కాంగ్రెస్ పార్టీకి రాహుల్ పునర్వైభవం తేగలరా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 132 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టబోతున్నారు.
పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పేరు సోమవారం ఖరారయ్యింది. అధ్యక్ష పదవికోసం కొన్నిరోజుల క్రితమే రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై డిసెంబర్ 16న బాధ్యతలు చేపడతారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. 543 ఎంపీ సీట్లకుగానూ కేవలం 44 సీట్లకే పరిమితమైంది. దీంతో బీజేపీ ప్రభుత్వం సునాయాసంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు ఇంత ఘోర పరాజయం ఎదురవడం ఇదే తొలిసారి.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వరుసగా ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలను మినహాయిస్తే తక్కిన మూడూ చిన్న రాష్ట్రాలే!
ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తవ్వాల్సివుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత చూపారు. 2009-2014 మధ్య తన ఓటుబ్యాంకులో దాదాపు 9శాతం ఓట్లను కాంగ్రెస్ పోగొట్టుకుంది.
మైనారిటీలు, కొన్ని కులాల ఓట్లు దూరమయ్యాయి.
''కాంగ్రెస్ పార్టీ తన సామాజిక పునాదిని కోల్పోయింది'' అని ప్రముఖ రాజకీయవేత్త సుహాస్ పాల్సికర్ అన్నారు.
ఇంతవరకూ కాంగ్రెస్ ఓడిపోయిన రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టం.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1962లో చివరిసారిగా గెలిచింది. పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి ఇప్పటిదాకా అధికారంలోకి రాలేదు.
బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లాంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పరిస్థితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పునరావృతమవుతున్నట్టు కనిపిస్తోంది.
ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 1998 నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఎంపీ స్థానాలు
1998లో 141
1999లో 114
2004లో 145
2009లో 206
2014లో 44

ఫొటో సోర్స్, AFP
బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ తలరాతను 47 సంవత్సరాల రాహుల్ గాంధీ మార్చగలరా?
రాహుల్ గాంధీ 13 సంవత్సరాల క్రితం రాజకీయ రంగప్రవేశం చేశారు. అది కూడా తన కుటుంబం వరుసగా పోటీచేస్తోన్న అమేథీ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు.
అప్పటినుంచి ఈ ఐదో తరం వారసుడు రాజకీయాల పట్ల ఆసక్తిగా లేనట్లుగా కనిపించారు.
2013లో పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ పార్టీని ఏమాత్రం మెరుగు పరచలేకపోయారు.
పార్టీలోని యువశక్తిని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. పైగా.. ఆ ప్రయత్నంలో కార్పొరేట్ వాతావరణం కనిపించింది.
రాజకీయంగా ఆశించినంత ఫలితం కనబడకపోగా పార్టీ పతనం కూడా ఆగలేదు.

ఫొటో సోర్స్, AFP
కానీ కొన్నాళ్ల కిందట ఓ మార్పు కనిపించింది. సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. అక్కడి విద్యార్థులు, అధికారులు, జర్నలిస్టులతో మాట్లాడారు.
వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. తన పరిమితులను వినయంగా ఒప్పుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థులతో మాట్లాడుతూ.. తనకంటే నరేంద్ర మోదీ బాగా మాట్లాడుతారని అన్నారు.
రాహుల్ సోషల్ మీడియా ప్రచారం కాస్తంత సానుకూల ఫలితాలనిస్తోంది. గతంతో పోలిస్తే రాహుల్.. చాలా ఉల్లాసంగా, చురుకుగా కనిపిస్తున్నారు.
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేయడం, తన పెంపుడు కుక్క వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్‌లో మొత్తం 26 సీట్లనూ బీజేపీయే గెలుచుకుంది.
కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా.. ఇలాంటి సమయంలో కూడా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సవాల్ రాహుల్ స్వీకరించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను మెప్పించేలా రాహుల్ ప్రవర్తించారు.
నిరుద్యోగం, నోట్ల రద్దు, దేశంలో పెరుగుతున్న అసహనం, ఆర్థికరంగ మందగమనం, నెరవేరని మోదీ హామీలు మొదలైన అంశాలపై చాలా స్పష్టంగా మాట్లాడారు.

ఫొటో సోర్స్, EPA
''ఈ కొత్త అవతారంలో రాహుల్ గాంధీ.. ఓటర్లతో ఎక్కువసేపు గడపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు'' అని రాహుల్ జీవితంపై పుస్తకం రాసిన ఆర్తి రామచంద్రన్ అన్నారు.
రాహుల్ గాంధీ ఉత్సాహం, ఉత్తేజం పార్టీ శ్రేణుల్లో కొత్త బలాన్ని నింపినట్టు కన్పిస్తోంది. కానీ ఎన్నికల్లో గెలవాలంటే మాత్రం రాహుల్ గాంధీకి మరింత రాజకీయ పరిజ్ఞానం, సరికొత్త రాజకీయ వ్యూహాలు ఖచ్చితంగా అవసరమే.
ఆర్థికరంగంలో రాహుల్ దార్శనికత ఏమిటో యువతకు వివరించడం చాలా అవసరం.
రాష్ట్రాల్లో చురుకైన, చరిష్మా ఉన్న నాయకులను గుర్తించి, వారిని ప్రోత్సహించడం, ప్రాంతీయ పార్టీలతో మైత్రీ సంబంధాలు నెరపడం, పార్టీ అధికారంలోవున్న రాష్ట్రాల్లో పాలన సవ్యంగా సాగేట్టు చూడటం.. ఇవన్నీ ప్రస్తుతం రాహుల్ ముందున్న లక్ష్యాలు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన ఉనికిని పోగొట్టుకుందని డా.పాల్సికర్ చెబుతున్నారు.
''దేశ రాజకీయాల్లో పోటీ పెరిగింది. ఏకపార్టీ పాలన అన్న ఆలోచన నుంచి ప్రజలు బయటికొచ్చారు. ప్రస్తుతం బహుళ పార్టీల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రజలు కూడా ఈ మార్పునే కోరుకుంటున్నారు. మరోవైపు సంకీర్ణ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి'' అని పాల్సికర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ.. అవినీతి రహిత పార్టీగా కనిపించాలి. అధికారంలో ఉన్నపుడు తలకెత్తుకున్న అపవాదుల నుంచి బయటపడాలి.
నేతల అవినీతి.. పార్టీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. మరీ ముఖ్యంగా బలవంతుడైన మోదీని ఢీ కొట్టేలా పార్టీ బలపడాలి.
తన వంశము, వారసత్వము రాహుల్ గాంధీ భుజాలపై ఎక్కువ బరువును మోపుతున్నాయి. వాటితో పోరాడటమే.. రాహుల్‌కు అన్నిటికన్నా కష్టమైన పని అని కొందరు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ తన జీవిత మూలాలను రాజకీయాలకు అనుకూలంగా మార్చుకున్నారు. అమెరికాలోని విద్యార్థులు వారసత్వ రాజకీయాల గురించి మోదీని ప్రశ్నించినపుడు -
''భారత్‌ను ఇంతవరకూ వారసత్వ రాజకీయాలు పాలించాయి. అది గతం..'' అని మోదీ సమాధానమిచ్చారు.
‘మైనారిటీలను సంతృప్తి పరచడం’
దేశంలోని ప్రాంతీయపార్టీలను రాజకీయ వారసత్వాలే నడిపిస్తాయి. బీజేపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
''భారతీయ ఓటర్లు రాజకీయ వారసులకు ఓటెయ్యడానికి విముఖత చూపడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి'' అని రాజకీయవేత్త సంజయ్ కుమార్ వివరించారు.
డా.కుమార్ అంచనా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ప్రాధాన్యమిస్తోందన్న కారణంతోనే చాలా మంది ఓటర్లు పార్టీకి దూరమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన మెజారిటీ హిందువులు కేవలం 16శాతమే!
సి.ఎస్.డి.ఎస్. అధ్యయనం ప్రకారం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రతి 10 మంది ఓటర్లలో 6 మంది ముస్లిములు, గిరిజనులు, సిక్కులు, క్రిస్టియన్లు. కానీ బీజేపీ విషయంలో ఈ గ్రూపుల ఓట్లు ప్రతి పది ఓట్లలో మూడు ఓట్లు మాత్రమే ఉంటాయి.
''హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం రాహుల్ గాంధీకి చాలా అవసరం. హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకోకుండా, హిందువులను వ్యతిరేకించకుండా హిందూ జాతీయవాదాన్ని వ్యతిరేకించాలి.
ఇదీ రాహుల్ ముందున్న పెను సవాలు!'' అని విశ్లేషకులు అజాజ్ అష్రఫ్ అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
అసలు 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారా లేక పార్టీ అధ్యక్షుడుగా ఉంటూనే మరో వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
''కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలు తప్ప సిద్ధాంతాలు ఉండవు. ఒకవేళ ఉంటే.. ఆ సిద్ధాంతం కూడా అధికారం సాధించడమే!'' అని కాంగ్రెస్ పార్టీపై పుస్తకం రాసిన జోయా హాసన్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లే మోదీ పాలనలో కూడా పునరావృతమయ్యే వరకూ వేచివుండి, ఆపై అదను చూసుకుని అధికారం సంపాదిద్దామని భావిస్తే.. అధికారం దక్కించుకోవడం రాహుల్‌కు పెను సవాలే!
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








