పెంపుడు జంతువులకు సోకుతున్న కోవిడ్ - తాజా పరిశోధనల్లో వెల్లడి

ఫొటో సోర్స్, NOAH SEELAM
యజమానులకు కోవిడ్ సోకితే, ఆ ఇంట్లోని పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా వైరస్ సంక్రమిస్తుందని తాజా పరిశోధనలలో తేలింది.
నెదర్లాండ్స్‌లో కోవిడ్ సోకిన 196 మంది ఇళ్ల నుంచి 310 పెంపుడు జంతువుల స్వాబ్‌లను సేకరించారు. పీసీఆర్ పరీక్షల్లో ఆరు పిల్లులు, ఏడు కుక్కలకు పాజిటివ్ రాగా, మరో 54 జంతువుల్లో కరోనా యాండీబాడీస్ ఉన్నట్లు తేలింది.
“కోవిడ్ సోకినప్పుడు ఇతరులతో భౌతిక దూరం పాటించినట్టుగానే మీ పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలి” అని ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎల్స్ బ్రోయెన్స్ సూచించారు.
"పెంపుడు జంతువుల ఆరోగ్యం ప్రధాన సమస్య కాదు. కానీ అవి వైరస్ రిజర్వాయర్లలా పని చేయొచ్చు. వాటి నుంచి మళ్లీ మనుషులకు వైరస్ సంక్రమించే అవకాశం ఉందన్నదే ఆందోళన కలిగించే విషయం."
పెంపుడు జంతువుల నుంచి యజమానులకు వైరస్ సంక్రమించినట్లు ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. కానీ, ఇంకా మనుషుల మధ్య సులువుగా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పుడు దీన్ని గుర్తించడం కష్టమని పరిశోధకులు అంటున్నారు.
కరోనా సోకిన పెంపుడు జంతువుల్లో చాలా వరకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోవడం లేదా తేలికపాటి లక్షణాలు ఉండడాన్ని గుర్తించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నెదర్లాండ్స్‌లో గత 200 రోజుల్లో కోవిడ్ బారిన పడినవారి ఇళ్లకు ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ను పంపారు.
పెంపుడు పిల్లులు, కుక్కల నుంచి స్వాబ్‌లను సేకరించి ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు జరిపారు.
గతంలో కోవిడ్ సోకింది, లేనిది తెలుసుకోవడానికి రక్త నమూనాలను సేకరించి యాంటీబాడీల టెస్టులు జరిపారు.
- 4.2 శాతం జంతువుల్లో ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు.
- 17.4 శాతం జంతువుల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.
కాగా, కోవిడ్ సోకిన పెంపుడు జంతువులు కోలుకుని, యాంటీబాడీలను అభివృద్ధి చేసుకోగలిగాయని తదనంతరం జరిపిన పీసీఆర్ పరీక్షల్లో తేలింది.
జంతువుల నుంచి మనుషుల కన్నా, మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకే అవకాశాలే ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు.
“పెంపుడు జంతువుల నుంచి యజమానులకు కోవిడ్ సోకే అవకాశాలు సున్నా అని చెప్పలేం. కానీ ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతోంది. కాబట్టి జంతువుల నుంచి సంక్రమిస్తున్న విషయాన్ని మనం గుర్తించలేకపోవచ్చు” అని డాక్టర్ బ్రోయెన్స్ అన్నారు.
రష్యాలో పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభించారు.
"మహమ్మారి వ్యాప్తిలో జంతువుల పాత్ర ఉందని అనుకోవట్లేదు. ఇప్పటివరకైతే దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు" అని డాక్టర్ బ్రోయెన్స్ అన్నారు.
యజమాని మంచం మీద పడుకున్న పిల్లుల్లో వైరస్ సంక్రమణకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కెనడాలోని ఒంటారియోలో యూనివర్శిటీ ఆఫ్ గ్వెల్ఫ్ జరిపిన మరో అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, UNIVERSITY OF UTRECHT
77 ఇళ్లల్లో పెరుగుతున్న 48 పిల్లులు, 54 కుక్కల్లో కోవిడ్ యాంటీబాడీల పరీక్షలు జరిపారు. కోవిడ్ సోకిన సమయంలో యజమానులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉన్నారా లేదా అని విచారించారు.
పెంపుడు పిల్లుల్లో 67 శాతానికి, పెంపుడు కుక్కల్లో 43 శాతానికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా, జంతు సంరక్షణశాలల్లో ఉన్న కుక్కల్లో కేవలం 9 శాతానికి, వీధి పిల్లుల్లో 3 శాతానికి మాత్రమే కోవిడ్ సోకినట్లు తేలింది.
పెంపుడు జంతువులలో నాలుగింట ఒక వంతుకు వ్యాధి లక్షణాలు కనిపించాయి. ముఖ్యంగా ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపించాయి.
పిల్లుల శరీర నిర్మాణం కోవిడ్ సోకేందుకు ఎక్కువ అవకాశం కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు.
కుక్కల కంటే పిల్లులే యజమాని ముఖానికి దగ్గరగా పడుకుంటాయి. అందువల్ల వాటిల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ.
పెంపుడు పిల్లులు, కుక్కలకు తమ యజమానుల నుంచి కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇదివరకే అధ్యయనాల్లో తేలింది. తాజా అధ్యయనాలు రెండూ ఈ పరిశోధనలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ వెటర్నరీ మెడిసిన్ డిపార్టుమెంట్ హెడ్ ప్రొఫెసర్ జేమ్స్ వుడ్ అభిప్రాయపడ్డారు.
వైరస్ సాధారణంగా కుక్కలు, పిల్లుల నుంచి ఇతర జంతువులకు లేదా వాటి యజమానులకు వ్యాపించదని ఈ అధ్యయనాల ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేషనల్ డాక్టర్స్ డే: వైద్యులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి.. చట్టాలతో వీటిని ఆపడం ఎందుకు సాధ్యం కావడం లేదు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: కోవిడ్ మరణాలపై రెండు రాష్ట్రాలవీ కాకిలెక్కలే- బీబీసీ పరిశోధనలో వెల్లడి
- కోవిడ్-19 మిక్స్ అండ్ మ్యాచ్: వేర్వేరు వ్యాక్సీన్లు తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ
- గంగానదిలో పెరిగిన నీరు.. తేలుతున్న శవాలు
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- కరోనావైరస్ పుట్టుక రహస్యం తేలాల్సిందే... ఎందుకంటే?
- చల్లటి నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అవుతుందా....దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- మరియమ్మ లాకప్ డెత్ లేవనెత్తుతున్న ప్రశ్నలు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








