అభిప్రాయం: ‘దేశంలో పార్లమెంట్ అవసరం తీరిపోయిందా?’

- రచయిత, అనిల్ జైన్
- హోదా, సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం
'దేశంలో రహదారులు మూగబోతే, పార్లమెంట్ అనాథలా మారిపోతుంది' అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరు దశాబ్దాల క్రితం అన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణం, పార్లమెంట్ పరిస్థితిని చూస్తే, అది నేటికీ వర్తిస్తుంది అనిపిస్తుంది.
మార్చి 5న ప్రారంభమైన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు కూడా గందరగోళం మధ్యే ముగిశాయి. మొదటి విడత సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం, దానిపై విపక్షాల విమర్శలు, వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యోక్తులతో కూడిన ప్రసంగం మినహా చెప్పుకోదగిన విశేషాలేమీ లేవు.
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా - పార్లమెంట్‌ను తమకు ఇష్టం వచ్చిన రీతిలో నడిపించడం, విపక్షాల విమర్శలను పట్టించుకోకపోవడం జరుగుతూ వస్తోంది.
ఇదే ధోరణి కారణంగా, దేశంలోని అతి పెద్ద పంచాయతీలో గొడవలు, నినాదాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శాపాలుగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు.

70 ఏళ్ల భారత పార్లమెంట్ చరిత్రలో బడ్జెట్, ఆర్థిక బిల్లులను చర్చ లేకుండా ఆమోదించడం ఇదే మొదటిసారి.
అలాంటిదే ఇంకో సంఘటన కూడా ఆరు నెలల క్రితం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండా నెలన్నర రోజులు వెనక్కి జరిపింది. అది కూడా విపక్షాల ఒత్తిడితో నామమాత్రంగా కేవలం 14 రోజులు నిర్వహించారు.
పార్లమెంట్ సక్రమంగా జరిగి, ప్రజాసమస్యలపై చర్చించాల్సిన బాధ్యత విపక్షాల మీద ఉంది. కానీ ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మొత్తం సమావేశాలలో అలాంటి ప్రయత్నమేదీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినట్లు కనిపించలేదు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎంపీలు తమ సొంత రాష్ట్రాల సమస్యలను చర్చించాలంటూ సభకు పదేపదే అంతరాయం కలిగించారు. అయితే సభను సజావుగా నిర్వహించడానికి లోక్‌సభ స్పీకర్ కానీ, రాజ్యసభ ఛైర్మన్ కానీ సరైన చర్యలు తీసుకున్న సూచనలు కనిపించలేదు.

విపక్షాల సవాళ్లు
ఉభయసభలూ సజావుగా జరిగి ఉంటే ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చేది.
పెరిగిపోతున్న నిరుద్యోగం, బ్యాంకు కుంభకోణాలు, పలుచోట్ల మతపరమైన ఘర్షణలు, కాశ్మీర్‌లో పరిస్థితి దిగజారుతుండడం తదితర సమస్యలు ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటోంది. పార్లమెంట్ జరిగితే వీటన్నిటి మీదా చర్చించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన నేపథ్యంలో, పార్లమెంట్‌లో ఖచ్చితంగా దానిపై చర్చ జరగాల్సి ఉండగా, అది కూడా జరగలేదు.
అంతే కాకుండా, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తదితర అంశాలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాయి.
ప్రభుత్వ తీరుపై సీనియర్ నేత శరద్ యాదవ్, ''ప్రభుత్వం ఇతర రాజ్యాంగ సంస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుందో, అలాగే పార్లమెంట్‌ను కూడా నిర్వీర్యం చేయాలని భావిస్తోంది ''అన్నారు.

ఈసారే ఎందుకు?
ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల వద్ద తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి పార్లమెంట్ రెండో విడత సమావేశాల 23 రోజుల వేతనాన్ని తీసుకోబోమని అధికార పార్టీ ఎంపీలు తెలిపారు.
అయితే గత నాలుగేళ్లలో ఎన్నోసార్లు పార్లమెంట్ సరిగా నడవని సందర్భాలున్నాయి. మరి అలాంటి నిర్ణయం ఈసారే తీసుకోవడానికి కారణమేంటి?
దీనికి కారణం సుస్పష్టం - పార్లమెంట్ సరిగా జరగకపోవడానికి విపక్షాలే కారణమని చెప్పేందుకే.
అధికారపక్షం పట్టుదల కారణంగానే పార్లమెంట్ సరిగా జరగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ డి.రాజా అన్నారు. మనసులో ఉన్న అపరాధభావం వల్లే అధికార పార్టీ ఎంపీలు వేతనాలు తీసుకోవడం లేదన్నారు.

ప్రభుత్వ బాధ్యత
ఈసారి పార్లమెంట్ సెషన్‌లో జరుగుతున్న గందరగోళాన్ని చూస్తే సుమారు ఒకటిన్నర దశాబ్దం క్రిందటి జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. ఆ సందర్భంగా కాంగ్రెస్‌తో అన్ని ప్రతిపక్ష పార్టీలు దానిని ఖండిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని పట్టుబట్టాయి.
విదేశీ వ్యవహారాల శాఖ దానిని ఖండిస్తూ ప్రకటన జారీ చేసినా, విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా మాత్రం విపక్షాల డిమాండ్‌కు అనుగుణంగా పార్లమెంట్‌లో తీర్మానానికి సుముఖంగా లేరు. దీంతో కొన్నిరోజుల పాటు పార్లమెంట్ స్తంభించింది.
ఆ సమయంలో ప్రధాని వాజ్‌పేయి, యశ్వంత్ సిన్హాను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లను పిలిపించారు. పార్లమెంట్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కేవలం మీడియా ద్వారా మాత్రమే కాకుండా అనధికారికంగా కూడా వారితో మాట్లాడాలని సూచించారు.

ఆయన సూచన మేరకు యశ్వంత్ సిన్హా, సుష్మా స్వరాజ్‌లు విపక్షాలను పిలిపించి మాట్లాడారు. దాంతో పార్లమెంట్ ప్రతిష్టంభన ముగిసింది.
వాజ్‌పేయి కాలం నాటి స్ఫూర్తి ఇప్పుడు కనిపించడం లేదు. పార్లమెంట్ ప్రతిష్టంభన తొలగించడానికి విపక్షాలతో మాట్లాడే ప్రయత్నాలు జరగడం లేదు.
ఏ పార్లమెంట్ మెట్లపై అయితే ప్రధాని నరేంద్ర మోదీ తలొంచి కన్నీరు రాల్చారో, అదే పార్లమెంట్‌లో చర్చలు సజావుగా జరగడానికి ప్రయత్నించి ఉంటే, భారత ప్రజాస్వామ్యం భవిష్యత్ గురించి ఇంతగా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








