవ్వకుండా క్రికెట్ ఆడమంటారా
"సభను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలే ముందుంటారు. ఒకవేళ విపక్ష సభ్యులు నిజంగా తప్పుదారి పట్టిస్తే వారిని సరిదిద్దాలి. లేదా రికార్డుల నుంచి తొలగించాలి. కానీ ఏకంగా ప్రివిలేజ్ యాక్షన్ తీసుకోవడం ఏమిటీ. మైక్ ఇవ్వకూడదనడం ఎలా ఉందంటే క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ని బ్యాట్ లేకుండా బరిలో దిగమనడంలా ఉంది. బాల్ లేకుండా బౌలింగ్ వేయమని చెబుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఇది విపక్షాల గొంతు నొక్కడంతో సమానం. ప్రభుత్వం పునరాలోచన చేయాలి" అంటూ ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేసిన, రాజకీయ విశ్లేషకుడు కే నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
సభలో అధికార పార్టీకి నచ్చినట్టుగా మాట్లాడితేనే అంగీకరిస్తామనే రీతిలో ఇలాంటి చర్యలు ప్రతిపాదించడం సరికాదని ఆయన అన్నారు. ప్రివిలైజ్ కమిటీ నిర్ణయాలు సభ్యుల హక్కులను కాపాడేందుకు తోడ్పడాలే తప్ప ఇలాంటి రాజకీయ చర్యలతో సిద్ధపడడం తగదని సూచించారు.
పునరాలోచన చేయాలి
"శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత. ఇద్దరు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదు. సభ్యుల వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం హక్కును కూడా నిర్వీర్యం చేయడమే. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కి కూడా ఆందోళనలు చేయలేదా? శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించు కోవాలని కోరుతున్నాం. ప్రివిలేజ్ కమిటీకి వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలి" అని కమిటీ సభ్యుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరుతున్నారు.
ఆయన ఈ మేరకు తన ప్రతిపాదనలను అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రూపంలో తెలియజేశారు.
మేం తప్పు చేయలేదు...
"శాసనసభను తప్పుదారి పట్టించామనడం సరికాదు. ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం ఆశ్చర్యమేసింది. నగదు బదిలీ అంశంలో షార్ట్ నోట్ డిస్కషన్ లో నేను ప్రస్తావించిన అంశాల్లో నేను నాకు వచ్చిన అవకాశం మేరకే మాట్లాడాను. స్పీకర్ ఇచ్చిన సమయంలోనే నేను ఎటువంటి అభ్యంతరకరం కాకుండా, అన్ పార్లమెంటరీ పదాలకు ఆస్కారం లేకుండా మాట్లాడాను. 2019లో సభ సాక్షిగా సీఎం జగన్ పెన్షన్ల పెంపుదల మీద చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాను. ఏటా రూ. 250 చొప్పున పెంచి ఇస్తామని చెప్పిన దానిని ఇంకా అమలు చేయలేదన్నాను. ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు చేయూత పేరుతో అన్యాయం జరుగుతోందన్నాను. సబ్జెక్ట్ మీద నేను మాట్లాడిన దానికి చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ అంగీకరించరని భావిస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజల తరుపున నేను మాట్లాడుతున్నాను. ప్రజల హక్కులను హరించే యత్నం జరగదనే అనుకుంటున్నాను"అంటూ నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే తాము ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధమేనని ఆయన బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








