బీజేపీ ప్రస్థానం: అటల్- అడ్వాణీ నుంచి మోదీ-షా వరకు

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/GETTY IMAGES
- రచయిత, ప్రదీప్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
'అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది.' ఇవి 37 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగంలోని మాటలు.
ప్రస్తుతం కమలం వికసిస్తోంది, కానీ దాన్ని పెంచిపోషించిన వాళ్ల రాజకీయ జీవితం మాత్రం ముగింపు దశకు చేరువైంది.
ఎన్నికల్లో పార్టీకి కొత్త నాయకత్వం ఒకటి తర్వాత మరోటి వరుస విజయాలను తెచ్చిపెడుతోంది.
అటల్ బిహారీ వాజ్‌పేయీ 2005 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా, బీజేపీలో రెండు తరాలకు మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి ఆయనే.
శారీరక వైకల్యంతో ఉన్నా ఇప్పటికీ పాత తరం నాయకుల్లో అత్యంత శక్తిమంతమైన నేత ఆయనే.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/GETTY IMAGES
జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను వాజ్‌పేయీ ఒప్పించారు.
దాంతో కొత్తగా ఏర్పడిన బీజేపీ గాంధేయ వాదాన్ని ఎంచుకుంది.
అలాగే, అప్పటి సంఘ్ సారధిగా ఉన్న సహబ్ దేవరాస్ ముందు వాజ్‌పేయీ మరో డిమాండ్ కూడా పెట్టారు.
తమ సమితి 'హిందూ' అనే పదానికి బదులుగా ఇండియా వాడాలన్నది ఆ డిమాండ్.
జన సంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు వరకు తొలిసారిగా ఒక మౌలిక మార్పునకు అంగీకారం కుదిరింది.
దాని ఫలితంగానే ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం లేని ఎం.సి. ఛాగ్లా, శాంతి భూషణ్, రామ్ జెఠ్మలానీ, సికందర్ భక్త్, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో భాగం అయ్యారు.
అయితే, బీజేపీ పుట్టిన నాలుగు సంవత్సరాల్లోనే ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం 1984 డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో బీజేపీతో వెళ్లాలా? లేక హిందుత్వను ఎంచుకోవాలా? అని సంఘ్ డైలమాలో పడింది.
చివరికి సంఘ్ హిందుత్వను ఎంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల తర్వాత రెండేళ్లకు బీజేపీ మనసు మార్చుకుంది. మళ్లీ మితవాద మార్గాన్ని ఎంచుకుంది.
1986లో అత్యంత ప్రజాదరణ కలిగిన వాజ్‌పేయీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హిందుత్వ వాదాన్ని ఆలింగనం చేసుకుంది.
వాజ్‌పేయీతో పోల్చితే అప్పటికి ఎల్‌కే అడ్వాణీ ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఏమీ కాదు.
కానీ 1988లో ఆయోధ్య ఉద్యమంలో చేరేందుకు అంగీకరించడం, ఆ తర్వాత అయోధ్య రథ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం వల్ల ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల చూపు అడ్వాణీ వైపు మళ్లింది.
దాంతో పార్టీలో వాజ్‌పేయీ ఏకాకిగా మారారు.
అయితే, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూలిన తర్వాత సంఘ్ పరివార్, బీజేపీలకు మళ్లీ వాజ్‌పేయీ గుర్తుకొచ్చారు.
అది కూడా తాత్కాలికమే. అప్పుడు ప్రధాని రేసులో అడ్వాణీ ఉన్నారు.
కానీ, అడ్వాణీని అదృష్టం వరించలేదు.
1990 నాటి జైన్-హవాలా కేసుకు సంబంధించిన డైరీలో ఆయన పేరు ప్రత్యక్షమైంది. దాంతో పార్లమెంటు సభ్యత్వానికి అడ్వాణీ రాజీనామా చేశారు.
ఆ కేసులో నిర్ధోషిగా బయటపడిన తర్వాతే పార్లమెంటులో అడుగుపెడతా అని శపథం చేశారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
1996 పార్లమెంటు ఎన్నికల్లో పోటీపడలేనన్న విషయం అడ్వాణీకి తెలుసు. అందుకే బీజేపీ ప్రధాని అభ్యర్థి వాజ్‌పేయీ అని 1995 నవంబర్‌లో ముంబయిలో జరిగిన సమావేశంలో ప్రకటించారు.
ఇక ఆనాటి నుంచి అడ్వాణీకి ప్రధాని అవ్వాలన్న కల ఓ ఎండమావిగానే మిగిలిపోయింది.
అడ్వాణీ ప్రధానికి పదవి రాలేదు. కానీ 2005లో పాకిస్తాన్ వెళ్లినప్పుడు చేసిన ప్రకటన ఆయన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.
తర్వాత పార్టీ ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది, ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం లేదు.
2009 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీని నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ ఓకే చెప్పారు.
గుజరాత్‌లో వచ్చిన ప్రభంజనంతో 2012లో మోదీ దిల్లీ ప్రచారం ప్రారంభమైంది.
అయితే, మోదీని ప్రధాని అభ్యర్థిగా కాదు కదా, ఎన్నికల ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా నియమించేందుకు కూడా అడ్వాణీ ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
బీజేపీలో బలమైన వ్యూహకర్తగా ఉన్న అడ్వాణీ, పార్టీలో అంతర్గతంగా మారుతున్న ఆలోచలను మాత్రం గుర్తించలేకపోయారు.
పార్టీ లోపల, బయట మోదీకి మద్దతు ఉప్పెనలా ఎగిసిపడింది.
అడ్వాణీకి ప్రధాని అభ్యర్థిగా నిలబడే అవకాశం దూరమైంది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టారు. దాంతో బీజేపీలోని ముగ్గురు వస్తాదులు అటల్, అడ్వాణీ, మురళీ మనోహర్‌ల శకం ముగిసింది.
ఇదీ బీజేపీలో మోదీ శకం.
పార్టీ నాయకుడే కాదు, పార్టీ నిర్వహణ, ఎన్నికల్లో అనుసరించే విధానాలు, ప్రభుత్వాన్ని నడిపే తీరు, నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం.. ఇలా అన్ని విషయాల్లోనూ బీజేపీ రూపురేకలు మారిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఒకవేళ మోదీ వ్యతిరేకులు అయితే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను బలవంతంగానే అదృశ్యం చేశారని అనుకోవచ్చు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ సరైన సమయంలోనే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నా నేటికీ పార్టీకి రియల్ హీరో ఆయనే.
ఆయన్ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో పోల్చవచ్చు. అలాగే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలు కపిల్‌దేవ్ లాంటివారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లంతా బలవంతంగా రిటైర్‌మెంట్ తీసుకున్నవారే.
2014 తర్వాత బీజేపీ మోదీ, షాల పార్టీ అయిపోయింది. ఏ నిర్ణయాన్నీ పార్టీ తీసుకోలేదు. అన్నీ నాయకుడే తీసుకుంటారు పార్టీలో అమలు చేస్తారు.
దీన్ని కేంద్రీకృత అధికారంగా చెప్పొచ్చు.
అయినా అది విజయవంతంగానే సాగుతోంది. ధిక్కార స్వరం వినిపించే సాహసం ఎవరూ చేయడంలేదు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
నరేంద్ర మోదీ అన్న ఒక్క పేరు వల్లనే పార్టీకి ఓట్లు పడుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు.
తమ సీనియర్ల మాదిరిగా నిదానంగా వెళ్లడంపైన ఇప్పటి నాయకులకు నమ్మకం లేదు.
కేవలం నాలుగేళ్లలోనే ఆరు రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల్లో ఒంటరిగా లేదా పొత్తుతో అధికారం చేపట్టే స్థాయికి బీజేపీ చేరుకుంది.
దీన్ని బహుశా పార్టీ వ్యవస్థాపకులు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంత ఎత్తుకు చేరుకోవడం సులువేం కాదు, అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే.
2019 ఎన్నికల్లో ఆ స్థానం పదిలంగా ఉంటుందా? లేదా అన్నది ముందున్న సవాల్.
ఇవి కూడా చదవండి:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- #CWG2018 పీవీ సింధు.. పతకం తెస్తుందా?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసుల షాక్ థెరపీ
- కండోమ్ ప్రకటనలు - నాటి నుంచి నేటి వరకు!
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








