రాహుల్ అయికిడో ఫొటోలు ట్విటర్‌లో వైరల్

ఫొటో సోర్స్, twitter.com/bharad
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాటలతో పంచ్‌లు విసిరే రాహుల్ గాంధీ, ఇకపై అవసరమైతే చేతులతోనూ విసరగలరేమో అనిపిస్తోంది కదా ఈ ఫొటోలు చూస్తుంటే!!
మొన్నా మధ్య జపాన్ మార్షల్ ఆర్ట్స్ అయికిడోలో తనకు బ్లాక్ బెల్ట్ ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబితే చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు అదే నిజమైంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌గా మారాయి.
రాహుల్ గాంధీతోపాటు అయికిడో నేర్చుకుంటున్న భరద్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. వీటిని కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న దివ్య స్పందన రీ ట్వీట్ చేశారు.
ఆ ఫొటోలను 2016 డిసెంబరులో తీసినట్లు బీబీసీతో భరద్ చెప్పారు.
"ఈ ఫొటోలను నేనే షేర్ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధాలు లేవు" అని ఆయన వివరించారు.
"అయికిడో నేర్చుకుంటున్నప్పుడే రాహుల్ గాంధీ పరిచయం అయ్యారు. ఆయనతో కలిసి శిక్షణ పొందడం చాలా బాగుంది" అని భరద్ అన్నారు.
నిత్యం క్రమం తప్పకుండా అయికిడోను రాహుల్ గాంధీ సాధన చేసే వారని, తరగతి గదిలో చాలా మౌనంగా ఉండేవారని భరద్ చెప్పారు. జపాన్ మార్షల్ ఆర్ట్స్ అయికిడో ప్రాచుర్యానికి ఈ ఫొటోలు తోడ్పడతాయని భరద్ ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, twitter.com/bharad
అయికిడోలో తనకు బ్లాక్ బెల్ట్ ఉందని ఇటీవల రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. "రన్నింగ్, స్విమ్మింగ్‌తోపాటు అయికిడోలో బ్లాక్ బెల్ట్ ఉంది" అని రాహుల్ అన్నారు.
"రాహుల్‌కు అయికిడో నేర్పేందుకు శిక్షకుడు ఆయన ఇంటికి వచ్చేవారు. చాలా వరకు అన్ని మెలకువలు ఇంటి వద్దనే నేర్పేవారు. అయినప్పటికీ ఆయన మళ్లీ శిక్షణ కోసం త్యాగరాజ స్టేడియానికి వచ్చేవారు" అని రాహుల్ శిక్షణా ప్రగతిని పరిశీలించడానికి నియమితులైన డాక్టర్ ఓపిందర్ థిండ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Opinder Thind
"జపాన్ మార్షల్ ఆర్ట్స్‌లలో అయికిడో ఒకటి. తనను తాను నియంత్రణలో పెట్టుకునేందుకు ఈ విద్య ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఆధ్యాత్మిక చింతనకు దోహదపడుతుంది. ఇది కేవలం ఆత్మరక్షణ కోసమే. ఇతరులకు హాని చేయడానికి కాదు" అని డాక్టర్ ఓపిందర్ వివరించారు.
"అయికిడోపై బాగా పట్టు సాధించాలంటే కొంత సమయం పడుతుంది. సాధన చేసే కొద్దీ శారీరకంగా, మానసికంగా మరింత బలవంతులు అవుతారు" అని ఓపిందర్ వెల్లడించారు.
డాక్టర్ ఓపిందర్ చెబుతున్న ప్రకారం 2013-14లోనే రాహుల్ గాంధీ అయికిడోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. శిక్షణ కేంద్రానికి రావడం తన పని తాను చూసుకొని వెళ్లిపోయే వాడు.
ప్రతి ఏడాదీ జరిగే అయికిడో వార్షిక సమావేశాల్లో రాహుల్ పాల్గొనే వారు.

ఫొటో సోర్స్, twitter.com/bharad
అయితే తనకు అయికిడోలో బ్లాక్ బెల్ట్ ఉందని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు చాలా మంది నెటిజన్లు తేలిగ్గా తీసుకున్నారు.
అయికిడో నేర్చుకుంటున్న రాహుల్ గాంధీ ఫొటోలను భరద్ ట్విటర్‌లో పెట్టినప్పుడు చాలా మంది వాటిని ప్రశ్నించారు. "ఇందులో కొత్త ఏముంది. సాదాసీదా స్టంట్స్ మాదిరిగా ఉన్నాయి" అని సుదీప్ యాదవ్ ట్వీట్ చేశారు.
దీనికి బదులుగా భరద్ ఇలా సమాధానం ఇచ్చారు.
"ఒక విషయంపై విశ్వాసం ఉంటేనే దాని గురించి తెలుసుకోగలం. అయికిడోలో బ్లాక్ బెల్ట్ సాధించాలంటే ఎటువంటి దొడ్డిదారి లేదు."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








