కేరళ వరద బాధితులు: ‘అన్నీ కోల్పోయాం... మళ్లీ గల్ఫ్ దేశాలకు వలస పోతాం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి, కొచ్చీ నుంచి
గత నెలలో వరదలు మిగిల్చిన విషాదం నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్కడి ప్రజలు అయిన వాళ్లను పోగొట్టుకోవడంతో పాటు ఆర్థికంగానూ చాలా నష్టపోయారు.
అలా తన చాలా ఏళ్ల కష్టార్జితాన్ని కోల్పోయిన వాళ్లలో సాజిత్ నంబూద్రి ఒకరు. ఆయన పదేళ్లకు పైగా గల్ఫ్ దేశాల్లో పనిచేసి, కొద్ది మొత్తంలో డబ్బు కూడబెట్టి, ఏడు నెలల క్రితమే కేరళకు వచ్చారు. ఇకపైన సొంతూరిలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కానీ, గత నెలలో వచ్చిన వరదల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
‘మేం అన్నీ కోల్పోయాం. ఇప్పుడు ఇంట్లోని అన్ని వస్తువులనూ మళ్లీ కొనాలి. లోన్ తీసుకోకుండా కారు, నాన్న కోసం స్కూటర్ కొన్నా. అవి రెండూ నీళ్లలో పూర్తిగా మునిగిపోయాయి.
గతంలో నేను దుబాయిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాణ్ణి. ఇప్పుడు మళ్లీ అక్కడికే వెళ్లిపోదామనుకుంటున్నా. నా పాస్‌పోర్టు కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త పాస్‌పోర్టు చేయించుకోవాలి.

ప్రస్తుతానికి ఇంట్లోకి రెండు మంచాలు కొన్నా. బావిని బాగా శుభ్రం చేసి, అందులోని నీళ్లు వాడొచ్చో లేదో తెలుసుకోవడానికి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించా. అందుబాటులో ఉన్న నీళ్లను కాగబెట్టాకే వాడుతున్నాం. బురదను పూర్తిగా తొలగించడానికి ఇంట్లోని టైల్స్ అన్నింటినీ తీసేసి, మళ్లీ వాటిని వేయించాల్సి వచ్చింది.
వరదల్లో పోగొట్టుకున్న అన్ని వస్తువులనూ ఇప్పుడు మళ్లీ కొనుక్కోవాలి’ అని సాజిత్ బీబీసీతో చెప్పారు.
త్రిశూర్ జిల్లాలోని వెట్టుకడవు పాలెంలో, చలకుడి నదికి కిలోమీటరు దూరంలో సాజిత్ ఇల్లు ఉంది. గత నెల 15న అతడి ఇంట్లో నీటిమట్టం 11 అడుగుల ఎత్తు వరకూ చేరుకుంది. నీటిమట్టం తగ్గేవరకు, వారం రోజులపాటు సాజిత్ ఇంటి మేడ మీదనే కాలం గడపాల్సి వచ్చింది.
కేరళ నుంచి పనికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వేలాది మందిలో సాజిత్ ఒకరు. వాళ్లంతా తమ సంపాదనలో 30-50 శాతం సొంతూరిలో ఇళ్ల నిర్మాణం, ఇతర వస్తువుల కోసమే ఖర్చు చేస్తారు. గత వారంలో విడుదలైన ‘కేరళ మైగ్రెంట్ సర్వే’ ప్రకారం ఏటా విదేశాల నుంచి కేరళకు వచ్చే డబ్బు విలువ రూ.85,092 కోట్లకు చేరింది.

ఇటీవలి కాలంలో వలస వెళ్లిన చాలామంది గల్ఫ్ దేశాల్లో పెరిగిన పన్నుల కారణంగానో, తల్లిదండ్రులతో ఉండేందుకో కేరళకు చేరుకున్నారు. గత ఐదేళ్లలో కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య 24లక్షల నుంచి 21లక్షలకు పడిపోయింది.
‘వరదల కారణంగా మళ్లీ గల్ఫ్‌కు వలసలు పెరిగే అవకాశం ఉంది. తిరిగొచ్చేసినవాళ్లు కూడా మల్లీ గల్ఫ్ బాట పట్టొచ్చు. ఇప్పటిదాకా ఇళ్లు కోల్పోయిన వాళ్లకు కొత్త ఇళ్లను కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు’ అని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ ఇరుదయ రాజన్ చెప్పారు.
కానీ, మళ్లీ గల్ఫ్ దేశాలకు వెళ్తే ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారితో పోటీతో పాటు మరింత కఠినతర పరిస్థితుల్లో వాళ్లు పనిచేయాల్సి రావొచ్చని కేరళ వాసులను ఆయన హెచ్చరించారు.
గతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ‘గల్ఫ్ దేశాలకు కేరళ నుంచి ఇదే చివరి దశ వలస అని నా అభిప్రాయం. మొత్తం అందరూ అక్కడికి వెళ్లిపోతే ఇక్కడెవరు మిగులుతారు? అందుకే, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి కేరళలో పనిచేస్తున్నారు’ అని రాజన్ చెప్పారు.

సాధారణంగా 20-34ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఇక్కడ ఉపాధి లభించక వలస వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. 1980-2010 మధ్య ఇలాంటి వలసలు ఎక్కువగా జరిగాయి. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇటీవలి కాలంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి అసంఘటిత రంగ కార్మికులు అత్యధిక సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు.
సౌదీ అరేబియాలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ట్యాక్స్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో తగ్గిపోతున్న చమురు ఆదాయం తదితర కారణాల వల్ల కేరళవాసులకు ఆ దేశాలపైన ఉండే ఆకర్షణ తగ్గిపోతోంది.
సాజిత్‌లా గల్ఫ్‌లో డబ్బులు సంపాదించే అవకాశాలు భవిష్యత్తులో అంత సులువుగా ఉండకపోవచ్చు. కానీ, పడిపోతున్న రూపాయి విలువ కారణంగా భారత్‌తో పోలిస్తే గల్ఫ్ దేశాల్లో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలూ లేకపోలేదు.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








