అభిప్రాయం: ‘శబరిమల తీర్పు’ సరే... మరి మన ఇళ్లల్లో ఆ నిషేధం పోయేదెన్నడు?

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంకా దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండు వారాల క్రితం, కొత్తగా పెళ్లైన నా స్నేహితురాలు మాట్లాడుతూ.. తీజ్ పండుగ రోజు ఉపవాసం, పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకునే హిందూ పండుగల్లో తీజ్ ఒకటి. కొత్తగా పెళ్లైనవారు తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ ఆ రోజు పూజలు చేస్తారు.

ఈ పండుగ జరుపుకునే మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రంతా గంట గంటకూ ప్రార్థనలు చేస్తారు.

అందుకోసం చేసుకుంటున్న ఏర్పాట్ల గురించి నా స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఫోన్లో చెప్పింది.

పండుగ రోజు కట్టుకునేందుకు కొత్త చీర కొనుక్కుంది. రెండు చేతుల నిండా చక్కగా మెహెందీ పెట్టుకుంది. అవన్నీ చెబుతున్నప్పుడు తన గొంతులో ఆనందాన్ని చూస్తుంటే, నాకు కూడా సంతోషంగా అనిపించింది.

కానీ, తీజ్ పండుగ నాడు ఉదయాన్నే ఆమెకు పీరియడ్స్ మొదలయ్యాయి. దాంతో ఉపవాసం, పూజలు చేయడానికి వీళ్లేదని తన తల్లితో పాటు, అత్తింటివాళ్లు అన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ పూజ గదిలో కూడా అడుగుపెట్టొద్దని, పూజకు వాడే వస్తువులను కూడా తాకవద్దని ఇంట్లో ఉండే పెద్దలు షరతులు పెట్టారు. అంతేకాదు, ఉపవాసం ఉంటున్న ఇతర మహిళలకు దూరంగా ఉండాలని చెప్పారు.

అది జరిగిన తర్వాత తను నాకు ఫోన్ చేసి దీనంగా తన ఆవేదన చెబుతుంటే, నా మనసు చలించిపోయింది.

పండుగ కోసం తను చేతుల నిండా చక్కగా మెహెందీ పెట్టుకుని ఉన్న ఫొటోలను వాట్సాప్‌లో చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. పట్టలేనంత కోపం వచ్చింది. తన స్వచ్ఛమైన మనసుకి, మంచితనానికి విలువ ఇవ్వకుండా పీరియడ్స్ పేరుతో పూజలు చేయొద్దంటూ అడ్డుకోవడం ఏమాత్రం సహేతుకం కాదనిపించింది.

శబరిమల

ఫొటో సోర్స్, SABARIMALA.KERALA.GOV.IN

శబరిమల తీర్పు

శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్న వార్త శుక్రవారం మా ఆఫీసు గోడలకు ఉన్న దాదాపు 20 టీవీ తెరలపై కనిపిస్తుంటే భోపాల్‌కు చెందిన నా స్నేహితురాలి కథ మళ్లీ గుర్తొచ్చింది.

ఇప్పటి వరకు కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశంపై నిషేధం ఉండేది. అది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగింది.

అయ్యప్ప స్వామి జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారని, అందుకే ఈ ఆలయంలోకి పీరియడ్స్ వచ్చే వయసులో ఉన్న మహిళలను అనుమతించడంలేదని దేవస్థానం చెబుతూ వచ్చింది.

ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లో 'భారత యువ న్యాయవాదుల సంఘం' సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాదాపు 12 ఏళ్ల పాటు సాగిన విచారణల తర్వాత ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ శుక్రవారం 4:1 మెజారిటీతో తుది తీర్పు వెలువరించింది.

కేవలం రుతుస్రావం కారణంతో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎప్ నారిమన్, జస్టిస్ ఏయం ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు, సంప్రదాయాలు తప్పక అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయితే, జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం ఈ తీర్పును వ్యతిరేకించారు.

శబరిమల

ఫొటో సోర్స్, SABARIMALA.KERALA.GOV.IN

కోర్టు తీర్పు గురించి టీవీల్లో చూస్తున్నప్పుడు, నా మదిలో యుక్తవయసులో ఉన్న నా మేనకోడలు మెదిలింది. తనకి రెండేళ్ల క్రితమే పీరియడ్స్ ప్రారంభమయ్యాయి. పీరియడ్స్ సమయంలో గుడికి, పూజ గదికి వెళ్లకూడదంటూ నానమ్మ హెచ్చరించిందంటూ ఓ రోజు తను నాతో మెల్లగా చెప్పడం గుర్తుకొచ్చింది.

ఆ సమయంలో వంటగదికి కూడా వెళ్లొద్దని, పచ్చడి జాడీలను ముట్టుకుంటే అందులోని పచ్చడి పాడైపోతుందని చెప్పేవారని మా కోడలు ఓసారి చెప్పింది.

"ఒక రోజు పీరియడ్స్ సమయంలో బాగా ఆకలి వేసి అన్నం తిందామని కిచెన్‌లోకి పరుగున వెళ్లి గిన్నె మూత తీశాను. వెనకాలనే మా నానమ్మ వచ్చి నన్ను తిట్టింది. మా అమ్మ ఇంకా ఎక్కువ తిట్టింది" అని చెబుతూ... ఎందుకు అలా అంటారు? అంటూ నన్ను అమాయకంగా ప్రశ్నించించింది. అందుకు నా దగ్గర సమాధానం లేదు.

ఒక్క నా మేనకోడలు మాత్రమే కాదు, దేశంలో వేలాది మంది బాలికలు ఆ ప్రశ్నకు సమాధానం కోసం చూస్తున్నారు.

అమ్మాయి

ఫొటో సోర్స్, AFP

మన ఆలోచన మారేదెన్నడు?

ఇప్పుడు శబరిమల ఆలయంలో మహిళల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. మరి, ఎన్నో ఏళ్లుగా మన మెదళ్లలో పేరుకుపోయిన ఇలాంటి మూఢవిశ్వాసాలను తొలగించుకునేది ఎన్నడు?

పీరియడ్స్ సమయంలో వంట గదికి వెళ్లేందుకు తలుపులు తెరిచేదెన్నడు?

పీరియడ్స్ లేదా రుతుస్రావం అనేది మహిళల శరీరంలో పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన సహజమైన ప్రక్రియ. అది అపవిత్రం ఎలా అవుతుంది?

యావత్ ప్రపంచాన్ని ఎదిరించేందుకైనా సుప్రీంకోర్టు మన వైపున నిలబడగలదు, కానీ జనాభాలో సగమైన మహిళల వైపున ఒక సమాజంగా మనం నిలబడేది ఎన్నడు? ఇవే ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)