స్టీఫెన్ హాకింగ్: గ్రహాంతర జీవులు ఉన్నాయని బలంగా నమ్మే ఈ శాస్త్రవేత్త ఇంకా ఏం చెప్పారు?

స్టీఫెన్ హాకింగ్..'కాలం కథ'ను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పిన శాస్త్రవేత్త. విశ్వాంతరాలలోని నిగూఢ రహస్యాలను విప్పిన పరిశోధకుడు.అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న స్టీఫెన్ విలియం హాకింగ్ 2018 మార్చి 14న తన 76వ ఏట మరణించారు.
కృష్ణబిలాలు, విశ్వ ఆవిర్భావం, గ్రహాంతర జీవుల గురించి చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
- ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942 జనవరి 8న స్టీఫెన్ జన్మించారు. ఆయన తండ్రి జీవశాస్త్ర పరిశోధకుడు. జర్మనీ దాడుల నుంచి తప్పించుకోడానికి వీరి కుటుంబం లండన్ పారిపోయింది.
- యుక్త వయసులో స్టీఫెన్ ఎక్కువగా గుర్రపు స్వారీ చేయడాన్ని ఇష్టపడేవారు. అయితే కేంబ్రిడ్జ్‌కు వచ్చాక తనకు అత్యంత అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యాధితో ఆయన శరీరమంతా చచ్చుబడిపోయింది.
- ప్రత్యేకంగా రూపొందించిన పరికరంతో ఆయన మాట్లాడుతారు. అంటే అది కృత్రిమ గొంతులాంటిది. 1988లో ఒక ప్రత్యేక సాంకేతిక పరికరం ద్వారానే మాట్లాడే పరిస్థితి ఆయనకు వచ్చింది. ఆ స్థితిలోనే ఆయన అనేక టీవీ షోలలో ఇలాగే ప్రసంగించారు. తన ప్రసిద్ధ పుస్తకం ''ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం: ఏ లేమన్స్ గైడ్ టూ కాస్మాలజీ'' వెలువరించారు. ఈ పుస్తకం దాదాపు కోటి కాపీలు అమ్ముడు పోయింది. అంతేకాదు తాను రాసిన పుస్తకాన్ని తానే చదవని సెలబ్రెటీగా స్టీఫెన్ పేరుతెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, Rex Features
4. హాకింగ్ పరిశోధించిన పలు విషయాలను ఇప్పుడు హాకింగ్ రేడియేషన్‌గా పిలుస్తున్నారు .ప్రశ్న, జవాబుతోనే విశ్వరహస్యాలను చేధించగలమని స్టీఫెన్ చెబుతుంటారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఇది ఎటు వెళుతోంది? దీనికి అంతం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే విశ్వం గుట్టు వీడినట్లే అనేది స్టీఫెన్ సిద్ధాంతం.
5. అమెరికాకు చెందిన యానిమేటెడ్ హాస్యభరిత కార్యక్రమం 'ది సింప్సన్స్'లో హాకింగ్ పాత్ర ఉంది. గ్రీకు పురాణాల రచయిత హోమర్‌తో కలిసి బార్‌లో మద్యం తాగుతూ స్టీఫెన్ కనిపిస్తారు. బీబీసీ కామెడీ సిరీస్‌లోనూ స్టీఫెన్ కనిపించారు. పింక్ ఫ్లాయిడ్ అనే రాక్ బ్యాండ్.. స్టీఫెన్ గౌరవార్థం 1994లో రూపొందించిన 'ది డివిజన్ బెల్' ఆల్బమ్‌లో ఆయన కృత్రిమ గొంతును వినియోగించుకుంది.

ఫొటో సోర్స్, PA
6. తన వ్యాధి ముదురుతున్నా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా స్టీఫెన్ పనిచేశారు. 2001లో 'యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్' పేరుతో మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు. తనకొచ్చిన వ్యాధి వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా దక్కాయని స్టీఫెన్ నమ్ముతారు. ఈ రోగం రాకముందు తనకు జీవితం బోర్ కొట్టేదని ఆయన చెబుతుండేవారు. అరుదైన వ్యాధి వల్ల ఆయన ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే 20 ఏళ్లుగా తనకు సేవలు చేసిన భార్య పట్ల ఆయన తరచూ కృతజ్ఞతలు చెబుతుంటారు. అయితే తర్వాత కాలంలో ఒక నర్సు కోసం ఆమెను విడిచి పెట్టారు. స్టీఫెన్ తనకు ఆస్పత్రిలో సేవలందించిన నర్సును 1995లో రెండో పెళ్లి చేసుకున్నారు.
7. శరీరం చచ్చుబడిపోయినా కృత్రిమంగా ఏర్పాటు చేసిన భూమ్యాకర్షణ రహిత స్థితి (వామిట్ కామెట్‌గా పిలుస్తుంటారు)లో గాలిలో ఎగిరిన మొదటి వ్యక్తిగా స్టీఫెన్ నిలిచారు. భూమ్యాకర్షణ శక్తిని శూన్య స్థితికి తీసుకొచ్చేందుకు 2007లో ప్రత్యేకంగా తయారు చేసిన విమానంలో ఆయన కొద్దిసేపు ఈ స్థితిని అనుభవించారు.
8. ''భవిష్యత్తులో భూమి మీద మనుగడ మరింత ప్రమాదకరంగా మారుతుందని నమ్ముతున్నా. అణుదాడుల ముప్పు పొంచే ఉంది. జీవాయుధాల ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా అనేక ప్రమాదాల అంచున మనమున్నాం. భూమికి ప్రత్యామ్నాయంగా విశ్వంలో మరో నివాసాన్ని వెతుక్కోకపోతే మనకు భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నా. అందుకే రోదసి ప్రయాణాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను.'' అని స్టీఫెన్ ఒకసారి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PA
9. జేన్, స్టీఫెన్‌ల వైవాహిక బంధాన్ని 'ది థియరీ ఆఫ్ ఎవెరిథింగ్' పేరుతో 2014లో సినిమాగా తీసుకొచ్చారు. ఇందులో తన పాత్ర పోషించిన నటుడు ఎడ్డీ రెడ్మెయిన్‌ను స్టీఫెన్ కలిశారు.
10. విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర మనకంటే తెలివైన గ్రహాంతర జీవులున్నాయిని నమ్మకంగా చెప్పగలను. అయితే, మన వనరులను దోచుకోడానికే అవి ఇక్కడికి వచ్చి వెళ్లిపోతాయి అని స్టీఫెన్ ఒకసారి డిస్కవరీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
11. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మదినం రోజే మరో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ మరణించడం యాదృచ్ఛికమే కావొచ్చు. కానీ, ప్రపంచం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











