ఓషో పాత్రలో ఆమిర్ ఖాన్... ఆనంద్ షీలాగా ఆలియా భట్

ఆమిర్ ఖాన్, ఆలియా భట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆమిర్ ఖాన్, ఆలియా భట్

భారతీయ ఆధ్యాత్మిక బోధకుడిగా పేర్కొనే రజనీష్ జీవిత చరిత్రపై నెట్‌ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్ రూపొందించనుందని ద క్వింట్ తెలిపింది. ఇందులో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆయన పాత్రను పోషించనున్నట్టు వివరించింది.

ఓషోపై ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ పేరుతో ఒరిజినల్ డాక్యుమెంటరీ వెలువరిచిన నెట్‌ఫ్లిక్స్.. అది హిట్ కావడంతో ఇప్పుడు ఆయన జీవితకథతో మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు క్వింట్ కథనం తెలిపింది.

వైల్డ్ వైల్డ్ కంట్రీ సిరీస్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మార్చి 16న ఆరు ఎపిసోడ్స్ అందించింది. ఆరున్నర గంటల నిడివితో ఉన్న ఈ డాక్యుమెంటరీని సూడాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు.

తాజా వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓషోగా నటిస్తుండగా, ఆయన పర్సనల్ సెక్రటరీ మా ఆనంద్ షీలా పాత్రను అలియాభట్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ ప్రాజెక్టును ఆమిర్ స్వీయ నిర్మాణ సంస్థ అయిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించనున్నారు.

ఓషో

ఫొటో సోర్స్, Getty Images

సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సేక్రెడ్ గేమ్స్ భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు ఒక గుర్తింపు తీసుకురావడంతో తమ పరిధిని, గుర్తింపును మరింత పెంచుకోడానికి ఈసారి ఆమిర్ ఖాన్, అలియా భట్‌తో ఓషో జీవితం తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు.

రజనీష్‌పై వచ్చిన వైల్డ్ వైల్డ్‌ కంట్రీ సిరీస్‌కు భారత్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించిందని నెట్‌ఫ్లిక్స్‌కు తెలుసు. కానీ అది రజనీష్ ఒరిజినల్ ఫుటేజ్ ఉన్న డాక్యుమెంటరీ. ఇప్పుడు అదే పాత్రలో ఆమిర్ ఖాన్‌ను ఓషోగా చూపిస్తూ, ప్రజలపై ఆయన ప్రభావం గురించి, ఆధ్యాత్మికత, సస్పెన్స్, శృంగారం కలిపి చూపించాలని అనుకుంటున్నారు.

ఈ సిరీస్‌లో ముఖ్యంగా ఆరెగాన్‌లో ఓషో, ఆయన సెక్రటరీ మా ఆనంద్ షీలా జీవనంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్, రజనీష్, నెట్‌ఫ్లిక్స్

ఫొటో సోర్స్, Getty Images

వైల్డ్ వైల్డ్ కంట్రీలో చూపించిన అంశాలను ఆమిర్ ఖాన్ తెరపై చేస్తారా, లేక కొత్త సిరీస్‌ పుణెలో రజనీష్ గత జీవితం గురించి చెబుతారా అనేదానిపై ప్రశ్నలు ఉన్నాయి.

సేక్రెడ్‌గేమ్స్‌లో రాజీవ్ పేరు ప్రస్తావించడంపై వివాదం తలెత్తడంతో, ఆమిర్ ఖాన్ చేస్తున్న ఓషో సిరీస్ పైన కూడా ఆయన అనుచరుల నుంచి వ్యతిరేకతలు వస్తాయేమోనని భావిస్తున్నారు.

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్న ఆయన తర్వాత ప్రాజెక్టు ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు క్వింట్ చెప్పినట్టు నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఆమిర్ ఓషో పాత్రలో కనిపిస్తే, సైఫ్ తర్వాత వెబ్ సిరీస్‌లో మరో బాలీవుడ్ నటుడు సంచలనం సృష్టించినట్టే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)