పార్లమెంటులో ఈరోజు: అవిశ్వాస తీర్మానం.. అసలు చర్చకు వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురారి కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇవాళ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్‌లు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? లేక పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడం వైపు మొగ్గు చూపుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
2014లో అధికార పగ్గాలు చేపట్టాక మోదీ సర్కార్ ఎదుర్కొంటున్న మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది.
నిన్నటివరకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీయే ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించడం బీజేపీకి ఇబ్బంది కలిగించే పరిణామం.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్డీయేలో ముసలం
ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా అనేక పార్టీలు మద్దతు ఇస్తామని తెలిపాయి.
బిహార్ మాజీ సీఎం, హిందుస్థాన్ అవామీ మోర్చా నేత జితన్‌రాం మాంఝీ ఇప్పటికే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.
లోక్‌జన్ శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కూడా బీజేపీ కనుక తన మిత్రపక్షాలను పరిగణలోకి తీసుకోనట్లయితే, సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.
వీటిపాటు ఎన్డీయేలో ఉన్న శివసేనలాంటి పార్టీలు బీజేపీ వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. అటు అనూహ్యంగా అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన అన్నాడీయంకే బీజేపీకి షాక్ ఇచ్చింది.
ఇక స్వయంగా బీజేపీ ఎంపీలే కొందరు పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందువల్ల అవిశ్వాస తీర్మానమే చర్చకు రాకుండా చేసే యోచన చేస్తోంది బీజేపీ అధిష్టానం. సభలో కొనసాగుతున్న నిరసనలను సాకుగా చూపి సభను వాయిదా వేసే అవకాశం ఉంది.
బడ్జెట్ మలి విడత సమావేశాలు నిజానికి ఏప్రిల్ 6 వరకు కొనసాగాలి.
అయితే, ప్రత్యేక హోదా, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణాలపై టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్‌లతో పాటు ఇతర విపక్షాలు కూడా సభలో ఆందోళన చేస్తుండడంతో ప్రభుత్వం చర్చ లేకుండానే 99 పద్దులను ఆమోదించేసింది.
ఆర్థిక, ద్రవ్య వినిమయ బిల్లులనూ ఈ విధంగానే ఆమోదించారు.

ఫొటో సోర్స్, Getty Images
రిస్కు తీసుకుంటుందా?
బడ్జెట్ వ్యవహారాలన్నీ ముగియడంతో పార్లమెంట్‌ను ఈనెల 16నే నిరవధికంగా వాయిదా వేయొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్‌లు అవిశ్వాస తీర్మానాలను ముందుకు తీసుకొచ్చింది ఈ కారణంతోనే.
శుక్రవారం గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను వాయిదా వేయడంతో ఆ పార్టీలు మళ్లీ నోటీసులిచ్చాయి. ఇవి సోమవారం సభ ముందుకువస్తాయి.
ఇబ్బందికర పరిస్థితిని తప్పించుకొనేందుకు సభ్యుల ఆందోళనను సాకుగా చూపుతూ, అవిశ్వాస తీర్మానాలను తిరస్కరిస్తూ పార్లమెంటును నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








