వెంకయ్యనాయుడు వ్యాసం: ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, M Venkaiah Naidu
- రచయిత, ముప్పవరపు వెంకయ్యనాయుడు
- హోదా, భారత ఉప రాష్ట్రపతి, బీబీసీ న్యూస్ తెలుగు కోసం
"పోలీసు అధికారి వ్యక్తిగత కక్షతో పౌరుడిని కాల్చి చంపినా పౌరుడికి న్యాయపరంగా ఎలాంటి సహాయం అందజేయాల్సిన అవసరం లేదు" అని 1976 ఆగస్టులో అప్పటి అటార్నీ జనరల్ నీరెన్ డే సుప్రీంకోర్టుకు విన్నవించారు.
'హెబియస్ కార్పస్' కేసుగా పేరుపొందిన జబల్‌పూర్ వర్సెస్ శివ్ కాంత్ శుక్లా కేసులో ఆయనీ వాదనలు చేశారు.
అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాన్నే ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. అటార్నీ జనరల్ మాటలు వినగానే కోర్టు హాల్లో ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తప్ప మిగతా నలుగురు న్యాయమూర్తులు పెదవి విప్పలేదు. దీంతో ప్రభుత్వ వాదనే నెగ్గింది.
ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) నాటి చీకటి రోజులు ఇలా ఉండేవి.
రాజ్యాంగం ప్రకారం పౌరులకు దక్కిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్ ఖన్నా తన పదవిని కోల్పోయారు.
ఆయన స్థానంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే జస్టిస్ హెస్ఎం బేగ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. న్యాయవ్యవస్థలో విలువలు అథమ స్థాయికి పడిపోయిన రోజులవి.

ఫొటో సోర్స్, M Venkaiah Naidu
‘మీడియా ఏకంగా పాకుతోంది'
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించే మీడియా.. దేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రజల పక్షాన నిలబడేందుకు దక్కిన చరిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకుంది.
అప్పటి ప్రభుత్వ నిరంకుశ ఆదేశాలకు అనుగుణంగా సాగిలపడి వ్యవహరించింది. రామ్‌నాథ్ గోయెంకా నేతృత్వంలోని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద స్టేట్స్‌మన్, మెయిన్‌స్ట్రీమ్ లాంటి కొన్ని పత్రికలే ఇందుకు మినహాయింపు.
మీడియా వైఖరిని తప్పుబడుతూ ఎల్‌కే ఆడ్వాణీ- "వంగండి చాలు అని ప్రభుత్వం అంటే మీడియా ఏకంగా పాకుతోంది'' అని పదునైన విమర్శ చేశారు.
ఇవన్నీ రెండేళ్ల ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో నిరంకుశ పాలనలో జరిగిన పరిణామాలు.
రాజ్యాంగ సవరణలను కోర్టులు సమీక్షించేందుకు వీల్లేకుండా రాజ్యాంగాన్ని సవరించారు. దీని ఫలితంగా రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఎలాగైనా మార్చుకోవచ్చు. ప్రజల స్వేచ్ఛ, జీవితాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏమైనా చేసుకుపోవచ్చు.
అంతకంతకూ పెరిగిపోతున్న అవినీతిపై, ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నుంచి నిరంకుశ ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకే నాడు ఇవన్నీ చేశారు.

ఫొటో సోర్స్, M Venkaiah Naidu
నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో
ఎవరైనా పౌరుడిని వ్యక్తిగత శత్రుత్వంతో కాల్చిచంపేసే అధికారం పోలీసు అధికారికి ఉండటం, ఈ అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆమోదించడం, ప్రజల గొంతును వినిపించాల్సిన మీడియా పాలకులకు సాగిలపడిపోవడం, ప్రజలకు వారి ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కులను ప్రభుత్వం నిరాకరించడం, రాజ్యాంగాన్ని పాలకులు తమకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడం- ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ కాలంలో జరిగాయి.
నాటి చీకటి రోజుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Shanti Bhushan
బతకడానికి తిండి ఉంటే సరిపోదు
మనిషి బతకడానికి తిండి ఉంటే సరిపోదు. ఎమర్జెన్సీకి కారణమైనవారిని 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా భారత్‌లోని పేదలు, నిరక్షరాస్యులు ఇదే విషయాన్ని చాటి చెప్పారు. ఎమర్జెన్సీ విధింపుతో 1975 జూన్ 25న జరిగిన తప్పిదాన్ని 1977 మార్చి 21న ప్రజలు తమ తీర్పుతో సరిచేశారు. ఎమర్జెన్సీ అమలైన ఆ 21 నెలలు స్వతంత్ర భారత చరిత్రలో నిజమైన చీకటి రోజులు. ఇది ఎన్నటికీ మరచిపోలేని బాధాకరమైన అనుభవం. ఇలాంటి అనుభవాలను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటూ ఉండాలి. ఎందుకంటే మనకు బతకడానికి తిండి ఉంటే సరిపోదు. స్వేచ్ఛ కూడా ఉండాలి. స్వేచ్ఛను పొందే హక్కు మనకుంది. స్వేచ్ఛ లేని జీవితం అర్థం లేనిది.
ఎమర్జెన్సీ కాలంలో నేను బాధాకర అనుభవాలను ఎదుర్కొన్నాను. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్న నేను రెండు నెలలపాటు అజ్ఞాతంలో ఉండి సీనియర్ నాయకులకు సహాయ సహకారాలు అందించాను. తర్వాత అధికారులు నన్ను అదుపులోకి తీసుకొని 17 నెలలకు పైగా జైల్లో పెట్టారు.
ఈ పరిణామం నా జీవితాన్ని మలుపు తిప్పింది. తోటి ఖైదీలు, సీనియర్ నాయకులతో జరిపిన చర్చలు, సంభాషణలు ప్రజలు, అధికారం, రాజకీయాలు, దేశం- అనే అంశాలపై నేను ఒక స్పష్టమైన దృక్పథాన్ని పెంపొందించుకొనేలా చేశాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలనే నా సంకల్పాన్ని జైలు జీవితం మరింత బలోపేతం చేసింది.

ఫొటో సోర్స్, Bushan
నాటి చీకటి రోజుల గురించి తెలుసుకోవాలి
నేడు దేశ జనాభాలో 1977 తర్వాత పుట్టినవారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం వారిదే. వారు దేశ చరిత్రను ముఖ్యంగా ఎమర్జెన్సీ కారణాలను, పర్యవసానాలను, నాటి చీకటి రోజుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
1975లో ప్రజల ప్రాథమిక హక్కులను లాగేసుకోవడాన్ని సమర్థించే కారణమేదీ లేదు.
దేశంలో అంతర్గతంగా కల్లోలం ఉందని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందనే పేలవ కారణాన్ని ప్రభుత్వం చూపింది.
నిజానికి నాడున్న అలజడి ఏమిటంటే- అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమవుతుండటం, 'నవ భారత్' కోసం వినిపిస్తున్న డిమాండ్లకు మద్దతు పెరుగుతుండటమే. ఇంకో కారణం ఏమిటంటే- లోక్‌సభ సభ్యురాలిగా నాటి ప్రధాని ఎన్నికను చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించడం.
ఈ నేపథ్యంలోనే, ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించే, వాటిని రక్షించే రాజ్యాంగాన్ని పక్కనబెట్టారు. ఎమర్జెన్సీ విధింపు అత్యంత తీవ్రమైన నిర్ణయం. అది దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది.

ఫొటో సోర్స్, Bushan
దేశమే ఒక పెద్ద జైలులా మారిపోయింది
ఆ చీకటి రోజుల్లో దేశమే ఒక పెద్ద జైలులా మారిపోయింది. ప్రతిపక్షానికి చెందిన ప్రతి నాయకుణ్నీ జైలుకు తరలించారు.
నిద్రలో ఉన్న వారిని సైతం లేపి, సమీపంలోని జైలుకు బలవంతంగా తీసుకెళ్లారు. జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే ఆడ్వాణీ, జార్జ్ ఫెర్నాండెజ్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, నానాజీ దేశ్‌ముఖ్, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, సికందర్ భక్త్, హెచ్‌డీ దేవెగౌడ, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాస్వాన్, సుబ్రమణ్య స్వామి, లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌తో దేశ భద్రతకు ముప్పుందంటూ వారిని జైల్లో పెట్టింది. మూడు లక్షల మందికి పైగా నాయకులను, వ్యక్తులను కారాగారంలో ఉంచింది. వీరిలో నాడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధినేతగా ఉన్న బాలా సాహెబ్ దేవరస్ కూడా ఉన్నారు.
నేడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు.

‘..వాళ్లు పతనమవ్వక తప్పదు’
ఎమర్జెన్సీ చీకటి రోజులతో భారత దేశ ప్రజాస్వామ్య భావన పునాదులే కదిలిపోయాయి. నాటి రోజులను మళ్లీ రానివ్వకూడదని దేశం సంకల్పం తీసుకొంది. నాటి చీకటి రోజుల నుంచి నేర్చుకున్న పాఠాలను దేశం తనకు తాను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా యువత, స్వతంత్ర భారత చరిత్రలోని నాటి చీకటి కాలం గురించి తెలుసుకోవాల్సి ఉంది.
''నన్ను నిస్పృహ ఆవరించినప్పుడు, చరిత్రలో ప్రేమ, సత్యం విజయం సాధించిన తీరును గుర్తుచేసుకొంటాను. ఒక దశలో నిరంకుశులు, క్రూరులు అజేయులుగా కనిపిస్తారు. కానీ చివరకు వాళ్లు పతనమవ్వక తప్పదు'' అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు.
తన సముచిత స్థానంలో తాను నిలిచేందుకు 'నవ భారత్' ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, చీకటి రోజుల జ్ఞాపకాలు మనల్ని వెలుగుల వైపు నడిపించాలి.
ఇవి కూడా చదవండి:
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- రాహుల్ ముందున్న అతిపెద్ద సవాళ్లు!
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- పీవీ నరసింహారావుది ‘తప్పుడు అంచనా’నా? లేక ‘నిర్ణయం తీసుకోవడంలో జరిగిన తప్పా’?
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- అభిప్రాయం: మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లరు. ఎందుకంటే..
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- రాజకీయాలను తలకిందులు చేసిన 5 బలపరీక్షలు
- బీజేపీ: అటల్- అడ్వాణీ నుంచి మోదీ-షా వరకు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








