చైనాలో వీగర్ ముస్లింలు : మైనారిటీ శిబిరాల్లో చెలరేగిన నిర్బంధ హింస

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోలాండ్ హగ్స్
- హోదా, బీబీసీ
ముస్లిం మైనారిటీలను నిర్బంధ శిబిరాల్లో ఉంచి హింసిస్తున్నారని చైనాపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పది లక్షల మంది వీగర్ ముస్లింలను, ఇతర ముస్లిం వర్గాలను పశ్చిమ షిన్‌జాంగ్ ప్రాంతంలో నిర్బంధించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్యసమితి ఆగస్టులో పేర్కొంది. 'రీ ఎడ్యుకేషన్' ప్రోగ్రాం పేరుతో వారిని నిర్బంధించినట్లు విన్నామని పేర్కొంది.
నిర్బంధాలపై మానవహక్కుల సంఘాలు చేస్తోన్న ఆరోపణలను చైనా ఖండిస్తోంది. అదే సమయంలో షిన్‌జాంగ్‌లో నివసిస్తున్న ప్రజలపై అణచివేతలు పెరుగుతున్నట్లు ఆధారాలు దొరికాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీగర్లు ఎవరు?
వీగర్లలో ఎక్కువ మంది ముస్లింలే. వీరి సంఖ్య పశ్చిమ చైనా ప్రాంతంలో 11 లక్షల వరకు ఉంది. జాతిపరంగా, సంస్కృతిపరంగా తాము మధ్య ఆసియా దేశాలకు దగ్గరివారమని వారు చెబుతుంటారు. అంతేకాదు వీరి భాషకు టర్కిష్‌తో పోలికలున్నాయి.
అయితే, కొన్ని దశాబ్దాలుగా, చైనాలోని మెజారిటీలైన హన్ చైనీస్ జాతీయులు షిన్‌జాంగ్‌కు భారీగా వలసవస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రబలంగా ఉన్న వీగర్లు తమ సంస్కృతి, జీవనోపాధి దెబ్బతింటున్నాయని భావిస్తున్నారు.

షిన్‌జాంగ్ ఎక్కడుంది?
చైనాలోని అతిపెద్ద రాష్ట్రమైన షిన్‌జాంగ్‌కు 8 దేశాలతో సరిహద్దు ఉంది. చైనాకు పూర్తిగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రానికి భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజక్‌స్తాన్, రష్యా, మంగోలియాలతో సరిహద్దు ఉంది.
టిబెట్‌లాగే ఇది కూడా స్వయంప్రతిపత్తి ప్రాంతం. కానీ, కేంద్రప్రభుత్వం దీనిపై భారీగా నియంత్రణలు విధిస్తోంది.
సిల్క్ రోడ్‌పై ఉన్న ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం, వ్యాపారాలకు కేంద్రంగా ఉంది.
20 శతాబ్దం తొలినాళ్లలో వీగర్లు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. అయితే, 1949లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
షిన్‌జాంగ్‌లోని ప్రజలకు ఏమైంది?
వీగర్‌లు ఉండే స్వయంప్రతిపత్తి కలిగిన షిన్‌జాంగ్ ప్రాంతాన్ని చైనా ఒక భారీ నిర్బంధ శిబిరంలా మార్చేసినట్లు విశ్వసనీయ నివేదికలు తెలిపాయని గత ఆగస్టులో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ తెలిపింది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారని కమిటీ పేర్కొంది.
మానవహక్కుల సంఘాలు కూడా ఈ రిపోర్టులను వెనకేసికొచ్చాయి.
ఎవరైనా తమను వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది.
నిర్బంధ శిభిరంలో ఉన్నవారు మాండరిన్ భాష నేర్చుకోవాలని, అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విశ్వసనీయంగా ఉండాలని ఒత్తిడి తెస్తున్నారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి.
ముఖాన్ని గుర్తించే కెమెరాల మధ్యన వీగర్లు బతుకుతున్నారని, వారి నివాసాలు కూడా క్యూ.ఆర్. కోడ్‌తో పర్యవేక్షణలో ఉన్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. ఇక్కడి ప్రజలకు బయోమెట్రిక్ టెస్ట్‌లు చేస్తున్నారని పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
బీబీసీ ఏం తెలుసుకుంది?
షిన్‌జాంగ్ ప్రాంతంలోకి వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదు. దీంతో అక్కడి నుంచి ప్రత్యక్షంగా వివరాలు సేకరించే అవకాశం లేదు. అయినప్పటికీ, బీబీసీ ఆ ప్రాంతానికి అనేకసార్లు వెళ్లింది.
అక్కడ ఉన్న శిబిరాలు, అడుగడుగునా కనిపించే పోలీసుల నిఘాను గుర్తించింది.
గతంలో నిర్బంధ శిబిరంలో చిత్రహింసలు పడి ప్రస్తుతం వేరే దేశంలో నివసిస్తున్న ఒమిర్‌ను బీబీసీ న్యూస్ నైట్ ప్రోగ్రాం ఇంటర్వ్యూ చేసింది.
చైనాలో తాను పడిన కష్టాల గురించి ఆయన వివరిస్తూ..''వారు కనీసం నన్ను నిద్రపోనివ్వలేదు. పైకిలేపి గంటల తరబడి కొట్టేవారు. పెద్ద కట్టెలతో చితకబాదేవారు. శరీరాన్ని గుచ్చే సూదులు, గోళ్లను పెరికించే పట్కార్లు టేబుళ్లపై కనిపించేలా పెట్టేవారు. వాటితో మా మీద ప్రతాపం చూపేవారు. దెబ్బలకు తాళలేక కేకలు వేస్తున్నవారి శబ్దాలను నేను విన్నా'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వీగర్లపై హింస ఎందుకు?
వందలాది మంది వీగర్ ముస్లింలు 'ఇస్లామిక్ స్టేట్' కోసం ఇరాక్, సిరియాల్లో పనిచేశారని.. ఐఎస్ పతనం తరువాత షిన్‌జాంగ్‌లోకి వారు వస్తుండడం దేశ భద్రతకు ముప్పని చైనా అంటోంది. అయితే, పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడటం వల్లే షిన్‌జాంగ్‌లో హింస తలెత్తిందని మానవహక్కుల సంఘం చెబుతోంది.
షిన్‌జాంగ్ రాజధాని ఉరూంఖిలో 2009 జులైలో జరిగిన జాతుల ఘర్షణల్లో 200 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది హన్ చైనీయులే. అప్పటి నుంచి అక్కడ దాడులు పెరుగుతున్నాయి. 2014 జులైలో ఒక పోలీస్‌స్టేషన్, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలపై దాడులు జరిగాయి. ఇందులో మొత్తం 96 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP
చైనా ఏమంటోంది?
వేర్పాటు వాదం, హింసాత్మక తీవ్రవాదం, నేర కార్యకలాపాలపై ప్రతిస్పందనగా తాము చర్యలు తీసుకుంటున్నామని చైనా తెలిపింది.
గత ఆగస్టులో జెనెవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో చైనా అధికారి హూ లిహాన్ మాట్లాడుతూ, 10 లక్షల వీగర్లను నిర్బంధ శిబిరంలో ఉంచుతున్నామని వెలువడిన నివేదిక నిజంకాదని అన్నారు.
అయితే, సెప్టెంబర్‌లో జెనెవాలోనే జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో మరో చైనా అధికారి మాట్లాడుతూ, షిన్‌జాంగ్‌లో శిక్షణ కేంద్రాన్ని, విద్యాసంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచం ఏం చేస్తోంది?
వీగర్ ముస్లింలపై చైనా అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఏ దేశం కూడా చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
బ్రిటీష్ ప్రధానమంత్రి థెరిస్సా మే.. గత జనవరిలో చైనాలో పర్యటించడానికంటే ముందు షిన్‌జాంగ్‌లో ముస్లింలపై అనుసరిస్తున్న వైఖరిపై తాము ఆందోళన చెందుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది.
చైనాపై ఆంక్షలు విధించాలని అమెరికాలోని ఒక కమిటీ ట్రంప్‌ను కోరింది. ''చైనాలో ముస్లింలపై అణచివేత కొనసాగుతోంది. వారిని నిర్బంధంలో ఉంచుతున్నారు.''అని ఆ కమిటీ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
షిన్‌జాంగ్‌లో పరిశీలన జరిపేందుకు అనుమతించాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నూతన అధ్యక్షుడు మైఖెల్ బాచ్లెట్ చైనాను డిమాండ్ చేశారు.
ఇవికూడా చదవండి:
- ‘భాగస్వామిని ఆకట్టుకునే శృంగార కళను మర్చిపోతున్న భారతీయులు’
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- ఎవరు అబద్ధాల కోరు?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- సిరియా: ఇది సైన్యాల మధ్య పోరాటం కాదు.. ప్రజలపై జరుగుతున్న యుద్ధం
- సెరెనా విలియమ్స్: ’యూఎస్ ఓపెన్ ఫైనల్లో అంపైర్ లింగవివక్ష చూపారు‘
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- కోర్టు తీర్పుతో ఇప్పుడు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)డ్ చేశారు.








