'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్‌లో హింస ఏమైనా తగ్గిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అలాంటి దాడులేవీ జరగలేదని పాకిస్తాన్ చెబుతున్నా, దేశంలో కూడా విమర్శలు వినిపిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం 2016 సెప్టెంబర్ 29న పాక్ క్స్పాలిత కశ్మీర్‌లో 'సర్జికల్ స్ట్రయిక్స్' సైనిక చర్యల రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
గత రెండేళ్లుగా భారత పాలిత కశ్మీర్ మినహా మిగతా భారతదేశంలో ఎలాంటి తీవ్రవాద ఘటనలూ జరగలేదు.
భారత్ పాలిత కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో కూడా తీవ్రవాదులను భారీ సంఖ్యలో కాల్చిచంపారు.
కానీ, కశ్మీర్ ఇప్పటికీ శాంతికి చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
'సర్జికల్ స్ట్రైక్' జరిగిన ఏడాది తర్వాత భారత హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఒక రిపోర్ట్ ప్రవేశపెట్టింది. అందులో 30 ఏళ్లుగా అస్థిరతలో ఉన్న భారత్ పాలిత కశ్మీర్‌లో అత్యధిక రక్తపాతం 2017లో జరిగిందని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన హింస
గత ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టిన గణాంకాల ప్రకారం, 2017లో రాష్ట్రంలో తీవ్రవాదుల హింస కూడా పెరిగింది. మొత్తం 342 హింసాత్మక ఘటనలు జరిగితే, 40 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.
అధికారిక గణాంకాల ప్రకారం సాయుధ తీవ్రవాదులను అంతం చేసే దిశగా 2017ను అత్యంత విజయవంతమైన ఏడాదిగా భావించారు. 2017లో ప్రభుత్వం 217 మంది తీవ్రవాదులను కాల్చి చంపినట్టు చెప్పింది. అదే 2016లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 138 మంది తీవ్రవాదులు మరణించారు..
అయితే, అదే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాల సంఖ్య కూడా పెరిగింది. 2016లో 100 మంది జవాన్లు మృతి చెందగా, 2017లో చనిపోయిన భద్రతా దళాల సంఖ్య 124కు పెరిగింది.
2018లో కేవలం 9 నెలల్లోనే 118 మంది జవాన్లు, పోలీసులు మృతి చెందారు. ఇక ఈ ఏడాది సెప్టంబర్ 25 వరకూ సైన్యం 176 మంది తీవ్రవాదులను కాల్చిచంపింది.

ఫొటో సోర్స్, Getty Images
సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత భారత పాలిత కశ్మీర్‌లో పరిస్థితి:
1.తీవ్రవాదులకు పెరిగిన మద్దతు
కశ్మీర్ లోయలో, ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ నాలుగు జిల్లాల్లో సాయుధ తీవ్రవాదులకు మద్దతు వేగంగా పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో మొదటి సారి ఇలా జరుగుతోంది.
సైన్యం ఎక్కడైనా ఎన్‌కౌంటర్‌కు సిద్ధమైతే, తీవ్రవాదులను కాపాడడానికి జనం ఆయా ప్రాంతాలకు భారీగా చేరుకుంటున్నారు.
50 మందికి పైగా పౌరులు అలాంటి ఘటనల్లోనే చనిపోయారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. అవతలివైపు నుంచి ఆగని ఫైరింగ్
ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా 'సర్జికల్ స్ట్రైక్స్' ఒక బలమైన స్పందన అని భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ, 2018 మొదట్లోనే ఎల్ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 633 ఘటనలు జరిగాయి.
ప్రతి ఏటా విడుదలయ్యే గణాంకాల ప్రకారం 2017 సామాన్యులకు అత్యంత హింసాత్మక సంవత్సరంగా మారింది. ఇందులో ఎల్ఓసీ దగ్గర 860, అంతర్జాతీయ సరిహద్దుల్లో 111 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
3. రాజకీయ అస్థిరత
పీడీపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి బీజేపీ ఈ ఏడాది తన మద్దతు ఉపసంహరించిన తర్వాత కశ్మీర్‌లో దారుణమైన రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీనివల్ల లోయలో వేర్పాటువాదులు తమ అనుకూల వర్గాలను బలోపేతం చేశారు. దీంతో భారత్ అనుకూల నేతలు సామాన్యులను కలవడం కష్టంగా మారిపోయింది.
'ఆల్ అవుట్' లాంటి సైనిక ఆపరేషన్లలో పౌరుల మృతి, పెల్లెట్ గన్ గాయాలు కూడా ప్రపంచం దృష్టి కశ్మీర్ వైపు మళ్లేలా చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
4.ఐరాస నివేదిక
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి మొదటిసారి కశ్మీర్ గురించి ఒక రిపోర్టు విడుదల చేసింది.
"అంతర్జాతీయ మానవ హక్కుల పరిశీలకులను భారత పాలిత కశ్మీర్‌లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు అనుమతించాలని, ఇలాంటి విషయాల్లో నేరుగా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఉన్న తమ రిపోర్ట్‌తో భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించారు. భారత్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఐక్యరాజ్యసమితి వేదికపై దీనిని స్వీకరించారు.
సైనికాధికారులు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల భారత్‌కు ఒక వ్యూహాత్మక ఆధిపత్యం లభించిందని చెబుతున్నారు. అవి జరిగిన తర్వాత పఠాన్‌కోట్, ఉరీ లాంటి దాడులు జరగలేదని చెబుతున్నారు. కానీ నిపుణులు మాత్రం కశ్మీర్‌లో రాజకీయ, భద్రత పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని చెబుతున్నారు. రెండేళ్ల సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రభుత్వానికి అవి వినసొంపుగా అనిపించలేదు.
ఇండియన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మరో సర్జికల్ స్ట్రయిక్ అవసరమని చెబుతున్నా, వివిధ వర్గాలు మాత్రం 2016లో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ విఫలమైనట్లేనని భావిస్తున్నారు
"విధానాల్లో కూడా గందరగోళం ఉంది. కశ్మీర్ అంశాల్లో కేవలం పాకిస్తాన్‌నే జోడించి చూస్తున్నారు. పాకిస్తాన్‌ను నియంత్రిస్తే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని అనుకుంటున్నారు. 1971లో పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, దశాబ్దం తర్వాతే లోయలో అశాంతి నెలకొంది, హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి" అని శ్రీనగర్ విలేఖరి బిలాల్ ఫుర్కానీ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
తీవ్రవాదులకు జనం అండ లేదు
పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న కాలాన్ని గుర్తు చేసుకున్న ఫుర్కానీ "పాకిస్తాన్‌తో ఎప్పుడు యుద్ధం జరిగినా లోయలో ఉద్రిక్తతలు తలెత్తేవి. 2003లో భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కశ్మీర్‌లో శాంతి ఏర్పడింది" అన్నారు.
పరిశోధకులు బిస్మా భట్ "భారత్-పాక్ యుద్ధానికి కశ్మీరీలకు ఎలాంటి సంబంధం లేదు. సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి. కానీ, ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఘోరంగా ఉండడంతో వారి లక్ష్యం నెరవేరలేదు. ఈ సర్జికల్ స్ట్రైక్ కు ముందు తీవ్రవాదులకు మద్దతు కోసం జనం ఎన్‌కౌంటర్ ప్రాంతాలకు పరుగులు తీసేవారు కాదు. ఈ స్ట్రయిక్స్ వల్ల తీవ్రవాదుల హింసకు సామాన్యుల మద్దతు పెరిగింది. అంతే, వేరే ఏం జరగలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యం దూకుడుతో ఏం లభించింది?
భారత్‌కు కశ్మీర్ సుదీర్ఘ కాలంగా ఉన్న ఒక రాజకీయ సమస్యగా మారింది. కశ్మీర్లో తీవ్రవాదుల హింసకు పాకిస్తాన్ ఫండింగ్ పుష్కలంగా ఉందని భారత ప్రభుత్వం చెబుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రాక ముందు నుంచీ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ డోభాల్ 'అఫెన్సివ్ డిఫెన్స్' విధానాన్ని సమర్థించుకుంటూ వచ్చారు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రారంభంలోనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తన ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వానం పంపి సున్నితంగా వ్యవహరించారు. తర్వాత ఒక రోజు నవాజ్ షరీఫ్ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశీ పర్యటన నుంచి హఠాత్తుగా పాకిస్తాన్ వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత భారత సైనిక స్థావరాలపై తీవ్రవాదుల దాడులు జరిగాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జమ్ము-కశ్మీర్ ఉరీలో జరిగిన దాడిలో 20 మంది సైనికులు మృతిచెందారు. రెండు దేశాల సంబంధాల్లో మళ్లీ చిచ్చు రేగింది.
ఆ తర్వాత ఎల్ఓసీ అవతలకు వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని భారత్ ప్రకటించింది. జమ్ము-కశ్మీర్‌లో తీవ్రవాదులు, వారి సానుభూతిపరులకు వ్యతిరేకంగా కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది.
అయితే, భారత పాలిత కశ్మీర్‌లో ఎక్కువ మంది, న్యూఢిల్లీలోని కొంతమంది మాత్రం భారత సైనిక విధానం వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యాయనే భావిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- ఇది ఫేక్ కాదు.. నిజంగానే ఈ పాముకు రెండు తలలున్నాయ్
- మహారాష్ట్ర: మనుషుల్ని చంపి తింటున్న పులి
- బిగ్‌బాస్-2: విజేత కౌశల్ అసలు కథ
- బిగ్ బాస్-2: 'ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయింది..." - బాబు గోగినేని
- బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?
- ‘‘మేం ఆర్యులం.. అసలైన ఆర్యులం...’’
- అభిప్రాయం: ‘శబరిమల తీర్పు’ సరే... మరి మన ఇళ్లల్లో ఆ నిషేధం పోయేదెన్నడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








