‘నేను నల్లగా ఉంటాను, నా పార్టనర్ తెల్లగా ఉంటాడు.. ఇది మీ పాపేనా అని అడుగుతున్నారు’

పాపతో ఎనా మిల్లర్

ఫొటో సోర్స్, Ena miller

ఫొటో క్యాప్షన్, పాపతో ఎనా మిల్లర్

ఎనా మిల్లర్‌కు గత ఏడాది పాప పుట్టింది. ఆ పాపను చూసి చుట్టూ ఉన్న జనం రకరకాల మాటలన్నారు.

‘‘మా పాప బోనీ పుట్టిన క్షణం నుంచీ తన చర్మం రంగు గురించి చర్చలే. బోనీ పుట్టిన తరువాత ఒక పగలు, ఒక రాత్రి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంది. తర్వాత పాపాయిని తీసుకొచ్చి నాకిచ్చారు.

బోనీ నా ఒడికి చేరిన కొన్ని గంటల తరువాత ఒకామె నా గదిలోకి వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌కు ఏం కావాలని అడిగారు.

నేను జవాబిచ్చేలోపే ఆమె పాపాయిని తదేకంగా చూస్తూ "ఈ పాప మీ పాపేనా?" అని అడిగారు.

అవును అన్నాను. తరువాత పాప ముద్దుగా ఉంది, బొద్దుగా ఉంది అని పొగుడుతారని ఆశించాను.

కానీ, ఆమె మళ్లీ అదే ప్రశ్న అడిగారు.. "నిజంగా మీ పాపేనా?"

ఆమె గొంతులో ఆశ్చర్యం, కొంచం షాక్ అయినట్లు కూడా అనిపించింది. ఆమె ప్రశ్నలో "నిజంగా" అన్న మాట విన్నాక నాకు ఆమె మాటల్లో ఏదో తేడా అనిపించింది.

"పాప ఎంత తెల్లగా ఉందో! ఆ జుత్తు ఎంత బావుందో.. మంచి స్ట్రెయిట్ జుత్తు. ఎంత తెల్లగా ఉందో.. " అని మళ్లీ మళ్లీ అదే మాట అంటూనే ఉన్నారు.

అక్కడి నుంచి మొదలైంది. ముక్కు, మొహం తెలియనివాళ్లు కూడా "ఈ పాప మీ పాపేనా?" అని అడగడం, “ఎంత తెల్లగా ఉందో” అని ఆశ్చర్యపోవడం.. ఇదే పనైపోయింది.

షాపింగ్‌కి వెళ్లినా, రెస్టారెంట్‌కు వెళ్లినా, స్నేహితులను కలిసినా అదే ప్రశ్న, అదే మాట’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు ఎనా మిల్లర్.

పాపతో ఎనా మిల్లర్

ఫొటో సోర్స్, Ena miller

నాది నల్లని చర్మం. నా పార్టనర్ తెల్లగా ఉంటాడు. మా పాప బోనీ ఇద్దరి రంగునూ కలుపుకొని పుట్టింది.

ఆసుపత్రి నుంచే మావాళ్లందరికీ పాప ఫొటో పంపించాను. అది చూసి కొంతమంది ఒక్క వాక్యంలో జవాబిచ్చారు. కొత్తగా తల్లిని అయిన నాకు మా పాపను పొగిడితే బావుంటుంది. కానీ, ఆ మాటలు అలా లేవు.

"పాప చాలా తెల్లగా ఉంది."

"పాపకు ఆఫ్రికన్ రూపురేఖలు ఎక్కువ వచ్చుంటే బావుండేది."

"పాప బాగా పాలిపోయినట్టుంది, కదా."

"ఫరవాలేదే, పాప తెల్లగానే ఉంది."

ఈ వ్యాఖ్యలు విని నేను చాలా బాధపడ్డాను.

కాన్పు తరువాత నేను, పాప ఐదు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడే కోవిడ్ మొదటి వేవ్ ప్రారంభమైంది. అందుకని మమ్మల్ని చూడ్డానికి ఎవరినీ అనుమతించలేదు. నా సహచరుడు కూడా వాట్సాప్‌లో వీడియో కాల్‌లోనే మాట్లాడేవాడు. అలాంటి పరిస్థితుల్లో పాప గురించి ఈ కామెంట్లు చూసి ఒక్కదాన్నే కూర్చుని బాధపడేదాన్ని. దీని గురించి గూగుల్ చేశా.

ఎందుకు నేను బోనీ తల్లిని కాదు అని అనుకుంటున్నారు? ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు?

జీవితాంతం బోనీకి ఇదే పరీక్ష ఎదురవుతుందా? నేనెవరో నా పాప అందరికీ వివరించి చెప్తూ ఉండాలా?

నన్ను, పాపను చూడ్డానికి వచ్చిన ఆయమ్మ అనుకుంటారా?

ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. నేను జీవితాంతం ఇలా బాధపడుతూ గడపలేను అనిపించింది.

బోనీతో ఎనా మిల్లర్

ఫొటో సోర్స్, Ena miller

ఫొటో క్యాప్షన్, బోనీతో ఎనా మిల్లర్

'ఆ సంఘటన మరచిపోలేను'

ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసిన ఐదు వారాల తరువాత, ఓ రోజు నేను బోనీని తీసుకుని వాకింగ్‌కు వెళ్లాను. హాయిగా ఇద్దరం నడుస్తుంటే ఒకాయన వచ్చి "మీ పాప ఇంత తెల్లగా ఉందేంటి?" అని అరవడం మొదలెట్టారు.

దగ్గరకొచ్చి కోపంగా చూస్తూ, మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని పరిశీలించారు.

"ఇంత తెల్లగా ఉందేంటి? తెల్ల జాతీయుడితో కలిశావా? తెల్లగా ఉన్నవాడితో కలిస్తే ఇలాగే అవుతుంది. చూడు ఎలా ఉందో... ఎలా ఉందో చూడసలు.. ఎందుకంత తెల్లగా ఉంది?" అని అరవడం మొదలెట్టారు.

ఆయన అరుపులకు చుట్టూ జనం చేరారు. నాకు భయమేసింది, సిగ్గేసింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన నల్ల జాతీయుడే. నా రంగు, ఆయన రంగు ఒకటే. అయినా, నా పాప తెల్లగా ఉంటే ఆయనకేం నష్టం? ఆయనకి ఎందుకంత కోపం వచ్చింది? ఇందులో ఆయనకు అవమానం ఏముంది?

నిజానికి, నా పాప రంగు గురించి నెగటివ్ కామెంట్లు చేసినవారంతా నా జాతివారే. నాకు వారి ప్రవర్తన అర్థమే కాలేదు. మిశ్రమ-జాతి కుటుంబాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.

నా కుటుంబాన్ని నేను సమర్థించుకోలేకపోవడం నాకు ఇప్పటికీ చాలా బాధ కలిగించే విషయం. అలాంటి కామెంట్లు వస్తుంటే నేనేమీ చెప్పేదాన్నికాదు. మౌనంగా ఉండిపోయేదాన్ని. వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఆ పెద్దాయన అరుపులకు కూడా నేనేమీ జవాబివ్వలేదు. కన్నీళ్లు ఆపుకుంటూ, అక్కడి నుంచి దూరంగా నడిచి వెళిపోయాను.

నా బాధను ఎప్పుడూ, ఎవరితోనూ పంచుకోలేదు. అప్పుడే వెండీని కలిశాను.

అవహాగనలేమితో చేసే కామెంట్ల పట్ల నవ్వుతారు వెండీ

ఫొటో సోర్స్, ENA MILLER

ఫొటో క్యాప్షన్, అవహాగనలేమితో చేసే కామెంట్ల పట్ల నవ్వుతారు వెండీ

వెండీ లోపెజ్ కథ

60 ఏళ్ల వెండీ లోపెజ్ సౌత్ లండన్‌లో నివసిస్తారు. జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకుండా హాయిగా గడుతుంటారు.

28 ఏళ్ల క్రితం వెండీకి ఒలివియా పుట్టింది. దక్షిణ అమెరికాలోని గయానాలో ఉన్న వెండీ స్నేహితురాలు ప్రసూతి వార్డుకు ఫోన్ చేసి మరీ ఆమె బిడ్డ తెల్లగా ఉందో, నల్లగా ఉందో కనుక్కున్నారు. ఈ విషయం చెబుతూ వెండీ పగలబడి నవ్వారు. ఇలాంటి ప్రవర్తన పట్ల ఆమె నవ్వుతారు.

ఒలివియాకు బ్రౌన్ జుత్తు ఉండేది కానీ ముందు జుత్తంతా ఉంగరాలు తిరిగి ఉండేది.

వెండీ కుటుంబంలో ఎవరైనా తెల్ల జాతీయులు ఉన్నారా అని ఒక డాక్టర్ అడిగారు. తన సహచరుడు, ఒలివియా తండ్రి తల్లె జాతీయుడేనని ఆమె చెప్పారు.

"కాదు, కాదు.. నీ కుటుంబంలో ఎవరో తెల్ల జాతీయులు ఉన్నారు. అందుకే ఒలివియా రంగు పాలిపోయినట్టు ఉంది" అని ఆ డాక్టర్ బదులిచ్చారు.

"ఆయన నాతో ఎందుకలా మాట్లాడారో అర్థం కాలేదు. నాకు తెలిసి ఆ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డలందరి తల్లుల దగ్గరకు వెళ్లి ఆ డాక్టర్ ఇలాంటి చర్చ పెట్టరు కదా. నాతోనే ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని ఆలోచించా.

వెండీ తల్లికి కూడా తన మనుమరాలి చర్మం రంగు నచ్చలేదు. అప్పుడప్పుడూ పాపను "వైట్ గర్ల్" అని సంభోదించేవారు. అయితే, వెండీకి అది పెద్ద బాధ అనిపించలేదు. కానీ, ఏ మాత్రం పరిచయం లేనివాళ్లు వచ్చి ఒలివియా రంగు గురించి నెగటివ్ కామెంట్లు చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోయారు.

ఒకానొక సంఘటన వెండీని చాలా బాధ పెట్టింది. షాపింగ్ కోసమని చిన్నారి ఒలివియాను తీసుకుని బయలుదేరారు. దారిలో ఒక పబ్ బయట ముగ్గురు నల్ల జాతీయులు నిల్చుని ఉన్నారు.

వారిలో ఒకరు వెండీ దగ్గరకు వచ్చి.. "ఈ పాప మీ పాపేనా?" అని అడిగారు.

"కాదు అని చెప్పాను. నా కన్న బిడ్డని నాది కాదని చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ పరిస్థితులు అలాంటివి. అలా చెప్పినందుకు నాకేం బాధ లేదు. వాళ్లు అలా అడిగేసరికి నాకు చాలా భయం వేసింది. వాళ్లు తాగి ఉన్నారు. మమ్మల్ని కొడితే? ఆ ఊహకే వణికిపోయాను. అప్పట్లో నల్లజాతి మహిళలు, తెల్లజాతి పురుషులను వివాహం చేసుకోవడం అంత ఆమోదయోగ్యం కాదు" అని వెండీ వివరించారు.

ఇప్పటికీ ఒలివియా రంగును చూసి నెగటివ్ కామెంట్లు చేసేవాళ్లు ఉన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం వెండీ ఊరుకోరు. ఎందుకంటే ఒలివియాకు కొత్తవిషయాలు తొందరగా నేర్చుకోలేని వైకల్యం (లెర్నింగ్ డిజెబిలిటీ) ఉంది. తనను తాను సమర్థించుకోలేరు. అందుకే వెండీ ఆమె పక్షాన నిలబడి వాదిస్తారు.

"కొన్ని నెలల క్రితం కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకోడానికి వెళ్లాను. అక్కడ ఉన్న ఒక నర్స్ నన్ను చూసి మీరు ఒలివియా కేర్ టేకరా? అని అడిగారు. కాదు, ఒలివియా తల్లిని అని చెప్పాను. ఆమె మరింత ఆశ్చర్యపోతూ, నిజంగా మీరే కన్నారా? అని అడిగారు. అలా అడిగేసి వెళిపోతే నేను ఊరుకోలేను. ఇలాంటి కామెంట్లు చేసినవారిని తిరిగి సరైన సమాధానం చెప్పాలి. నా బిడ్డ ఆరోగ్యం బాగుంటే, తనే చెప్పేది.. మా అమ్మ నలుపు, మా నాన్న తెలుపు. మీకేం నష్టం? మమ్మల్ని వదిలేయండి అని నా బిడ్డే గట్టిగా చెప్పేది. తను చెప్పలేదు కాబట్టి నేను చెబుతున్నాను" అంటూ వెండీ ఆవేదన వ్యక్తం చేశారు.

మా పాప బోనీ పుట్టిన దగ్గర నుంచి నేను వింటున్న మాటలన్నీ నా మనసుని దొలిచేస్తూ ఉన్నాయి. వెండీని కలిసాక అదే విషయం ఆమెను అడిగాను. నేను మరీ సున్నితంగా ఉన్నానా, ఈ కామెంట్లను ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటున్నానా అనే సందేహాన్ని వెలిబుచ్చాను.

"ఆ పరిస్థితుల్లో లేనివాళ్లందరూ చెప్పే మాట ఇది. నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అంటారు. మేమేదో మాటవరసకి అన్నాం, నువ్వు మరీ సీరియస్‌గా తీసుకుంటున్నావు అని కొట్టిపారేస్తారు. ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నవారికే తెలుసు ఆ బాధేమిటో" అని వెండీ జవాబిచ్చారు.

బోనీకి ఏడాది నిండేటప్పటికి నేను పూర్తిగా అలిసిపోయాను. తెలిసినవారికీ, తెలియనివారికీ కూడా "ఇది నా పాపే" అని చెప్పి, చెప్పి అలిసిపోయాను.

ఫరీబా కుటుంబం

ఫొటో సోర్స్, ENA MILLER

ఫొటో క్యాప్షన్, ఫరీబా కుటుంబం

21వ శతాబ్దంలో ఉన్నా ప్రజల ఆలోచనలు మారలేదు అంటున్న ఫరీబా

41 ఏళ్ల ఫరీబా సగం ఇరానియన్, సగం ఇంగ్లిష్. తన భర్త ఒక నైజీరియన్. వారికి ముగ్గురు పిల్లలు... పది, ఎనిమిది, ఆరేళ్లవాళ్లు.

"మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచం మారిపోయింది, గతాన్ని మర్చిపోయి ముందుకు కదులుతున్నారు అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. ఇంకా జనాల ధోరణి మారలేదు" అంటారు ఫరీబా.

మిశ్రమ జాతి పిల్ల పెంపకం గురించి ఫరీబా ఓ బ్లాగు నడుపుతున్నారు.

“మా ముగ్గురు పిల్లల రంగులు వేరువేరుగా ఉంటుంది. వాళ్లకొచ్చే కామెంట్ల గురించి నేను చాలా భయపడ్డాను. సమాజంలో వాళ్లను ఎలా చూస్తారన్న దాన్నిబట్టీ వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు" అని ఫరీబా అన్నారు.

ఓసారి ఫరీబా తన ఏడేళ్ల కూతురిని ట్యూషన్ క్లాస్ నుంచి తీసుకురావడానికి వెళ్లారు.

"నా పాపను చూడగానే దగ్గరకు తీసుకున్నాను. అక్కడ ఉన్న పిల్లల్లో ఒక పిల్ల వచ్చి, తను మీ పాపా? అని అడిగింది. అవునని చెప్పాను. తన రంగు వేరుగా ఉన్నా, నువ్వు తనను ప్రేమించగలుగుతున్నావా? అని అడిగింది. ఆ మాటలు మా పాప వింది. తనకు ఏడుపు వచ్చేసింది. కన్నీళ్లను ఆపుకోడానికి ప్రయత్నించింది. చాలా బాధపడ్డాను. ఆ సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను" అని ఫరీబా వివరించారు.

అయితే, వీటన్నిటి గురించి బ్లాగులో రాయడం ఉపయోగపడుతోందని ఆమె అన్నారు.

"ఇలాంటి మాటలన్నీ పడి ఊరుకోకుండా బ్లాగులో రాయడం ద్వారా నలుగురికీ తెలియజేస్తున్నాను. అవగాహన కల్పిస్తున్నాను. అది నాకు ఉపశమనాన్ని కలిగిస్తోంది" అని ఫరీబా చెప్పారు.

ఇదంతా కొన్ని రోజులు మాత్రమే, తరువాత అందరూ మర్చిపోతారని ఫరీబా చెప్తారేమోనని ఆశపడ్డాను. కానీ ఆమె అలా చెప్పలేదు. ఇది జీవితాంతం ఉంటుందన్నారు.

"మా పెద్ద పాప అందరికన్నా నల్లగా ఉంటుంది. తన మీద చాలా అనవసర కామెంట్లు వస్తుంటాయి. అవన్నీ తనపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇంతకన్నా నల్లగా అయిపోతే సమాజం వెక్కిరిస్తుందేమోనని భయపడుతోంది. నలుపు రంగును సమాజం ప్రతికూలంగా చూస్తుందని అనుకుంటోంది" అంటూ ఫరీబా వాపోయారు.

ఆషాదీ ఇదే పరిస్థితి

ఆషా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు. మంచి ఉత్సాహవంతురాలైన అమ్మాయి. చర్మం రంగులపై జనాల నెగటివ్ కామెంట్లకు ఆమె ఒక పరిష్కారం కనుగొన్నారు.

"మా కుటుంబాన్ని ఐస్-క్రీం ఫ్లేవర్స్‌తో పోల్చి చెప్తాను. నేను కేరమిల్. మా అమ్మ వెనిలా. నాన్న చాక్లెట్. ఎల్లా ఫడ్జ్, నా చిన్న చెల్లెలు బటర్‌స్కాచ్. నువ్వు నాకన్నా తక్కువ రంగు, ఎక్కువ రంగు అనుకునే కన్నా ఇలా చెప్తే మనసుకు తేలికగా ఉంటుంది. మా మధ్య మంచి సంబంధాలు నెలకొనేందుకు సహాయపడుతుంది."

"మమ్మల్ని మంచి రుచికరమైన ఆహారంతో పోల్చుకోవాలనుకున్నాను. అందరూ ఇష్టపడేది. ఉదాహరణకు ఐస్-క్రీం. మేమంతా ఒకే కుటుంబం. బయటవాళ్లు మామీద తీర్పులివ్వడానికి వీల్లేదు" అని ఆషా అన్నారు.

మేఘన్ మార్కెల్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లాంటి వ్యక్తులు రంగు పట్ల ఉన్న పక్షపాతాన్ని ఛేదించే దిశగా ప్రజలను ప్రోత్సహిస్తారని ఫరీబా ఆశాభావం వ్యక్తం చేశారు.

"మార్పు వస్తుందని ఆశిద్దాం. కొంచం ఓపికతో ఎదురుచూడాలే తప్ప ఆశను వదులుకోకూడదు" అని ఫరీబా అన్నారు.

వెండీని కలిసి వచ్చిన కొన్ని వారాల తరువాత ఆమె నాకు ఒక మెసేజ్ పంపారు.

"అంతా కుశలమేనని తలుస్తాను. ఓ విషయం చెప్పడం మర్చిపోయాను.. మీ పాపతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. బాల్యం మళ్లీ తిరిగి రాదు. మన చూస్తుండగానే పిల్లలు త్వరగా ఎదిగిపోతారు. ఈ సమయం చాలా విలువైనది. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపండి."

వెండీ సలహా పాటించడం నాకు ఆనందమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)