ఎడిటర్స్ కామెంట్: ఇదేనా ఆధునిక నాగరికత! గాంధీ మార్గం ఇదేనా!

స్వచ్ఛభారత్

ఫొటో సోర్స్, బీబీసీ

    • రచయిత, జి.ఎస్.రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

పరిశుభ్రత గురించి మహాత్మా గాంధీ కన్న కలల్ని నిజం చేయడానికంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకం ప్రకటించింది. కానీ లక్ష్యం మాత్రమే కాదు, మార్గం కూడా ఉన్నతంగా ఉండాలన్న మహాత్ముడి మాటలకు విలువనిస్తున్నారా?

''పరిపూర్ణ పరిశుభ్రత ఉన్న గ్రామమే నా ఆదర్శ గ్రామం. గ్రామాలు తొలుత పరిష్కరించుకోవాల్సిన సమస్య శానిటేషన్'' అని గాంధీ 1937లో హరిజన్ పత్రికలో రాశారు. అది ఆయనకు అత్యంత సన్నిహితమైన ముఖ్యమైన విషయం.

చాలా చోట్ల, చాలా సందర్భాల్లో ఆయన పరిశుభ్రత గురించి రాసి ఉన్నారు. ''టాయిలెట్ డ్రాయింగ్ రూమ్ అంత పరిశుభ్రంగా ఉండాలి, నేను పశ్చిమ దేశాల నుంచి ఇది నేర్చుకున్నాను'' అని కూడా 1925లో నవజీవన్ పత్రికలో రాశారు.

కానీ బహిరంగ మల విసర్జన చేసే వారి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించాలని, పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఆయన భావించారా? ఇపుడు జరుగుతున్న పరిణామాలను ఆయన హర్షించేవారా, మరింత బాధపడేవారా!

కరీంనగర్ పోలీసులు లోయర్ మానేరు డ్యామ్ చుట్టుపక్కల బహిరంగ మల విసర్జన చేస్తున్నవారిని డ్రోన్ కెమెరాలతో పసిగట్టి మరీ అదుపులోకి తీసుకుని దండలేసి అవమానిస్తున్నారు. పద్ధతి గురించిన చర్చను పక్కకు తోసేసి అక్కడ నీటి వనరుల కాలుష్యం అనో ఇంకోటో అధికారులు చెప్పొచ్చు.

ఇది ఒక్క కరీంనగర్‌కు సంబంధించిన అంశం కాదు. దేశవ్యాప్తంగా రకరకాల పద్ధతుల్లో ఈ అవమానాలు సాగుతున్నాయి. ఇదంతా మోదీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ పథకం అమలులో భాగంగా చేస్తున్న పని. టార్గెట్లు నిర్ణయించుకుని అధికారులు పనిచేస్తున్నారు. అందులో టాయిలెట్లు నిర్మించడం, బహిరంగ మల విసర్జనను నిరోధించడం అతి పెద్దభాగం. అంతవరకూ తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. అది అవసరం కూడా.

కానీ టార్గెట్లు చేరుకోవడానికి బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి అవలంబిస్తున్న పద్ధతులే ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి. చాలా చోట్ల రేషన్ కట్ చేయడం లాంటివి సాగుతున్నాయి. జులైలో రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఆరు బయట మలవిసర్జనకు వెళ్తున్న మహిళలను కొందరు ఫోటోలు తీస్తుండగా అభ్యంతరం చెప్పినందుకు జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు.

రాంచీలో ఈ మధ్య 'హల్లా బోల్ లుంగీ ఖోల్' అనే పేరుతో బైట మలవిసర్జన చేసే వాళ్లను అపహాస్యం చేస్తూ ఒక క్యాంపెయిన్ నిర్వహించారు. బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఇలాంటి ఫోటో ఒకటి ట్విట్టర్‌పై షేర్ చేయడంతో దుమారం లేచింది. ఇలాంటి ఘటనలు ఏదో ఒక స్థాయిలో ఎక్కడో చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

మలవిసర్జన పద్ధతులు సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన విషయం. సంప్రదాయాల్లో భాగంగా వస్తున్న అనాచారాలను మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇతరులకు హాని కలిగించే అనేక అనాచారాలను చట్టాల సాయంతోనూ, సివిల్ సొసైటీలో చైతన్యం పెంచడం వల్లనూ అదుపు చేసిన చరిత్ర భారతదేశానికి ఉన్నది. కానీ ఒక వ్యక్తిగత అలవాటును మాన్పించడానికి రాజ్యం ఎక్కడి దాకా వెళ్లొచ్చు అనేది ఇక్కడ తలెత్తే ప్రశ్న.

మరుగుదొడ్డిలో పిడకల నిల్వ

ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. అది ఆధునికత నెత్తిన పెట్టుకునే విలువ. ఒక ఆధునిక అలవాటు చేయించడానికి మరొక ప్రధానమైన ఆధునిక విలువను ఇంతగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా! బహిరంగ మలవిసర్జన ఎక్కువ అనాగరికమా, లేక ఫొటోలు తీసి అవమానించడం ఎక్కువ అనాగరికమా!

వ్యక్తి స్వేచ్ఛ అనేది ఆధునిక నాగరికతతో పాటుగా వచ్చిచేరిన ఇంకో పెద్ద విలువ. ఈ పద్ధతులు అవలంబించేవాళ్లు ఎంతవరకు వ్యక్తి స్వేచ్ఛకు విలువనిస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలను గౌరవించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందా, ఉండదా!

కార్లలోనూ పర్యాటక ప్రాంతాల్లోనూ తిరుగుతూ తిన్నవీ తాగినవీ ఎక్కడంటే అక్కడ విసిరేసే వారి గురించి అంటే పట్టణ ఉన్నత మధ్యతరగతి లోని వారిని ఉద్దేశించిన ప్రకటనల్లో ప్రభుత్వం వారికి సుతిమెత్తగా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. తమకంటే చిన్నపిల్లలైన వారో లేక అంధులో వాటిని తీసి డస్ట్ బిన్లో వేయడం లాంటి ‌దృశ్యాలతో వారికి ప్రశ్చాత్తాపం కలిగించి పరివర్తన తీసుకురావచ్చు అనే పద్ధతిలో ఆయాడ్స్ తయారుచేశారు.

వీడియో క్యాప్షన్, ప్రధానంగా పట్టణాలను ఉద్దేశించి ప్రభుత్వం రూపొందించిన ప్రకటన

అదే పేదల బహిరంగ మలవిసర్జన దగ్గరకు వచ్చేసరికి యాడ్స్ అన్నీ వారిని నలుగురిలో నిలబెట్టి ఎగతాళి చేయడం, పరువు తీయడం అనే పద్ధతి ఎంచుకున్నారు. అంటే ఉన్నత మధ్యతరగతిలో గిల్ట్ ద్వారానూ దిగువ తరగతిని అవమానించడం ద్వారా మార్పు తేవచ్చని ప్రభుత్వమే సూచించినట్టైంది. ఇది దేశవ్యాప్తంగా టోన్ సెట్ చేసినట్టు అనిపిస్తుంది. అధికారులు దాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లినట్టు తెలుస్తున్నది. తన పేరుతో తన బొమ్మతో సాగుతున్న పథకంలో ఈ వేర్వేరు ప్రమాణాలను గాంధీ హర్షించేవారా!

వీడియో క్యాప్షన్, బహిరంగ మలవిసర్జనపై ప్రభుత్వం రూపొందించిన యాడ్

కొన్ని అలవాట్లకు మనుషుల ఆర్థిక స్థాయికి సంబంధం ఉంటుంది. పేదరికం నుంచి మధ్యతరగతికి ఎదిగిన వారు తమంత తాముగా ఎలాంటి ఉత్సాహ ప్రోత్సాహకాలు లేకుండానే టాయిటెట్లు నిర్మించుకోవడం అన్ని చోట్లా కనిపించే అంశం. ఈ విషయంలో పట్టణాలకు గ్రామాలకు తేడా ఉన్నమాట వాస్తవమే కానీ పల్లెసీమల్లో కూడా అలవాటు పెరుగుతున్నది. బహిరంగ మలవిసర్జన అవమానకరమైన పని అన్నది అంతా గుర్తిస్తున్నారు. ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేసేవారు దాదాపు అందరూ పేదలు!

అలవాటు మార్చుకోలేకపోవడం అనే అంశం కూడా కొంత వరకు ఉన్నప్పటికీ టాయిలెట్ మెయిన్ టెయిన్ చేయడానికి అవసరమైన స్థలం, నీరు లేకపోవడం అనేది ప్రధానంగా పనిచేస్తున్నది. గాంధీ చెప్పిన విధంగా టాయిలెట్ ని డ్రాయింగ్ రూమ్ అంత శుభ్రంగా ఉంచుకునే వెసులుబాటు పేదలకు ఉండదు. అసలు డ్రాయింగ్ రూమ్ అనేది వారికి పరిచయమైన పదం కాదు. టాయిలెట్లకు అవసరమైన కనీస నీటి సదుపాయం కూడా ఉండదు. రన్నింగ్ వాటర్ గురించి అడగనే లేం. టాయిలెట్‌కు అవసరమైన నీళ్లు అటుంచి తాగే నీటి కోసం చాలా గ్రామాల్లో మైళ్లకు మైళ్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలాంటి దేశంలో బలప్రయోగంతో వారిని అలవాటు చేయించడం ప్రజాస్వామికమనిపించుకుంటుందా! నీటి సరఫరాకు పూచీపడలేని ప్రభుత్వాలకు ఒత్తిడి తెచ్చే హక్కు ఉంటుందా!

స్వచ్ఛ భారత్‌ ప్రచార కార్యక్రమంలో

ఫొటో సోర్స్, Twitter

"ఇది స్పష్టంగా హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వం ఒక పథకం ప్రకటించగానే అందరూ ఆటోమేటిగ్గా దాన్ని అమలు చేయాలని, లేకపోతే ఎంతటి అవమానాలైనా చేస్తామనే ఉన్మాదపు పోకడ ఇక్కడ కనిపిస్తున్నది. టాయిలెట్లు కట్టుకోకుంటే రేషన్ కట్ చేస్తామని చాలా చోట్ల బెదిరిస్తున్నారు. ఇది అమానవీయం" అని కాకర్ల సజయ లాంటి సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

పేదలు కాబట్టే వారిని ప్రభుత్వాలు ఈ విధంగా అవమానించగలుగుతున్నాయి అనే విమర్శకు ప్రభుత్వాల దగ్గర సమాధానముందా! ఇంత అనాగరికమైన షేమింగ్ అండ్ నేమింగ్ పద్ధతులను ధనిక నేరాల విషయంలో అవలంబించగలదా! కోట్ల ప్రజాధనం కొల్లగొట్టినా, కోర్టుల్లో తేలినా, కాలర్ ఎగరేసి తిరిగే బడా నేరస్తులున్న దేశంలో తరాలుగా వస్తున్న ఒక వ్యక్తిగత అలవాటును పాటిస్తున్న పాపానికి ఈ స్థాయిలో అవమానించడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మొత్తం వ్యవహారాన్ని చూసినపుడు ఇది ఆరోగ్యం అనోరోగ్యం పరిధి దాటిపోయి పట్టణ మధ్యతరగతి దృష్టికోణం నుంచి చూసే నైతికాంశంగానూ నాగరికాంశంగానూ మారిపోయినట్టు కనిపిస్తున్నది. ఎలాగైనా తాము నేర్చుకున్న నాగరికత అవతలి వారికి నేర్పించి తీరాలి అనే ఆధిపత్యంతో కూడిన దృష్టి ప్రతిఫలిస్తున్నది.

ADD

ఫొటో సోర్స్, PIB

పోలీసుల చర్య చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని వసుధా నాగరాజ్ వంటి న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సహజమైన జీవక్రియను తాము కోరుకున్నపద్ధతిలోనే జరగాలంటూ శాసిస్తూ దానికోసం పహారా కాయడం అనాగరికం అని వసుధ చెపుతున్నారు. పోలీసుల చేతిలో ఉన్న దృశ్యాలు ఎవరు ఎందుకోసమైనా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని, ఇది పౌరుల ప్రైవసీని వారి హక్కులను కాలరాయడమేనని ఆమె చెపుతున్నారు.

సాధారణంగా ఇలాంటి అలవాట్లకు సంబంధించి కాలువల వ్యవసాయం ఉన్న ప్రాంతాలకు బంజరు భూములు- బయళ్లు అధికంగా ఉండే మెట్ట ప్రాంతాలకు తేడా ఉంటుంది. బంజరు ప్రాంతాల్లో అక్కడి ప్రజలు కూడా అదేమీ అంత పెద్ద సమస్యగా భావించరు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడం అవసరమే కానీ దానికి రాజ్యం ఇలాంటి పద్ధతులు ఎంచుకుని బెదిరింపులకు, అమానవీయమైన పద్ధతులకు పాల్పడడం అనేదే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. డెడ్ లైన్ల ఒత్తిడిలో ఉన్న అధికారులకు ఈ ప్రశ్న వినిపిస్తుందా!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)