'సేక్రెడ్ గేమ్స్'లో రాజీవ్ గాంధీని ఏమన్నారు?

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGES
- రచయిత, మొహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఇండియన్ సిరీస్ 'సేక్రెడ్ గేమ్స్' గురించి రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. ఒక కాల్పనిక వెబ్ సిరీస్‌లోని ఒక పాత్రతో తన తండ్రి(రాజీవ్ గాంధీ) ఆలోచనలను మార్చలేరని అన్నారు.
జులై 6న ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో ఉంది.
విడుదలైన ఐదు రోజుల తర్వాత నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పై.. సిరీస్ నిర్మాతలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత రాజీవ్ సిన్హా కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వెబ్ సిరీస్ ద్వారా భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని అవమానించారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది కూడా కేసు పెట్టారు.
అయితే, శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ మరో రకంగా స్పందించారు. బీజేపీ/ఆర్ఎస్ఎస్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నియంత్రించాలని భావిస్తున్నాయని రాహుల్ అన్నారు.
"మా నాన్న భారతదేశానికి సేవ చేస్తూ జీవించారు, మరణించారు. కల్పితమైన ఒక వెబ్ సిరీస్‌లోని పాత్ర దాన్ని ఎప్పటికీ మార్చలేదు" అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాహుల్ గాంధీ ఈ ట్వీట్‌తో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
అయితే.. ఈ సిరీస్‌లో కేవలం రాజీవ్ గాంధీని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు.
ఈ సిరీస్ హిందుత్వవాదులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో బాబ్రీ విధ్వంసం, షా బానో కేసు గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం కావచ్చు.

ఫొటో సోర్స్, NETFLIX
రాజీవ్ గాంధీ గురించి ఏమన్నారు?
"1977లో దేశంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నడిచేది, ప్రభుత్వం జనాల '---` (అంగం) కోస్తూ వెళ్లేది ".
కాంగ్రెస్ నేతలు 'సేక్రెడ్ గేమ్స్' సిరీస్‌లో ప్రధాన పాత్ర గణేష్ గైతోండే(నవాజుద్దీన్ సిద్దిఖీ) పలికే ఈ ఒక్క డైలాగునే తప్పుబట్టడం లేదు.
విక్రమాదిత్య మోత్వానీ, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మొదటి సిరీస్ 8 ఎపిసోడ్లలో ఇలాంటివి చాలా డైలాగులు ఉన్నాయి. వాటిపై కూడా కొంతమంది నుంచి అభ్యంతరాలు రావచ్చు.
మొదటి డైలాగునే తీసుకుంటే, ఎమర్జెన్సీ సమయంలోని కుటుంబ నియంత్రణ ఆధారిత మాఫియా గురించి గైతోండే తన మాటల్లో చెబుతాడు. ఆ సమయంలో అతడు మొదటిసారి ముంబయిలో అడుగు పెడతాడు.
మరో ఎపిసోడ్ ప్రారంభంలోనే గైతోండే తన కథను ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతుంటాడు.
ఆ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అంత్యక్రియలు, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి కావడం, బోఫోర్స్ ఫిరంగుల దృశ్యాలు కనిపిస్తాయి. అప్పటివరకూ గైతోండే ఒక మామూలు గూండాగా ఉంటాడు.
"1985లో అమ్మ చనిపోవడంతో కొడుకు పీఎం అయ్యాడు. పీఎం అయ్యాక బోఫోర్స్ కుంభకోణం చేశాడు. దేశంలో ప్రధానిపై నమ్మకం లేనపుడు, నేను ముక్కుసూటిగా వెళ్తే ఏం జరుగుతుందిలే" అని అతడు తన కథ చెబుతాడు"
బోఫోర్స్ కుంభకోణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు రావడం వాస్తవమే. కానీ అది ఎప్పుడూ నిరూపితం కాలేదు.
సిరీస్‌లో మహిళలపై హింస, బలవంతంగా సెక్స్ లాంటివి కూడా నింపేశారు. నెట్‌ఫ్లిక్స్ ఒక అమెరికా సంస్థ. అందుకే దీని రిలీజ్ గురించి నిర్మాతలు ఏమాత్రం ఆలోచించలేదు.
ఇలాంటి దృశ్యాల వల్లే నెట్‌ఫ్లిక్స్‌లో సేక్రెడ్ గేమ్స్ సిరీస్‌కు 16+ గ్రేడింగ్ ఇచ్చారు.
గణేష్ గైతోండే పేరుతో నడిచే మాఫియా చుట్టూ తిరిగే ఈ సిరీస్‌లో 70 నుంచి 90వ దశకం వరకూ చూపించారు. ఆ సమయంలో దేశంలో అత్యవసర స్థితి, రామ మందిరం ఆందోళనలు, మండల్ కమిషన్ లాంటి చారిత్రక ఘటనలు జరిగాయి.
సిరీస్‌లో వీటి ప్రస్తావన ఉంది. ఈ సిరీస్‌లో గ్యాంగ్‌వార్, మతం అన్నీ సమాంతరంగా నడుస్తుంటాయి. అదే సమయంలో ముంబయిలో గ్యాంగులు మతాల ఆధారంగా విడిపోయాయి.

ఫొటో సోర్స్, NETFLIX
ఇందులో మరో కీలక పాత్ర అయిన సబ్ ఇన్‌స్పెక్టర్ సర్తాజ్ సింగ్(సైఫ్ అలీ ఖాన్)ను పట్టుకున్నప్పుడు మాఫియా అంటుంది. అతడి ఖాకీ బట్టలను, బాడీని విడివిడిగా తగలబెట్టండి అని చెబుతుంది. దాంతో మరోసారి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.
గైతోండే "ఆ రాజీవ్ గాంధీ కూడా అలాగే చేశాడు. షా బానోను, దేశాన్ని విడివిడిగా తగలబెట్టాడు. 1986లో షా బానోకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో ఆమె కోర్టులో అతడిపై కేసు వేసి గెలిచింది. కానీ ఆ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఆ '---` (పిరికివాడు) నోర్మూసుకో అన్నాడు. కోర్టు కేసును తలకిందులు చేసి షా బానోను ముల్లాల ముందు పడేశాడు. దాంతో తను హిందువుల నుంచి చాలా తిట్లు తినాల్సి వచ్చింది. వాళ్లను సంతోషపెట్టడానికి టీవీలో రామాయణం మొదలు పెట్టారు. ప్రతి సండే ఉదయం దేశమంతా టీవీకి అతుక్కుపోయేది. వాళ్లలో అందరికంటే పెద్ద భక్తుడు మన బంటీనే. దేవుడి మార్గంలో వెళ్తే అన్ని దారులూ ఖాళీ అవుతాయని బంటీకి అప్పుడే అర్థమైంది". అంటాడు.
"ప్రధానమంత్రి చేసిన ఆ పని మొత్తం దేశాన్నే కుదిపేసింది"
ఇందులో షా బానో కేసు, రామ మందిరం ఆందోళనల ప్రస్తావన ఉంది. భరణం గురించి షా బానో తరఫున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రకంగా భావించారు. ఆ తర్వాత పార్లమెంటులో 1986 ముస్లిం మహిళల (విడాకులపై హక్కుల రక్షణ) చట్టం తీసుకొచ్చారు.
ముస్లింల మెప్పు పొందడానికి అప్పటి ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని భావిస్తారు.

ఫొటో సోర్స్, NETFLIX
ఒక దగ్గర గైతోండే చరిత్ర పుటలు తిరగేస్తాడు. "బ్యాడ్ టైం చెప్పకుండానే మొదలైపోయింది. టైమ్ అంటే అలాగే ఉంటుంది. దేశమంతా బలహీనంగా అనిపిస్తోంది. కశ్మీర్‌లో హోం మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయ్యింది. దిల్లీలో మండల్ పేరుతో పిల్లలు తమపైనే కిరోసిన్ పోసుకుంటున్నారు. పార్లమెంటులో ప్రధాన మంత్రిని రోజూ బనియన్ మార్చినట్టు మార్చేస్తున్నారు. కానీ నేను గోపాల్‌మఠ్‌ను అంత తేలిగ్గా వదుకునేవాడ్ని కాదు" అంటాడు.
ఈ సిరీస్‌లో 1992లో డిసెంబర్‌లో బాబ్రీ మసీద్ కూల్చివేత, తర్వాత జరిగిన మతఘర్షణల ప్రస్తావన కూడా ఉంది.
రచయిత విక్రమ్ చంద్ర నవల "సేక్రెడ్ గేమ్స్" ఆధారంగా తీసిన ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్లో క్రెడిట్స్ ప్రారంభంలో జై శ్రీరాం నినాదాలు, బాబ్రీ మసీదుపై ఎక్కుతున్న కరసేవకుల దృశ్యాలు కనిపిస్తాయి. వీటితోపాటూ రథయాత్ర దృశ్యాలూ ఉన్నాయి.
ముంబయి మాఫియాతోపాటు మతం, హిపోక్రసీ చుట్టూ తిరిగే ఎపిసోడ్స్ వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక తర్వాత వచ్చే సిరీస్ మిగతా ఎపిసోడ్స్ ఎవరికి ఎంత ఆగ్రహం కలిగిస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా
- హైదరాబాద్: ఇతను సంగీతంతో ఆటిజాన్ని జయించాడు, వారానికి ఓ భాష నేర్చుకుంటున్నాడు
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- 5,300 ఏళ్ల కిందటి మంచుమనిషి చివరిగా ఏం తిన్నాడు?
- కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం: ఎడిటర్స్ కామెంట్
- 34 ఏళ్లు వెతికితే కానీ భారత మొదటి ఒలింపియన్ కుటుంబం ఆచూకీ దొరకలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








