కోవిడ్-19 మిక్స్ అండ్ మ్యాచ్: వేర్వేరు వ్యాక్సీన్లు తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్
మొదటి డోసు ఒక రకం వ్యాక్సీన్, రెండవ డోసు మరో రకం వ్యాక్సీన్ తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ ఉంటుందని బ్రిటన్‌లో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
దీన్నే “మిక్స్ అండ్ మ్యాచ్” విధానమని పిలుస్తున్నారు.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు మొదటి, రెండు డోసుల్లో ఒకదాని తర్వాత మరొకటి తీసుకుంటే మరింత ప్రభావవంతంగా పని చేసినట్లు కామ్-కోవ్ చేసిన అధ్యయనంలో తేలింది.
రెండు వ్యాక్సీన్లను ఏ కాంబినేషన్‌లో వేసినా, రోగనిరోధక శక్తిని మరింత క్రియాశీలంగా చేసినట్లు గుర్తించారు. దీంతో వ్యాక్సీన్ల కొరతకు ఇది ఒక మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే రెండు డోసుల ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారు రానున్న నెలల్లో బూస్టర్ డోసుగా ఇతర బ్రాండ్ టీకా తీసుకుంటే బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
రెండు డోసుల్లో ఒకే బ్రాండ్ టీకా ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని, దీనిలో ఎలాంటి మార్పులు చేయడం లేదని యూకే డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జోనాథన్ వాన్-టామ్ తెలిపారు.
“రెండు వేర్వేరు వ్యాక్సీన్లను ఇవ్వడం అనేది బూస్టర్ డోసు ఇచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. తక్కువ సంఖ్యలో వ్యాక్సీన్లు అందుతున్న దేశాలకు ఈ పద్ధతి అండగా నిలుస్తుంది” అని చెప్పారు.
రక్తం గడ్డ కడుతోందనే సమస్య నడుమ స్పెయిన్, జర్మనీ దేశాలు ఇప్పటికే యువతకి తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా, రెండో డోసుగా ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సీన్లను అందిస్తున్నాయి.
కోవిడ్ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శరీర రక్షణకు ఉపయోగపడే యాంటీబాడీలు, టీ కణాల ఉత్పత్తికి రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, EPA
కామ్-కోవ్ పరిశోధన
నాలుగు వారాల పాటు 50 ఏళ్లు పైబడిన 850 వాలంటీర్లపై ఈ పరిశోధన చేశారు. తొలి డోసు ఆస్ట్రాజెనెకా, మలి డోసు ఫైజర్ తీసుకున్న వారిలో పెద్ద సంఖ్యలో యాంటీబాడీలు, టీ కణాలు ఉత్పత్తి అయినట్లు తేలింది.
రెండు డోసుల ఆస్ట్రాజెనెకాను తీసుకోగా ఉత్పత్తి అయిన యాంటీబాడీల కంటే మిక్స్ డోసులు తీసుకున్న వారిలో ఏర్పడిన యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
రెండు డోసుల్లో ఫైజర్ తీసుకున్న వారిలో అత్యధికంగా యాంటీబాడీలు ఏర్పడ్డాయి. ఒక డోసు ఆస్ట్రాజెనెకా, రెండో డోసు ఫైజర్ తీసుకున్న వారిలో అత్యధికంగా టీ కణాలు ఏర్పడ్డాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాథ్యూ స్నేప్ వెల్లడించారు.
అయితే, ఈ ఫలితాల ఆధారంగా ఒకే టీకాను రెండు డోసుల్లో తీసుకోవాలనే యూకే పాలసీ సరికాదని తాము చెప్పడం లేదన్నారు.
“ప్రస్తుతం ఎనిమిది నుంచి 12 వారాల వ్యవధిలో ఇస్తున్న ఒకే బ్రాండ్‌కి చెందిన రెండు డోసుల వ్యాక్సీన్లు జబ్బు తీవ్రతను తగ్గించి, ఆసుపత్రి పాలవకుండా అడ్డుకుంటున్నాయి. డెల్టా వేరియంట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
కేవలం నాలుగు వారాల వ్యవధిలో అందించిన రెండు వేర్వేరు వ్యాక్సీన్ల ఫలితాలు కూడా బాగున్నాయని ఆయన చెప్పారు. సాధారణంగా యూకేలో టీకా డోసుల మధ్య వ్యవధిని ఎనిమిది నుంచి పన్నెండు వారాలు ఉండేలా చూసుకుంటున్నారు. డోసుల మధ్య వ్యవధి పెరిగే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పారు.
రెండు వేర్వేరు వ్యాక్సీన్లను 12 వారాల వ్యవధిలో ఇచ్చిన ప్రయోగ ఫలితాలు వచ్చే నెలలో వెల్లడవుతాయని తెలిపారు.

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images
మరో బూస్టర్ డోసుపై భిన్నాభిప్రాయాలు
రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత ఆస్ట్రాజెనెకా మూడో డోసు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి మరింత పెరుగుతుందని మరో అధ్యయనంలో తేలింది.
కానీ ప్రజలకు మూడో డోసు అవసరమా లేదా అన్న విషయంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మూడో డోసు ఎంత మేరకు రక్షణ కల్పిస్తుందన్న దానిపైనా స్పష్టత లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ డోసును చలికాలంలో ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రమాదకరమే అనిపిస్తోందని తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ పేర్కొన్నారు.
తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న వారికి, మలి డోసుగా ఫైజర్ వ్యాక్సీన్ ఇవ్వాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
అది నెమ్మదిగా పనిచేస్తుంది
“మిక్స్ అండ్ మ్యాచ్” విధానంలో ఇచ్చే వ్యాక్సీన్లపై తొలి ప్రయోగ ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. తొలి డోసు ఆస్ట్రాజెనెకా, రెండో డోసుగా ఫైజర్ వ్యాక్సీన్లు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా వృద్ధి చెందుతుంది’’ అని బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్గుష్ వాల్ష్ విశ్లేషించారు.
‘‘రెండు డోసుల ఫైజర్.. తొలి డోసు ఆస్ట్రాజెనెకా, రెండో డోసు ఫైజర్... తొలి డోసు ఫైజర్, మలి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు తీసుకున్న వారిలో ఏర్పడిన యాంటీబాడీలు రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారిలో ఏర్పడలేదు.
దీని అర్థం రెండు డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకోవడం నిరర్థకమా అంటే కాదు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న వారు ఆసుపత్రి పాలుకావడం 90 శాతం తగ్గింది. కాబట్టి, ఆస్ట్రాజెనెకా కూడా బాగా పని చేస్తుంది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ నిదానంగా పని చేస్తుంది. సమయం గడిచే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య సమయం ఎనిమిది నుంచి పన్నెండు వారాలు ఉంటోంది. దీని ఆధారంగా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఈ అధ్యయనం మూడో డోసును ఇతర బ్రాండ్లకు చెందిన వ్యాక్సీన్ ఇవ్వాలని సూచిస్తోంది. అయితే, రెండు వేర్వేరు వ్యాక్సీన్లను తీసుకున్నప్పుడు కండరాల నొప్పులు, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








