హెచ్‌సీయూ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసు: 'చనిపోయి 19 గంటలు దాటినా ఏ ఒక్కరూ ఎందుకు పట్టించుకోలేదు' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Ani
హెచ్‌సీయూలో మౌనిక ఆత్మహత్యపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాల్‌డేటా కీలకంగా మారింది. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటలకు మౌనిక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని తన హాస్టల్ గదిలో కిటికీ గ్రిల్స్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆత్మహత్య దిశగా ఉసికొల్పిన ఆ కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం మౌనిక ఈనెల 19 నుంచి హాస్టల్‌లోని తన గదిలో ఉంటోంది. ప్రతి గదిలో ఇద్దరు విద్యార్థులుంటారు. ఆమె రూమ్మెట్ ఇంకా వర్సిటీకి రాకపోవడంతో మౌనిక ఒంటరిగానే ఉంటోంది.
22న రాఖీ పౌర్ణమి రోజు ఓ స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లి, తిరిగి తన గదికొచ్చింది. రాత్రి తన స్నేహితురాలితో ఫోన్ మాట్లాడి, 11:30కు గుడ్‌నైట్ అని మెసేజ్ పెట్టింది.
మరుసటి రోజు మౌనిక గది తలుపులు తెరుచుకోలేదు. టిఫిన్, భోజనం చేసేందుకు, ల్యాబ్ క్లాసుల కోసం ఆమె బయటకు రాలేదు. స్నేహితులు ఎన్నోసార్లు ఫోన్ చేసినా తీయలేదు.
అనుమానం వచ్చిన ఇద్దరు స్నేహితులు, సాయంత్రం 6:30కు మౌనిక గది వద్దకు వెళ్లారు. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా పలుకే లేదు.
మరికొందరు వచ్చి గట్టిగా తలుపును నెట్టడంతో పైన ఉన్న గడియ ఊడిపోయింది. రాత్రి 7:30కు లోపలికి వెళ్లి చూసి అంతా షాక్ అయ్యారు. కిటికీ గ్రిల్స్‌కు తన స్కార్ఫ్‌తో మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

ఫొటో సోర్స్, SHUJAUDEEN SHUJA/FACEBOOK
పెళ్లి ప్రస్తావన తెస్తే తిరస్కరణ
గతంలో ఒకట్రెండుసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు తనకు చాలా భవిష్యత్తు ఉందని, ఇప్పుడే పెళ్లి వద్దని తమతో చెప్పిందని మౌనిక తండ్రి లచ్చయ్య చెప్పారు.
'చాలా పెద్ద కాలేజీ అన్నారు.. నీ బిడ్డ పెద్ద చదువు చదువుతోంది చాలా అదృష్టవంతురాలు అని అందరూ అంటుంటే మురిసిపోయాను. కానీ ఇంతపెద్ద కాలేజీలో నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. చనిపోయి 19 గంటలు దాటినా ఏ ఒక్కరూ పట్టించుకోలేని దుస్థితి ఉంటుందని అనుకోలేదు' అంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం లచ్చయ్య బోరున విలపించారు.
తన కూతురు ధైర్యం కలదని, ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు, బాధలు ఏమీ లేవని చెప్పారు.
సూసైడ్ నోట్‌లో ఏముంది?
మౌనిక గదిలో మూడు లైన్ల సూసైడ్ నోట్ లభించింది.
'ఐయామ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐయామ్ నాట్ గుడ్ డాటర్, ఐయామ్ సారీ అమ్మా నాన్న, లవ్‌యూ ఆల్, మిస్ యూ శాన్వి (అక్క కూతురు)' అని అందులో ఉంది.
తన ఫోన్లో మరొకరితో ఆమె సెల్ఫీ బయటకొచ్చినా ఆ వ్యక్తి మొహం కనిపించడం లేదు. అతను ఎవరనేది తేల్చేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మౌనిక సెల్‌ఫోన్, ల్యాప్ టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ఆమె చనిపోయిన 19 గంటల వరకూ ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలోనూ విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్: ప్రైవేటు జూనియర్ కాలేజీల వార్షిక ఫీజు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు జూనియర్ కాలేజీల వార్షిక ఫీజును ప్రభుత్వం ఖరారు చేసినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. 2021-2022 నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు ఈ ఫీజులు వర్తిస్తాయని చెప్పింది.
ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఏడాదికి గరిష్ఠంగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలైతే రూ.15వేలు, పురపాలక సంఘాల్లో ఉంటే రూ.17500, నగర పాలక సంస్థల్లో ఉండే వాటికి రూ.20వేలు వసూలు చేయాలి.
సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు ఏడాదికి గరిష్ఠంగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలైతే రూ.12వేలు, పురపాలక సంఘాల్లో ఉంటే రూ.15000, నగర పాలక సంస్థల్లో ఉండే వాటికి రూ.18 వేలు తీసుకోవాలి.
ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, ప్రవేశం, పరీక్ష, లేబోరేటరీ, క్రీడలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, అదనపు బోధనా కార్యక్రమాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం, స్టడీటూర్, ఇతర విద్యా సంబంధమైన ఫీజులన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి.
పదో తరగతికి రూ.18వేలు
ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి గ్రామాల్లో 10వేలు, పట్టణాల్లో 11వేలు, నగరాల్లో 12వేల ఫీజును నిర్ణయించింది.
ఇక ఆరు నుంచి పదో తరగతి వరకు గ్రామాల్లో 12వేలు, పట్టణాల్లో 15వేలు, నగరాల్లో 18 వేల ఫీజును ఖరారు చేసింది.

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRao
అమల్లోకి ఈడబ్ల్యూఎస్ కోటా
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
ఆ కథనం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించనివారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
మార్గదర్శకాలివే
ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
ఈ కోటా ద్వారా లబ్ధిపొందేందుకు తాసిల్దార్ జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు పొందినవారి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తారు. సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే ఉద్యోగం నుంచి తొలగించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఉద్యోగ నియమాల్లో ఒక సంవత్సరంలో అర్హులైన అభ్యర్థులు దొరక్క ఈడబ్యూఎస్ కోటా ఉద్యోగాలు భర్తీకాకపోతే ఆయా పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించి తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయరాదు.
ఈడబ్యూఎస్ కోటా అభ్యర్థి ఆన్‌రిజర్వ్‌డ్ కోటా ఉద్యోగాలకు అనర్హుడు.
ఈడబ్యూస్‌లోకి 10 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం కోటాను అమలుచేస్తారు.
ఈడబ్యూఎస్‌వారికి ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు వర్తిస్తుంది.
డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ పోస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలోనే పరీక్ష రుసుముల్లో మినహాయింపునిస్తారు.
ఈ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థలో సీట్ల సంఖ్యను పెంచుతారు.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY
హెల్త్ ప్రొఫైల్ కోసం ఒక్కొక్కరికి పది టెస్టులు
తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీ కోసం ప్రాథమికంగా ఒక్కొకరికి పది రకాల టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించిందని వెలుగు పత్రిక రాసింది.
ఆ కథనం ప్రకారం ఈ పరీక్షల్లో కొన్ని టెస్టులు ఊళ్లలో క్యాంపులు పెట్టి చేయనుండగా మరికొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో చేయనున్నారు.
ఏయే టెస్టులు చేయాలన్నదానిపై రూపొందించిన నివేదికను హెల్త్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రభుత్వానికి అందజేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌లో సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల సర్వేను వంద రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
టెస్టులు ఇవే
ఊళ్లలో జరిగే క్యాంపుల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు పాల్గొంటారు.
ఈ క్యాంపుల్లో ఎత్తు, బరువు, జబ్బ చుట్టుకొలత (న్యూట్రిషనల్ అసెస్‌మెంట్ కోసం), కాటరాక్ట్, ఓరల్ కావిటి, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ లెవల్స్ చెక్ చేస్తారు.
ఇదివరకే ఏమైనా జబ్బులు ఉంటే వాటిని కూడా రికార్డుల్లో నమోదు చేస్తారు. కొలెస్ట్రాల్ లెవెల్, హియరింగ్ టెస్ట్ వంటివి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో చేస్తారు.
ఆయా వ్యక్తులకు ఇదివరకే ఉన్న జబ్బుల ఆధారంగా కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, ఈసీజీ, స్కిన్ థిక్‌నెస్(న్యూట్రిషనల్ అసెస్‌మెంట్ కోసం) వంటి టెస్టులు కూడా చేయాలని నిర్ణయించారు.
హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రతి వ్యక్తి వద్ద ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వివరాలు సేకరించనున్నారు. ఆధార్ నంబర్‌నే ఐడీ సంఖ్యగా వినియోగించి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు. ఈ ఐడీని ఫోన్ నంబర్‌కు అనుసంధానిస్తారు.
ఇవి కూడా చదవండి:
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









