యుక్రెయిన్‌లోనే ఆంధ్రప్రదేశ్ వైద్యుడు: జాగ్వర్, పాంథర్‌లతో కలిసి బేస్‌మెంట్‌లోనే జీవనం

ఫొటో సోర్స్, GIRIKUMAR PATIL
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వైద్యుడు తన రెండు పెంపుడు పులులతో కలిసి యుక్రెయిన్‌లోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లోనే వారానికి పైగా రోజులుగా తలదాచుకుంటున్నారు.
గిరికుమార్ పాటిల్, 20 నెలల క్రితం కీయెవ్ జూ నుంచి జాగ్వర్‌తో పాటు బ్లాక్ పాంథర్ పులులను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. తన పెంపుడు పులులు లేకుండా అక్కడి నుంచి రాలేనని ఆయన అంటున్నారు.
తూర్పు యుక్రెయిన్ దోన్బస్ రీజియన్‌లోని సెవెరోదోన్యస్క్ అనే చిన్న పట్టణంలో ఆయన ఆరు ఏళ్లకు పైగా నివసిస్తున్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం పూట కర్ఫ్యూ సమయంలో తన పెంపుడు పులులకు ఆహారం కొనడం కోసం మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. ఆయన దగ్గర 20 నెలల వయస్సున్న మగ జాగ్వర్, 6 నెలల ఆడ పాంథర్ పులులు ఉన్నాయి.
పొరుగునే ఉన్న గ్రామాల నుంచి 23 కిలోల గొర్రె, టర్కీ కోడి, చికెన్ మాంసాన్ని సాధారణం కన్నా నాలుగు రెట్లు అధికంగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
''నా పెంపుడు పులులు కూడా నాతో పాటే రాత్రిళ్లు బేస్‌మెంట్‌లోనే ఉంటున్నాయి. మా చుట్టుపక్కలా బాంబుల వర్షం కురుస్తోంది. పులులు బెదిరిపోయాయి. చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. వాటిని నేను వదిలిపెట్టలేను'' అని 40 ఏళ్ల పాటిల్ చెప్పారు.
''ఇది నేను చూస్తోన్న రెండో యుద్ధం. కానీ ఇది చాలా భయంకరంగా ఉంది.''
గతంలో లూహాన్స్స్ ప్రాంతంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రష్యా అండ ఉన్న తిరుగుబాటుదారులు, యుక్రెయిన్ బలగాల మధ్య 2014నుంచి పోరాటాలు జరుగుతున్నాయి.
అక్కడ జరిగిన పోరాటంలో తన ఇంటితో పాటు తన రెస్టారెంట్ కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత అక్కడ నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న సెవెరోదోన్యస్క్ ప్రాంతానికి మారిపోయారు. అక్కడే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ పులులను కొనుగోలు చేశారు.
''నేనిప్పుడు వార్ జోన్‌లో ఇరుక్కుపోయాను. ఈసారి నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి రావాలని నా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ నేను ఈ పెంపుడు జంతువులను వదిలి వెళ్లలేను'' అని పాటిల్ చెప్పారు.
20 నెలల క్రితం 35,000 డాలర్లు (రూ. 26.92 లక్షలు) వెచ్చించి కీయెవ్ జూ నుంచి బ్లాక్ పాంథర్‌తో పాటు జాగ్వర్ పులులను కొనుగోలు చేసినట్లు పాటిల్ తెలిపారు. జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి సరిపడినంత స్థలం ఉన్న వ్యక్తులకు జూ, ప్రైవేటు అమ్మకాల ద్వారా జంతువులను విక్రయిస్తుందని ఆయన చెప్పారు. జూ అధికారుల నుంచి పొందిన పులుల జనన ధ్రువీకరణ పత్రాలను కూడా పాటిల్ చూపించారు.
మెడిసిన్ చదవడం కోసం 2007లో యుక్రెయిన్ వచ్చినట్లు పాటిల్ చెప్పారు. 2014 నుంచి ఆయన ఆర్థోపెడిక్ విభాగంలో ప్రాక్టీస్ చేస్తూ సెవెరోదోన్యస్క్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. యుద్ధం కారణంగా ప్రస్తుతం ఈ ఆసుపత్రిని మూసివేశారు. ప్రైవేటుగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, GIRIKUMAR PATIL
సెవెరోదోన్యస్క్‌లో ఆరు గదులున్న రెండస్థుల భవనంలో ఆయన ఉంటారు. ఇందులో పులుల కోసం ప్రత్యేకంగా చిన్న ఎన్‌క్లోజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. తన సంపాదనలో అధిక భాగం పెంపుడు జంతువులకే కేటాయిస్తానని పాటిల్ చెప్పారు. ఆయన దగ్గర బ్లాక్ పాంథర్, జాగ్వర్‌తో పాటు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. 85 వేల సబ్‌స్క్రైబర్లు ఉన్న తన యూ ట్యూబ్ చానెల్‌లో పెంపుడు పులుల వీడియోలు షేర్ చేస్తూ అదనపు ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
''దక్షిణ భారత సినిమా స్టార్, నా అభిమాన నటుడు చిరంజీవి, చిరుతపులితో నటించిన సినిమా చూసినప్పటి నుంచి నాకు పులులపై ఇష్టం పెరిగింది'' అని గిరికుమార్ చెప్పుకొచ్చారు.
గిరికుమార్ తండ్రి బ్యాంక్ మేనేజర్ కాగా తల్లి టీచర్. సాధారణంగానే జంతుప్రేమికుడైన గిరికుమార్ తన ఇంట్లో పెంపుడు కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుతారు.

హైస్కూల్, కాలేజీ చదువులు పూర్తయ్యాక గిరికుమార్ నటనారంగంలో పని చేశారు. తెలుగు సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. యుక్రెయిన్‌లో కూడా స్థానిక సినిమాలు, సిరీస్‌లో విదేశీయుడిగా అరడజను పాత్రల్లో నటించానని ఆయన చెప్పారు.
తన ఇంటి నుంచి రష్యా సరిహద్దు కేవలం 80 కి.మీ దూరంలోనే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న రష్యన్ బలగాల కారణంగా సరిహద్దుకు చేరుకోవడం తాజా పరిస్థితుల్లో అంత సులభం కాదని ఆయన అంటున్నారు. తాము ఉంటోన్న ప్రాంతంలో విద్యుత్ కోతలతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలు ఉన్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఆయన తరచుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ చురుగ్గా ఉంటారు.
''ఇక్కడ నేనొక్కడిని మాత్రమే భారతీయుడిని. రాత్రిళ్లు నేను ఒక్కడినే ఇక్కడ ఉంటాను. మా ఇరుగుపొరుగులో దాదాపు అందరూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిపోయారు. కానీ నేను ఇక్కడ ఉండబోతున్నా'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2,56,958.51 కోట్లతో తెలంగాణ బడ్జెట్
- ప్రపంచ ఆహార వ్యవస్థకు పెను విపత్తుగా యుక్రెయిన్ యుద్ధం
- రష్యా, అమెరికాలతో సంబంధాలు భారత్‌కు కత్తి మీద సాముగా మారాయా
- పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతుర్ని ఆడిస్తున్న భారత ప్లేయర్లు
- రొమాన్స్‌లో మహిళలు యాక్టివ్‌గా ఉంటే తప్పా, కామసూత్ర పుట్టిన దేశంలో ఎందుకీ పరిస్థితి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












