ఆధార్ తప్పనిసరి కాకపోయుంటే.. ఈ అమ్మాయి ఇప్పుడు బతికుండేది

- రచయిత, రవి ప్రకాష్
- హోదా, బీబీసీ ప్రతినిధి ఝార్ఖండ్ నుంచి
సెప్టెంబర్ 28, 2017... సంతోషి కుమారి అనే 11ఏళ్ల అమ్మాయి ఆకలితో చనిపోయిన రోజు. ఆ దుర్ఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. తిండి కోసం ఏడుస్తూ తన కూతురు ప్రాణాలు కోల్పోయిన దృశ్యం ఇప్పటికీ ఆమె తల్లి కోయలీ దేవి కళ్లముందు కదలాడుతూనే ఉంది.
ఝార్ఖండ్‌లో సిండెగా జిల్లా, కారిమతి గ్రామం సంతోషి స్వస్థలం. ఇంట్లో సరుకులు లేని కారణంగా తల్లి కోయలీ దేవి పిల్లలకు అన్నం పెట్టలేకపోయింది. వాళ్ల ఆధార్ కార్డును రేషన్ దుకాణంలోని పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రానికి అనుసంధానించలేదన్న కారణంగా ఆ కుటుంబానికి అప్పటికి ఎనిమిది నెలలుగా రేషన్ అందలేదు. ఆధార్‌కు అనుసంధానించని అన్ని రేషన్ కార్డులను ఝార్ఖండ్ ప్రభుత్వం ఆ సమయంలో రద్దు చేసింది.
సంతోషి మరణం దేశ వ్యాప్తంగా అప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధార్‌తో పాటు దేశంలో ఆకలి పైన కూడా అనేక చర్చలు జరిగాయి. కొందరు సామాజిక కార్యకర్తలు రూపొందించిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలో 56మంది ఆకలితో చనిపోయారు.
ఇందులో 42 మరణాలు 2017-18 మధ్యే సంభవించాయి. వీటిలో 25 మరణాలకు ఆధార్ కార్డు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైంది. ప్రముఖ సామాజిక కార్యకర్తలు రితిక ఖేడా, సిరాజ్ దత్తా ఈ గణాంకాలను సేకరించారు.
వీటి ప్రకారం ఎక్కువ ఆకలి చావులు ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనే సంభవించాయి.


ఫొటో సోర్స్, Dhiraj
ఈ జాబితాను తయారు చేసిన సిరాజ్ దత్తా బీబీసీతో మాట్లాడుతూ... ‘దేశంలో ఆకలి చావులు మీడియాలో ప్రధాన వార్తలుగా మారకపోవడం చాలా బాధాకరమైన విషయం. గత నాలుగేళ్లలో 56మంది ఆకలితో చనిపోయినా, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం సరికాదు. మీడియా కథనాలు, మేం సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించాం. చనిపోయిన వాళ్లలో ఎక్కువమంది అణగారిన వర్గాలకు చెందినవారే’ అని చెప్పారు.
‘ప్రభుత్వాలు ఈ మరణాలను అంగీకరించకపోవడం మరింత ఆందోళనకరం. సంతోషితో సహా చాలా కేసుల్లో మరణాలకు ఇతర కారణాలను చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆకలి సమస్యను ప్రభుత్వం అంగీకరించి, దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలి. రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసినవాళ్లను కాకుండా ఈ కేసుల్లో ఎవరిని దోషులుగా పరిగణించాలి?’ అని సిరాజ్ పేర్కొన్నారు.
సంతోషి చనిపోయాక ఆమె తల్లి కోయలి దేవికి ప్రభుత్వం కేవలం 50వేల రూపాయలను నష్టపరిహారంగా అందించింది. ఇప్పటికీ ఆమె ఇంట్లో బియ్యం అంతంతమాత్రంగానే ఉన్నాయి. కూరగాయాలు, పండ్లు, పాలు అప్పుడప్పుడు అతిథుల్లా ఆమె ఇంటికి వచ్చి వెళ్తుంటాయి.
‘ఆధార్ కార్డు కారణంగానే నాకు రేషన్ అందలేదు. ఒకవేళ అది తప్పనిసరి కాకపోయుంటే నా బిడ్డ ఈరోజు బతికుండేది. ఆ కార్డు వల్లే తను చనిపోయింది. ఆ తరువాత ప్రభుత్వం మాకు రూ.50వేలు ఇచ్చింది. వాటిలో ఇప్పుడు కేవలం రూ.500 మా దగ్గర మిగిలున్నాయి. కొంత డబ్బు నా చికిత్సకు ఖర్చయింది. ఆ తరువాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ రేషన్ ఆగిపోతే మాకు ఆకలి చావే దిక్కవుతుంది’ అని కోయలి దేవి చెప్పారు.

కోయలి దేవి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అత్త వయసు 80ఏళ్లు దాటింది. ఆమె పెద్ద కూతురు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆమెకు చండో అనే తొమ్మిదేళ్ల పాప, ప్రకాష్ అనే మూడేళ్ల బాబు ఉన్నారు.
‘మాకొచ్చే అరకొర సంపాదనతో పిల్లలకు పోషకాహారం అందించడం కష్టం. ఈ ఆధార్ కార్డుల లాంటివి మాలాంటి వాళ్లకు అర్థం కావు. వాటి ఉపయోగాలేంటో మాకు తెలియవు. ఇప్పుడు తెలుసుకున్నా మా కూతురు తిరిగి రాదు కదా’ అంటారామె.
సంతోషి చనిపోయాక ఏం జరిగింది?
కోయలి దేవి కుటుంబం ప్రస్తుతం ఓ గుడిసెలో ఉంటోంది. దాని బయటే ఓ చింత చెట్టు ఉంది. గతంలో ఆమె భర్త ఒకరి దగ్గర బాజా వాయించేవారు. దాంతో ఆ యజమాని ఆ చెట్టును వీళ్లకు బహుకరించాడు. కానీ, కోయలి దేవి భర్త ఇప్పుడు ఆ పనిచేయట్లేదు. దాంతో, ఆ చెట్టు కాయలను ఆ మాజీ యజమానే తీసుకెళ్తున్నాడు. వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించే వెసులుబాటు కూడా లేకుండా పోయింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వీళ్లకు ఓ చిన్న మరుగుదొడ్డిని కూడా కట్టించి ఇచ్చింది.

ఫొటో సోర్స్, MansiThapliyal
సంతోషి చనిపోయాక ప్రభుత్వం స్పందించి, ఆ గ్రామస్తులకు కొవ్వొత్తులు, అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తామని, దాంతో వాళ్లు ఉపాధి పొందొచ్చని తెలిపింది. మేకలను, పందులను కూడా అందిస్తామని, వాటిని పెంచుకోవచ్చని చెప్పింది. కానీ, ఏడాది గడిచినా వాటిలో ఏ హామీ కూడా నెరవేరలేదు.
తమకు ఉపాధి కల్పించాల్సిన కాంట్రాక్టర్ ఎక్కడికో వెళ్లిపోయాడనీ, ఆ తరువాత ప్రభుత్వం పట్టించుకోలేదని ఓ మహిళ చెప్పారు.
ఆ ఊళ్లో ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డులను పంపిణీ చేశారు. అక్కడ ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సంతోషి మరణం తరువాత అక్కడ వచ్చిన మార్పు అదొక్కటే.
ఇవి కూడా చదవండి
- #AadhaarFacts: తల్లీబిడ్డలను కలిపిన ఆధార్
- ఆధార్ లింక్ లేక.. కూలీ డబ్బులు రాక..
- మీ వేలిముద్రలు ఎవరూ దొంగిలించకుండా కాపాడుకోండి
- కేరళ వరద బాధితులు: ‘అన్నీ కోల్పోయాం... మళ్లీ గల్ఫ్ దేశాలకు వలస పోతాం’
- ఇష్టపూర్వక వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీం కోర్టు
- చరిత్రాత్మక ఆధార్ కేసులో తొలి పిటిషనర్ పుట్టస్వామి
- లాల్ బహుదూర్ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా?
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- వాణిజ్య ప్రకటనల్లో పురుషుల ధోరణి మారుతోందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








