యుక్రెయిన్‌ శరణార్థులు: ఆశ్రయం ఇస్తే నెలకు 35వేలు.. బ్రిటన్ ఆఫర్.. వివరాలు 240 పదాల్లో..

శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆశ్రయం కల్పిస్తే నెలకు 35వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

1.అసలు ఏంటీ పథకం?

ఈ పథకం పేరు హోమ్స్ ఫర్ యుక్రెయిన్.

రష్యా దాడులతో లక్షలాది మంది యుక్రెనియన్ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.

అలా బ్రిటన్‌కు వచ్చే యుక్రెయిన్‌ ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: బంకర్లో అయిదు రోజులు తలదాచుకున్న సత్య శ్రీజ ఏమన్నారంటే...

2.నెలకు రూ.35 వేలు రావాలంటే ఏం చేయాలి?

బ్రిటన్ వచ్చే యుక్రెయిన్ వ్యక్తి లేదా కుటుంబానికి బ్రిటన్ జాతీయులు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది.

వారిని తమ ఇంట్లో లేదా తమకు చెందిన ఇతర భవనంలో ఉచితంగా ఉండనివ్వాలి.

కనీసం ఆరు నెలల పాటు వారికి ఆశ్రయం కల్పించాలి.

ఇందుకోసం ప్రభుత్వం సోమవారం ప్రారంభించే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

స్పాన్సర్ (బ్రిటన్ జాతీయులు), యుక్రెయిన్ శరణార్థుల వివరాలను క్షణ్ణంగా తనిఖీ చేసి, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆ దరఖాస్తును ఆమోదిస్తారు.

యుక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించినందుకు ఆ తర్వాత నుంచి నెలకు రూ.35వేలు ప్రభుత్వం ఇస్తుంది.

అలాగే సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలకు ఒక్కో శరణార్థికి 10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని బ్రిటన్ తెలిపింది.

యుక్రెయిన్ శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

3.యుక్రెయిన్ నుంచి ఎంత మంది వెళ్లిపోయారు?

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి 25 లక్షల మందికి పైగా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థి సమస్య ఇదని పేర్కొంది.

వలస వెళ్తున్న యుక్రెయిన్ ప్రజల మ్యాప్

4. బ్రిటన్‌కు ఎంత మంది వచ్చారు?

యుద్ధం కారణంగా బ్రిటన్‌కు వచ్చేందుకు యుక్రెయిన్ ప్రజలకు ఇచ్చిన వీసాల సంఖ్య 3 వేలకు చేరిందని బ్రిటన్ హౌజింగ్ మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు.

అయితే, ప్రస్తుతం బ్రిటన్‌‌లో బంధువులు ఉన్న యుక్రెనియన్లు మాత్రమే వస్తున్నారని తెలిపారు.

ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకం ద్వారా వేలాది మంది యుక్రెనియన్లకు బ్రిటన్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రమాదం నుంచి యుక్రెయిన్ ప్రజలను వీలైనంత త్వరగా బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు ఈ పథకం సహాయ పడుతుందని మంత్రి మైఖేల్ చెప్పారు.

అయితే, ఈ పథకంలో న్యాయపరమైన, భద్రతాపరమైన చిక్కులు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్‌కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)