చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ

పాస్టర్ ‘వాంగ్ యీ’ని పోలీసులు అరెస్టు చేశారు

ఫొటో సోర్స్, facebook/EarlyRain

చైనాలో చర్చిలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడం అక్కడి క్రైస్తవ సమాజాన్ని ఆందోళనలోకి నెడుతోంది.

చర్చిలపై పెరుగుతున్న పోలీసుల దాడులు, మత సంబంధింత కార్యకలాపాలపై ఆంక్షలు, అడ్డగింతలపై నిరసన వ్యక్తమవుతోంది.

ఇటివల సిచువాన్ ప్రావిన్స్‌లోని 'ఎర్లీ రెయిన్ కోవెనెంట్ చర్చి' పాస్టర్, ఆయన భార్యను అరెస్ట్ చేయడం ప్రభుత్వం సాగిస్తున్న దాడుల్లో భాగమేనని ఆరోపిస్తున్నారు.

గుయాంగ్‌ఝూ ప్రావిన్స్‌లో శనివారం అక్కడి రోంగ్విలి చర్చిలో 'చిల్డ్రన్స్ బైబిల్ క్లాస్'పైనా పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు.

''పోలీసుల కన్ను నాపై పడకపోవడం నా అదృష్టం' ని చెంగ్డూలోని ఒక క్రైస్తవుడు అనడాన్ని చూస్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.

చర్చి సభ్యులు

ఫొటో సోర్స్, facebook/earlyrain

ఎందుకీ దాడులు

తమ దేశంలో మత స్వేచ్ఛ కల్పిస్తామని చైనా బయటకు చెబుతున్నా అధికారికంగా అది నాస్తిక దేశం.

మతాలు దేశంలో వేళ్లూనుకుంటే రాజ్య సుస్థిరతకు భంగం కలుగుతుందన్నది అక్కడి ప్రభుత్వ గట్టి నమ్మకం. అందుకే, మత గురువులపై చర్యలు తీసుకోవడమనేది అక్కడ కొత్తేం కాదు.

ప్రభుత్వ నియంత్రణలో ఉండే 'త్రీ సెల్ఫ్ పేట్రియాటిక్ చర్చ్' పరిధిలోనే అక్కడి క్రిస్టియన్లంతా ఉండాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. (త్రీ సెల్ఫ్ పేట్రియాటిక్ మూమెంట్ అనేది చైనాలోని ప్రొటెస్టంట్ల మత సంస్థ. ఇది ప్రభుత్వం, పార్టీ మాట జవదాటకుండా పనిచేస్తుంటుంది. ఈ చర్చిల్లో పాస్టర్లు, ఫాదర్లు అంతా పార్టీ నిర్ణయించివారే ఉంటారు. ఇది కాకుండా ప్రభుత్వ నియంత్రణలోని చైనీస్ పేట్రియాటిక్ క్యాథలిక్ అసోసియేషన్ కూడా ఉంటుంది.)

పోలీసుల దాడిలో గాయపడిన ఎర్లీ రెయిన్ చర్చి సభ్యులు

ఫొటో సోర్స్, facebook/earlyrain

ఫొటో క్యాప్షన్, పోలీసుల దాడిలో ఎర్లీ రెయిన్ చర్చి సభ్యులకు తగిలిన గాయాలు

అత్యధికం అనుమతి లేని చర్చిలే..

ఇటీవల కాలంలో చైనాలో క్రైస్తవ జనాభా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో 10 కోట్ల మంది క్రైస్తవులున్నట్లు అంచనా. వీరిలో అత్యధికులు ప్రభుత్వ అనుమతి లేని 'అండర్‌గ్రౌండ్ చర్చి'లలో ఆరాధనలు జరుపుతారు.

(చైనా ప్రభుత్వ అనుమతితో పనిచేసే 'చైనీస్ పేట్రియాటిక్ క్యాథలిక్ అసోసియేషన్'లో చేరకుండా నడిపే చర్చ్‌లు ఇవి. ఆ దేశంలో ఇవి చట్టబద్ధం కావు).

అలాంటి ఒక చర్చిలో 'వాంగ్ యీ' పాస్టర్‌గా పనిచేస్తారు. సుమారు 800 మంది క్రైస్తవులు దాని పరిధిలో ఉన్నారు. ఒక చిన్న స్కూలు కూడా నడుపుతున్నారు.

'వాంగ్ యీ'కి ఏదైనా మొఖం మీదే మాట్లాడుతారన్న ముద్ర ఉంది. చైనా ప్రభుత్వం మతాన్ని నియంత్రించడాన్ని వ్యతిరేకిస్తూ తరచూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు.

చర్చిలపై నిఘా మరింత పెంచుతూ, ఆంక్షలు తీవ్రతరం చేస్తూ చైనా ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డిసెంబరు 9న పోలీసులు ఈ చర్చిపై దాడి చేసి పాస్టర్ వాంగ్‌, ఆయన భార్య జియాంగ్ రోంగ్‌లను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొద్దిరోజుల్లోనే అదే చర్చికి చెందిన సుమారు 100మంది సభ్యులను పోలీసులు తమతో తీసుకెళ్లారు.

ప్రభుత్వ నియంత్రణలోని చర్చిల్లోనే ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం అంటోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ నియంత్రణలోని చర్చిల్లోనే ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం అంటోంది

పోలీసుల ఆటంకాలు

''చర్చికొచ్చేవారి ఇళ్లను లూటీ చేశారు. స్కూలు తాళాలు పగలగొట్టారు. ఎంతోమంది చర్చి సభ్యులను హౌస్ అరెస్ట్ చేశారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని చర్చి సభ్యురాలు ఒకరు 'బీబీసీ'కి చెప్పారు.

ఈ చర్చిలకొచ్చేవారి ఇళ్లకు పోలీసులు వెళ్తున్నారు. ఇంకెప్పుడూ వాటికి వెళ్లబోమని హామీ పత్రాలు రాయించుకుంటున్నారని, చర్చి నడిపే స్కూలు నుంచి తమ పిల్లలను తప్పించేసి వేరే స్కూళ్లకు పంపించేలా ఒత్తిడి తెస్తున్నారనీ ఆమె తెలిపారు.

ఈ చర్చికి చెందిన కొందరు ఆదివారం వేరే ప్రదేశంలో పోగై అక్కడ ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు.

చర్చి వద్ద పోలీసులు మోహరించి ఎవరినీ లోనికి వెళ్లనివ్వలేదు. పోలీసుల అదుపులో ఉన్న చర్చి సభ్యులను వేధించారని, వారితో దురుసుగా ప్రవర్తించారనీ చర్చి పెద్దలు ఆరోపించారు.

పాస్టర్ వాంగ్ అరెస్టయిన రెండు రోజుల తరువాత 'ఎర్లీ రెయిన్ కోవెనెంట్ చర్చి' ఒక లేఖ విడుదల చేసింది.

అది వాంగ్ తన అరెస్టుకు ముందు రాసిన లేఖ. అందులో ఆయన, చైనా ప్రభుత్వం, అధికారుల పట్ల తమకు గౌరవం ఉందని.. రాజకీయంగా, చట్టబద్ధ సంస్థల మార్పునూ తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు.

అయితే, చైనా కమ్యూనిస్టు పాలనలో చర్చిలపై పెరుగుతున్న దాడులు, హింసను చూసి అసహ్యం, కోపం కలుగుతున్నాయని అన్నారు.

వాంగ్ దంపతుల అరెస్టు తరువాత వారిపై రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు.

చైనాలో ఈ నేరానికి 15 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. చర్చికి సంబంధించిన అనేక మంది సభ్యులపై ఇవే అభియోగాలు మోపారు పోలీసు అధికారులు.

చర్చిని మూసివేయడంతో ఆరుబయటే ప్రార్థనలు

ఫొటో సోర్స్, Early rain

ఫొటో క్యాప్షన్, చర్చిని మూసివేయడంతో ఆరుబయటే ప్రార్థనలు

'అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి'

మరోవైపు గుయాంగ్‌ఝూలోని రోంగ్విలి చర్చి విషయంలోనూ చైనా కఠినంగా వ్యవహరించిందని చెబుతున్నారు. శనివారం అక్కడ పిల్లకు బైబిల్ క్లాస్ జరుగుతుండగా పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చారని.. చట్టవిరుద్ధంగా మీరంతా ఇక్కడ చేరారని చెబుతూ తమ వద్ద ఉన్న బైబిళ్లు తీసుకుని చర్చికి తాళం వేశారని సభ్యులు చెప్పారు.

అంతేకాకుండా.. చర్చికొచ్చే అందరి చిరునామాలు తీసుకుని వారి నుంచి మొబైల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

బీజింగ్‌లో అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చిల్లో అతిపెద్దదైన జియాన్ చర్చిని సెప్టెంబరులో మూసివేయించారు. గత కొన్నేళ్లలో వివిధ చర్చిలను ధ్వంసం చేసి, శిలువలను తొలగించిన సందర్భాలున్నాయి.

'అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలో చైనా సమాజం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఇవి సంకేతాలు సమాజాన్ని అన్ని రకాలుగా నియంత్రించాలని ప్రభుత్వం కోరుకుంటోంది' అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.

''క్రిస్మస్, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ చైనాలో క్రైస్తవుల పరిస్థితులను పట్టించుకోవాలని, ప్రభుత్వం చర్చిలపై సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాం'' అని హాంకాంగ్‌కు చెందిన యాకీ వాంగ్ అన్నారు.

ప్రభుత్వం అధీనంలో ఉండే 'త్రీ సెల్ఫ్ పేట్రియాటిక్ చర్చి'లు కమ్యూనిస్టు పార్టీ బోధనలు, దేశభక్తి ఆలోచనలే వ్యాప్తి చేస్తాయని, వాటిని చర్చిలుగా పరిగణించడం హాస్యాస్పదమని పేరు చెప్పడానికి ఇష్టపడని 'ఎర్లీ రెయిన్' చర్చి సభ్యుడొకరు అన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)